రాజమండ్రి

ప్రేమ పరిమళం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిరణ్ డ్యూటీ నుండి ఇంటికి వచ్చేసరికి రాత్రి పదయింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో శ్రీమతి పరిమళకి ఫోన్ చేశాడు.
అయితే ఫోన్ స్విచ్ఛ్ఫా చేసి ఉండడంతో ఏం చెయ్యాలో తోచలేదు. పక్కింటి వాళ్లకి తాళం చెవి ఇచ్చిందేమో అని వెళ్లాడు.
అతన్ని చూడగానే ‘‘కిరణ్ వచ్చావా? నువ్వు వస్తే తాళం ఇవ్వమని మీ ఆవిడ ఇచ్చి వెళ్లింది’’ అని పక్కింటి లక్ష్మమ్మ చెప్పింది.
‘‘తను ఎక్కడికి వెళ్లింది ఆంటీ?’’ తాళం అందుకుంటూ అడిగాడు.
‘‘నీకు చెప్పలేదా? చెప్పానని నాతో అంది కదా’’
‘‘ఆ గుర్తుకొచ్చింది. చెప్పింది లెండి’’ అనేసి అక్కడి నుండి వచ్చేశాడు.
‘చెప్పకుండా వెళ్లింది అంటే ఆంటీ ఆరా తీస్తుంది. ఎందుకొచ్చిన సమస్య. అయినా పరిమళ ఎక్కడికి వెళ్లింది?’ అనుకుంటూ ఇంటి తలుపు తీశాడు.
ఇల్లు మొత్తం నీటుగా సర్ది ఉంది. బట్టలు ఇస్ర్తి చేసి ఉన్నాయి. డైనింగ్ టేబుల్ మీద కిరణ్‌కి ఇష్టమైన వంటలవీ ఉన్నాయి.
‘ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా?’ అనుకున్నాడు కిరణ్.
ఏమీ స్ఫురించలేదు.
అంతా బాగానే ఉంది గానీ పరిమళ ఎక్కడికి వెళ్లింది? పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. మా ఇంటికి గానీ, వాళ్ల ఇంటికి గానీ వెళ్లే పరిస్థితి లేదు.
తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాడు. అందరూ పరిమళ రాలేదనే సమాధానం చెప్పారు.
ఎక్కడికి వెళ్లింది? అని ఆలోచిస్తుంటే టేబుల్ దగ్గర ఒక కాగితం కనిపించింది.
గబగబా తెరచి చూశాడు.
‘ప్రియమైన కిరణ్‌కు...
మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం నా జీవితంలో చేసిన పెద్ద పొరపాటు. ఇంట్లో వాళ్లని కాదనుకోవడం మరో పొరపాటు. నేను కోరుకున్న భాగస్వామిని పొందానన్న ఆనందం కన్నా మీరు నా పట్ల ప్రవర్తిస్తున్న తీరు, మీ స్వభావం నాకు నచ్చలేదు. ఉదయం ఆఫీసుకి వెళ్లి రాత్రికి వస్తున్నారు. అంత వరకు ఒక్క ఫోన్ కాల్ కానీ, మెసేజ్ కానీ ఉండదు. అడిగితే ఆఫీసులో బిజీ వర్క్ అంటారు. నేను ఇక్కడ ఒంటరిగా వంట చేసుకుని, తిని, బోర్ కొడితే టివి చూస్తూ గడపాలి. పోనీ నేను కూడా ఉద్యోగం చేస్తానంటే