రాజమండ్రి

సమాజానికి కవివైద్యుడి చికిత్స ‘నేటి భారతం’ (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేజీలు:124, వెల:100/-
ప్రతులకు:
శ్రీమతి జె.తులసిలక్ష్మి
46-15/21/1,
పార్కుగేటు వీధి,
దానవాయిపేట
రాజమహేంద్రవరం
సెల్:98481 42428
**
వ్యక్తి ఆరోగ్యానికి వైద్యుడు ఎంత అవసరమో, వ్యవస్థ ఆరోగ్యానికి కవి అంత అవసరం. మనిషి రోగాలపాలు అయితే వైద్యుడు చికిత్స చేస్తాడు. సమాజం జబ్బుపడితే కవి నయం చేస్తాడు. కవి, వైద్యుడు ఒకరయితే అటు సమాజ రుగ్మతల్ని, ఇటు మనిషి రోగాలకు ఏక కాలంలో వైద్యంచేసి, సంఘాన్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. ఆ కవి వైద్యుడే డాక్టర్ జనపాల కాళేశ్వరరావు. అనేకానేక సమస్యలమీద, రుగ్మతల మీద, సంఘటనల మీద రాసిన కవితల సంపుటి నేటి భారతం. అదే నవ్య భారతం కావాలని ఆకాంక్షిస్తున్నారు. ‘ఆశ రూపు దాల్చుతోంది/ స్వార్థపు అంకురం వికసించబోతోంది/్భమ్యాకాశాల వేదికగా/రాజ్యకాంక్ష పురివిప్పుతున్న సమయమది’. ఈ నాలుగు పాదాల ప్రార,నంతోనే కవి చెబుతున్న సంగతి ఇట్టే బోధపడుతుంది కదూ. అదీ డాక్టరుగారి కలంలోని పదును. పుస్తకం తెరవగానే తన మొదటి కవితతో ఆకట్టుకున్న వైనం ఇది. దేశంపట్ల జనపాల వారికున్న తపనకు ‘సరిహద్దుల దురాక్రమణ’ కవిత నిదర్శనం.
‘ఏం చేయాలి?’ అని అగుగుతూనే అవినీతి మీద యుద్ధాన్ని ప్రకటించారు. అవినీతి జాడ్యాన్ని తరమడానికి ఏంచెయ్యాలో చెబుతున్నారు. ‘సర్దుకుపోవడమే అలవాటుగా/ మనిషి బ్రతుకుతుంటే’ ఏం చేయాలో అడుగుతున్నారు. ప్రభుత అంటే ఒక బుగత అనే తీరులో నేడు అధికార రాజకీయాలు చలామణికావడం చూస్తున్నాం. దానే్న గట్టి చురకలతో అంటించారు. ‘సాధ్యాసాధ్యాలతో పని లేదు/ సీట్ల కోసం/ వాగ్దానాల మీద వాగ్దానాలు/ ఉండనే ఉందిగా ఓటుకు నోటు’ అని వెటకరిస్తున్నారు. శుష్కప్రియత్వం ఏపాటిదో తెలియజెబుతున్నారు... ఉన్నవాళ్లంతా/కానివాళ్లయితే/మన తెలివికేం తక్కువ/ మేడిపండు ప్రజాస్వామ్యం’ అని ఎద్దేవా చేస్తున్నారు. శాస్ర్తియత లేని అంశాల్ని ‘ఆబ’గా చూపించి, వెర్రిలోకి ‘వాస్తు’ని జొప్పించి, జాతక కథల్ని జోతిష్యం పేరుతో నమ్మబలుకుతున్నారు. ప్రజాధనాన్ని ఎలా దోచేస్తున్నారో నేటితరం నాయకుల్ని ఈ కవితలో చూపారు.
వైద్య సేవల భాగ్యం ‘ఆసుపత్రి’ అంటే కవి డాక్టరాయే మరి ఊరుకుంటారా... ఆ చోద్యాన్ని మన కళ్లముందు పెట్టి ప్రజారోగ్యం మందు కనుగొంటున్నారు. ఒక నిబద్ధత కలిగిన వైద్యుని ఆవేదన ‘ఆసుపత్రి’లో చూడొచ్చు. ఎత్తిన కత్తి దించకుండా ఎడతెగని పోరాటం చేయాల్సిన అవసరం ఉన్న అంశం ‘అంతర్జాలం’. ప్రపంచాన్ని ముంగిట తెచ్చిందని సంబరపడిపోతున్నాం గాని, దాని అనర్ధాన్ని సరిగా పట్టించుకోవడంలేదు. ‘బూతు’ని జేబులో పెట్టి, పిల్లలకు జోల పాడుతున్నాం. వాడెలా మంచోడవుతాడు? ఉత్తముడుగా ఎలా మారతాడు. సమస్త నేర ప్రపంచాన్ని తలుపులు బార్లా తెరిచి, చట్టాలుచేసి, నరోధించగలమా? ఎంత కావాలో అంత మంచిని మాత్రమే తీసుకునే ఉదారత ఏదీ? ‘అంతర్జాల అశ్లీలం’ కవితలో ‘జగతికి జీవన జ్యోతి అంతర్జాలం’ ‘మారే కాలానికి మార్పునిచ్చే ఉపకరణం’ అంటారు. ‘లోక రీతిని జనులకందించే సాధనం’ ‘జవసత్వాలను హరించే విషవలయ వ్యాపకం’ అయిందని ఆవేదన చెందుతారు. నవ నాగరికతకు తెచ్చిన దుర్లక్షణం అన్నమాట.
