రాజమండ్రి

భవితను కన్న బాల్యం (కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిల్ప ట్యూషన్ ముగిసిన తర్వాత తొరగా ఇంటికి బయలుథేరింది. కూతురు కోసం తల్లి ఎదురు చూస్తోంది. కూతురిని వీధి చివరకు రావడం చూసి కప్పు వేడి పాలలో చక్కెర కలిపింది. ఇంట్లో అడుగుపెట్టిన శిల్ప ‘మమీ, మమీ! ఎక్కడున్నావ్... నేనొచ్చేశాను’ అంటూ పిలిచింది.
‘ఆ... వస్తున్నాను... ఏంటి సంగతి... మంచి హుషారుగా ఉన్నావు’ తల్లి కాత్యాయని ఎదురురెళ్లింది పాల కప్పుతో.
‘ఈ రోజు ఏ పాఠాలు చదివావు’ తల నిమిరి చేతిలోని కప్పు తీసుకుని దగ్గరున్న బల్లపై పెట్టింది.
వీపు మీదున్న స్కూలు బ్యాగ్ తీసి షెల్ప్‌లో పెడుతూ, ‘ఆ విషయం తర్వాత చెప్తా. ముందు మా క్లాసు టీచరు ఏం చెప్పిందో విను’ మనసులోని ఆనందం మొఖంపై తాండవమాడింది.
‘ఏమిటో... ఆ సంగతి’ కూతురి ఆసక్తిని ఆబగా వినటానికి కుర్చి లాక్కుని కూర్చుంది.
‘మా క్లాసు మొత్తం నుంచి ఏడుగురు టీంని ఒక పోటీ కోసం ఎన్నుకొంది మా టీచరు. వాళ్లలో నేనొకదాన్ని’ సంతోషం వెలుగుపోతూ చెప్పింది శిల్ప.
‘అయితే’ ఏమడుగుతుందో ముందే ఊహించి మాటను ముందుకు నెట్టింది కాత్యాయని.
‘అది కాదమ్మా! ఫస్ట్ ప్లేస్ రావటానికి నీ హెల్ప్ కావాలి!’ ‘అసలు విషయం చెప్పి బల్లమీదున్న పాల కప్పు తీసుకుని ఇష్టంగా తాగేసింది.’
కాత్యాయని మృదువుగా శిల్పను దగ్గరకు తీసుకుని ‘బహుమతికోసం పోటీపడే ఏడుగురిలో నువ్వుండటం నాకు గర్వంగా ఉంది. నా పెంపకం వృథా కాలేదు. ఏ విషయం మీదో పోటీ చెప్పలేదని’ గుర్తు చేసింది తల్లి కాత్యాయని.
కుడి చేత్తో నెత్తిమీద కొట్టుకుని ‘ఓ... అసలు దాని గురించి చెప్పటం మాని ఏదేదో వాగేస్తున్నా. డ్రాయింగ్ పోటీనమ్మా. మూడు అంశాలిచ్చి వాటిలో ఒకదాన్ని ఎన్నుకోమన్నారు’ మడత పెట్టిన కాగితం ముక్కను స్కూలు యూనిఫాం జేబు నుంచి బయటకు తీసి కాత్యాయని చేతికిచ్చింది.
‘కాలుష్య నివారణ, మత్తు పానీయాల అలవాటు, వన్య సంపద సంరక్షణ’ కాగితంలో ఉన్న అంశాలు పైకే చదివింది కాత్యాయని.
తల్లి చేతిలోని కాగితాన్ని తీసుకుంటు ‘దీంట్లో దేన్ని ఎన్నుకోవాలి? దేని గురించి గీయాలి. లేదంటే మరోదాన్ని ఏదైనా’ ప్రశ్నల వర్షం గుప్పించింది శిల్ప. దానికి సమాధానం ఇవ్వకుండా కూతురి కుతూహలాన్ని చూసి మనసులో నవ్వుకుంది కాత్యాయని.