మీకు ఇష్టం ఉండదు. లంకంత కొంపలో ఒంటరిగా ఉంటున్నాను. మీ ఇంట్లో వాళ్లతోను, మా ఇంట్లో వాళ్లతోను మనకు సంబంధాలు లేవు. మన బంధువులు బద్ధ శత్రువులయ్యారు. ఈ సమయంలో నువ్వైనా నాతో ప్రేమగా ఉంటావని, నా కోసం సమయం కేటాయిస్తావని అనుకుంటే అలాంటిది ఎప్పుడూ లేదు. ఉదయం పెందలాడే వెళ్లిపోయి, రాత్రి బాగా చీకటి పడాక వస్తావు. పోనీ వచ్చిన తర్వాతైనా కాస్సేపు సరదాగా మాట్లాడతావా అంటే అదీ లేదు. రాగానే తినేసి నిద్రపోతావు. పోనీ ఏ ఆదివారమైనా నాతో గడుపుతావని అనుకుంటే ల్యాప్‌టాప్ తీసి దాంతోనే కాలం అంతా గడుపుతావు. ఇంట్లో నేను ఉన్నాననే విషయం కూడా గుర్తు లేనట్లు ప్రవర్తిస్తున్నావు. సరికొత్త వంటకం చేసి నీకు పెడదామనుకుంటే హోటల్ నుండి ఆర్డర్ చేస్తావు. అసలు నీ ఉద్దేశం ఏమిటో నాకు అర్ధం కావడంలేదు. నన్ను ప్రేమించి చేసుకోవడం వల్ల కట్నం మిస్ అయ్యానని బాధపడుతున్నావా? అందుకే ఓ వారం రోజులు నీకు కనబడకూడదని, అప్పుడైనా నీలో మార్పు వస్తుందని, రావాలని తెలిసిన వారింటికి వెళ్లిపోతున్నాను...
నువ్వు కావాలని కోరుకునే
నీ పరిమళ!
ఆ ఉత్తరం చదివి కిరణ్ ఉద్వేగానికి లోనయ్యాడు.
‘ఎంత పని చేశావు పరిమళ. నువ్వు నన్ను అర్ధం చేసుకున్నది ఇంతేనా?’ అని నిస్సత్తువుగా సోఫాలో కూలబడ్డాడు.
ఇంతలో కాలింగ్‌బెల్ మోగింది.
గబగబా వెళ్లి తలుపు తీశాడు.
ఎదురుగా లక్ష్మమ్మ!
‘‘బాబూ పరిమళ వచ్చిందా? నువ్వు ఏమైనా తిన్నావా?’ అంటూ అడిగింది లక్ష్మమ్మ.
‘‘తిన్నాను ఆంటీ!’’
‘‘పరిమళ గురించి ఏమైనా తెలిసిందా?’’
‘‘తెలిసింది ఆంటీ! తను వాళ్ల ఫ్రెండింటికి వెళ్లిందట. వంట చేసే వెళ్లింది’’ అన్నాడు కిరణ్.
‘‘నీలో ఏదో మార్పు కనిపిస్తోంది. ఇద్దరూ ఏమైనా గొడవ పడ్డారా?’’ అనుమానంగా అడిగింది లక్ష్మమ్మ.
‘‘అలాంటిదేం లేదు ఆంటీ’’
‘‘ఎందుకు బాబూ నా దగ్గర అబద్ధాలు ఆడతావు. ఎంతో మంది జీవితాలు చూసిన దానిని. ఎవరెలా ఉన్నారో వారి ముఖం చూస్తేనే తెలిసిపోతుంది’’ అంది లక్ష్మమ్మ.
కిరణ్ ఆమెని లోపలికి పిలిచి పరిమళ రాసిన ఉత్తరం చూపించాడు.
ఉత్తరం చదివిన లక్ష్మమ్మ ‘‘తను నీ ప్రేమని కోరుకుంటోంది. నిర్లక్ష్యం చేయకు’’ అని చెప్పింది.
