విజయవాడ

చావుకబురు (చిన్న కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏరా! నేను వ్యాపారం కోసం పట్నం వచ్చి రెండు నెలలైంది. ఇంటి దగ్గర వార్తలు ఏమీ తెలియటం లేదు. విశేషాలు ఏమిటి?’
‘మీరు ప్రేమగా పెంచుకునే చిలుక ఎగిరిపోయిందండీ!’
‘ఎలా ఎగిరిపోయింది? పంజరం తలుపు వేయటం మర్చిపోయారా?’
‘మర్చిపోలేదు. పనివాళ్లు కావాలనే తెరిచారు’
‘కావాలని ఎందుకు తెరిచారు?’
‘మన ఇల్లు కాలిపోతూంటే ఆ మంటల్లో పడి చచ్చిపోదటండీ!’
‘ఏమిటీ! నా ఇల్లు తగలబడిపోయిందా? ఎలా జరిగింది?’
‘పొలంలో ఉన్న మీ వరికుప్పలకు అంటుకున్న నిప్పు గాలికి ఎగిరివచ్చి అంటుకుంది’
‘ఆరుగాలం కష్టపడి పండించిన పంట అంతా బుగ్గిపాలైందా? అయ్యో! అసలు వరికుప్పలకు నిప్పు ఎలా అంటుకుంది?’
‘శ్మశానంలోని చితికి అంటించిన మంటలు అంటుకున్నాయి’
‘ఎవరు చనిపోయినారు?’
‘అమ్మగారు చనిపోయారు గదండీ!’
‘అయ్యోయ్యో! నా భార్య చనిపోయిందా! ఎంతపని జరిగింది? ఆమెకు ఏం జబ్బు చేసింది?’
‘జబ్బు వల్ల కాదండీ! అమ్మాయిగారు మరణించారన్న వార్త విని తట్టుకోలేక గుండె ఆగి మరణించారు’
‘నా కుమార్తె కూడా మరణించిందా? భగవంతుడా! భగవంతుడా! నా కుమారుడు జబ్బుతో ఉన్నాడు కదా! వైద్యుడికి చూపించారా?’
‘చూపించారు. కానీ తగ్గలేదు. కూర్చోలేక, పడుకోలేక చాలా ఇబ్బంది పడ్డారు. గుక్కెడు మంచినీళ్లు కూడా తాగలేకపోయారు’
‘ఇన్ని బాధలు పడేకన్నా దేవుడు తీసుకెళ్లినా బాగుండేది’
‘చిత్తం. అలాగే జరిగిందండీ. దేవుడు తీసుకెళ్లిపోయాడు’
‘అయ్యోయ్యో! నా కుమారుడు కూడా వెళ్లిపోయాడా? ఇన్ని దారుణమైన విషయాలు ఉంటే అవన్నీ చెప్పకుండా ముందుగా పంజరంలో చిలుక ఎగిరిపోయిందని చెబుతావేంరా?’
‘చావుకబురు చల్లగా చెప్పాలని పెద్దలన్నారు కదండీ!’

