మంచి మాట

వ్యసనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వ్య సనం’ అంటే అలవాటు అని చెప్పవచ్చు. ఏదైనా ఒక పనిని గత కొద్దికాలంగా కొనసాగిస్తూ, వర్తమానంతోపాటుగా ఉంటూ భవిష్యత్‌పై కూడా ప్రభావం చూపే దానిని ‘వ్యసనం’గా చెప్పవచ్చును. ఈ వ్యసనం అనేది మనకు అవసరం లేకున్నా, ఒక్కోసారి మన ప్రమేయం లేకుండా కూడా మనల్ని ప్రేరేపిస్తూ జరిగిపోతుంటుంది. వ్యసనంవలన మనల్ని మనమే నియంత్రించుకోలేని పరిస్థితి తలెత్తే అవకాశాలు కన్పిస్తాయి. వ్యసనాలు వలన కలిగే ఫలితాల్ని బట్టి వ్యసనాలను మంచి వ్యసనాలు మరియు చెడు వ్యసనాలు అని రెండు విధాలుగా పేర్కొనవచ్చు. కాని నేడు వ్యవసం అన్న పదాన్ని చెడు వ్యసనానికి పర్యాయపదంగా సమాజంలో ఉపయోగించడం జరుగుతుంది. చెడు వ్యసనాలకు బానిస అయినవారిని వ్యసనపరులుగా భావిస్తున్నారు. ఒక పనిని నిరంతర క్రమంగా చేయడంవలన అది వ్యసనంగా మారుతుంది.
ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని పెంచడంలోనూ తగ్గించడంలోనూ వ్యసనాల పాత్ర ప్రస్ఫుటంగా కన్పిస్తుంది. వ్యక్తికి ఉండే వ్యసనాలను బట్టి ఆ వ్యక్తిని మంచివాడిగా లేదా చెడ్డవాడిగా నిర్ణయించవచ్చు. భావి భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపడంలో వ్యసనాల పాత్ర ప్రధానంగా ఉంటుంది. ఉదాహరణకు మహాభారతంలో కౌరవులు ప్రతి నాయకులుగా మారి చరిత్రహీనులుగా మిగిలిపోవడానికి కారణం వారికి ఉండే చెడు వ్యసనాలే. పాండవులను ఆదర్శప్రాయులుగాను, ఉన్నతులుగాను చేసేవి వారికిగల మంచి వ్యసనాలే అని చెప్పవచ్చును. మనిషిలోని దానగుణాన్ని లేదా రాక్షస గుణాన్ని వ్యక్తపరిచేవి ఈ వ్యసనాలుగా చెప్పవచ్చును. చెడు వ్యసనాలకు బానిసైనవాడు తనపైన తనకి నియంత్రణను కోల్పోయి ఆ వ్యసనాలు ఆడించే ఆటలో కీలుబొమ్మగా మారి లోక వినాశనానికి దారితీయవచ్చు.
రామాయణంలో రాముడ్ని యుగపురుషుడుగా నిలిపినవి అతడు అలవరచుకొనే క్రమశిక్షణతో కూడిన అలవాట్లే (వ్యసనాలు) అనేది జగమెరిగిన సత్యం. అలాగే రావణుడు ఎంత గొప్పవాడయినప్పటికి తన యొక్క రాక్షస గుణానికి సంబంధించిన వ్యసనాలు వలన నాశనం కాబడ్డాడు. సృష్టిలో మనిషిని శక్తిగా మార్చడంలో క్రియాశీలమైన ప్రభావాన్ని చూపుతున్నవాటిలో ఈ వ్యసనాలు ముఖ్యమైనవి. ఉదాహరణకు కచుడు తను కలిగివున్న మంచి వ్యసనాలతో శుక్రాచార్యునికి శిష్యుడుగా చేరువై మృతసంజీవిని మంత్రాన్ని సాధించగలిగాడు. అదేవిధంగా ఎరుకల కులానికి చెందిన ఏకలవ్యుడు కూడా తన యొక్క మంచి వ్యసనాలతో అత్యుత్తమ విల్లు విద్యావంతుడుగా పేరుగాంచాడు. ఒక రాజ్యాన్ని రాజు గొప్పగా పాలించడంలో లేదా అదే రాజ్యాన్ని కోల్పోవడంలో కూడా ఆ రాజుకి గల వ్యసనాలు పాత్రను పోషిస్తాయి. ఒక వ్యక్తి వ్యక్తిత్వం అంచనా వేయడంలో వ్యసనాలు ముఖ్య భూమికను పోషిస్తాయి. ఒక వ్యక్తి తన భవిష్యత్ ప్రణాళికపై ఆ వ్యక్తికి గల వ్యసనాలు ప్రభావం చూపుతాయి. సిద్ధార్థుడు- గౌతమబుద్ధుడుగా మారడానికి కారణం అతడు అలవరచుకున్న వ్యసనాలే అని మనకు చరిత్ర చెబుతుంది. చరిత్రలో గొప్ప కీర్తి కలిగిన అశోకుడు తన వ్యసనాలు ప్రభావం వలన పేరు ప్రఖ్యాతులు పొందాడు. దేశ ఖ్యాతిని ప్రపంచమంతా చాటి చెప్పిన స్వామి వివేకానంద అలవరిసుకొనే అలవాట్లు నేడు ఎందరికో ఆదర్శప్రాయం.
ఈ వ్యసనాల ప్రభావం ఒక వ్యక్తిపైనే కాకుండా ఆ వ్యక్తి కుటుంబం, పరిసరాలు, సమాజం, భవిష్యత్, చరిత్ర మొదలైన అంశాలపై చెరగని ముద్ర వేస్తాయి. ప్రతీ ఒక్కరూ మంచి వ్యసనాలకు ప్రతీకగా మారాలి. ‘వ్యసనం’ అంటే మంచి వ్యసనానికి పర్యాయపదంగా చెప్పబడేలా ఉండాలి. ‘మంచి వ్యసనాలు’ భావి భవిష్యత్‌కు బంగారు బాటను వేస్తాయి అనే విషయాన్ని గమనించి విద్యార్థి దశ నుంచే మంచి వ్యసనాలను అలవరచుకోవాలి. మంచి వ్యసనాలు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. విజయబావుటా ఎగురవేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కావున మంచి వ్యసనాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి.

-పెయ్యల శ్రీనివాసరావు