‘‘నేను ప్రేమగానే ఉన్నాను ఆంటీ. తనే నన్ను అర్ధం చేసుకోలేదు. తనకి నేను, నాకు తను తప్ప మాకు ఎవరూ లేరు ఆంటీ. అలాంటప్పుడు నేను తప్పుగా ప్రవర్తిస్తానా? నేను సంపాదిస్తుంది అంతా తన కోసమే కదా. కట్నం లేదని బాధపడుతున్నానేమో అంది. అది నాకు బాధ కలిగిస్తోంది. నన్ను విడిచి తను వెళ్లిపోతే నేను సంతోషంగా ఎలా ఉండగలను ఆంటీ?’’ కన్నీళ్లతో అన్నాడు కిరణ్.
‘‘సంపాదిస్తున్నదంతా తన కోసమే అన్నావు. అన్నివేళలా ఆడవాళ్లు సంపాదనే చూడరు. ప్రేమను కూడా కోరుకుంటారు. ఆ ప్రేమే లేకపోతే ఎంత సంపాదించినా దండగే. భర్త పట్టించుకోకపోతే ఏ ఆడదైనా తట్టుకోలేదు. అనేక అనుమానాలు కూడా పుట్టుకు వస్తాయి. మీ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించుకుంటున్నప్పుడు ఉండే ప్రేమ పెళ్లయ్యాక ఎందుకు ఉండదు?’’ సూటిగా ప్రశ్నించింది లక్ష్మమ్మ.
ఆ మాటకి కిరణ్ మాట్లాడలేకపోయాడు.
‘‘ప్రేమించుకునేటప్పుడు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ‘గుడ్‌మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్‌నైట్, తిన్నావా? పడుకున్నావా? లేచావా? అంటూ మెసేజులు పెట్టుకుంటారు. పెళ్లయ్యాక ఒక్క మెసేజ్ పెట్టరు. ఒక్క క్షణం ఖాళీ చేసుకుని ఆఫీసుకి వెళ్లాక ఒక్క మెసేజ్ పెడితే ఆడది ఎంత సంతోషిస్తుందో కదా. ఈ రోజు నువ్వు బాగున్నావు. నీ డ్రెస్ బాగుంది. చీర బాగుంది అనేటి అందమైన మాటలు, పొగడ్తలను ఆడవారు కోరుకుంటారు. ఆ మాత్రం భార్య కోసం చేయలేవా?’’ అంది లక్ష్మమ్మ.
కిరణ్‌కి తను చేసిన తప్పేంటో అర్ధమయింది.
‘‘సారీ ఆంటీ! తప్పు నాదే. డబ్బు సంపాదించాలి. పరిమళకి ఏ సమస్యా రాకూడదు అనుకున్నానే గానీ తనకి ప్రేమను పంచివ్వాలనే ఆలోచన ఏనాడూ చేయలేదు. ఇప్పుడు అర్జెంట్‌గా పరిమళని చూడాలని ఉంది’’ అన్నాడు.
‘‘పరిమళ నా దగ్గరే ఉంది’’ అంది లక్ష్మమ్మ.
‘‘మీ దగ్గరా?’’ ఆశ్చర్యంగా అన్నాడు కిరణ్.
‘‘అవును! తనని నేను చాలా రోజుల నుండి గమనిస్తున్నాను. ఏదో కోల్పోయినట్లు ఉంటోంది. ఆరా తీశాను. విషయం అర్ధమయింది. నా ఆలోచనతో ఈ ప్లాన్‌ని అమలు చేశాను. మీ ఇద్దరి కలతలను తొలగించాను’’ అంది లక్ష్మమ్మ.
‘‘్థ్యంక్స్ ఆంటీ’’ అంటూ లక్ష్మమ్మతో కలసి వెళ్లి పరిమళని తీసుకొచ్చాడు.
చేసిన వంటలను ఇద్దరూ ఒకరికొకరు వడ్డించుకుంటూ తృప్తిగా తిన్నారు.

