దక్షిన తెలంగాణ

వాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాన తక్కువయ్యిందని మెల్లంగ బయలెల్లి నిర్మలక్క ఇంటికి పోయినము. నన్ను చెల్లెను జూసి ‘వాగుకు పోదాముపాయే’ అని మమ్ములను ఎంటేస్కుని తీసుకుని పోయింది. ఆడుకుంటూనే ఉన్నము. ఎంతయాళ్ల అయ్యిందో తెల్వదు. ఇల్లు యాదికొచ్చి అమ్మో అమ్మ ఏమంటదోనని మనసులో భయమన్పించింది. నీళ్లలో ఎగిరి బట్టలన్నీ తడిసిపోయినై గిట్లనే ఇంటికిబోతే అమ్మకొట్టనే కొడుతదని మెల్లంగ ఇంటిదారి పట్టిన..రాంగ రాంగ కచ్చకాయలేరుకుని గంగమ్మ పెద్దమ్మ గద్దెలకాడ ఆగినము. ‘అక్క బట్టలారే వరకు కచ్చకాయలాటలాడి ఇంటికి పోదామని’ చెల్లె మంజు ఐడియా ఇచ్చింది. సరేనని ఆడుకుంట కూసున్నము. గంగమ్మ పెద్దమ్మ బయటకచ్చింది. ‘ఏమాటలాడుతుంఢ్రే పోరగండ్లు అన్నం తిన్నారా?’ అని అన్నది. ‘తిన్నము పెద్దమ్మా’ అనుకుంటూ నిర్మలక్కతో పాటు ముగ్గురము లోపలికి పోయినము పెద్దమ్మ ఎనకనే నడిసినం..
పుష్ప వదిన అన్నయ్య పాటలింటున్నరు. రేడియో పాటలనుకుంట చిన్నవదిన పుష్ప, అక్కగూడ అక్కడనే ఉన్నది. ఏవో పరాశికాలాడుతున్నరు. మాకేమీ అర్థముకాలేదు. వంటకాడికి పోయినము పెద్దమ్మ పాలకుండ కున్న పాలగోకు కౌశ్కతో గీకిచ్చింది. ముగ్గురము తిని పెరట్లకు పోయినము. నిర్మలక్క ‘చెల్లె’ బొచ్చెడు జామకాయలున్నయే అన్నిటి నాకైతె చెట్టుకు ఆకులే కన్పిస్తున్నయి. ఒక్కటంటే ఒక్కటి జామకాయ దొరికింది. ముగ్గురము కాకెంగిలి చేస్కుని తిన్నము. కొంచమైనా తియ్యగా అనిపించింది. మెల్లంగా ఇంటిదారి పట్టినం అమ్మ ఇంటి ముందే కాపలాగా ఉన్నది. రండ్రి, రండ్రి అంది. భయంతోనే లోపడికిపోయినము’ బాపురానియ్యి నీ సంగతి అన్నది. మేం భయంతో వణికిపోయినం.
ఆనాడు పొద్దుగాల్నే అమ్మ శాపలుకడుగుతుంటే అందరము నవ్వుకుంట ఆర్గురు సంతానము ఆమె సుట్టే ఉన్నాము. అమ్మ వంటపనిమీద పడంగనే మెల్లగ జారుకుని వాగులో ఆటకని సరోజ, కోడం పద్మ, వాసు, రవి అందరము బయలెల్లి ఒక గంతులో వాగుకు చేరినాము. నిర్మలక్క గుడ మాకంటే ముందే అక్కడున్నది. ఎగురుతూ, దుంకుతూ పిట్టగూళ్లు కట్టుకున్నాము. కొందరు కాసిపుల్లాట లాడిన్డ్రు, ‘శాపలు పడుదాము రా..రా’ అని నిర్మలక్క పిలిసింది. సరోజన, వాసు, రవి శాపలన్ని పట్టి సెలయెతోడి సెలిమెలేసిన్డ్రు సిన్న శాపలు రెండు పైకి తేలినయి. బాధనిపించి నేను శాపలను వాగులోకి వదిలాను.
‘మేం కష్టపడి శాపలుపడ్తె నువ్వు వదుల్తవా’ అన్నరు అందరు వాసు నా నెత్తిమీద ఒక్క దెబ్బెసిండు నేను ‘అమ్మా’ అని ఏడుస్కుంటు ఇంటికి వచ్చిన. నాయెనకనే అందరు ఇంటి దారి పట్టిన్డ్రు అమ్మ గలుమలనే కావలిగాసినట్టుగా అక్కడ్నే ఉన్నది. దుకాణం బందుజేసి బాపు సైకిల్‌పట్టుకొని వచ్చింన్డు ‘రాండ్రి బిడ్డా’ అన్నది కోపంతోటి సదువులేదు ఏములేదు సెలవచ్చిందంటే గిదె ఆటలు మాట మాటకు వాగుకు పోయి ఆడుతున్నరు అని తన బాధ చెప్పింది కోపంగా ‘సరే రేపు జెప్పుదాము వీళ్ల సంగతి’ అన్నడు బాపు మాదిక్కు సూసుకుంట భయంభయంగా అన్నాడు రాత్రి నిద్రపోయినం తెల్లార్తేనె రిజల్టని లేసి తయారయ్యి బడిగంట బడిదారి పట్టినం. ఆనందము సార్ అందరు పాసయ్యిన్డ్రు అన్నాడు. ఒక్క ఇద్దరు ఫేలయినరని అని వాళ్ల పేర్లు చెప్పిండు. అనంగనే సంబరంగ ఇంటికొచ్చి అమ్మతో అనంగనే అమ్మ కళ్లల్లో సంబురము వెలిగింది. ఇంకెప్పుడు వాగుకు పోవద్దని అనలేదు!

