ఉత్తర తెలంగాణ

కథ ఏకబిగిన చదివించగలగాలి (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నామని సుజనాదేవి
ఏ.ఓ.
ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా
హుస్నాబాద్ బ్రాంచ్
జిల్లా సిద్దిపేట-505467
సెల్.నం.7799305575
*
కథ ఏకబిగిన పాఠకులను చదివించేలా ఉండాలని భావించే ప్రముఖ కథకురాలు నామని సుజనాదేవి వరంగల్‌లోని మట్టెవాడకు చెందిన వారు.. 2000నుంచి 2003 వరకు క్రీడా రంగంలో క్రీడాకారిణిగా వెలుగొందిన ఆమె.. జీవిత భీమా సంస్థలో ఉన్నతాధికారిగా పని చేస్తున్నారు. వందకు పైగా కథలు రాశారు.. మూడు కథా సంపుటాలను వెలువరించారు. రెండు కవితా సంపుటాలను కూడా ప్రకటించిన ఆమె రచనలు అనేక ప్రముఖ పత్రికల్లో ప్రచురితమవుతున్నాయి. భర్త క్యాతం సంపత్ ప్రోత్సాహంతోనే రచనా వ్యాసాంగాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నానని చెపుతున్న నామని సుజనాదేవితో ‘మెరుపు’ ముచ్చటించింది. ముఖాముఖి వివరాలు పాఠకుల కోసం..
ఆ మీరు రచనా వ్యాసాంగాన్ని
ఎప్పుడు ప్రారంభించారు?
ఆంధ్రజ్యోతిలో కొత్త రచయితలు శీర్షికలో ‘ప్రేమ తపన’ కథతో 1991లో ప్రారంభించాను.

ఆ మీరు రచనల వైపు ఆసక్తి
చూపడానికి ప్రేరణ ఇచ్చిందెవరు?
మా నాన్న పలు పుస్తకాలు తెప్పించడం వల్ల, ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేసే పెదనాన్న రాజశేఖరం గారు పలు శుభకార్యాలలో స్వీయ కవితల కరపత్రాలు పంచడం వల్ల.

ఆ మీ కుటుంబ నేపథ్యం చెప్పండి?
చేనేత కుటుంబం నుండి వచ్చాను. తాతయ్య మగ్గం నేసేవారు. నాన్న, మామయ్య ఆయుర్వేద వైద్యులు. మామయ్య క్యాతం మల్లయ్య కుక్క కాటుకు మందు స్వయంగా కనిపెట్టారు. ఇప్పటివరకు ఆ మందు తీసుకున్న వేలాది మంది ఆరోగ్యంగా ఉన్నారు. మా శ్రీవారు సంపత్ కుమార్ కూడా భీమా సంస్థలో ఉన్నత అధికారిగా సేవలందిస్తున్నారు.

ఆ మీరు ఏయే ప్రక్రియల్లో రచనలు చేశారు?
కథలు, కవితలు, వ్యాసాలు, నానీలు, బాలగేయాలు, బాలల కథలు.

ఆ మీ ముద్రిత గ్రంథాలు?
మనోస్పందన, మనో వీచిక, పంచామృతం, ఎదలయలో, హృదయనేత్రం ఇంకా అనేక సంకలనాలలో నా కథలకు స్థానం లభించింది.

ఆ మీ దృష్టిలో కథ అంటే ఏమిటి?
పాఠకుల మదిలో చెరగని ముద్ర వేసే పరిమిత నిడివిగల్గిన ఇతివృత్తం.

ఆ మంచి కథకుండాల్సిన లక్షణాలు ఏమిటి?
మొదలు పెట్టగానే ఆగకుండా చదివించగలగడం, పరిమితమైన నిడివి, సమాజహితమైన సందేశం, శిల్పం, మరపురానిదిగా, కొసమెరుపుతో పూర్తవ్వాలి.

ఆమీకు నచ్చిన ఆధునిక కథకులు ఎవరు?
కె.వి.నరేందర్, పెద్ది అశోక్ కుమార్.