- నల్లపాటి సురేంద్ర,
సెల్ : 9490792553.

-----
పుస్తక పరిచయం
----
తడి ఆరని...
‘చైతన్య ఝరి గోదావరి’
వేల సంవత్సరాల నుంచో వందల సంవత్సరాల నుంచో గోదావరి ప్రవహిస్తూనే ఉంది. కాని గోదావరిని ఏ తరం ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది. ప్రక్కన ప్రవహిస్తూ వెళ్తున్నా ఎప్పటికప్పుడు కొంగొత్తదనం దానిలో కన్పిస్తూనే ఉంటుంది. అందుకే గోదావరి ఓ కవితా వస్తువు. అలాగే ఒక కవితా శీర్షిక. ఇంకా చెప్పాలంటే గోదావరి పుస్తకం. కవి సృజనాత్మకతకు తగినన్ని పేర్లు తానే పెట్టుకుంటుంది. జీవనది గోదావరి కవిత్వంలో సాహిత్యంలో కొత్త వరవడికి తానే అంకురార్పణ అయి నూతనత్వంతో జ్వలిస్తూనే ఉంటుంది.
ఎవరు ఎన్నిసార్లు చూసినా దానిలో కొత్తదనం సరికొత్తగా కన్పిస్తూనే ఉంటుంది. పాతబడిపోవడమో, మూలన పడిపోవడమో చూడని ఒకేఒక సరికొత్త శీర్షిక గోదావరి. గోదావరి పదానికి ముందూ వెనుక చరిత్రను లిఖించుకుంటూనే ఉంటుంది. జన జీవితంలో స్మరించుకుంటూనే ఉంటుంది. చేతనం చైతన్యం కురిపించి, మురిపించింది గోదావరి ర్యాలి శ్రీనివాస్‌కి. దాని చుట్టూ రాసుకున్న కవితలకు ప్రేరణ అయ్యింది. అందుకే తనకి చైతన్య ఝరి అయ్యింది. కనుకనే తన కవితల పుస్తకానికి ‘చైతన్య ఝరి గోదావరి’గా టైటిల్ పెట్టారు. ఆ శీర్షికతో మనల్ని తనతో కలుపుకుని పోవడానికి తనలో ఇముడ్చుకోడానికి సమాయత్తపరుస్తున్నారు.
గోదావరిని చూసినా విన్నా చాలు తరించి పోతుంది జీవితం. పాతతరం కవులనే కాదు కొత్త తరానికి రాబోయే తరానికి గోదావరి వస్తువు లేకుండా తన సాహితీ సృజన చేయలేడని చెప్పవచ్చు. చక్కని వర్ణనల ఉండ చుట్టి కొస చివర తాను పట్టుకొని మన మీద విసురుతున్నాడు. ఆ ఉండ మనం. మనం పట్టుకుపోకుండా తన్నుంచి తప్పుకుపోకుండాను ‘ఆశల వల’ కవితలో ఎలా చుట్టేవాడో చూడండి. ‘ఎండ చెలిమితో/గోదారి మధ్యాహ్నం చీర కడుతుంది / బంగారంలా తాను/నా ఎదురుగా తిరుగాడుతుంటే/అలసట ఆవిరైపోతుంది’ శ్రమను ఎలా మర్చిపోవచ్చో నీటితో తన అనుబంధాన్ని పులకించిపోతూ కొత్త అనుభూతికి స్వాగతం పలికారు శ్రీనివాస్.
గోదావరి తనకెందుకు చైతన్య స్ఫూర్తి అయిందో తూర్పుతీరం నుంచి ఎలా ఓర్పుతో ఎదురు చూస్తున్నారో ‘గుండెల్లో గోదారి’ చల్లబర్చి చికాకుపెట్టి సిర్రెక్కించే కుటుంబ బంధాలతో చిక్కబర్చారు. ‘ఓ జ్ఞాపకాల జావళీలు / తనలోకి దారి చేసుకుంటున్నారు. ఆకలి, సాహసం అంతా గోదావరి తోనే తన మాటలు తన ఊహలు అన్నీ గోదావరే. ఆ సంభాషణ వినాలని ఉందా? అయితే ఈ కవిత చదవండి. ‘చైతన్య ఝరిలే’... ‘అనంత ప్రవాహంతో / ఆవలి తీరాన్ని చేరుకోవాలన్నపుడు / అంతు చిక్కని ఆశల దూరాన్ని / తెలుసుకోగలిగాను’ అంటారు. ఓ రైతు ఆర్తిని మరో రైతు బిడ్డ మాత్రమే తీర్చగలడు. ఓ రైతు గోడును కళ్లకు కట్టినట్టు చూపారీ కవితలలో ‘ఎత్తిపోతలు’ ‘ఏళ్ల తరబడి / మా తల రాతల్ని / మేమే ఎత్తిపోసుకుంటున్నాం’ అన్నదాత కష్టం పట్టని వారికి ఇది కనువిప్పు అవుతుంది.
