విజయవాడ

ప్లాస్టిక్ పరిమళం (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి వాక్యం
ప్రేమకు ప్రతిరూపమై
కళ్లు చెమర్చేవి
నాడు నాకొచ్చిన ఉత్తరం
చిన్న కార్డుముక్కే అయినా
వచ్చీరాని భాషలో రాసినా
గోరుముద్దలు
తిన్నంత కమ్మగా
అమ్మ ఒడిలో
సేదతీరినంత
హాయిగా వుండేది!
అక్షరం అక్షరంతో కలిసి
అమృతం కురిసి
నాన్న నన్ను
గుండెకు హత్తుకున్నంత
ఆనందంగా
మరలా మరలా
చదవాలనిపించేది!
ఇప్పుడు ఆ అదృష్టం
నాకే కాదు
ఏ ఒక్కరికి మిగల్లేదు
సైబర్ నెట్‌లో
నలిగి నలిగి
ఉత్తరం
కనుమరుగౌతుంటే
ప్రేమలు
మమతలు
మాయవౌతున్నాయి!
ఎక్కడ చూసినా
చాటింగులు
మేటింగులు
ఎస్‌ఎంఎస్‌లు
చరవాణిలో వచ్చేది
వొట్టి ప్లాస్టిక్ పరిమళమే!
రండి.. రండి
ఉత్తరానికి
ఊపిరిపోద్దాం
మళ్లీ మనం
జవజీవాలు నింపుకుందాం!

- ఎస్‌ఎం సుభాని,
గుంటూరు.
చరవాణి : 9490776184
**

మదిలోని
మధుర భావం

నేనెలా మరచిపోగలను?
నన్ను చూసి నవ్వుతోన్న
నీ కళ్లు ఒలకబోసిన
మధువు తియ్యదనాన్ని!
నేనెలా మరచిపోగలను?
నాకోసం నువ్వు నడచివస్తోంటే
ఆ ఎడారి బాటంతా నిండిన
మల్లెల సుగంధ పరిమళాలను
నేనెలా మరచిపోగలను?
శిశిరంలో చలిచెలి
నన్ను కవ్విస్తోన్న వేళ
వసంతంలా నన్నుచేరి
నీ బిగి కౌగిలితో బంధించిన
సుమధుర సుందర క్షణాలను!
నేనెలా మరచిపోగలను?
చీకట్లు ముసిరిన
నా జీవన రహదారిలో
కౌముదీ కాంతులతో దారిచూపిన
అమృత ఘడియలను!
నేనెలా మరచిపోగలను?
నాలోని
అణువణువునూ ఆక్రమించుకొని
నా గుండె గుడిలో దేవతగా
పూజలందుకుంటోన్న నిన్ను!

- విడదల సాంబశివరావు,
చిలకలూరిపేట,
చరవాణి : 9866400059
**
అద్దంలో

చందమామ
పెద్దనోట్ల రద్దు
అవినీతికి
అంతిమ సంస్కారమన్నారు
కానీ నేడది
నీతిని పాతరవేసి
నల్లకుబేరులకు
ఆకుపచ్చ తివాచీ పరచింది
ఎక్కడ చూసినా డబ్బే
ప్రజల అవసరాలు తీర్చదు
బలవంతుడు బరిలోకి దిగితే
బలహీనుడు బలి అయినట్లు
ధనాధిపతులంతా
చలిమర గదుల్లో సేదతీరుతూ
డబ్బుతో చలికాచుకుంటుంటే
బడుగు బతుకులన్నీ
నడిబజారులో తెల్లారిపోతుంటే
భావి బంగారుమయమంటూ
అద్దంలో చందమామని చూపినట్లు
డబ్బులెక్కలు చెబితే
కడుపులు నిండవు
కష్టాలు తీరవు!

- డా.మైలవరపు లలితకుమారి,
గుంటూరు.
చరవాణి : 9959510422
**

ప్రేమ..

పెద్దరికం కక్షగట్టి
పెత్తనంతో కళ్లెర్రజేసినా
కులం కాటేసి
విషంతో చంపేసినా
మతం మంటబెట్టి
నిప్పుల్లో పడతోసినా
ఆచారం అడ్డగించి
చీకటి గదిలో బంధించినా
ఆస్తులు, అంతస్తులు అటకాయించి
అహంకారంతో ప్రశ్నించినా
దౌర్జన్యం దాడిచేసి
అమానుషంగా గాయపర్చినా
అధికారం ఎదురొచ్చి
తుపాకులు గురిపెట్టినా
పరువు ప్రతిష్ఠలు ఏకమై
గుండెల్లో గునపాలు దించినా
ఒకరికి ఒకరై తోడునీడగా
జంటపక్షులై స్వేచ్ఛగా విహరిస్తూ
అంతరాల దొంతరలను
సంప్రదాయపు సంకెళ్లను
తెంచుకుంటూ
త్యాగానికి చిరునామా..
ప్రేమేనని చాటిచెబుదాం!

జె. విశ్వ,
చరవాణి : 7793968907
**

నీ జ్ఞాపకాల సౌరభాలు..

ప్రియతమా
నే గురుతున్నానా?
తొలివలపు గీతాన్ని
ప్రణయ ప్రణవ సంగీతాన్ని!
నీ ముగ్ధమోహన రూపాన్ని చూసీ
ఎన్ని దశాబ్దాలు గడిచాయో..
నీకూ నాకూ మధ్య కాలం
ఎన్ని యోజనాల కుడ్యాన్ని నిర్మించినా
నీ జ్ఞాపకాల సౌరభాలు
నన్నింకా వెంటాడుతూనే ఉన్నాయి
ఏకాంతసీమలో
ఏకమైన రసహృదయాలతో
ఎనె్నన్ని కలలుకన్నాం..
వలపు సామ్రాజ్యానికి నిన్ను
యువరాణిని చేయాలని
మమతల పల్లకీలో
నిను ఊరేగించాలని
కోకొల్లలుగా కలలు కన్నాను
కట్టుకున్న కలలమేడ తృటిలో
కాలగర్భంలో కలిసిపోయింది
ప్రణయ రణం లేకుండా
అకారణంగా నన్ను వీడిపోయావు
నువ్వు నా ఒంటికి అంటించిన
వలపు సుగంధం ఇంకా
పరిమళాలు వెదజల్లుతూనే ఉంది
నీరాక కోసం
ఎదురుచూస్తూనే వుంటాను ఆశతో
కన్నుల్లో కోటి దీపాలు
వెలిగించుకొని!

- జి సూర్యనారాయణ,
బందలాయిచెరువు,
చరవాణి : 9704784744