‘సరే కాని, ఇంకా టైముంది కదా ఈ లోపు దాని గురించి ఆలోచిద్దాం. నీకు భోజనం టైమయింది’ అంటూ వంట గదిలోకి వెళ్లింది.
చిత్రలేఖనం అంటే ఎంతిష్టమో మొన్న మార్చి 8న దామెర్ల రామారావు ఆర్ట్స్ గేలరీలో ఆయన జయంతి ఉత్సవానికి వెళ్లినపుడు తెలిసింది. గేలరీలో ఉన్న మరికొంతమంది ఆర్టిస్టుల చిత్రాల్ని తదేకంగా చూస్తుండి పోవడం గమనించింది. నీటి రంగులతో ల్యాండ్ స్కేప్ చిత్రాలు గీచిన భగీరధి, సంజీవ్ దేవ్, దామెర్ల చిత్రాలు బాగా నచ్చాయి. అప్పుడే తన దగ్గరో ప్రామిస్ తీసుకుంది.
డ్రాయింగ్ పోటీలో బహుమతి ఎలా గెలిపొందాలనే తలంపులో ఉన్న శిల్పకు వెంటనే గుర్తొచ్చింది అమ్మిచ్చిన ప్రామిస్. ఆ మాట ప్రకారం మార్కెట్‌కు వెళ్లి బ్రష్‌లు, పెద్ద చార్ట్, మరికొన్ని రంగులు తల్లితో కొనిపించింది శిల్ప.
శిల్పలోని చిత్రకళాభిలాషను గమనించిన తారా నగేష్ అనే ఆర్టిస్టు కొంత తర్ఫీదునివ్వటం, రంగులద్దే ముందు ఎలా స్కెచ్‌లు వేసుకోవాలి లాంటి అంశాలు ఇప్పుడు ప్రాక్టీసు చేసుకోడానికి ఉపయోగపడ్డాయి.
ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి జరిగే హాని తదితర అనర్థాలను తన తరగతి పాఠం బాగా మనసులో నాటుకుంది. చుట్టూ ఉన్న పరిసరాలన్నీ గమనిస్తుంది శిల్ప. ఒక స్పష్టమైన రూపం మనసులో రూపు దాల్చింది.
తల్లి చెప్పే మాటలు, డ్రాయింగ్ సార్ ఇచ్చే గైడెన్స్, క్లాస్ టీచర్ ప్రోత్సాహం పోటీకి అవసరమైన బలాన్నిచ్చాయి శిల్పకు.
తల్లి కాత్యాయనితో బజారుకు వెళ్లటం శిల్పకు ఓ సరదా. అన్నీ చూడొచ్చు. మనుషుల వేషభాషలు వస్తువులు ఒకటేమిటి అన్నీ చూడటం అమ్మతో బాగా అలవాటు అయ్యింది.
ఒకసారి ఒక ఫంక్షన్‌కు వెళ్లి వస్తూ మార్కెట్‌కు వెళ్లారు. వాళ్లు కొనే ప్రతి వస్తువుకి ఒక కవరు ఇవ్వటం గమనిస్తూనే ఉంది శిల్ప. కేరీ బ్యాగ్‌ల వల్ల జరిగే అనర్థం అంటూ స్కూల్లో టీచరు చెప్పిన మాట గుర్తొచ్చి తల్లిని అడిగింది శిల్ప.
‘అమ్మా! అనర్థం అంటే ఏమిటి?’
‘అవసరాన్ని మించి వాడేయడమే అనర్థం. అవినీతి కావచ్చు, బజారు నుంచి తెచ్చుకునే సంచులు కావచ్చు’ అమ్మ ఎప్పుడు మార్కెట్‌కు వచ్చినా చేతిలో ఓ గుడ్డ సంచి తప్పక ఉంటుంది. అమ్మ చెప్పిన సమాధానం నిజమనిపించింది.
వారంలో ఓ రోజు తారా నగేష్ సార్ దగ్గరకెళ్లటం, సందేహాలు తీర్చుకోవడం శిల్పకు పోటీ మూలంగా అలవాటు అయ్యింది.