‘జాలిగొన్న ఏ నీటి సూరీడు / ఈ నేలకు చెమ్మరింత చేకూర్చలేకపోయాడు’ అందుకే...? గోదావరికి మెమోదారిచ్చాం! / మెట్టగొంతునిక తడారనివ్వం! అని హామీ ఇస్తున్నారు. గోదావరి అందాల్ని గోదావరితో ఉండే ఆనందాన్ని తనివితీరా అనుభవించాడీ కవి. అందుకే ఎంతో చక్కగా మనకు అనుభూతికరించారు.
గోదావరిని దృశ్య కావ్యంలా మన ముందుంచారు. గోదావరిని చూసి తరించిన వాళ్లు కూడా మరోసారి చూసి తన్మయం అయిపోతారు. రోజూ చూసే వాళ్లు ఆనందంలో జీర్ణం అయిపోతారు. అచ్చంగా ఇది గోదావరి కావ్యమే. ఓసారి చదివి ఎవరైనా, గోదావరి చుట్టూ ఉన్న అందాల్నే కాదు ఆపై జీవనం సాగించే ‘జాలరి’ బతుకుల్ని బాల్యం పోకడల్ని ‘పడవ ప్రయాణం’ అనుభూతుల్ని కళ్ల ముందు ఆవిష్కరింప చేశారు. అందాలు, ఆనందాలు, అనుభూతులు అన్నీ చూపునోడు గోదావరి రుచిని కూడా మన నోటికి అందించాడు. జల పుష్పాల జలకాలాటలు, గలగల పాడే గోదాట్లో కనువిందు చేస్తాయి. ఇక పులస ఊసెత్తితే చాలు ఆహార ప్రియుల వళ్లు పులకరించిపోద్ది, ఆ వలసల పులుసు రుచిని ‘జాలరి’లో ఘమఘమ పరిచారు.
నీటిలోకి విసిరే చిల్లర నాణేలు కొందరి బాలలకు ఉపాధి మార్గం. గోదావరి దాటే ప్రతి ప్రయాణికుడు గోదావరిమ్మ చల్లగా చూడాలని ఓ రూపాయి గోదాట్లోకి విసిరి దణ్ణం పెట్టుకోవడం రివాజు. ‘నీటి రూపాయి’ శీర్షికన ఉన్న ఆ కవితను ఎంత గొప్పగా చెబుతున్నారో చూడండి. ‘గట్టు నుండి మీ బాధల్ని / దూరంగా విసిరేయమన్నట్టు చూస్తారు / వీడలేని బంధాన్ని / ఆ నీళ్ల నుండి బయటకు తీస్తారు’ ఇంకా ఇలా చెప్తారు. ‘ప్రాణాన్ని రూపాయికి కట్టేసి / పైకి తేలతారు. ఇది చాలా రిస్కు అయితే పిల్లలు అదొక ఆట విడుపుగా డబ్బులేరే దారిగా భావిస్తారు. ఓ అయిదుగురు జట్టు ఒకడికి దొరికినా నిరాశ చెందరు. ‘రూపాయి దొరికే దాక / నీటికి దారులు చేస్తారు’ వేరే బతుకు మార్గం తెలీక ఇందులో గడిపేవారు వీరు.
బలం - జీవం, నీరు - ప్రాణం, నీటి దేవుడు - కాటన్. నోట్లోకి నాలుగు మెతుకులు మెక్కుతున్నాడంటే ఇక్కడి మనిషి, ఆ పుణ్యమంతా కాటన్‌కి దక్కుతుంది. ఇక్కడ పండే ప్రతి గింజ మీద కాటన్ పేరే ఉంటుంది. అందుకే అతడు నిత్య స్మరణీయుడు. ఆయన గురించి ఇక్కడో మాట చెప్తున్నారు ర్యాలి శ్రీనివాస్. ‘ఖ్యాతి నిచ్చే నీటిదీపం’ కాటన్ అని అభివర్ణిస్తారు.
ఏ కవితనూ చదవకుండా వదలలేం. అలాగే వదిలేసే కవిత కానరాదు. మొత్తం కవితలన్నీ దేనికవే విభిన్నత ప్రత్యేకత కలిగినవి.
రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిగా ‘చిన్న పత్రికలు - సావిత్య సేవ’పై సాహితీ సేద్యం చేసే క్రమంలో పాత్రికేయుడిగా నాకు కొంత పరిచయం ర్యాలి శ్రీనివాస్ గారు. దానిలో భాగంగానే టౌన్ హిల్ లైబ్రరీకి తీసుకెళ్లి కొంత సమాచార సేకరణకు తోడ్పడ్డాను. ఆయన బహుముఖ ప్రజ్ఞా శీలత్వం తెలిసిందని చెప్పే ప్రయత్నమిది. ఆ పరిశోధనకి బంగారు పతకాన్ని కూడా గెలుచుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం.
మీరు గోదావరిని చూడకపోయినా ఇప్పుడు ‘చైతన్య ఝరి గోదావరి’ స్పర్శించి ఆనందానుభూతి చెందవచ్చు.

