విశాఖపట్నం

వాళ్లకీ ఓ రోజుండాలి (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వేశ్వరశర్మగారు మంచి పేరున్న ఉపాధ్యాయుడు, వేదపండితుడు, సాహితీవేత్త. ఈమధ్యనే ఉద్యోగ విరమణ చేసారు. విశ్రాంతి తీసుకోవలసిన ఈ వయసులో ఈయనకు అవిశ్రాంత శ్రమ పెరిగింది. పిల్లలిద్దరూ పెళ్లిళ్లు అయి అమెరికాలో ఉన్నారు. పక్షవాతం వచ్చిన భార్యకు అన్నీ తానై సేవలందిస్తూ కోలుకునేటట్టు చేస్తున్నారు. ఇదివరకు ఇంట్లో ఏచిన్న పని కూడా తాను చేసియెరగడు. యింట్లో పనిమనిషి కొన్ని పనులు వరకు మాత్రమే చేయగలదు. అన్ని సందర్భాలలో కనిపెట్టుకొని చంటిపిల్లలకు చేయాల్సిన పనులన్నీ ఎంతో సహనంతో కూడిన ప్రేమతో చేస్తున్నప్పటికీ కొద్దిపాటి అసౌకర్యం, అసహనం చోటు చేసుకుంటున్నాయి. పాచిపనులు, పాకీపనులు చేసేవారిపట్ల ఔన్నత్యాన్ని అనుభవంలో తెలుసుకుంటున్నారు మాస్టారు. మనవాళ్లు అనుకునే వారిని శుభ్రత చేసే విషయంలోనే అసహ్యించుకుంటున్నాం కదా! పరాయివాళ్లకు చెత్తను చీదరించుకోకుండా ఓర్పుగా శుభ్రపరిచేటి పారిశుధ్య కార్మికులు ధన్యులు అనుకున్నాడు మనసులో.
అన్నట్లు నిన్న వీధి గేటు వద్ద ఉంచిన చెత్త బుట్ట అలానే ఉంది. రెండు రోజుల నుండి మున్సిపాలిటీ వర్కర్లబంద్. ఊరంతా ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయింది. వేరే యే యితర వర్గాలు బంద్ చేసినా దానికో ప్రత్యామ్నాయం వెతకొచ్చుగానీ, పారిశుధ్యం విషయంలో కష్టమే. అబ్బ వీధులన్నీ భయంకరంగా ఉన్నాయి. వీళ్లు స్ట్రైక్ ఆపేస్తే బాగుండు అనుకున్నాడు శర్మమాష్టారు. ఇలా అనుకున్నాడో లేదో... టి.వి.లో ఫ్లాష్ న్యూస్ పారిశుధ్య కార్మికుల సమ్మె విరమణ. హమ్మయ్య, మంచి పనయ్యింది అనుకున్నారు మాష్టారు.
మర్నాడు ఉదయానే్న పారిశుధ్య కార్మికుడు వెంకటరావు ఇంటింటికీ వచ్చి తని చెత్తనూ, పొడిచెత్తనూ వేరు చేస్తూ తాను తెచ్చుకున్న వేరు వేరు తొట్టెలలో నింపుతూ చాలా ఉత్సాహంగా పని చేస్తున్నాడు. ఈ సేకరించిన చెత్తను వీధి చివర చెత్తల బండిలో వేస్తూ చేతులకు ఏది అంటినా పట్టించుకోకుండా, అసహ్యమనేదే కనబడకుండా అత్యంత ఆరాధనా భావంతో పని చేస్తున్నాడు.
శర్మ మాష్టారు పరిశీలనగా చూస్తున్నారు వాని పని తీరును. ఆ క్షణంలో అతడు జుగుప్సాకరమైన సర్పాలను వళ్లంతా చుట్టుకొని లోకహితం కొరకు హాలాహలాన్ని మింగిన శివుడులా కనబడ్డాడు. స్వచ్ఛపరిసరములకు సజీవరూపం ప్రసాదిస్తున్న బ్రహ్మలాగ దర్శనమిచ్చాడు. యెంతటి పనినైనా అవలీలగా చేస్తూ ఆనంద పరవశుడైనట్టి శ్రీమహావిష్ణువుగా గోచరించాడు.
మాష్టారుకి మెదడులో ఆలోచన మెదిలింది. అన్ని వృత్తుల వారికి సంవత్సరంలో ఏదో ఒకరోజు ప్రత్యేకదినంగా ఉంది. కార్మికుల దినోత్సవం మే 1వ తారీఖున జరుపుకుంటున్నాం. ఈ కార్మికులు మిగతా కార్మికుల కంటే విభిన్నం. వీరికొరకు ప్రత్యేక దినం ఉందా? అని గూగుల్‌లో వెతికారు. ప్చ్! వీరిని గుర్తించే దినం లేదు. తనకు తళుక్కున ఉపాయం మెరిసింది.
అక్టోబర్ 2వ తారీఖు మహాత్మాగాంధీ జన్మదినం, ప్రధాని మోదీ స్వచ్ఛ్భారత్ కార్యక్రమం ప్రారంభించిన దినం సహమూర్తి జన్మదినాన్ని పారిశుధ్య కార్మికుల దినోత్సవంగా జరుపుకోవడం న్యాయమనిపించింది. ట్విటర్, ఫేస్‌బుక్ గూగుల్ మరియు ఇతర సామాజిక మాధ్యమాలలో ఈ విషయాన్ని అందంగా ప్రతిపాదించాడు. తన విశే్లషణాత్మక వివరణ అందరినీ ఆకట్టుకుంది. లక్షలాదిగా లైక్స్ వచ్చాయి.
ఈ ప్రతిపాదనను ప్రధానమంత్రికి, రాష్టప్రతికి ఇతర కీలక మంత్రులకు, సంఘసేవకులకు లేఖల రూపంలో తెలియజేశారు. ప్రధాన పత్రికలలో ప్రభావవంతమైన వ్యాసాలు రాసారు. దీని విషయమై దేశమంతటా చర్చలు జరిగాయి. బహుజనులకు వివిధ వర్గాల మద్దతు లభించింది. కేంద్ర ప్రభుత్వం సై అంది. ప్రధాన మంత్రి ప్రమోదంలో పారిశుధ్య పరమేశ్వరుల కొరకు స్వచ్ఛ కార్మికుల దినోత్సవంగా అక్టోబర్ 2వ తారీఖునాడు దేశమంతటా జరుపుకోవాలని నిర్ణయించారు. ఆ రోజు ఉత్తమ పారిశుధ్య కార్మికులను ఎంపిక చేసి ప్రతీ పట్టణ, జిల్లా స్థాయిలలో సత్కారాలు కూడా చేయాలని సూచించారు. శర్మ మాష్టారి మెదడులో ఓ ఆలోచనా విత్తనం ఉద్దీపనా వృక్షమై స్వచ్ఛమైన భావనలకు అర్థవంతమైన ఫలాన్ని ఇచ్చింది. వాళ్లకీ ఓ రోజొచ్చింది.

- చావలి శేషాద్రి సోమయాజులు, పాచిపెంట, విజయనగరం జిల్లా. ఫోన్ : 9032496575