మంచి మాట

దివ్యత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరు ఏ పనులు చేయక జడ పదార్థాలలా ఉన్న చోటునే అంటిపెట్టుకొని ఉంటారు. ఎవరికి హృదయం ఉండదు అని యక్షుడు ప్రశ్నిస్తే రాతికి హృదయం ఉండదు అని యుధిష్ఠిరుని సమాధానం. రాయివంటి జడ పదార్థానికి హృదయము చైతన్యము ఉండవు. మనం జడ పదార్థాలం కాము కనుకనే ఈ ఉరకలు పరుగులు.
కర్మయోగం 21వ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్ముడిలా అన్నాడు. ‘‘శ్రేష్ఠులగు వ్యక్తులు ఏ కర్మను చేయుదురో సామాన్య జనులు దానినే చేయుదురు. వారు లౌకిక, వైదిక వ్యవహారములందు దేనిని ప్రమాణంగా గ్రహింతురో లోకులు కూడా దానినే అనుసరింతురు’’. నలుగురు నడిచే బాటనే మనం నడుస్తున్నాం కాని వారు శ్రేష్ఠులా కారా అని ఆలోచించడంలేదు. ఈ రెండింటికి దోమకు ఏనుగుకు ఉన్నంత తేడా ఉంది. ధర్మబద్ధంగా జీవించేవారిని, సత్కర్మలనాచరించేవారిని మనం తప్పనిసరిగా ప్రమాణంగా తీసుకోవాలి.
అంతేకాని నలుగురితోపాటు నారాయణ అని అన్యాయ కృత్యాలవైపు వెళ్ళకూడదు. అందువలన మనం అడుగు ముందుకు వేసేటప్పుడు అది ధర్మపథమా కాదా అని ఆలోచించాలి. భౌతిక లక్ష్యాలే జీవిత లక్ష్యాలు కారాదు. ఈనాడు చదువులు విజ్ఞానాన్ని ఇస్తున్నాయి కాని వినయాన్ని ఇవ్వటంలేదు. సంపదలను వృద్ధి చేసుకునేందుకు అనువైన విద్యను ఉపాధ్యాయులు చెప్తున్నారే కానీ శీల సంపదను కాపాడుకునే చదువులు చెప్పడంలేదు. శీలము వలన సుఖము లభిస్తుంది. సంతోషమే గొప్ప సుఖము. శీలము లేని వాడి దగ్గర లక్ష్మి ఉండదని ప్రహ్లాదుడికి కథ చెప్తుంది.
ధర్మము, యోగము, ఈశ్వర భక్తి, తత్త్వచింతన- ఇవన్నీ ఆలోచనా మార్గాన్ని క్రమబద్ధీకరించే మార్గాలు. ఇవి ఋషులందించినవి. వారి అతీంద్రియ ప్రజ్ఞను సాక్షాత్కరించిన దివ్యమార్గాలివి. వీటిని అనుసరించే మానవ మేధ దివ్యంగా పరిణమించగలదు అని పెద్దల వచనం. మానవుడు దివ్యత్వం వైపు పయనించాలి. ఋషులేర్పరచిన ధార్మికోపదేశాలు ప్రకాశంవైపు దారితీస్తాయి. వాటిని అనుసరించడం ముదావహం. బుద్ధివల్ల సాధించే విజ్ఞానం యొక్క లక్ష్యం దివ్యత్వం కావాలి. అంతేకాని అది విధ్వంసానికో, వినోదానికో, విలాసానికో ఉపయోగించకూడదు. మన విజ్ఞానం వలన పదిమందికి మేలు జరగాలి. ఇతరులకు కీడు జరుగరాదు.
అన్యాయార్జితం ఎల్లకాలం నిలువదు. దానివలన ఎన్నో దుష్పరిణామాలుంటాయి. ఆశను విడనాడిన వ్యక్తి ధనవంతుడు అవుతాడు. లోభం వదిలేస్తే సుఖిస్తాడు. సంతోషమే గొప్ప సుఖము. నీవు న్యాయంగా సంపాదించినదైనా అది దేవుని వరం. ఆ డబ్బుకి నీవు ధర్మకర్తవే కాని స్వామివి కాదని గ్రహించాలి. ప్రతి మనిషికి కుటుంబమే పరిమితం కాదు.
మనిషి సంఘజీవి. అతని లాలన పాలన పెరుగుదల పేరు ప్రఖ్యాతులు సమాజ కారణంగానే లభిస్తున్నాయి. నీ పొరుగువాడు దుఃఖంలోనో ఆపదలోనో వుంటే నీకు ఎంతటి సంపదలున్నా నీవు సుఖంగా ఉండలేవు. అవసరాలకు మించినదానికన్నా ఎక్కువ వాడుకుంటే నీది భోగ గుణమే అవుతుంది. ఈ ధనం నీకు సమాజం నుంచి లభిస్తున్నది. అందువలన కొంతభాగం సమాజానికే చెందాలి. దరిద్రనారాయణుల సేవయే మాధవసేవ అని స్వామి వివేకానంద చెప్పారు. స్వశక్తితో ఆర్జించినదే అనుభవానికి యోగమైనది. పిత్రార్జితం లేదా సంతానం ఆర్జించిన సొమ్మును అనుభవించడం ఉత్తమమయినది కాదు, అది మధ్యమమే. అటువంటి ధనమును సత్కార్యాలకు, దానధర్మాలకు వాడడం శ్రేయము. వృద్ధాప్యంలోనున్న తల్లిదండ్రులను ఆదుకోవడం పుత్ర ధర్మము.
మన దేశం కర్మభూమి, ధర్మభూమి, పుణ్యభూమి, యోగభూమి. ఇది భోగభూమి కాదు. ఇక్కడ భోగలాలసకు తావులేదు. అందువలన భౌతిక సుఖాలకు ఆశపడి అధర్మంగా, అనైతికంగా అక్రమంగా ధనార్జన చేయడం పాపమే కాదు నేరం కూడాను.

-గుమ్మా ప్రసాదరావు