విజయవాడ

నాయకుని ఆదర్శం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోజు మాతృ దినోత్సవం. ఈసందర్భంగా కొత్తగా కట్టిన అనాధాశ్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అందులో వృద్ధుల్ని, మరోవైపు అనాధల్ని చేర్చుకొని భోజనాలు, దుస్తులు, ఇతర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎంతోమంది తమ తల్లుల్ని సరిగా చూడక, పట్టించుకోకుండా ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారు. ఆరోజు కొత్తగా ఎన్నికయిన ప్రజాప్రతినిధి గురునాథం గార్ని ప్రారంభోత్సవానికి పిలిచారు. ఉదయం నుంచే అనాధలు, వృద్ధులంతా పడిగాపులు కాస్తున్నారు. వాళ్లకొక ఆశ్రయం దొరుకుతోందని ఆశగా ఎదురుచూస్తున్నారు.
సభా కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిధులంతా వచ్చారు. ప్రసంగాలు వినిపించారు. వృద్ధులు, అనాధలపై జాలి చూపించారు.
‘దిక్కూమొక్కూ లేక చెప్పుకోటానికి నా అనే వాళ్లు లేని రోడ్ల మీద తిరిగే బిచ్చగత్తెల్ని, వృద్ధుల్ని చూస్తుంటే మా కడుపు తరుక్కు పోయింది. అందుకే అలాంటివారి కోసం ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాం. మీకందరికీ ఇక్కడ రక్షణ కల్పిస్తాం. ఈరోజు నుంచి మీరంతా ఇక్కడ నిర్భయంగా ఉండవచ్చు. ఇక్కడ మీకు కావలసిన సదుపాయాలన్నీ సమకూరుస్తారు. మీ లాంటి అనాధల కోసం, వృద్ధుల కోసమే ఈ భవనం కట్టించారు’ అంటూ గురునాథం గారు వేదికపై చేసిన ప్రసంగానికి జనం చప్పట్లు కొట్టారు.
ఒకసారి ఆయన అందరి వైపూ తేరిపార చూసి ‘నేను ఊరికే ఉపన్యాసం చెప్పే వాడిననుకొంటున్నారా? ఏదైనా చెప్పేటప్పుడు ఆచరించి చెప్పాలి అంటారు. అలాంటి వారిలో నేను మొదటి రకం వాడిని. ఇక్కడ చేరే వృద్ధులందరూ నా తల్లి లాంటివారు. నాకేమాత్రం స్వార్థం లేదు. అందుకే చేర్పిస్తున్నాను. మా అమ్మగారు నా మాట ఎప్పుడూ జవదాటదు. ఇక్కడుండే మహిళలందరికీ చేదోడువాదోడుగా ఉంటుందని మీకందరికీ మాట ఇస్తున్నాను’.. అనగానే మళ్లీ చప్పట్లు మార్మోగాయి. ఆ తర్వాత అందరూ ముక్కున వేలేసుకున్నారు.
‘్ఛ! దుర్మార్గుడా! తల్లినని కూడా చూడకుండా నన్ను వృద్ధాశ్రమంలో చేర్పించి ఆదర్శవంతుడను అనిపించుకోవాలని చూస్తున్నావా? ఈరకంగా నన్ను వదిలించుకోవాలనుకున్నావా?’ అని మనసులోనే తిట్టుకుంటూ వేదికపైకి వచ్చింది సుబ్బాయమ్మ గారు.