‘మందుల అవినీతి’ మీద ధ్వజమెత్తారంటే అనరూ... స్వయాన ఆయన డాక్టరు. ఏమందు రాస్తే ఎంత కమీషనిస్తారో ఆ కంపెనీ రిప్రజంటేటివ్ అదే రోగికి రాయాలి. మల్టీ నేషనల్ డ్రగ్ కంపెనీల బాగోతాన్ని కనిపెట్టి, ఒక దేశం ఆ మందులు నిషేధిస్తే, ఆ మందు ఎంత వికటించినా ఇక్కడ ఆమోదయోగ్యం. అదీ డబ్బు మహత్యం అదే జబ్బు మర్మం. ‘వ్యవస్థీకృతమైపోయిన అవినీతి / నైతికతను చంపేస్తున్న దుర్నీతి’ అని అభివర్ణించారంటే నకిలీ, కల్తీల తేడా లేకుండా విక్రయాలు జరుగుతున్నాయనే. హెపటైటిస్-బి అనే జబ్బుకు వ్యాక్సిన్ వేయించుకోవాలని లేదంటే మరణం అనివార్యమంటూ మందుల కంపెనీల గుంజుడు ఎవరు మరచిపోతారు? పరిణామక్రమం గురించి చదువుకున్నాం. మృతభాషగా మారుతున్న వేళ దాన్ని బతికించుకునే ప్రయత్నాన్ని గోముగా చెప్పారు. మనిషి చిన్న హృదయానికి పెద్ద సంబరం సంక్రాంతి, ఎందుకంటే తెలుగు సంప్రదాయం అంతా జగమంత కుటుంబంలా ఒదిగిపోయే ఒకే ఒక పెద్ద పండగ సంక్రాంతి. సంక్రాంతి పండగను వస్తువుగా తీసుకోకుండా ఏ కవి ఉండడు. మరి మన డాక్టరుగారికి ఎందుకుంటుంది మినహాయింపు. ఎన్నిటికో ప్రతీకలుగా నిలిచే నవ్వులను తనవిగా చేసుకున్న జనపాలవారి విన్నపాలు చూడండి. ‘నా పలుకు నచ్చినా నచ్చకపోయినా/అందరిని నవ్వుతూ పలకరిస్తా/ ఎందుటివారి నవ్వే నాకనందం/ నాకదే సంక్రాంతి సంబరం’ అనటం ఆయనలోని సహజనైజం. ఈ సంపుటిలో కొన్ని కవితలు మనల్ని అలరిస్తాయి. నవ్వుల పరిమణాలు విరజిమ్ముతాయి. ఆయన మోములో సౌమ్యత, ఆయన సుగుణం ప్రభుత్వ వైద్యునిగా విశ్రాంతి తీసుకున్నా, వృత్తినుంచి విరమణ లేకుండా వైద్యసేవలు అందిస్తున్నారు.
అంకితభావం, నిబద్ధత, మంచి సమాజానికై తపన పుష్కలంగా ఉన్న కవి కలం ఇంకా పదును తేలాల్సిన అవసరం ఉంది. అర్ధంకాని కవిత్వమే చిక్కదనం కాదుకాని, సరళత వచనంతో సాగిన కవిత్వం. పేలవమనలేము గానీ, రుచితో కరచుకొనిపోయేలాంటా పద చిత్రాల జాడ పుస్తకంలో దొరకదు.
పద ప్రయోగాలు ప్రారంభ ఎత్తుగడలతో కవిత్వపు పట్టు సాధించారు. కవితలకు తగిన క్యారికేచర్లు, అరుదైన ఫొటోలతో కవితలకు అందాన్ని తెచ్చిపెట్టారు. కవితాత్మకత కొట్టొచ్చేలా ప్రయత్నించారు. కవరు పేజీపైన ‘సమకాలీన ఆర్థిక, సామాజిక, విద్యా, రాజకీయ విషయాల వచన కవితలు’ అని ముద్రించడం విశేషం. సమాజానికి సందేశాత్మక కవిత్వ సంపుటి అందించి డాక్టరు, కవిడాక్టరై కృతకృత్యులైనారు.

- రవికాంత్, 9642489244

**
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net