రాజమండ్రి

వదినా! నీకు వందనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరులో బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తున్న జగదీష్‌కి సోదరుడు నవీన్ నుండి ఫోనొచ్చింది.
‘‘ఒరేయ్! జగదీష్ మీ వదిన దేవి మనకింక లేదురా! మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది. అందనంత ఎత్తుకు వెళ్లిపోయి మనల్ని ఒంటరివాళ్లని చేసింది’’ గద్గదస్వరంతో చెప్పాడు నవీన్.
అది విని జగదీష్ కాళ్లు వణికాయి.
‘‘అన్నయ్యా! అసలు ఏమయిందో చెప్పు అన్నయ్యా’’ అంటూ ఆందోళనగా అడిగాడు.
‘‘రాత్రి వదినకి గుండెపోటు రావడంతో హాస్పటల్‌కి తీసుకెళ్లాను. అయినా ఫలితం దక్కలేదు’’ అంటూ ఫోనులోనే ఏడ్వడం ప్రారంభించాడు నవీన్.
‘‘అన్నయ్యా! ఇప్పుడే నేనూ, సిరి బయలుదేరి వస్తున్నాం’’ అని చెప్పి ఫోన్ కట్ చేసాడు జగదీష్.
ఇంట్లో వంట చేస్తున్న సిరికి విషయం చెప్పాడు.
‘‘అయ్యో! ఎప్పుడండీ?’’ బాధగా అడిగింది సిరి.
చెప్పాడు జగదీష్.
ఇద్దరూ ఇంటికి తాళం వేసి బయలుదేరారు.
కాంప్లెక్స్‌కి చేరుకుని వైజాగ్‌కి నాన్‌స్టాప్ బస్సు ఎక్కారు.
కొద్ది సేపటికి బస్సు బయలుదేరింది.
బస్సు ముందుకు వెళుతుంటే ఆలోచనల్లోకి జారుకున్న జగదీష్ గతంలోకి జారుకున్నాడు.
నవీన్‌కి, జగదీష్‌కి మధ్య పదేళ్లు తేడా. వారిది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పుడే వారి తండ్రి మరణించడంతో పెద్దవాడైన నవీన్ మీదే బరువు బాధ్యతలు పడ్డాయి. ఉన్న భూమితో వ్యవసాయం చేస్తూ తమ్ముడు జగదీష్‌ను చదివించాడు. పదవ తరగతి అత్తెసరు మార్కులతో పాసయ్యాడు జగదీష్. అయినా తమ్ముడిని ఏమీ అనలేదు నవీన్.
ఇంటర్ చదువు కోసం తమ్ముడిని ఒక ప్రైవేట్ కాలేజీలో చేర్చాడు. ఇది జరిగిన అయిదు నెలల తర్వాత వారి తల్లి మరణించింది.
ఊళ్లో వాళ్లందరూ పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టడంతో దేవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నవీన్.
జగదీష్ ఎప్పట్లాగే చదువును నిర్లక్ష్యం చేస్తూ ఆటపాటలదాలతో కాలం గడపసాగాడు. ఫలితంగా ఇంటర్‌లో రెండు సబ్జెక్టులు తప్పాడు.
అయినా నవీన్ అతన్ని ఏమీ అనలేదు.
‘‘మీ తమ్ముడి గురించి ఆలోచించండి! తను అస్సలు చదవడంలేదు’’ అని భర్తతో చెప్పింది.
దానికి నవీన్ మాట్లాడుతూ ‘‘వాడింకా చిన్నపిల్లాడు’’ అంటూ వెనకేసుకొచ్చాడు.
ఒకరోజు రాత్రి అంతా నిద్రపోయిన తర్వాత జగదీష్ సెల్‌ఫోన్‌లో నగ్నదృశ్యాలు చూడసాగాడు. అప్పుడు పనె్నండు గంటలు దాటింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన దేవి ఆ దృశ్యం చూసి జగదీష్ చేతిలోని సెల్‌ఫోన్ లాక్కుని దూరంగా విసిరేసి వెళ్లిపోయింది.
ఈ పరిణామంతో జగదీష్ సిగ్గుపడ్డాడు. ఆ క్షణంలో ఏం చేయాలో అతనికి అర్ధం కాలేదు. అసలేం జరిగిందో, ఎలా జరిగిందో అతనికి అవగతం కాలేదు. వదినకి అలా దొరికిపోవడంతో అతనికి తల కొట్టేసినట్లు అయిపోయింది. ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే... ఛీ వెధవ బతుకు. రేపటి నుండి తలెత్తుకుని తిరగలేను’ అనుకున్నాడు.
ఆ రోజు నిద్రపట్టకుండానే తెల్లారిపోయింది.
రాత్రంగా ఆలోచనలతో నిద్రకు దూరం అవడంతో కళ్లు ఎర్రబడ్డాయి. తెల్లవారితే అన్నయ్య కొడతాడేమోనని భయం కూడా పట్టుకుంది. కానీ దేవి ఈ విషయం ఎవరికీ చెప్పలేదు.