‘అందరికీ నమస్కారం! ఇది వృద్ధాశ్రమం. కొడుకులుండి కూడా తల్లుల్ని సరిగ్గా చూడకుండా, పట్టించుకోకుండా, మంచానపడితే ఎక్కడ చాకిరీ చేయాల్సి వస్తుందోనని కన్నతల్లుల్ని వదిలించుకోవాలని మిమ్మల్ని ఈ ఆశ్రమంలో చేర్పిస్తున్నారు. అలాగే నా కొడుకు కూడా! ఎంతో ఆదర్శవంతుడు. ఏ పనైనా ఆచరించి చూపిన తర్వాతనే దాన్ని ఆచరణలో పెట్టే మనస్తత్వం వీడిది. చిన్నప్పటి నుంచీ రామాయణ, మహాభారత గాథలన్నీ, దేశ నాయకుల జీవిత చరిత్రలన్నీ విని వంట బట్టించుకున్నవాడు. ఈ ఆశ్రమంలో వృద్ధులే కాక మతిస్థిమితం లేని వాళ్లు, వికలాంగులు, ఎంతోమంది అనాధలున్నారు. నా కొడుకు గురునాథం కూడా మానసిక వికలాంగుడు. ఏం మాట్లాడతాడో పాపం.. తెలియని స్థితిలో ఉన్నాడు. నా కొడుకు బాగుపడాలని, వాడి మానసిక పరిస్థితి పూర్తిగా నయం కావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఏ తల్లయినా బిడ్డల క్షేమం కోరుకుంటుంది. అందుకే నా కొడుకుని ఇదే ఆశ్రమంలో చేర్పించి సరైన వైద్యం అందిస్తే తిరిగి బాగుపడతాడని ఆశిస్తూ ఇక్కడున్న అనాధలతో పాటు నా కొడుకు గురునాథంను కూడా చేర్పిస్తున్నాను. ఈరోజు నుంచి అనాధాశ్రమంలో నా బిడ్డకింత చోటు కల్పించాలని కోరుకుంటున్నాను’ అంటూ నిర్వాహకులను వేడుకుంది.
వేదికపై వున్న గురునాథం తల్లి మాటలకు షాకయ్యాడు. పళ్లు పటపటా కొరుకుతూ కోపంతో తల్లివైపు చూశాడు.
‘అమ్మా! ఏమిటి నువ్వు చేసిన పని. నన్ను ఈ అనాధాశ్రమంలో చేర్పిస్తావా? అసలు నువ్వు తల్లివేనా? నాకేం ఖర్మ ఇక్కడ చేరటానికి? నా ఇంట్లో సకల సౌకర్యాలతో రాజభోగం అనుభవిస్తున్నాను. అసలు నీకేం హక్కుంది నన్ను ఇక్కడ చేర్పించటానికి?.. అంటూ తల్లి మీద విరుచుకుపడ్డాడు.
‘ఒరే! అదే ప్రశ్న నేను నిన్నడుగుతున్నాను. పది నెలలు మోసి, కని, పెంచి, పెద్దచేసి ఇంతవాడిని చేస్తే తల్లి అనే గౌరవం కూడా లేకుండా ఈ ఆశ్రమంలో నన్ను చేర్చాలని తీసుకొచ్చావు. నిన్ను కూడా చేర్పిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీ కర్థమవుతుంది. మీనాన్న సంపాదించిన ఆస్తిలో సగం వాటా నాది. ఆస్తి వదులుకుని అనాధాశ్రమంలో ఉండాల్సిన అవసరం నాకు లేదు. నీలాంటి కొడుకులకు బుద్ధి చెప్పాలంటే ఒకటే మార్గం. నా వంతు ఆస్తిని ఈ ఆశ్రమానికి విరాళంగా రాస్తున్నాను. నేను ఇక్కడే ఉండటానికి నిర్ణయించుకున్నాను’ అంటూ వేదిక పైనుంచి దిగి వృద్ధుల్లో కలిసిపోయింది సుబ్బాయమ్మ. గురునాథం గుండె ఆగిపోయినంత పనైంది.