‘జాతీయ జెండాలోని మూడు రంగులు’ వాటి పోలికలు నిజమేనా సార్! నగేష్ సార్‌ని అడిగింది శిల్ప.
‘ఏ రంగు దేన్ని సూచిస్తుందో అది నీ భావాన్ని బలపరుస్తుంది’ నిమ్మళంగా చెప్పారు నగేష్ సార్
ఏ రంగు ఎలా మిళితం చెయ్యాలో ఏ రెండు రంగులు కలిపితే మరో రంగు వస్తుందో తెలుసుకున్నది అప్పుడే.
పక్కాగా ప్రాక్టీసు మొదలెట్టాక చక్కని చిత్రాలు ఎలా గీయొచ్చో బాగా అవగతమయ్యింది శిల్పకు. తను బొమ్మలు వేస్తున్నప్పుడల్లా కాస్త సృజనాత్మకతను జోడించమ్మా అనటం గుర్తొచ్చి తన క్లాస్ టీచర్‌ను అదే మాట అడిగింది శిల్ప.
‘చూచిన దానికి, తెలుసుకున్న దానికి నీ తెలివిని జోడిస్తే అదే సృజనాత్మకత’ టీచరు గుచ్చి చెప్పడంతో బాగా అర్థమయ్యింది.
నిత్య జీవితంలో ఎదురైన అనుభవాలు సమస్యలను అధిగమించే ప్రయత్నాలు ఎరుక పరిస్తే బాల్యానికి, జీవితంలో ఎదగటానికి భవిష్యత్తును నిర్మించుకోడానికి దోహదపడతాయి.
చిత్రలేఖన పోటీల్లో శిల్ప ఎన్నుకున్న అంశం కాలుష్య నివారణ. అందులో భాగంగా పర్యావరణ స్పృహతో ఒక చిత్రాన్ని రూపొందించింది. డ్రాయింగ్ షీట్‌లో ఒక పక్క కళకళలాడుతున్న బజారు, మరోపక్క చేతి సంచితో నారతోగాని బట్టతోగాని చేసిన సంచి, అది తల్లి కూతుళ్లు వెళ్తున్న దృశ్యం. బజారులో దుకాణాల ముందు వేలాడదీసిన క్యారీ బ్యాగ్‌లు, మార్కెట్ చేస్తున్న వాళ్ల చేతుల్లో క్యారీ బ్యాగ్‌లు ఎరుపు, నీలం, తెలుపు, పసుపు, అన్నీ రంగుల సంచులు పరచుకుని ఉన్నాయి. ముదురు వర్ణంలోనే కాదు, లేత వర్ణంలోను పేలవంగా పాలిపోయి ఉన్నాయి.
చిత్రంలో అన్నీ చక్కగా అమరి ఉన్నాయి. కొన్ని పొందికగా కూడా ఉన్నాయి. పరిణతి సాధించిన అంశం చక్కగా ఇమిడిపోయి ఉంది. ఇంకా ఆ చిత్రానికి ఒక టైటిల్ కూడా పెట్టింది. ‘ప్లాస్టిక్‌ను వదిలేద్దాం! పర్యావరణాన్ని కాపాడదాం!’
పోటీలో ఉత్తమ చిత్రంగా ఫ్రైజ్ మనీని గెలుచుకుంది శిల్ప గీసిన చిత్రం. అభినందనలు, ప్రశంసలు క్లాస్ టీచర్‌తోపాటు స్కూల్ ప్రిన్సిపాల్ సహా విద్యార్థులు ముద్దుల వర్షం కురిపించారు. భవితను కన్న బాల్యం ఊహకు దక్కిన గౌరవం, కళాత్మకతను ఛేదించిన సృజనాత్మకత.
పిల్లల ఆలోచనలకు దగ్గరగా మనం వెళ్లటం కాదు. వాళ్లు వెళ్లే ఆలోచనలకు మనం వెళ్లి చూడగలిగితే చాలు నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించడం ఇట్టే సులువు.