ఆ రోజు ఉదయం పొలానికి బయలుదేరాడు నవీన్.
అతన్ని చూసి ‘‘అన్నయ్యా! నేను హాస్టల్‌లో ఉండి చదువుకుంటాను’’ అంటూ చెప్పాడు జగదీష్.
అది విని ఆశ్చర్యపోయాడు నవీన్.
‘‘ ఏం నీకిక్కడ బాగాలేదా?’’ ఆశ్చర్యంగా అడిగాడు నవీన్.
‘‘బాగానే ఉంది అన్నయ్యా! కానీ నాకెందుకో హాస్టల్‌లో ఉండి చదువుకోవాలని ఉంది. వదినతో కూడా ఈ విషయం చెప్పు’’
‘‘సరే! నీకు ఎక్కడ బాగుంది అనిపిస్తే అక్కడే ఉండు’’ అన్నాడు నవీన్.
‘‘హాస్టల్‌లో ఉండి బాగా చదివి మీకు తెస్తాడు మీ తమ్ముడు’’ అప్పుడే అక్కడికి వచ్చిన దేవి అంది.
ఆ మాటలు జగదీష్‌కి ఎక్కడో గుచ్చుకున్నాయి.
ఇక బాగా చదవాలని అనుకున్నాడు.
అలా అన్నయ్య, వదినలను ఒప్పించి హాస్టల్‌లో చేరిన జగదీష్ అనుకున్నట్లుగానే బాగా చదవసాగాడు. ఇంటర్, డిగ్రీ కూడా హాస్టల్‌లోనే ఉండి పూర్తి చేశాడు. సెలవుల్లో ఇంటికి వచ్చినా పుస్తకం వదిలేవాడు కాదు.
ఇదిలా ఉండగా ఊరు ఊరంతా ఆమె అడుగు పెట్టగానే మరిదిని తరిమేసిందని, ఎవరూ లేని అనాథలా హాస్టల్‌లో చేర్పించిందని దేవిని తూలనాడారు.
అయితే నవీన్ గానీ, దేవి గానే ఎవరిని ఖండించలేదు.
జగదీష్ బాగా చదివి బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు.
అన్నయ్య, వదిన చూపించిన పిల్లని పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లిలో కూడా వదినతో మాట్లాడలేదు.
కొన్నాళ్లకు అతనికి ఏలూరుకి బదిలీ అయింది.
అక్కడే పదేళ్లు గడిచిపోయాయి. ఈ మధ్య పెద్దగా రాకపోకలు కూడా లేవు.
ఒక్క కుదుపుతో బస్ ఆగడంతో జగదీష్ ఆలోచనలు చెదిరిపోయాయి.
అప్పటికే బస్ విశాఖపట్నం కాంప్లెక్స్‌కి చేరుకుంది.
అందరితో పాటు జగదీష్, సిరి కూడా దిగారు. ఆటో బేరమాడుకుని అన్నయ్య ఇంటికి చేరుకున్నాడు.
ఇంటి ముందు టెండు వేసి ఉంది. జనం కిక్కిరిసిపోయి కనిపించారు. జగదీష్, సిరి ఆటో దిగారు. తమ్ముడిని చూడగానే నవీన్‌కి దు:ఖం ఆగలేదు. వదిన శవాన్ని చూసి జగదీష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
సంవత్సరాలుగా మాట్లాడని వదినని అలా చూస్తుండిపోయాడు.
‘వదినా! ఒక్కసారి లే... నీతో మాట్లాడాలి. వదినా నీకు వందనం. నువ్వే గనుక ఆ రోజు జరిగింది చెప్పి ఉంటే అన్నయ్య ఏం చేసేవాడో, ఎలాంటి నిర్ణయం తీసుకునేవాడో...’ అనుకున్నాడు. తర్వాతి కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి.
పది రోజుల తర్వాత ఒంటరిగా కనిపించిన నవీన్‌తో మాట్లాడాడు జగదీష్.
‘‘అన్నయ్యా! నీకో విషయం చెప్పాలి’’ అన్నాడు జగదీష్.
‘‘నువ్వే ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఆరోజు రాత్రే వదిన నాకు జరిగిందంతా చెప్పింది. ఎవరికీ చెప్పొద్దని ఒట్టు కూడా వేయించుకుంది. నిన్ను హాస్టల్‌లో వేసి చదివిద్దామని అంది. నువ్వు కూడా హాస్టల్‌లో ఉండి చదువుకుంటానని మంచి నిర్ణయం తీసుకున్నావు’’ అన్నాడు.
అది విన్న జగదీష్ మనసు ఆర్ద్రతాభావంతో కొట్టుకులాడింది. ‘వదినా నీకు వందనం’ మనసులోనే తల్లిలాంటి వదినకి ప్రణామాలు అర్పించాడు జగదీష్.

- నల్లపాటి సురేంద్ర, గాజువాక, విశాఖ, సెల్ : 9490792553.