- తాటికోల పద్మావతి,
గుంటూరు. చరవాణి : 9441753376

సమీక్ష

పల్లె జీవన ప్రతిబింబాలు..
‘శీలావి’ కుంచె ముద్రలు!

వెల: రూ. 300
శీలా సుభద్రాదేవి,
217 నారాయణాద్రి,
ఎస్‌విఆర్‌ఎస్ బృందావనం,
సరూర్ నగర్, హైదరాబాద్.
చరవాణి : 9866197874

కుంచె ఆధారంగా భవితను నిర్మించేవాళ్లు చిత్రకారులయితే, కలం ఆధారంగా చరిత్రను సృష్టించేవాళ్లు కవులవుతారు. కలం, కుంచె రెండూ విభిన్న సాధనాలు. విభిన్న కళా ప్రక్రియలకు ఆధారాలు. కలం పట్టిన వారంతా కవులు కాలేరు. కుంచె పట్టిన వారంతా చిత్రకారులూ కాలేరు. కానీ అటు కలాన్నీ, ఇటు కుంచెనూ సమానంగా వినియోగించగల సమర్థులూ లేకపోలేదు. కానీ అతి కొద్దిమంది మాత్రమే అలాంటి వారుంటారు. అలాంటి అతి కొద్దిమందిలో అలనాటి అడవి బాపిరాజు గారి తర్వాత రెండింటా సమాన ప్రజ్ఞాపాటవాలున్న వ్యక్తి శ్రీ శీలం వీర్రాజుగారు. సాహిత్యంతో పాటు చిత్రకళలో కూడా విశేషంగా కృషి చేసిన వీరు ఇప్పటికే ‘శిల్పిరేఖ’, ‘శీలావీర్రాజు చిత్రకారీయం’ పేరుతో రెండు చిత్రకళా గ్రంథాలను వెలువరించారు. వయస్సుపరంగా 77 ఏళ్లు పైబడిన వీరు గతంలోని తన చిత్రకళా గ్రంథాలకు కొనసాగింపుగా మరో 70 చిత్రాలతో, మరికొన్ని రేఖాచిత్రాలతో వెలువరించిన మరో చిత్రకళా గ్రంథం ‘కుంచె ముద్రలు’.
చిత్రకారుడిగా 70 ఏళ్ల వీరి కళాకృషికి దర్పణంగా వీరి కుంచె నుండి వెలువడిన ‘ఏటికెదురు, ముచ్చట్లు, పేరంటం, తారంగం, ఒప్పులకుప్ప, వామన గుంటలు, సువీ సువీ, చలిమంటలు, శ్రమజీవులు, వేటపడవలు, ఫ్రూట్ మార్కెట్, మేదరి జీవితం, కూలికోసం, అద్దరికి, క్షురకుడు, నిరీక్షణ, మట్టి మనుషులు’.. ఇలా వీరు వేసిన ఏ చిత్రాన్ని చూసినా అంతరించిపోతున్న మన గ్రామీణ సంప్రదాయ స్మృతులన్నీ మనసు పుటల్లో మెదిలీ, మనసులో ఒక పులికింతను రేపుతాయి. హాయిగొలిపే ప్రశాంత వాతావరణ వొడిలోకి తీసుకుపోతాయి. ఆయన రేఖాచిత్రాలు ఒకప్పటి మన దేశ శిల్ప సౌందర్యానికి ప్రతీకలైన హంపి, రామప్ప, ఎల్లోరా, లేపాక్షి, తదితర శిల్ప సంపద గొప్పతనాన్ని చాటితే వర్ణచిత్రాల్లోని రేఖలు మన స్వచ్ఛమైన గ్రామీణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. కళ అనేది కేవలం సంపన్నులకు అలంకార వస్తువుగా కాకుండా సామాన్యుల అవగాహన పరిధికి అందుబాటులో ఉండాలని భావించే శీలావీ చిత్రాల్లో దేన్ని చూసినా మనం కూడా ఒక స్వచ్ఛమైన, అచ్చమైన పల్లె వాతావరణం వొడిలోని మకిలి లేని మనుష్యుల మధ్య విహరిస్తున్న అనుభూతి మనకు కలుగుతుంది. చిత్రకారులు, చిత్ర కళాభిలాషులందరూ తప్పక కొని దాచుకోవాల్సిన ఈ చిత్రకళా గ్రంథాన్ని చక్కటి హార్డ్‌బౌండ్‌లో తీసుకురావాలనే శ్రీ శీలా వీర్రాజు గారి ఆలోచన చిత్రకళలో వారి నిరంతర కృషి నిజంగా ఎంతో అభినందనీయమైనది.

- వెంటపల్లి సత్యనారాయణ,
భద్రాచలం.
చరవాణి : 9491378313

పుస్తక పరిచయం

‘రసరాజా’మృతం .. ‘విజయ భారతం’!