ఆ మీకు నచ్చిన ఆధునిక గ్రంథం ఏది?
పెద్దింటి రచించిన ‘జిగిరి’ నవల.

ఆ ఇప్పుడొస్తున్న కథలు, కథానికలపై
మీ అభిప్రాయం?
కొత్త సీసాలో పాత సారా.

ఆ ఎల్‌ఐసిలో ఉన్నతోద్యోగం చేస్తున్న మీరు రచన చేయడానికి సమయాన్ని ఎలా వినియోగించుకుంటున్నారు?
సెలవు రోజుల్లో.. రాత్రి వేళల్లో సమయం కేటాయిస్తుంటాను. సమయం దొరకక కాగితంపై పెట్టాలనుకున్న చాలా ఆలోచనలు పెట్టలేక పోతుంటాను. అయినా మా శ్రీవారి ప్రోత్సాహంతో రచనలకు సమయాన్ని కేటాయస్తున్నాను.

ఆ మీకు నచ్చిన పురస్కారాలు?
శాతవాహన యూనివర్శిటీ, గురజాడ, శ్రీశ్రీ, ఉగాది, విశ్వశాంతి సేవ, ఐతా చంద్రయ్య, అలిశెట్టి ప్రభాకర్, సోమ రాధాకృష్ణ స్మారక పురస్కారం మొదలైనవి.

ఆ పురస్కారాల ప్రదానంపై
మీ అభిప్రాయం?
ప్రోత్సాహకరంగా ఉంటాయి. సమాజం, సాహిత్యం పట్ల బాధ్యతను పెంచుతాయి. అయితే ఎంపికలో అర్హులకు పెద్దపీట వేసి వారికే పురస్కారాలు అందేలా చూడాలి.

ఆ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోని సంఘటనలు కథలుగా మలచడానికి నేటి కథకులు ఎక్కువగా ప్రయత్నించడం లేదు.కారణం ఏమిటి?
మలచిన కథలు ప్రచురణకు నోచుకోలేదంటాను. పైగా కథకులు చాలామంది ఉద్యమంలో స్వయంగా పాల్గొన్నారు. రాసే సమయం లేకపోయింది. అందువల్లనే అనుకుంటాను. ఇప్పటికైనా ఉద్యమ ఘట్టాలను కథలుగా మలచడానికి రచయితలు ముందుకు రావాలి. అలాగే పత్రికలు వాటిని ప్రచురించాలి.

ఆ తెలంగాణ గ్రామీణ భారతాన్ని ప్రతిబింభించే కథలు రావాలంటే
ఏం చేయాలి?
వారి గురించి అధ్యయనం చేసి వారితో మమేకం అవ్వాలి. అలా రాసిన వాటికి ప్రాచుర్యం కల్పించాలి.

ఆ కవిత్వం, కథ ఈ రెండింటిలో ఏది రాయడం సులభం?
వేటికవే విశిష్టమైనవి. రెండు కళ్లలాగా..

ఆ తెలంగాణా సాహిత్యం వెలుగులోకి రావాలంటే ఏం చేయాలి?
ముందుగా వాటిని రాసేవారిని, వారి రచనలను ప్రచురించి ప్రోత్సహించాలి. సమాజంలో వారికి ప్రత్యేక గుర్తింపునివ్వాలి. ప్రభుత్వం అలాంటి వారికి ప్రోత్సాహకాలు ప్రకటించాలి. మరుగున పడ్డ తెలంగాణ సాహిత్యం వెలుగులోకి రావడానికి కవులు, రచయితలు ముందుకు రావాలి.

ఆ ఇప్పటి కథకులకు, కవులకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమిటి?
సమాజహితమయ్యే, చిరకాలం గుర్తుండిపోయే రచనలు చేయాలి. కాలక్షేపం కోసం కాకుండా సామాజిక చైతన్యం కోసం రచనలు చేయాలి.
*
ఇంటర్వ్యూ:
దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544