- హనుమాండ్ల రమాదేవి
బెల్లంపల్లి, సెల్.నం.9959835745

**
పుస్తక సమీక్ష

ఏజెన్సీలో సాహితీ చైతన్యం

పేజీలు: 56 వెల : 60/-
ప్రతులకు: గోపగాని రవీందర్
ఇ.నం.9-76/2, ఫకీర్ గుట్ట
ఉట్నూర్-504203
ఆదిలాబాద్ జిల్లా
సెల్.నం.9440979882
**
గత మూడు సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ‘ఉట్నూర్ సాహితీ వేదిక’ సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తూ సృజనకారులను ప్రోత్సహిస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో సాహితీ చైతన్యాన్ని తీసుకరావడంలో తనవంతు పాత్రను పోషించడం అభినందనీయం.
2014లో ‘ఉట్నూర్ కవిత’ను వెలువరించి అనేక మంది కొత్త కవులకు అవకాశం కల్పించారు. నేటితరానికి సాహిత్యం పట్ల ఆసక్తిని కలిగించేలా కృషి చేస్తున్న సాహితీవేదిక ఈ సంవత్సరం ‘ఉట్నూర్ సాహితీ సంచిక’ పేరుతో ఓ గ్రంథాన్ని వెలువరించారు. ఈ గ్రంథంలో కవితలు, పాటలు, వ్యాసాలు చోటుచేసుకున్నాయి. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గోపగాని రవీందర్ నేతృత్వంలో ఏర్పడిన సంపాదకవర్గం పర్యవేక్షణలో ఈ గ్రంథం రూపుదిద్దుకున్నది. కట్ట లక్ష్మణాచారి, కొండగుర్ల లక్ష్మయ్యల సహకారంతో సాహితీవేదిక అనేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కవితా సంకలనాలను వెలువరించడం ముదావహం. ఈ గ్రంథంలో 3 పాటలు, 21 కవితలు, 7 వ్యాసాలున్నాయి. ఇవన్నీ ఉట్నూరులోని భిన్న భాషలకు అద్దం పట్టేలా ఉండటం విశేషం! ముఖ్యంగా హింది, కొలామి, తెలుగు, ఇంగ్లీష్, గోండి భాషలలోని రచనలకు ప్రాధాన్యతనిచ్చారు. కత్తి కంటే పదునైనది..బంధాలను దూరం చేసేది స్మోకింగ్ అనీ..దాన్ని మానుకొమ్మని 9వ తరగతి విద్యార్థి నితీష్ కుమార్ తన కవితలో చక్కగా తెలిపాడు. ఒక నిమిషంలో సిగరెట్ మాయం.. కాని నువ్వు పాడె ఎక్కడం ఖాయం అని హెచ్చరించాడు. విజయ్ కుమార్ నలుబోల ‘శుభోదయం’ పేరుతో రాసిన కవితలో ఉషోదయవేళ కొలువుదీరే అందాలను అక్షరాల్లో బంధించారు. జాధవ్ బంకట్‌లాల్ విద్యార్థులకు తమ భవితను తెలుసుకొమ్మని హితవుపలికారు. కుమ్రలాల్ షావ్ మూఢ నమ్మకం విడనాడాలని తమ రచన ద్వారా సూచించారు. డాక్టర్ జాధవ్ ఇందల్ సింగ్ తమ కవిత ద్వారా ‘పితాకీ అవేదన్’ను వినిపించారు. మొస్రం జగ్గేరావు ‘రేలా రేలా రేరేలా రేరేలా’ అంటూ గోండి పాటను రాశారు. జీవితంలో కష్టాలుంటాయి..