‘అందమైనా వెనె్నలలోనా అచ్చతెలుగూ పడుచువలే ఆధునికాంధ్ర పద్య కవిత్వమనే మల్లెపూలా పందిరిలోకి సరిగమలా నడిచివచ్చింది - ‘విజయ భారతం’- అనే పద్యకావ్యం. కవి - రసరాజు. ఇది సంపూర్ణ కథాత్మక (శృంగార) వీర రస ప్రధాన కావ్యం. ఇది ప్రస్తుతమే కాదు - దేశానికి ఎప్పటికీ అవసరమే. సర్వశ్రీ బేతవోలు, గరికపాటి, రాళ్లబండి వారల ముప్పీఠికలూ ఈ కావ్యానికి వీరతిలకం దిద్దాయి.
‘ఆతడు సిపాయి! భుజముపై అదె తుపాకి! తెలియునా దాని బరువెంతొ? దేశమంత -’ అని రసరాజు ఉవాచ. (ఈ భావం ఇంతకుపూర్వం ‘రసరాజు నానీల’లో ఉంది). కానీ - రసరాజు కథ గానీ, పాట కానీ, పద్యం గానీ ఆ కవిత్వం బ(ప)రువు దేశం బ(ప)రువును మోసే తుపాకీ సిపాయి అంత!
ఏదో దినపత్రికలో చాలాకాలం క్రితం సంక్షిప్తంగా వెలువడిన ఒక వార్త తాలూకు మలుపు రసరాజును హత్తుకోగా ఈ ‘విజయ భారతం’ కావ్యం వెలువడింది. లాల్‌బహదూర్ శాస్ర్తీగారు ప్రధానిగా ఉన్న రోజుల్లో - తీవ్రంగా గాయపడ్డ ఒకానొక సిపాయి - సైనిక వైద్యాలయంలో శాస్ర్తిజీకి నివేదించిన ఒకే ఒక గొప్ప మాట ఈ కావ్యానికి కొసమెరుపు. ఆ ఒక్క మలుపూ మినహాయిస్తే - దీనిలోని మిగతా సన్నివేశాలూ, ప్రాంతాలూ, చివరకు పాత్రల పేర్లూ కథతో సహా అన్నీ ఈ కవి కల్పితాలే.
కథానాయకుని పేరు రణసింగ్. సిపాయి. నాయిక అమృత. సిక్కు వంశస్థురాలైనా ఒకరకంగా తెలుగింటి ఆడపడుచే. అందుకే ఆమెను రణసింగ్ తెలుగు సంప్రదాయాన్ని కూడా మేళవించి పెళ్లాడాడు. తొలిరాత్రి గడవక ముందే కాశ్మీర్ లోయలో పాకిస్థాన్‌తో జరిగే యుద్ధానికి రమ్మని పిలుపు వచ్చింది. వెళ్లాడు. అరివీర భయంకరంగా యుద్ధం చేసి గాయాల పాలయ్యాడు. పరామర్శించడానికి వచ్చిన లాల్‌బహదూర్‌కు నమస్కారం చేయలేక బాధపడిన రణసింగ్‌ను మనం మరువలేము. అలాగే శోభనం నాడు ఊహల్లో తేలిపోతూ ఉన్న నాయిక అమృత - అదేరోజున అంత సంతోషంతోనూ భర్తను యుద్ధానికి పంపింది. ఆమె త్యాగశీలాన్ని కూడా మరువలేము. ‘అమృతాశయం, వివాహం-విందు, శోభనం, తెలుగు వీరులు, రంగప్రవేశం, ముందుచూపు, యుద్ధ్భూమి, నడచివచ్చిన దేవుడు, మహావీరచక్రి-’ అని నవ ప్రకరణాలతో నవనవోనే్మషంగా అలరారే ఈ కావ్యంలోని ప్రతి పద్యమూ ‘పద్మశ్రీ’కి అర్హమైనదే!
‘ఘుమఘుమల్ రేపుచు గురిజూచి కొట్టెను ‘జే’యంచు గుత్తివంకాయ కూర--’ ఇత్యాదిగా సీసంలో సాగిన ఈ విందు - అమృత సరసిలో పాఠక జిహ్వలకు కూడా స్నాతకోత్సవం జరిగినంత పసందుగా ఉంది. జిహ్వలకు స్నాతకోత్సవం జరిగిందనడం - రసరాజుగారి రుచికరమైన కొత్త పదబంధం. ‘జడలోని చీకటుల్ జాతరల్ సేయగా మెలమెల్లనేతెంచు కలికి హొయలు--’ ఈ శోభన వేష వర్ణనం - అందమైన వెనె్నలలోనా అచ్చతెలుగూ పడుచువలే, మల్లపూలా పందిరిలోకీ నడిచి వచ్చే సరిగమలా- ఉంది. ‘జవ్వనములోని జలపాతశక్తి నుండి ఎంత విద్యుత్తు పుట్టెనో ఎవరికెరుక?’ షాకిచ్చే ఎంత షోకైన రూపకాలంకార శోభన వర్ణనయో గదా! ఇది. ఇంతగా శోభన దృశ్య శోభతో వృద్ధుల్ని సైతం ముగ్గులోకి దింపిన రసరాజు ఉన్నట్టుండి అది జరుగనీయక - భర్తను రణరంగానికి నాయిక సాగనంపడంతో అమృతాయమానమైన ముగింపునిచ్చారు- ఆ ప్రకరణానికి. (‘మ్రుగ్గునందు దింపడం’ అనేది ఆ సందర్భంలోని పలుకుబడే. తెలుగుకి పలుకుబడిని పెంచిన పలుకుబడి అది.)