గోనుగుంట మురళీకృష్ణ
ఇసుకపల్లి, గుంటూరు జిల్లా.
చరవాణి : 9701260448

ఆధ్యాత్మికం

ఆంజనేయుడు ఆంధ్రుడే!
అంజనాద్రి ఆయన జన్మస్థలం

హనుమంతుని అవతారం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సర్వదేవతా స్వరూపుడు, ఏకాదశ రుద్రుడుగా జన్మించిన హనుమ కలియుగాన పిలిచిన పలికే దైవం. ఆ హనుమ పుట్టినరోజే హనుమజ్జయంతి. ఈ నెల 31న జరుగుతుంది.
పూర్వం కశ్యపుడనే బ్రాహ్మణుడు వుండేవాడు. ఆయన వేద వేదాంగాలు, సర్వశాస్త్రాల సారం ఎరిగినవాడు. ఆయన భార్య మహా పతివ్రత అయిన ‘సాధ్య’. వారు పుత్రుడు కలగాలనే కోరికతో కైలాసం వెళ్లి పరమశివుని కటాక్షం కోసం వేయి సంవత్సరాలు ఘోర తపస్సు చేశారు. ప్రతిరోజూ అగ్నిహోత్రుడు, వాయుదేవుడు తపస్సు చేస్తున్న కశ్యప దంపతులకు అవసరమైన సపర్యలు చేసేవారు. వారి కఠినమైన తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు పార్వతి సహా ప్రత్యక్షమయ్యాడు.
‘మీ తపస్సుకు కారణమేమిటి? మీ అభీష్టములు తెలియజేయండి?’ అని అడిగాడు.
‘స్వామీ! నీవు మాకు పుత్రుడువై జన్మింపుము’ అని వారు వరం కోరుకున్నారు. అప్పుడు బోళాశంకరుడు సంతసించి ‘కశ్యపా! నీ మరుజన్మలో నీవు కేసరి అను నామముతో వానర రాజువై జన్మిస్తావు. నీ భార్య సాధ్య కూడా అహల్యాగీతములకు సౌందర్యవతియైన అంజన అను పేరుతో పుత్రికగా జన్మిస్తుంది. నేను మీ ఇద్దరకు హనుమంతుడనే నామముతో కుమారుడుగా జన్మిస్తాను’ అని వరమిస్తాడు.
తరువాత అగ్నిహోత్రుడు, వాయుదేవుడు కూడా శివుని ప్రార్థించి, ‘స్వామీ! మాకుకూడా నిన్ను పుత్రుడుగా పొందవలెనని కోరికగా యున్నది. మా కోర్కె దీర్చవా?’ అని అడిగారు. అందుకు శంకర భగవానుడు చిరునవ్వుతో ‘తథాస్తు’.. అని దీవించి అంతర్థానమయ్యాడు.
ఒకప్పుడు రాక్షసుల బాధలు తట్టుకోలేక మహారుషులు, దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని ప్రార్థించారు. ప్రత్యక్షమైన బ్రహ్మకు తమ బాధలు వివరించారు. ఆయన విని ‘దీనికి నా ఒక్కడి శక్తి సరిపోదు. మనమందరము కలిసి కైలాసంలో కొలువుతీరి వున్న పరమేశ్వరునికి మన బాధలు విన్నవించుకుందాము రండి!’ అని అందరితో కలిసి కైలాసానికి వెళ్లారు. పరమేశ్వరుని ప్రార్థించారు. ఆయన అనుగ్రహించి ‘మనమందరము బదరికాశ్రమములో వేంచేసియున్న నరనారాయణులను ఆశ్రయిస్తే ఆయన ఈ కష్టములన్నియు తీర్చగలడు’ అని చెప్పాడు. బ్రహ్మాది దేవతలను అక్కడకు తీసుకెళ్లి, వారి కష్టాలను నరనారాయణులకు విన్నవించారు. ఆయన ఒక క్షణకాలం ఆలోచించి- ఈశ్వరుని, బ్రహ్మాది దేవతల, తన తేజస్సును గ్రహించి ఒక ముద్దగా చేసి ఈశ్వరునికిచ్చాడు. దాన్ని హాలాహలుడు మింగేశాడు.
భక్త సులభుడైన శ్రీనివాసుడు వేంకటాచలము మీద వెలసి భక్తుల బాధలు తీర్చుచూ, దరిచేరిన వారికి వరములొసగి వారికి ఇహపర సుఖాలను కలుగజేస్తున్నాడు.
కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులు విహారార్థమై వేంకటాచల వనాల్లో సంచరిస్తున్న సందర్భంలో వానర మిథునములను చూసి ఆనందపడుతూ వారుకూడా వానర రూపులై క్రీడించిన సమయంలో ఈశ్వరుడు ఆ తేజఃపుంజాన్ని పార్వతీదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు. ఆ తేజస్సు వేడికి తట్టుకోలేక పార్వతీదేవి అగ్నిలో వదిలింది. ఆ వేడిని అగ్నిదేవుడే భరించలేక వాయుదేవుడిని ప్రార్థించి ఆయనకిచ్చాడు.
అంజనే అనే ఒక వానర స్ర్తి, కేసరి అనే వానరరాజు భార్య చాలాకాలం నుండి వాయుదేవుని కోసం తపస్సు చేస్తుంటుంది. వాయుదేవుని మించిన మిక్కిలి బలవంతుడైన కుమారుడిని ప్రసాదించమని వేడుకొంటుంది. వాయుదేవుడు కరుణించినవాడై ఆ తేజఃపుంజాన్ని ఒకరోజు ఆమె చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. కళ్లు మూసుకుని ప్రార్థిస్తున్న ఆమె ఆ ముద్దను పండనుకొని తినేసింది.
తరువాత వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి మందవాసరం పూర్వాభాద్ర నక్షత్రమున్న మధ్యాహ్న సమయంలో మహా బలవంతుడు, సర్వ లక్షణ సంపన్నుడు, పద్మరేఖలతో కూడిన పాదపద్మాలు కలిగిన వాడు, పెద్ద వాలము కలిగిన వాడైన కుమారునికి కేసరి భార్య అంజనాదేవి జన్మినిచ్చింది. ఆ సమయం శుభసమయంగా భావించిన దేవతలు పుష్పవర్షం కురిపించారు. ప్రకృతి శుభసూచకాలు ప్రకాశింపజేసింది.
హనుమ జన్మస్థలం గురించి భిన్నమైన అభిప్రాయాలున్నాయి. ఉత్తర భారతంలో త్రయంబకానికి సుమారు 5 కి.మీ.ల దూరంలో అంజనేరి అనే కొండ ఉంది. సుమారు మూడు, నాలుగు కిలోమీటర్ల మెట్లు ఎక్కి వెళ్లాలి. నరసంచారం చాలా తక్కువ. కోతులే ఎక్కువ. అక్కడ చిన్న గుడి వుంది. అదే హనుమ జన్మస్థలమని చెప్తారు. చాలాచోట్ల వారివారి భక్తికి తగ్గట్టుగా జన్మస్థలం గురించి చెపుతుంటారు. అయితే ఆంధ్ర పరాశర మహర్షిగా ప్రశంసలందుకున్న శ్రీ అన్నదానం చిదంబర శాస్ర్తీగారి పరిశోధనల ప్రకారం తిరుమల కొండపై వేంచేసి వున్న జాబాలి మహర్షి ఆశ్రమ ప్రాంతంలో స్వామి జన్మించాడని నిర్థారించారు. పాపనాశనం వెళ్లే మార్గంలో ఆకాశగంగకు సమీపంలో వుంది ఈ ఆశ్రమం. ఇదే స్వామి జన్మస్థలం.
తిరుమల కొండదారిలో అంజనాద్రి వుంది. అదే అంజనాదేవి పేరుమీద వెలసిన కొండ అని, అదే ఆంజనేయుని జన్మస్థలమని పండితులు చెప్తూ వుంటారు. అందుకే ఆంజనేయస్వామి ఆంధ్రుడేనని భక్తులు విశ్వసిస్తారు. అందుకేనేమో ఆంజనేయుడు అనే పేరు దక్షిణ భారతంలో ఎక్కువగా వినిపిస్తూ వుంటుంది. ఉత్తర భారతంలో హనుమంతుడుగానే ప్రసిద్ధికెక్కాడు. గొప్పవారి జన్మరహస్యాలు సాధారణ మానవులకు అర్థంకావు. ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, షిర్డీ సాయిబాబా లాంటివారి పుట్టుక రహస్యాలు చాలామందికి తెలియవు. వారంతా కారణజన్ములే.
(31న హనుమజ్జయంతి సందర్భంగా..)

