విశాఖపట్నం

ఓ మంచి మాస్టారి గురించి మంచి పుస్తకం ‘మా దేవుడు మీరే మాస్టారు’ (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల విడుదలైన ‘మా దేవుడు మీరే మాస్టారు’ సంపుటి మంచి పుస్తకాల జాబితాలో చేరుతుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రముఖ దాతగా, విద్యా ప్రదాతగా మొత్తం 34 అవార్డులు అందుకున్న ఓ ప్రధానోపాధ్యాయుడు మెండ తవుడు మాస్టారి జీవితం గురించి ఈ పుస్తకంలో పొందుపరిచారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, దేశంలో తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే, ఉపాధ్యాయ ఉద్యమాల రాజు సింగరాజు, సర్దార్ గౌతులచ్చన్న ఆదర్శాలను, స్ఫూర్తిదాయక ఘట్టాలను, ఉదంతాలను ఇందులో రాశారు. అన్నింటికీ మించి జగద్గురువు వ్యాస మహర్షి గురించి వివరించిన తీరు ప్రశంసనీయమని చెప్పాలి. తవుడు మాస్టారు వీరందరినీ ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లినట్లు, విజయం సాధించినట్లు పుస్తక రచయితలు వాండ్రంగి కొండలరావు, నెయ్యిల ఉమామహేశ్వరరావు తేనెలొలుకు భాషలో రాశారు. ప్రపంచ దేశాలలో గురుపూజోత్సవ వేడుకలను, తేదీలను ఇందులో ఊటంకించారు. ‘ ఆణిముత్యాలు ఆరని దీపాలు’ శీర్షికలో కబీరుదాసు, స్వామి రంగనాథానంద, రాజా రామ్మోహన్‌రాయ్, రామకృష్ణ పరమహంస, మహాత్మాగాంధీజీ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రవచనాలు పుస్తకానికి వనె్న తెచ్చాయి. ‘ ఆదర్శ ఉపాధ్యాయులు కావాలంటే శీర్షికలో ఉపాధ్యాయుని వ్యక్తిత్వం ఎలా ఉండాలో విశే్లషించిన వైనం బాగుంది. ‘గురువును ద్వేషిస్తే అధోగతే’ శీర్షిక గురుద్రోహులకు కనువిప్పు కలిగిస్తుంది. ‘గురువు మెండయిన మాస్టారు/గురువుకు గుడ్‌మార్నింగ్’ తదితర కవితలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. కొందరు పుట్టుకతో గొప్పవారు అవుతారు. మరి కొందరు కృషితో గొప్పవారవుతారు. మరికొందరు అదృష్టం వరించి గొప్పవారవుతారు. ఇందులో రెండవ కోవకు చెందిన ఆదర్శ ఉపాధ్యాయుడు తవుడు మాస్టారి ఆదర్శాలు, త్యాగశీలత, అంకితభావం తదితర అంశాలు పాఠకులను ఆకట్టుకుంటాయి. రచయితలు అభినందనీయులు. ఈ పుస్తకాన్ని శ్రీకాకుళం బాపూజీ కళామందిర్‌లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్యే గాదె శ్రీనివాసులునాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు లక్ష్మీదేవి అక్టోబర్ 1న ఆవిష్కరించారు. చక్కని ముఖచిత్రంతో రూపకల్పన చేసిన ఈ పుస్తకం ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఓ కరదీపిక. ఈ పుస్తకాన్ని చదవాలనుకునేవారు ప్రచురణకర్త ఎం. ప్రభ సెల్ : 9441620038 నెంబర్‌లో సంప్రదించాలి.
- వడ్డిపల్లి ధనలక్ష్మి,
రాజాం-532127.
శ్రీకాకుళం జిల్లా.
సెల్ : 8500371947.
**