యుద్ధ ప్రయాణమై రణసింగ్ - రైలులో తోటే తెచ్చుకున్న ‘తెలుగు వీరులు’ అనే ఆంగ్ల గ్రంథాన్ని చదువుతున్నాడని చెబుతూ అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, సుద్దాల హనుమంతు, తదితరుల అమరమైన సమర దృశ్యాలను చూపిస్తూ నాయకునిలోనే కాదు - పాఠకులలో కూడా వేడినెత్తురు పొంగిపొరలేలా చేశారు. తత్ఫలితమే - ‘హోరెత్తెన్ దిశలెల్ల నొక్కపరి - విద్యున్మాలలో ముద్దమందారాలెన్నొ రణద్యుతుల్ నెరపె - తీక్ష్ణస్వామియై సింగు విస్ఫోరోదంచిత ‘్భరి’విక్రమముతో శ్లాఘార్హుడౌచున్ తుపాకీ రోషానకు నెత్తురుంబులిమె- మ్రోగెన్ దుందుభి ధ్వానముల్’ ఇత్యాదిగా సాగిన యుద్ధ్భూమిలోని నాయకుని వీరవిహారం.
సూర్యుడస్తమించాడనడాన్ని ‘కాలపురుషుని కరాననొప్పారు నెరుపుగినె్న జారిపడిపోయె పశ్చిమాశాముఖాన’ అని యుద్ధ్భూమిలో ఎంతో మహానంద దృశ్యంగా చూపించారు- రసరాజు - కొత్తకొత్తగా!. ‘అచతుర్వదనోబ్రహ్మా, ద్విచాహురపరోహరిః, అఫాలలోచనశ్శంభుః..’ అనే శ్లోకభావం స్ఫురించేలా లాల్‌బహదూర్ శాస్ర్తీగారిని ‘ఆస్యమొకటౌచు ద్యోతితమగును గాని--’ ఇత్యాదిగా మూడు తేటగీతుల్లో త్రిమూర్త్యాత్మకునిగా ముచ్చటగా వర్ణించారు - యుద్ధ్భూమి ప్రకరణంలో. అదే ఘట్టంలో లాల్‌బహదూర్‌ను ఏనుగును రక్షించిన విష్ణువుతో పోలుస్తూ కందంలో అందంగా అపూర్వంగా తటాలున గజేంద్రమోక్షణ ఘట్టాన్ని మెరిపించారు. అదీ కవి ప్రతిభ అంటే.
రణసింగ్ మరణాన్ని వాచ్యంగా చెప్పలేదీ కవి-- ‘దేశ రక్షణమెంచి అమృతావధువు ‘రణ’వరుడు కోలుకొనగ తోరమ్ముగట్టె- ‘జన్మ జన్మలకీవె నాసతి’వటంచు ఆమె చెక్కిళులను సింగుప్రేమ నిమిరె’- ఇంతవరకు బాగానే ఉంది. ‘కడచినవి కొన్నినాళ్లు - సత్కార మొసగె/ విజయభారత పుత్రుని వీరకళకు/ రాష్టప్రతి; ‘మహావీరచక్రము’ ధరించి పొలతి సిగలోన రణసింగు పూలు ముడిచె’నని ముగించారు. మహావీర చక్రాన్ని ధరించాడనడంలోనే మరణాన్ని ధ్వనింపజేశారు. వీర సిపాయి పత్నికి వైధవ్యం ఎన్నటికీ లేదన్న విషయాన్ని ‘పొలతి సిగలోన రణసింగు పూలు ముడిచె’నన్న పాదంలో గొప్పగా ధ్వనింపజేశారు- రసరాజు.
నుడికారాలో, పలుకుబడులో, సామెతలో, కొత్త పదబంధాలో, భావచిత్రణలో, యతిప్రాస స్థానాల్లో ఒయ్యారంగా ఒదిగిపోయిన అన్యభాషా పదాలో, సజీవ వ్యావహారిక సంభాషణాత్మక వాక్యాలో ఏవో ఒకటి - ఇలాంటివెన్నో గుప్పిళ్లకొద్దీ దొరుకుతాయి - ఈ కావ్యంలో. అసలు- ‘మువ్వంతులే’ కాదు - ‘ఏకబిగి’ని ఈ కావ్యం మొత్తం మనల్ని చదివింపజేస్తుంది. ‘వచ్చెడివాడు ఫల్గునుడు’ అని ఒక పద్యం ఎత్తుగడలో తిక్కన గారిని చక్కగా ఎత్తుకున్నారు- రసరాజు. జాషువా వాక్యపద స్ఫురణలూ, కరుణశ్రీ తెలుగు బాలహేలలూ పుణికి పుచ్చుకున్న రసరాజు పద్యంలో ఆయనదైన ముద్రయే అనుభవ పరిపాకంతో కనిపిస్తుంది - ఇందులో. ‘సైనికుని పాత్రన్ మెచ్చుకోకుండ - దేశములో ఎవ్వరు గాలి పీల్చిన కృతజ్ఞత్వంబు కాదద్ది-’ అని గొప్ప సందేశాన్ని ఇచ్చిన ఈ ‘విజయ భారతం’ నిజంగా ‘రసరాజా’మృతమే!