- అనంత్
సెల్: 9494842274

పుస్తక సమీక్ష

సామాజిక స్పృహధార
‘యశోధర’!

ఆధునిక యుగంలో బహుళ జనాదరణ పొందిన ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగు సాహిత్యంలోకి వచ్చిన వాంజ్మయ ప్రక్రియ ‘నవల’. సాంఘిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని అనేక మంది నవలా రచయితలు మంచి నవలల్ని రాశారు. సాంఘిక నవలల తర్వాత ప్రముఖ స్థానాన్ని ఆక్రమించినవి చారిత్రాత్మక నవలలు. చరిత్రను ఆధారంగా చేసుకొని వచ్చినవే ఈ నవలలు. వీటిలో ఊహకి చోటులేదు, సత్యానికే చోటు. ఈ కోవకు చెందిన చారిత్రాత్మక నవలే ‘యశోధర’.
ఈ నవలను 2006లో అక్టోబరు 14న తొలిసారి ఆవిష్కరించారు. యశోధరకు సంబంధించిన చరిత్ర ఇప్పటివరకు పూర్తిస్థాయిలో లేకపోవటంతో ఆ లోటును భర్తీచేయటానికా అన్నట్లు యశోధర చరిత్రను తవ్వితీసి, ఒక చారిత్రాత్మక నవలగా అందించారు డా. గూటం స్వామి. యశోధర చరిత్రను నవలగా రూపొందించటంలో డా. స్వామి ముందుచూపు ప్రశంసనీయం. ఆయన కృషికి తార్కాణంగా కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారం (2014) పొంది రూ.10వేలు నగదు బహుమతి అందుకొని చరిత్ర సృష్టించింది ‘యశోధర’.
యశోధరను ప్రధాన పాత్రగా చేసుకొని రాసిన నవల ఇది. ప్రతి పురుషుని అభివృద్ధి వెనుక ఒక స్ర్తిమూర్తి త్యాగం ఉంటుందనేది జగద్విదితమే. సిద్ధార్థుడు పరివ్రాజకుడై, జ్ఞానోదయుడై, అఖండ విశ్వానికి జ్ఞానసూర్యుడిగా వెలుగొందటానికి అర్ధాంగిగా యశోధర సహకారం, త్యాగం అసాధారణమైనవి. శాక్యవంశీయుడైన దండపాణి ముద్దుల తనయ యశోధర, స్వయంవరంలో సిద్ధార్థుని భర్తగా పొంది, జీవితం ఆనందంగా సాగుతున్న దశలో సిద్ధార్థుడు వరివ్రాజం స్వీకరించాలని నిర్ణయించుకున్న విషయం తెలుసుకుని, నిరుత్సాహ పడకుండా సర్వమానవాళి సౌభాగ్యాన్ని, సమాజ సంక్షేమాన్ని ఆశించి, భర్తకు తన నమ్మతిని తెలిపిన వీరపత్ని, ధీరవనిత.
సిద్ధార్థుని నిష్క్రమణం తర్వాత మానవ సహజమైన దుఃఖాన్ని దిగమింగి, అతని గుణగుణాలను గుర్తు చేసుకుంటూ చివరికి బుద్ధుని బోధనల ప్రభావంతో మహిళా వరివ్రాజికయై సిద్ధిపొందింది. సిద్ధార్థుని అర్ధాంగిగా, బుద్ధుని అంతేవాసిగా జీవించిన మహోన్నత త్యాగశీలి యశోధర మహిళాలోకానికే ఆదర్శనీయురాలు. బౌద్ధ జగత్తులోనే ఆదర్శ భిక్షుణిగా జీవనం సాగించిన యశోధర త్యాగనిరతిని పఠనీయంగా అక్షరబద్ధం చేశారు డా. గూటం స్వామి. నవల సామాజిక చైతన్యం కలిగించేదిగా ఉండాలనేది