నెల్లూరు

నిజమైన ఉగాది (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిమళ దీర్ఘంగా ఆలోచిస్తోంది. ఆమె ఆలోచనల్లో రెండు విషయాలున్నాయి. రాబోయే ఉగాదితో పాటు తన పిల్లల గురించి. వ్యవసాయం చేస్తూ ఆ ఊళ్లో మంచిపేరు తెచ్చుకున్న తన భర్త పరంధామయ్య చనిపోయి పదేళ్లవుతోంది. ఆ ఇంటికి కోడలిగా వచ్చి తను ఆ ఇంటికి, ఆ ఊరికి ఆప్తురాలైపోయింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న సామెత తన పాలిట నిజమైంది. పిల్లలు ఉద్యోగాలు పెళ్లిళ్లు అంటూ దూరం అయిపోయినా ఉగాదికి మాత్రం తప్పనిసరిగా తనని కలవాలని తండ్రికిచ్చిన మాట కోసం ఊళ్లో వాళ్ల కోసం ఆ ముందురోజు వచ్చి ఉగాది మరుసటిరోజు వెళ్లిపోతారు.
వాళ్ల గురించి తనకు పెద్దగా బెంగలేదు. కాని కన్నకూతురు వైఖరే ఆమెకు వింతగా ఉంటుంది. మంచి సంబంధం చూసి యాభైవేలు కట్నమిచ్చి ఆమె పెళ్లి ఘనంగా చేశారు కాని ఎప్పుడూ ఏదో ఒకటి తన వద్ద నుండి లాక్కుపోవాలనే చూస్తుంది ఆ అమ్మాయి పద్మిని. ఎంతసేపు స్వార్థంగా తప్ప ఎదుటివాళ్ల గురించి ఆలోచించదు. తను ఇక కోడళ్లు వేరింటి అమ్మాయిలైన వాళ్లే కొద్దోగొప్పో మేలు పండగ అంటూ చెరొక చీర తీసుకువస్తారు కాళ్లకు దండం పెడతారు. వాళ్లు చూడకుండా అందులో ఒక చీర లాగేసుకుంటుంది పద్మిని. వెళ్తూ..వెళ్తూ ఊరగాయలు, ఆవగాయలు మసాలాపొళ్లు దొడ్లో ఉండే కూరగాయలు అన్ని పట్టుకువెళ్తుంది.
ఈమెను చూసి కోడళ్లు కూడా అన్నో ఇన్నో తీసుకుంటారు. మనవళ్లు సుష్టుగా భోంచేసి క్యారమ్స్ ఆడుకోవడం, చేను దగ్గరకు వెళ్లి రావడం టివి.చూడ్డం చేస్తారు. కోడళ్లు వంటలో సహాయం చేస్తే ఆ మూడురోజులు తనే వంట చేస్తుంది. కంది చట్నీ నెయ్యి వేసి వేడివేడి అన్నం కలిపి తలా నాల్గుముద్దలు పెడుతుంది. బొబ్బట్లు, గారెలు, పులిహోర కలిపి పండుగ వంటలు చేసి వెళ్లే రోజు వాళ్లందరికీ అరిసెలు, సకినాలు, నువ్వుండలు, రవ్వలడ్లు, బేసన్ లడ్డు ప్యాక్ చేసిస్తుంది. తను వేసిన ఆకుకూరలు, కాయగూరలు పూలచెట్లు వాళ్లను బాగా ఆకర్షిస్తాయి. పెరడంతా బోసిపోతుంది. మళ్లీ వాటిని మామూలు స్థితికి తీసుకురావడానికి తనకి ఎంతోకాలం పడుతుంది. అందరూ తన కోసం ఒక బస్తాపెట్టి మిగిలిన బియ్యం మొత్తం పట్టుకెళ్లిపోతారు.