- రవికాంత్, సెల్: 9642489244
ప్రతులకు
ర్యాలి శ్రీనివాసు
2-101, రావిచెట్టు వీధి
పామర్రు - 533305
తూర్పు గోదావరి జిల్లా
సెల్: 9949131716
పేజీలు: 86, వెల 80/-

----
మినీ కథలు
----

ఊహ - వాస్తవం
వ్యవసాయం అంటే రేసుల కంటే ప్రమాదంగా మారిన ఈ రోజుల్లో ఉన్న ఎకరం భూమిని రామిగాడు ఎలాగో ఒకలా సాగు చేస్తున్నాడు. రామిగాడికి ఒక సమస్య వచ్చింది. తన గ్రామంలోను, చుట్టుపక్కల గ్రామాల్లోను చాలా మంది రైతులకు రుణమాఫీ వచ్చింది. రామిగాడికి మాత్రం రాలేదు. కారణం తెలియదు. బ్యాంకు వాళ్లు చెప్పింది రామిగాడికి అర్ధం కాలేదు. స్థానిక నాయకుల చుట్టూ తిరిగాడు. నెలలు గడిచాయి. ఏమాత్రం ఉపయోగం లేకపోయింది. ఏం చేయాలో రామిగాడికి తోచలేదు. ఇంతలో ఏదో ఊరిలో ఒక వ్యక్తి పేదలకు ఇచ్చే మంజూరు కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయి ఒక సెల్‌టవర్ ఎక్కి దూకేస్తానని బెదిరించడంతో అధికారులు, నాయకులు బతిమాలి ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి కిందకు దింపారని టివిలో చూశాడు. వెంటనే రామిగాడి బుర్రలో అదే పథకం రూపుదిద్దుకుంది.
మరునాడు రామిగాడు తన ఊరిలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. జనం పోగయ్యారు. నాయకులు, అధికారులు, పత్రికల వాళ్లు, టివిల వాళ్లు వచ్చారు. తనకు రుణమాఫీ చేయకపోతే దూకేస్తానని బెదిరించాడు. అందరూ బతిమాలారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రామిగాడు ఆనందంగా కిందకి దిగాడు. వెంటనే ఆత్మహత్యా ప్రయత్నం నేరం కింద పోలీసులు రామిగాడిని అరెస్టు చేశారు. వాస్తవానికి, ఊహకు ఎంత తేడా ఉందో రామిగాడికి తెలిసి వచ్చింది.