జగమెరిగిన సత్యం. ఈ నవలలో కొన్ని సామాజికాంశాలను కవి స్పృశించారు. వివాహ వయస్సు వచ్చింది, వివాహం చేయాలన్న తన తండ్రితో యశోధర ‘నాకింకా బాల్యాన్ని అనుభవించాలని, తండ్రిచాటు బిడ్డగా జీవించాలని ఉంది. వివాహం చేసుకొని మిమ్ముల్ని విడిచి వెళ్లిపోతే మీ ఆలనాపాలనా ఎవరు చూస్తారు? మీ సేవ చేసుకునే భాగ్యం కొనే్నళ్లైనా దయచేయమ’ని ఒక కుమార్తెగా తన ధర్మాన్ని నిర్వర్తించింది. అలాగే భర్త పట్ల, అత్తమామల పట్ల, చివరికి కుమారుని పట్ల కూడా తన ధర్మాన్ని బాధ్యతనెరిగి సక్రమంగా నిర్వర్తించింది. ఎంతటివారైనా కూతురుని ఒక అయ్యచేతిలో పెట్టడం లోక సహజం. ‘అది సృష్టి ధర్మమని, ఆ ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించటం తప్పేకాదు, నేరమవుతుందని, చక్కని వరుణ్ణి వెదికి వివాహం చేస్తానని’ యశోధర తండ్రి తన ధర్మాన్ని తనూ సక్రమంగా నిర్వర్తించాడు. తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ- ఈ అయిదుగురినీ ఎవరైతే పూజిస్తారో వారే ఈ భూమీద ధర్మాత్ములని, తండ్రి మాట శిరసా వహించమని సిద్ధార్థునితో పెంచిన తల్లియైన ‘ప్రజాపతి’ చెప్పి తన ధర్మాన్ని నిర్వర్తించింది.
‘పుట్టటం, చావటం చాలా భయానకమైనవి. దాన్నుంచి తప్పించుకునే మార్గం కోసమే నా అనే్వషణ, ఆందోళన’ అని చెబుతాడు బుద్ధుడైన సిద్ధార్థుడు. జీవులను హింసించరాదని ఈ నవల ద్వారా మనకు తెలుస్తుంది. నోరున్న జీవులకే కాదు, నోరులేని మూగజీవాలకు రక్షణ కల్పించాలన్న సిద్ధార్థుని అభిప్రాయంతో యశోధర ఏకీభవిస్తుంది. ‘చంపేవాడిని చంపేవాడు ఇంకొకడు ఉంటాడని, విజేతనూ జయించేవాడు ఇంకొకడు ఉంటాడని, దోచుకొనేవాడిని ఇంకొకడు దోచుకుంటాడ’ని శాక్య సంఘాన్ని ధిక్కరించి సిద్ధార్థుడు శాంతిని కోరాడు. హింసని వ్యతిరేకించి దేశ బహిష్కరణను కోరుకున్నాడు.
బుద్ధుని కరుణరస పూరితమైన చరిత్రను ఎంతోమంది కవులు కావ్యాలుగా రాశారు. తల్లిదండ్రులను ప్రేమించే ప్రేమమూర్తిగా, అత్తమామల పట్ల ఆదరణ - కర్తవ్య నిర్వహణ చేసి, భర్త అడుగుజాడల్లో జీవితాంతం వరకూ నడిచిన భార్యగా, కుమారునికి మంచి తల్లిగా తన జన్మను చరితార్థం చేసుకున్న యశోధర హృదయాన్నీ, జీవితాన్నీ వెలికితీయాలని రచయిత చేసిన ప్రయత్నం, అతనికున్న సామాజిక స్పృహ అనిర్వచనీయం. ఇలాంటి చారిత్రాత్మక నవలను రచించిన డా. గూటం స్వామి జన్మ ధన్యం.
బుద్ధం శరణం గచ్ఛామి/ ధర్మం శరణం గచ్ఛామి / సంఘం శరణం గచ్ఛామి