ఉగాది అందరికీ ఆమనిని తెచ్చిపెడితే తనకు మాత్రం శిశిరమాసం గుర్తుకుతెస్తుంది. పెద్దకొడుకు నామమాత్రానికి ‘‘ఈ ఊళ్లో ఒంటరిగా ఎందుకు అమ్మా పదమనింటికి వెడదాము’’ అంటాడు. అప్పుడే పెద్దకోడలు కళ్లతోనే సైగ చేస్తుంది. చిన్నకొడుకు ‘‘నీకేదన్నా ఐతే ఎలాగమ్మా..మాకు ఎవరు చెబుతారు’’ అంటే వెంటనే చిన్నకోడలు ‘‘అత్తయ్యకు ఊరంతా బంధువులే కదండీ ఊరివాళ్లు ఊర్కుంటారా ఏమిటి’’ అంటుంది. అంటే వాళ్లకు తనకు సంబంధించిన వస్తువులే కావాలి కాని తను అవసరం లేదు. ఇక కూతురు మాత్రం ఊర్కుంటుందా ‘‘అమ్మకు అక్కడేమి తోస్తుంది ఇక్కడైతే తెలిసినవాళ్లున్నారు..టైమ్ తెలీదు కదమ్మా’’అంటుంది. ఒక నవ్వు నవ్వి ఊర్కుంటుంది. ‘‘అమ్మా ఆస్తులన్నీ పంచెయ్యమ్మా ఊరికే పల్లెటూర్లో దానికి వాల్యూలేదు’’ అని ఒకడంటే ‘‘అమ్మ అందరికీ సమానంగా అంటే మా ఇద్దరికీ సమానంగా పద్మినికి నీయిష్టం’’ అని ఒకడంటే ‘‘ ఓ.. ఓ. అమ్మ ఇష్టం కాదు మీతో సమాన వాటా నాకు’’ అంటుంది పద్మిని. ‘‘మీ చదువులకు తగలెయ్యలేదు నాన్న’’ అంటే ‘‘పెళ్లి నీకు ఘనంగా చేయలేదు నాన్న’’ అని వాళ్లంటారు, ఇలా ఆస్తుల గురించే కాని తన గురించి వాళ్లకు అసలు గుర్తుకురాదు.
తన ఇంట్లో ఉన్న మూడ్రోజులు ఇలాగే ఉంటుంది వాళ్ల వరస. నవ్వి ఊర్కుంటుంది కానీ తనేమి మాట్లాడదు. తనకు తెలుసు వాళ్ల అసలు విషయం ఆస్తులు అమ్మేస్తే అక్కడికి రావడం తప్పించుకోవచ్చని వాళ్ల అభిప్రాయం. వాళ్లు తెంచుకున్నంత త్వరగా తను తెంచుకోలేదు. అందుకే ‘‘నేను ఎప్పుడు మీకు ఇవ్వాలో అప్పుడే ఇస్తాను ఇప్పుడు ఆ ప్రస్తావన వద్దు’’ అంటూ ముగించేస్తుంది. అయిష్టంగా తలూపి వెళ్లిపోతారు వారు. వాళ్లు వెళ్లగానే ఖాళీయైన పెరడులాగా తన మనసు ఖాళీ అయిపోయింది.
తన అత్తమామలకు తన భర్త ఇంకో కొడుకు, కూతురు ఉన్నారు వాళ్లు అంత ఆప్యాయత చూపించకపోయినా తన భర్త, తను ఎంతో ఆదరంగా చూసుకున్నారు వాళ్లను. వాళ్ల ద్వారా ఆస్తులు రాకపోయినా తన భర్త కష్టపడి ఆ ఇల్లు కట్టించాడు. పదెకరాల మాగాణి కొన్నాడు. ఇప్పుడు వాటి మీదే తన పిల్లల కన్ను. తన అత్తమామలు పరంధామయ్య చేతులమీదుగా తృప్తిగా వెళ్లిపోయారు కాని, తన పిల్లలకు తన గురించి చింతేలేదు.