శేఖరమంత్రి శంకరరావు,
సెల్ : 7286963020.
---
తెలివితో గెలవాలి!
రాజు, రాణిలది ప్రేమ వివాహం. ఇద్దరి తల్లిదండ్రులు కొంత ఎదురు చెప్పినా వారి పెళ్లి మాత్రం సజావుగానే జరిగిపోయింది. వేరింటి కాపురం కూడా పెట్టారు. రాజు తల్లిదండ్రులు కొడుకు కట్నం తేలేదని కొన్నాళ్లు మొరాయించినా కోడలు నడవడి చూసి సర్దుకుపోయారు.
రాణి ఇంటి ముందు చక్కటి పూలతోట పెంచడం వల్ల ఆ పరిసరాలు మంచి పరిమళంతో ఆహ్లాదకరంగా మారాయి.
అలాగే ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు పెంచడం మొదలుపెట్టి ఇంటి అవసరాలకు కావలసిన కూరలు సొంతంగా సాగు చేసుకోవడం మొదలుపెట్టారు. దీనివల్ల వారికి కూరల ఖర్చు బాగా తగ్గింది. రాజు తల్లిదండ్రులు కోడలి తెలివి తేటలకి సంతోషించారు. ఆమె పొదుపరితనం వారికి బాగా నచ్చింది.
గతంలో పెరట్లో పిచ్చిమొక్కలు, పొదలు ఉండేవి. రాణి కూరల సాగు మొదలుపెట్టిన తర్వాత ఆ పిచ్చిమొక్కలు, పొదలను తొలగించి రాజు సాయంతో పంచాయతీ చెత్త బండిలో వేయించింది. ఆమెని చూసి ఇరుగు పొరుగు కూడా చెత్తని తీసి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా పంచాయతీ చెత్త బండిలో వేయడం అలవాటు చేసుకున్నారు. దీనివల్ల ఆ కాలనీ అంతా పరిశుభ్రంగా తయారయింది. అందరూ రాణిని మెచ్చుకున్నారు.
భార్య తన తల్లిదండ్రుల వద్దే కాకుండా కాలనీ అందరి వద్ద మంచి పేరు తెచ్చుకోవడంతో రాజు రాణిని అభినందించాడు.

- సీరపు మల్లేశ్వరరావు,
సెల్ : 7680812592.

----
మనోగీతికలు
----
లక్ష్యం చేయకు అలక్ష్యం

ఎగసిపడే అలలు చూడు
ఉత్సాహంతో ఉండాలని తెలుస్తుంది

ఎగిరిపడే బంతిని చూడు
పడినాలేచి నడవాలని తెలుస్తుంది

మ్రోడువారిని శిశిరం చూడు
ఆమనిలో చిగురించాలని తెలుస్తుంది

అంగవైకల్యంలో చిరునవ్వులు చూడు
అకుంఠిత ప్రతిభే అందమని తెలుస్తుంది
అందం ఉండాల్సింది ముఖంలో కాదు
అందంలో ఎక్కుతున్న వివేకం అని తెలుస్తుంది

అష్టకష్టాలకు కృంగిపోకూడదు
ఇష్టపడి కీర్తి బావుటా నింగికి చేర్చాలని తెలుస్తుంది

రూపంలో అందం నచ్చేది కొందరికే
కురూపమున్నా విలువ పెంచేది సౌశీల్యంలోనే

అందుకే లక్ష్య సాధనలో చేయకు అలక్ష్యం!
నీ విజయకేతనాలకు అదే సాక్ష్యం!
- బిహెచ్‌వి రమాదేవి,
9441599321

కవిత్వమంటే....