- డా. చుక్కా యశోద,
చరవాణి : 9440850447

పుస్తక పరిచయం

బౌద్ధాన్ని కళ్లకు కట్టే ‘మంచి ప్రశ్న... మంచి జవాబు’

కవిత్వంలో ప్రధాన పాత్ర పోషించేది శైలి. రచనా సంవిధానాన్ని బట్టి ఆ కవి ప్రతిభను ఊహించవచ్చు. రచయిత తన శైలికి ఎలాంటి ప్రాధాన్యమిస్తాడో తన రచనలో దిశా నిర్దేశం చేసిన నల్లి ధర్మారావు తన దృక్పథాన్ని ‘మంచి ప్రశ్న... మంచి జవాబు’ అనే అనువాద రచన ద్వారా తెలియజేశారు. ధర్మారావు అనువాదకుడు, కవి, రచయిత, విశే్లషకుడు. రచన చిన్నదైనా ఉన్నంతలో సిద్ధార్థుడు బుద్ధుడిగా మారే వరకు పొందిన క్రమ పరిణామ వికాసాన్ని చర్చించారు. జీసస్ నుండి బుద్ధుని వరకు తెలిపారు. సంక్షిప్తంగా గౌతమ బుద్ధుడిగా ఎలా మారాడో తెలియజేశారు. బౌద్ధ్భిక్షువుగా మారిన ‘శ్రావస్తి ధమ్మిక’ రచించిన ‘గుడ్ క్వశ్చన్... గుడ్ ఆన్సర్’ అనే పుస్తకాన్ని బండారు ఉత్తమ బుద్ధిస్టు సొసైటీ, ఇంగ్లండ్‌లో ప్రచురణ జరిగి సంచలనం సృష్టించింది. దీనిని 12 భాషల్లో అనువాదాలు చేశారు. ఒక బౌద్ధ ప్రార్థనా మందిరం (స్థలం)లో ఉచితంగా పంపిణీ చేయగా దాన్ని తెలుగులో అనువాదం చేయాలనే ఉద్దేశ్యంతో బౌద్ధ మతాన్ని గౌరవించే రచయితగా నల్లి ధర్మారావు ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. విదేశాలకు చెందిన క్రైస్తవమతం, కమ్యూనిజాలను కూడా బౌద్ధం ప్రభావితం చేయడం విశేషమని రచయిత నల్లి ధర్మారావు అంటారు. ఈ రచన శంకరంబాడి సుందరాచారి రచించిన ‘బుద్ధగీతి’ అనే ఖండకావ్యాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ గ్రంథంలో నల్లి ధర్మారావు బౌద్ధం ఎలా విస్తరించింది అనే విషయాన్ని కాకుండా అత్యున్నత తత్వశాస్త్రంగా తెలిపారు. ఆయన బోధనలు ఎన్నో లక్షల మంది జీవితాల్లో పరివర్తన తెచ్చి మార్చగలిగిందని తెలిపారు. మతపరమైన అసహనం, గర్వం, స్వార్ధం అనే అంశాలపై కచ్చితంగా అధ్యయనం చేయాలని, బౌద్ధంలోని నాలుగు ప్రధాన సూత్రాలు, నాలుగు సత్యాల ద్వారా కచ్చితమైన శాస్ర్తియ విధానాన్ని రచయిత నల్లి ధర్మారావు తెలిపారు. ఈ గ్రంథంలో వర్ణనలు, సన్నివేశాలు సందర్భోచితంగా కనిపిస్తాయి. సిద్ధార్థుడి తపస్సు వర్ణన, అతని బోధనలు, నుడికారాలు, భావుకత, సరళశైలి అలంకారాలు ఈ చిన్న కావ్యాన్ని అద్భుత గ్రంథంగా మలిచాయి. ఈ కావ్యం తేటగీతి పద్యాలతో రూపుదిద్దుకుని బుద్ధుడి జననం నుండి జ్ఞానోదయం వరకు ఉన్న అన్ని అంశాలతో అలరిస్తుంది. అలాగే ఏ తరహాలో బుద్ధుని ఆరాధనం చేయాలో, ఎక్కడెక్కడ బౌద్ధమతస్తులు ఎక్కువగా ఉన్నారో ఈ గ్రంథంలో మనకు తెలుస్తుంది. అలాగే ప్రతి మనిషిలో తలెత్తే అనేక ప్రశ్నలకు సమాధానంగా కూడా ఈ పుస్తకం మనకు కనిపిస్తుంది. పునర్జన్మలో లక్ష్యాలను కూడా సాధించవచ్చునని అభివర్ణించడం జరిగింది. బుద్ధుడి బోధనల్లో ఇదొక అద్భుతమైనదని తెలిపారు. ఒక భాషకు చెందిన భావం, సాహిత్యం మరే ఇతర భాషలతో సంబంధం లేకుండా మనజాలదు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిగా భావించిన గాంధీ మహాత్ముడికీ బుద్ధుడే ఆదర్శప్రాయుడయ్యాడు. ఆనాటి ప్రజలు బుద్ధుడిని ఎలా అనుసరించారు. ఆయన బోధనలను ఎలా విన్నారని తెలియజేస్తూ సరళమైన భాషలో, ఆకట్టుకున్న శైలిలో ఈ గ్రంధాన్ని రచయిత రాశారు.

- శృంగారం ప్రసాద్, సెల్ : 9985828323.

మనోగీతికలు

స్మృతులు
ఆకాశం వైపు చూశాను
మేఘాల మధ్య నుండి
చూస్తున్నాడు చంద్రుడు
మేఘాల చర నుండి బయటపడటానికి
వసంత కాలంలో చల్లగాలి
నా మీదుగా వెళ్తూ
మేఘాలను పలకరించి
తనకు తోడుగా
వర్షాన్ని తెచ్చుకుంది
చినుకులు ఒక్కొక్కటిగా
నా మేనుని తాకుతుంటే
ఆ స్పర్శ నాకు బాల్య స్మృతులను
గుర్తు చేశాయి...
జోరు వర్షంలో
మిత్రులతో కలిసి కాగితపు
పడవల పోటీలు
కోతికొమ్మచ్చుల ఆటలో
చెట్టుకొమ్మలు పట్టుకొని గాలిలో ఊగటం
పరుగు పందాలు...
గోళీల ఆటలు..
బడి సెలవు వస్తే చేనుగట్లపై షికార్లు
ఒకటేమిటి ఇలా ఎన్నో స్మృతులు
తళుక్కున మెరిసిన మెరుపు
నన్ను బాల్యం నుండి బయటకు పడేసింది
మరలా ఆకాశం వైపు
చూశాను
చంద్రుడు నన్ను చూసి
మేఘాల మధ్య దాగుంటున్నాడు
వర్షాన్ని ఆహ్వానిస్తూ...