‘‘ ఏం పరిమళమ్మ చీకట్లో కూర్చున్నావు ఉగాదికి మీ పిల్లలు వచ్చినట్లున్నారు’’ అంటూ పలకరించింది ఎదురింటి మీనాక్షమ్మ. ‘‘వచ్చారు వెళ్లారు నేను ఒక్కదానే్న మిగిలాను’’అంది నిర్లిప్తంగా పరిమళ. ‘‘నేనో విషయం చెబుతాను ఇవి అమ్మేసి సమాన వాటాలిచ్చేసి ముగ్గురి వద్ద కొంత కాలం ఉంటే కాలం వెళ్లిపోతుంది కదా’’ అంది మీనాక్షమ్మ. ‘‘అంటే నేను కూడా ఒక వాటానా వాళ్లకి’’ అంది పరిమళ. ‘‘అలా ఎందుకు అనుకుంటావు పరిమళమ్మ, ముగ్గురి దగ్గర కాసిన్ని రోజులుంటే వాళ్లతో గడిపినట్లుంది కదా’’ అనింది మీనాక్షమ్మ.
‘‘వాళ్లతో గడిపే బదులు ఇక్కడ ఒంటరిగా ఉండటమే బావుంది.. వాళ్లకి నాకు సంబంధించిన ఆస్తి ముఖ్యం. నేను ముఖ్యం కాదు.. వచ్చారు..వెళ్లారు. వాళ్లు వచ్చిందాని వల్ల నాకు లాభమూ లేదు. వెళ్లినందు వల్ల నష్టమూ లేదు’’ అని పరిమళమ్మ నిట్టూర్చిచ్చింది. అదేమిటి పరిమళమ్మ అలా అంటావు. ‘‘నీ పిల్లల వద్ద ఈ సమయంలో వుంటే నీకు మంచిది కదా’’ అనింది మీనాక్షమ్మ. ఏమిటి మంచి దోపిడి దొంగల్లాంటి పిల్లలు, కోడళ్లంటే పరాయివాళ్లు... కూతురు కూడా వాళ్లలాగే ప్రవర్తిస్తుంది. వాళ్లయినా ఒక చీర అయినా తెస్తారు. వాళ్లు తెచ్చిన చీర కూతురు లాక్కుపోతుంది. ఇక వాళ్లకు ఇవ్వాల్సింది ఏమీ లేదు. ఇది నా భర్త స్వార్జిత ఆస్తి. ఇది పిత్రార్జితం కాదు. కాబట్టి నేను ఏం చేయాలో నిర్ణయించుకున్నాను’’ అంది పరిమళమ్మ.
పరిమళమ్మ జీవితంలో ఇప్పుడు ఒంటరి తనం లేదు.తనలాంటి వాళ్లెందరో ఆమె అండ చేరారు. ఆమె ఆలయంలో మొక్కలు చిగుర్లు వేస్తున్నాయి. ఇన్నాళ్లు ఉగాది అంటే పండగే. ఇప్పుడు రాబోయే ఉగాది నిజమైన ఉగాది అనిపిస్తుంది. శిశిరం పోయి వసంతం వచ్చేసింది. తన పిల్లలకు అవసరానికి మించి అంతా ఇచ్చింది.తనలాంటి అభాగ్యులకు సేవచేసే భాగ్యం భగవంతుడు తనకు ఇచ్చాడు. తన నిర్ణయం పట్ల ఆమెకు మంచి భావం కలిగి కనబడని దైవానికి దణ్ణం పెట్టుకుంది. తనలాంటి వాళ్లకు తను తోడు..తనకు వాళ్లు తోడు.
*
-డా॥ ఎం.ఎస్. జ్ఞానేశ్వర్
మదనపల్లె. చరవాణి : 9440729701

-డా॥ ఎం.ఎస్. జ్ఞానేశ్వర్ మదనపల్లె. చరవాణి : 9440729701