వాటికి పరిష్కారం కనుక్కోవాలేకానీ.. ఆత్మహత్యలకు పాటుపడ వద్దని తెలుపుతూ ఎం.గిరిధర్ 9వ తరగతి విద్యార్థి తన కవితలో పేర్కొన్నాడు. స్నేహం యొక్క మధురిమలను ఎ.జ్యోతి 10వ తరగతి విద్యార్థిని తన కవితలో చక్కగా చిత్రించింది. కట్ట లక్ష్మణాచారి తమ కవిత ద్వారా కలాం స్పూర్తిని తెలిపారు.
ముంజం జ్ఞానేశ్వర్ తన ‘పద్యరాగాలను’ అక్షరబద్ధం చేశారు. రసాస్వాదనతో స్వరాలపన ఎలా చేయాలో తెలిపారు. ముంజం మల్లేష్ అవ్వకు వందనం సమర్పించారు. కొండగుర్ల లక్ష్మయ్య అడవి బిడ్డల గొప్పదనాన్ని తన కవిత ద్వారా వివరించారు. ఆధునిక యుగంలో అమ్మతనం అమ్ముడు పోయిందని మహిళా ఉద్యమ నాయకురాలు మర్సుకోల సరస్వతి తమ కవితలో ఆవేదనను వ్యక్తపరిచారు. అన్ని మరిచినా..పరువాలేదు..తల్లి దండ్రులను మరువవద్దని గుగ్లావత్ వినోద్‌కుమార్ సూచించారు. శ్రావణ్ రాథోడ్ ‘మేలీగిందీ’,‘ఉగాది’ కవితల్ని రాసి మెప్పించారు.
అక్షరాలతోని నిర్మాతమైన పదాలతో కుస్తీ పడుతూ బతుకు భవనాన్ని కట్టుకునే విద్యార్థి కూడా ఓ శ్రామికుడేనని గోపగాని రవీందర్ తమ కవిత ద్వారా తేల్చి చెప్పారు. వీటితో పాటు ఆదివాసిల ఆచార వ్యవహరాలను, బంజార వివాహ వేడుకలు, కథ, నవలల్లో ఉత్తర తెలంగాణ ఆదివాసి జీవనం తదితర వ్యాసాలను ఈ గ్రంథం చివరన పొందుపరిచారు. సాడిగె రాజగోపాల్ ఉట్నూర్ సాహితీ వికాసాన్ని తమ వ్యాసం ద్వారా తెలిపారు. ‘శిల్పగురు’ పురస్కార గ్రహీత తొలి ఆదివాసి కళాకారుడు కోవ నానేశ్వర్ గురించి మహ్మద్ రహీ మోద్దీన్ తమ వ్యాసంలో వివరించారు. మర్సుకోల క్రాంతి కుమార్ ‘ది ఆదిలాబాద్ ఆదివాసి’ అంటూ ఆంగ్లంలో ఓ వ్యాసం రాశాడు.
సాదాసీదాగా ఇలా కవితలు, పాటలు, వ్యాసాలతో వచ్చిన ఈ గ్రంథంలోని రచనలు చాలావరకు కొత్త వాళ్లనే ఉండటం విశేషం..కవులు, రచయితల్ని తయారు చేయడాని సాహితీవేదిక చేస్తున్న కృషి శ్లాఘనీయం..గోపగాని రవీందర్ మార్గదర్శకత్వంలో కవిత్వం, ఇతర రచనలు ఎలా చేయాలో కొత్తవారికి శిక్షణనిచ్చే వర్క్‌షాపులు ఏర్పాటు చేసి..కొత్త వారిని ఇంకా ప్రోత్సహిస్తారని ఆశిద్దాం..అలాగే ఇందులో రచనలు వచ్చిన వారు ఇంతటితో ఆపక తమ కలాలకు ఇంకా పదును పెట్టుకుంటారని ఆశిద్దాం.

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544
**
ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net