- చింతా రాంబాబు
కాట్రేనికోన, చరవాణి: 9948178092

శిక్ష
చూపులు కలుపుకొని
చెట్టా పట్టాలు వేసుకొని
పార్కుల వెంట తిరిగావు
క్షణ కాలంలో
తనువు అర్పించావు
ఆనందకరమైన అందమైన
ఊహల్లో విహరించావు
పార్కుల వెంట తిప్పినవాడు
పారిపోయాడు
వాడి రూపాన్ని నీ కడుపున
ఉంచి
వాడిని మరిచావు
నన్ను వికసించకుండా
‘అబార్షన్’ అనే శిక్ష వేసి
నశింప జేశావు
ప్రేమ ముసుగులో మీకు (నీకు)
తెలిసిన ప్రేమ ఇదేనా...?
(నీవు) మీరు చేసిన తప్పుకు
నాకు ‘శిక్ష’ వేస్తావా (రా)...?

- చింతా రాంబాబు
కాట్రేనికోన
చరవాణి: 9948178092

కవితనా సంబరం సాగరం
నేను చూశాను కాకినాడలో
అద్భుత ఆటపాటల సంబరాలు!
గులాబి పరిమళం వీచిన
విద్యార్థుల స్నేహ సంబంధాలు!
నాటకాలు, నృత్యాలు, క్రీడలు
మరెన్నో వేడుకలు!
అంతరించిపోతున్న మానవ సంబంధాలకు
ఆదికావ్యం ఈ సంబరాలు!
ప్రభుత్వపు ప్రేమాభిమానాలకు
కొలతలు ఈ నెలతలు!
అందాల విన్యాసాలకు
మా విద్యార్థుల మమతలు!
ఎంత చదువు చదివినా
ఆహ్లాదం లేనిదే ఏముంది జీవితం!
మనసు, మమత ఆనందించనిదే లేదు జీవనం!
అందుకే మన ఎనె్నసెస్ చేస్తుంది
సేవా పోరాటం!
అభ్యుదయంతో ఆరాటపడుతుంది !
విద్యార్థులకు ఈ సంస్థ
నిరంతర కాపరి!
వారి ఎదుగుదలకు, కృషికి ఊపిరి!
అందుకే గగనాన్ని తాకిన
ఈ సాగర సంబరాలు!
మా విద్యార్థుల హృదయాలకు
సాంత్వన పరిమళాలు!

- డి ప్రశాంతి
ఫస్ట్ బిసిఎ

కొబ్బరాకు
వెనె్నల్లో ఆకాశం
కొబ్బరాకు మాటున
చిరునవ్వు నవ్వే కనె్నపిల్లలా ఉంది
రాత్రంతా
సీతాకోక నిశీధి
ఇంద్రధనస్సులా గుండెలో నింపుకొని
వెచ్చని ప్రకృతి వడిలో
కలలుకంటూ నిద్రపోతోంది
కొబ్బరాకు నీడన
గాలి మాటలకు
వౌనంగా అటూ ఇటూ ఊయలలా
ఊగుతూనే ఉంటుంది మేఘాల మధ్యన
కొబ్బరాకు
చెట్టు హృదయాన్ని చెప్పటానికి
మనసు వెనుక నుండి
గాలి చూరుకు పట్టిన గబ్బిలంలా
వేలాడుతూ ఆకాశం చెవిలో
చెపుతుంది వౌనంగా
రెండు పెదాలు
రెండు కళ్లు పలకలేని భావాలకు
కొబ్బరాకు
నీలి మేఘం ముసుగులో పైటేసింది
జీవిత రంగస్థలంపై
మనిషి నాటకం
ముగిసిన క్షణాన
నీవే కాటికి దారవుతావు
చివరి క్షణాన
గుండెకు తాకే మిత్రుడవుతావు

- నల్లా నరసింహమూర్తి అమలాపురం
చరవాణి - 9247577501

email: merupurjy@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net