మంచి ప్రయత్నం

విశాఖ కథా తరంగాలు-2

విశాఖ రచయితల సంఘం వారు ప్రచురించిన రెండవ కథా సంపుటం ఇది. లబ్ద ప్రతిష్టులైన వారి కథలను ఏర్చికూర్చి సంకలనంగా తీసుకువచ్చారు. మంచి ప్రయత్నం చేశారు. ఇటువంటి ‘మంచి’ మరికొంత రావలసి ఉంది. ఈ పుస్తకంలో ఇరవై రెండు కథలున్నాయి. మానవ సమాజంలోని జీవన విధానంలోని పార్శ్యాలను విభజించి చూపించాయి. కొన్ని కథలు చిన్నవే. కానీ, నీతి (కాదు... సమాజరీతి)ని గొప్పగా పలికాయి. కా.రా. మాస్టారి కవితలాంటి కథ.. కథలాంటి కవిత ‘రక్కసి బలుపు ఆగడం’ నాటి, నేటి సమాజంలోని ‘చెడు’ ఎలా వేగరంగా విస్తరిస్తోందో దానిని వినాశం చేయడం ఎంత కష్టమో నర్మగర్భంగా గుర్రపుడెక్క మొక్కలా నిదానంగా పాఠకుడి మెదడును చేరి ఆక్రమిస్తుంది’. తన సహజమైన ‘మార్కు’ను మాస్టారు ఈ కథలో చూపించారు. అంగర సూర్యారావు కథ ‘దేవుడు చూడని మనిషి’. మనిషి అంతరాల్లోని ‘ఆంతరం’, లౌక్యం తెలియని మనిషిని ‘దేవుడు’ కూడా చూడడని లౌక్యం తెలిసిన సౌభాగ్యవతి తన పనిని తాను చక్కదిద్దుకొన్న వైనాన్ని వివరిస్తుంది. రహమాన్ జీవితం.. ముగింపు లేని కథగా.. అతడు ‘దేవుడు చూడని మనిషి’గా మిగిలిపోయాడని చెబుతుంది.. ‘ముగింపు’ ఏమిటో పాఠకుల్నే ఊహించమంటుంది. ‘నాగమ్మ’ కథలోని అ‘నైతికత’ కొన్ని వంశాల్లో, కొన్ని గ్రామాల్లో, కొన్ని కుటుంబాల్లో అవసరమని. నాగమ్మ తన కోడలు మంగమ్మకు గంగులుకు మధ్య ‘సంబంధం’ తన కొడుకు వంశాంకురం కోసమని చూసీచూడనట్టు వదిలేయడం, మంగమ్మకు కొడుకు పుట్టే సమయానికి ‘గంగులు’ జైలు పాలు కావడం వంటివి నాటకీయతకు వేదిక. ఒకనాటి సాహిత్యంలో ఇటువంటి కథలు కోకొల్లలుగా వచ్చాయి. అయినా ‘నిష్టల’ ‘వారి చేయి తిరిగిన కథనం’ కథను రసపట్టుగా సాగిస్తుంది. ఏది నీతి? ఏది అవినీతి? అనే తర్జనభర్జనలు ‘మనిషి’ నమ్మకంపైన, మానవ నిర్మిత సమాజంపై ఆధారపడి ఉంటాయి. అవసరం మనిషిని ‘ఏదో ఒక్క దిక్కుకు’ తోస్తుంది. జీవన మైదానంలో ‘నిన్న అవసరం లేని వ్యక్తి’ ‘నేడు తెలియని వ్యక్తి’ ‘రేపు చెప్పలేం’ అనుకొనే వ్యక్తుల మధ్య జీవన సంఘర్షణను, వారు సాధించిన కాలక్రమమైన విజయాలను (అపజయాలను) చక్కగా ఎత్తిచూపుతుంది. ‘కోర్టు పక్షి’, ‘అక్కా మళ్ళీ రావూ’, ‘వరద’, సిరిమాను’ వంటి కథలు ఆనాటి సామాజిక స్థితిగతులను, ప్రాంతాల వారీగానున్న ‘యాస’ను ‘పరిభాష’ను వివరిస్తాయి. ‘మనిషి అంతరంగాలను’ ఆచార సంప్రదాయాలను వివరిస్తాయి. బాలి ‘చిరిగిన శుభలేక’, ‘సైనికుడు’, ‘పాటలపల్లకి’, ‘కంట్లో నలుసు’ వంటివి మానవత్వపు మంచితనం, జీవన వైవిధ్యాలను చక్కగా చిత్రించాయి.
కథలన్నీ ఇంతకు పూర్వం వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి, బహుమతులందుకొన్నవి. కొన్ని చిన్నవి. కొన్ని ఈ సంపుటి కోసం ప్రత్యేకంగా రాయబడినవి. రెండు కథా సంపుటాలను చాలా ఏళ్ళ తర్వాత ప్రచురించటం, జిల్లా రచయితలను, వారి రచనలను ఒకే వేదికపైకి తీసుకురావటం అభినందనీయం. ‘ఓ చారిత్రాత్మక సమాజ తీర్పులను’ ఈ కథల రూపంలో అక్షరీకరించిన సుప్రసిద్ధ రచయితల రచనలు ‘కూర్పు’ చేశారు. కానీ, కథలలోని ‘సారాంశం’ అన్ని వేళలకు, అన్ని తరాలకు ‘అందజేసే’ సమానమైన తీర్పు కాదేమోననే అనుమానం పాఠకులకు కలుగజేశారేమోఅనిపిస్తుంది. కొత్త రచయితలను తీర్చిదిద్దే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామనే ఆలోచన వారి ముందు మాటలో వినబడింది. మొదటి సంపుటంలోని కథలు దాదాపుగా ప్రసిద్ధులైన వారివే. మరోసారి కేవలం కొత్తవారి కథలను తీసుకువస్తే వర్తమాన సమాజపు, సాంకేతికత వెనుకనున్న కష్టం.. సుఖం... వేదన.. పరివేదన.. ఆనందాల మాటునున్న ఆవేదనలు స్పష్టమయ్యే అవకాశాలున్నాయి. ఈ దిశగా విశాఖ జిల్లా రచయితల సంఘం తమ కార్యాచరణ ప్రణాళికను రూపుదిద్దుంచుకుంటుందని ఆశిద్దాం. ఇటువంటి మంచి కథా సంపుటాలు వారినుంచి మరిన్ని వస్తాయని కోరుకుందాం.

- గున్న కృష్ణమూర్తి,
సెల్ : 9493802010.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.