- డా. రామడుగు వేంకటేశ్వరశర్మ,
గుంటూరు.
చరవాణి : 9866944287

మనోగీతికలు

గ్రీష్మ దృశ్యమాలిక
ఉ॥ గ్రీష్మము తీక్ష్ణమైన పెను కీలల తూపులు గ్రుచ్చి యంతటన్
ఊష్మము రేపుచుండ నట ఉగ్ర జటాధరు మూడు కన్నులున్
భీష్మ శిఖల్ వెలార్చి కడు భీతిని గొల్పెడి తీరుతోచె; నా
శుష్మపు ధాటికిన్ జడిచి స్రుక్కి స్రవించె హిమధ్రువమ్ముయున్

ఉ॥ ‘వేసవి అగ్ని గోళముల వెల్లువలన్’ సహియింపలేక ని
ర్వాసితులౌచు, మాడి, ధర రాలెడి ఘాతుక కీటకమ్ములా
‘కోసల రాము’ బాణ హతికోర్వక కుందుచు కూక వెట్టుచున్
రాసులు రాసులై మడము రక్కసి మందను గుర్తుచేసెడిన్!

చ॥ కఱకుగ వీచుచున్న వడగాడ్పుల వాడిని తాళజాలకన్
వెఱచుచు బ్రద్దలై శిలల వేడి ద్రవమ్మెగజిమ్ము పర్వతాల్
చుఱచుఱ మండ; ధూమజమె సోకని అభ్రము నుండి భిత్తికల్
చెరచెర నేలపై పడుచు చిచ్చుల కుప్పగ మారినట్లయెన్!

ఉ॥ వాగులు, వంకలున్, నదులు వాడిగ వ్యాపనమొందు ఎండకున్
కాగుచు ఆవిరౌటకని కంధి భయంపడి, యూర్మిహస్తముల్
చాగిల జేసి భాస్కరుని చల్లని రక్షణ వేడె; నాపదల్
మూగిన వేళనే యెడద మ్రొక్కును దేవుని కాపు కోసమై!

ఉ॥ తప్తమరుత్ప్రవాహముల దారుణ ధాటికి వేగలేక సం
తప్త వనస్పతుల్ విసిగి తత్తఱిలన్ ‘వనకీల’ పుట్టి సం
ప్రాప్త విపత్తుపై అశని పాతములన్ కురియించి నట్లయెన్!
ఆప్తులయెన్ విరోధులగు అగ్గియు, గాలి నిదాఘ వేళలన్!