కవిత్వం
అక్షరాల పేర్పుడూ
పదాల నూర్పుడూ
గణాల కూర్పుడూ కాదు
కవిత్వంలో కబురులాడడమంటే -
చినిగిన బతుకు బట్టను
చెలిమి దారంతో కులాసాగా కుట్టుకోవడమే...
కవిత్వంలో కూనిరాగాలు తీయడమంటే -
నదిని చుట్టి వచ్చిన నగ్న పాదస్పర్శతో
పసిడి పంట చుట్టూ ప్రదక్షిణం చేసుకోవడమే
కవిత్వాన్ని కళ్లకద్దుకోవడమంటే
డాలర్ నోట్లోంచి ఊడిపడ్డ డాంబికాన్ని
పూటపూటకీ పుటంపెట్టి నివురు చేయడమే...
కవిత్వాన్ని చుంబించడమంటే -
నునుపు చెంపల మీద నురగ నురగలగా
నవ్వు తుంపరల్ని ఆరేసుకోవడమే...
కవిత్వాన్ని కౌగిలించుకోవడమంటే -
వర్ష ధారల్లో ఒదిగిన గువ్వ జంటను
మెడ మెచ్చుతనంతో మేగుకోవడమే...
కవిత్వంతో కలిసి నడవడమంటే -
ఎక్కడో ఒకచోట అందమైన అనుభూతితో
గుండె కండె దారాన్ని చిక్కు తీసుకోవడమే...
- ఎస్‌ఆర్ భల్లం, సెల్: 9885442642

భారత మాతాకీ జై
నీవు ఏ తల్లికి పుట్టావో
ఆమె మంచిదైనా చెడ్డదైనా
నీవు చచ్చేవరకు
ఆ తల్లి బిడ్డవే...
నీవు
ఏ దేశ గడ్డపై పుట్టావో
ఆ దేశ పరిస్థితులు
ఎలా ఉన్నా
నీవు చచ్చే వరకు
ఆ దేశమాత బిడ్డవే...
అయితే,
నా గొంతుకపై
కత్తిపెట్టినా
నాప్రాణం పోయినా
భారత మాతాకీ
జై...2 అని అననని
ఎవరైనా అన్నారంటే
వారికి మతి చలించి ఉండవచ్చు
లేదా
వారి తండ్రి
భారతీయుడు
కాకపోవచ్చు
- చక్రవర్తుల వెంకటేశ్వరరావు
సెల్: 8143883395

చరవాణి లోపలికి వెళ్లాక...
బుసలు కొట్టే
నాగుపాములు చరవాణిలై
జేబులో ఉరకలేస్తోంది
యువత వేలాది రూపాయల
టచ్ చరవాణిలో
మునిగిపోతున్నారు
అశ్లీల దృశ్యం
కళ్లల్లో చిగురిస్తోంది
చరవాణి తెరపై
విలువైన కాలం కరిగిపోతోంది
అక్షరాలు చదివే కళ్లు
కనిపించడం లేదు
దృశ్య ప్రపంచంలో
బూతుబొమ్మలు కొత్త దృశ్యాలై
మళ్లీ
మనిషి మెదడులో
విషమై తుఫానులు చెలరేగుతోంది
కామ నేత్రాలతో
దృశ్యం నిశ్శబ్దంగా మూలుగుతోంది
అందమైన మనిషి భవిష్యత్తు
అంధకారమై పోతోంది
సంభాషణ తెగిపోయి
దృశ్యాలు చిగురిస్తున్నాయ్
యవ్వనోద్రేకాల కామ వికారాలను
చరవాణిలో నిద్రపుచ్చేస్తున్నారు
దృశ్య ప్రవాహంలో
అమ్మాయిల శరీర సౌందర్యం
నగ్నంగా
చరవాణికి చరయ్యింది
మానవ సంబంధాలు చిగురించేలా
సంస్కారం వికసించేలా
కొత్త అనుబంధాల దృశ్యాలు
మళ్లీ
కొత్త ఆనందం వెలుగై
కళ్లల్లో పూయాలి

- నల్లా నరసింహమూర్తి
అమలాపురం, చరవాణి: 9247577501

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net