ఉ॥ ఉష్ణము నేల నల్దెసల నుత్తల వెట్టుచు సంచరించుచున్
తృష్ణను రేగజేసి మృగతృష్ణల ఉచ్చుల నేర్పరించగన్
‘కృష్ణకురంగ’ మా స్థలము తృష్ణను దీర్చు తటాకభ్రాంతిచే
‘విష్ణుపదం’పు టంచులు భువిన్ స్పృశియించెడి దాక పర్వెడిన్!

ఉ॥ వానలు రాకముందె తమ వాసము కట్టగ పక్షులన్ని బ
ల్కానన సీమలందు తిరుగాడి, శ్రమంబడి, ఎండు పుల్లలన్
ఈనెలు సేకరించు విధమింపుగ తోచెను; దూరదృష్టితో
జ్ఞానులు చేయు కార్యములు గణ్యములై విలసిల్లు ధాత్రిపై!

చ॥ బలముగ వీచు త్రిమ్మరి ప్రభంజన మంతట నాకతాయియై
వెలమగ, ధూళి రేణువులు వేడుకతో జతగూడి దానితో
నలుగడనున్న స్వచ్ఛతను నాశము జేసెను; అల్పులెప్పుడున్
ఖలులనె మెచ్చి, చేరి, చెడి, గాసిలు చుందురు లోకమందునన్!

- గోపీనాథరావు ఎరుకలపూడి,
విజయవాడ.
చరవాణి : 9848293119

అమ్మ
పుట్టిన బిడ్డను చూసి
మురిసిపోయేది అమ్మ
పొత్తిళ్లలో బిడ్డను పెట్టుకొని
పాటలు పాడేది అమ్మ
తడబడే అడుగుల
తప్పటడుగులు చూసి
తన్మయం చెందేది అమ్మ
వచ్చీరాని ముద్దుమాటలు వింటూ
మురిసిపోయేది అమ్మ
ఊయలలూపుతూ తన ఊహల్లో
ఎంతో ఎత్తు ఎదగాలని
కలలుకనేది అమ్మ
పాలిచ్చిన అమ్మకు
పాపం తెలియదు
పుణ్యం తెలియదు
వంద పిలుపులకు
దేవుడు పలకలేకపోవచ్చు
ఒక్క పిలుపుకే ఉలిక్కిపడి
పరుగెత్తుకొచ్చేది అమ్మ
తన గర్భంలో బిడ్డ తంతున్నా
అడ్డదిడ్డంగా తిరుగుతున్నా
ఆనందించేది.. అమ్మ
తొమ్మిది నెలల బరువు
ఆ తల్లికి పేగుబంధంగా మారి
విడదీయరాని
అనుబంధం అవుతుంది!

- బి శివరామకృష్ణ,
తెనాలి, గుంటూరు జిల్లా.
చరవాణి : 9642251612

ఆభరణం
శారదాదేవి కరుణా కటాక్షముల
మనసున ఊరే మనోగీతికల
జ్ఞాననేత్రాన రంగుల వూహలు
శాసిస్తూంటాయి నిత్యనూతనంగా
ప్రకృతిమాత అందాల భామ
అందలాలెన్నో అవతరిస్తాయక్కడ
కనుదోయికి చిక్కే నిండు నిజాలివి
దొర్లుతుంటాయి కనులపండువగా!
దేముడిచ్చిన ఈ జీవిత వలయంలో
నూతన పరిమళాలు
ఉదయిస్తుంటాయి
మనోనేత్రాన మెదిలే మెరుపులు
ఆజ్ఞాపిస్తాయి నవ పరిమళంలా
నూతన తేజం అలుముకుంటుంది
అంబరాన కనిపించే చందమామలా
ఊగిసలాట హృదయ ఫలకంపైన
అవనిపై జారే వెనె్నల మడుగులా
మొదలౌతాయి భావతరంగాలు
అంతంలేని అంకురార్పణలు
సాహిత్యవేదన
సంబరాల మదిన
సంతరించుకుంటాయి
నవ్య సరాగాలు
నేడు పరవశిస్తున్నాయి పలుకరింపుల
అలమటిస్తున్నాయి
అలవిగాని మమతల
నాలోవున్న సాహిత్యాభిలాషలు
ఓ మహత్తరమైన ఆభరణంలా!

- తన్నీరు సీతారామాంజనేయులు,
జగ్గయ్యపేట, కృష్ణాజిల్లా
స్థిరవాణి : 09654 - 224726

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

- తాటికోల పద్మావతి