- లక్కరాజు పూర్ణచంద్రరావు,
విజయవాడ.
చరవాణి : 9346978829

తెలుగు భాష, సంస్కృతుల
పరిరక్షణే లక్ష్యంగా..

31న విజయవాడలో సమ్మేళనం

‘తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణ నేటి అవసరం. ప్రభుత్వపరంగా, ప్రజల పరంగా కూడా చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించే దిశగా విస్తృత స్థాయిలో తెలుగు భాషా సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నాం. ఈ నెల 31న ఉదయం 10నుండి సాయంత్రం వరకు విజయవాడ లబ్బీపేటలోని శ్రీ శేషసాయి కల్యాణ మంటపంలో జరిగే ఈ సమ్మేళనంలో తప్పక పాల్గొనాల్సిందిగా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం’ అని ఆహ్వాన సంఘ కార్యదర్శులు పెద్ది రామారావు, విష్ణువర్ధన్, డా. జివి పూర్ణచందు తెలిపారు. ఈ సమ్మేళనం ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఉపాధ్యక్షులుగా గుత్తికొండ సుబ్బారావు, గోళ్ల నారాయణరావు, డా. ఈమని నాగిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ‘మన భాష, సాహిత్యం, ప్రామాణిక సాంగీతం, నాట్య, చిత్రకళలతో పాటు మన దేశీయ కళారూపాలు ప్రజాదరణ, ప్రభుత్వాదరణ పెనవేసుకుని ముందుకు సాగవలసి ఉంది. అందుకోసం వ్యక్తులుగా మనం, సంస్థలు, ప్రభుత్వం ఏంచేయాలో చర్చించాలి. ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవాలి. అందరం కలిసి ఆ ప్రణాళిక అమలు కోసం కృషిచేయాలి. ఈ సమ్మేళనం అందుకు దోహదపడాలి. ఇందులో మీరు తప్పక భాగస్వాములు కావలసిందిగా కోరుతున్నామని’ భాషా ప్రేమికులు, ఔత్సాహికులను వారు ఆహ్వానించారు. ‘తెలుగు భాషా వికాసం, భాషా సాహిత్యం, ప్రభుత్వ సంస్థల పనితీరు - మెరుగుదల, రాష్ట్ర అకాడమీలు, తెలుగు సాధికారిక సంస్థ వంటి నూతన సంస్థల ఏర్పాటు, పరిశోధనలకు ప్రోత్సాహం, ప్రజల్లో భాషానురక్తి కలిగించే కార్యక్రమాలు, విద్యావిధానంలో తెలుగు సంగీత, నృత్య కళాశాల పనితీరు, విశ్వవ్యాప్తంగా తెలుగు’ వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణోద్యమ రథసారథి మండలి బుద్ధ ప్రసాద్ షష్టిపూర్తి మహోత్సవాన్ని తెలుగు భాషా సాంస్కృతిక సమ్మేళనంగా జరపనున్నామని, ఇందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ వారు సహకరిస్తున్నారని వారు వివరించారు.

పుస్తక పరిచయం

సామాజిక నిబద్ధతే ‘స్మృతి ప్రవాహం’
పేజీలు 166, వెల రూ.150
ప్రతులకు: జీవన్, 7-10-220,
శ్రీరామ్ హిల్స్,
బోనకల్ రోడ్, ఖమ్మం.
చరవాణి : 9059881131

సమాజ ప్రాథమిక చలనాల ఆధారంగా కవిత్వ పరిణామాత్మక చలనాలను చూడగలం. కవికి జ్ఞానంతో పాటు సామాజిక వారసత్వం ఉండాలి. ఏ ఒక్కటో ఉంటే ఏకపక్ష జ్ఞానమే అవుతుంది. రెండూ కలిస్తేనే బాహ్య వాస్తవికతపై పరిపక్వమైన జ్ఞానాన్ని, శక్తినీ ప్రదర్శించగలడు. అలా రెంటినీ ఒకే తాటిపై నడిపిస్తూ వర్తమాన సాహిత్య లోకంలో బహుముఖీనంగా సాగే కవితా ప్రస్థానంలో ఒక నిబద్ధతను ప్రదర్శిస్తున్న కవి- జీవన్. ఆయన రాసిన కవితల గురించి చెప్పేటప్పుడు ఆయన గురించి ఒక మాట చెప్పాలి. కవి జీవన్ జ్ఞానంతో పండిన పండు. అతనొక నిండు కుండ. విచక్షణాజ్ఞాని. ఆయన గతంలో జీవన గీతం, గ్లోబలిపీఠం కవితా సంపుటాలు వెలువరించారు. ఈ ‘స్మృతి ప్రవాహం’ కవితా సంపుటిలో ఎడబాట్లు, విచ్ఛిన్నాలూ, వైరుధ్యాలూ, ఆత్మిక నైరాశ్యాలు, స్మృతి భావనలు, సామాజిక రుగ్మతలు, మానవ సంబంధాలు.. ఇలా చాలా అంశాలను చక్కగా, చిక్కగా స్పృశించారు.
కవి జీవన్ గత నెల వెలువరించిన ‘స్మృతి ప్రవాహం’ కవితా సంపుటిలో తెలంగాణ సమాజాన్ని అట్టుడికించిన అనేక పరిణామాలు, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన పోరాటాలు, సామాజిక అంశాలు, అంతరంగ భావాల సమ్మిళితాలు.. అన్నీ గుదిగుచ్చి యాభై కవితల్ని ఇందులో పొందుపరిచారు. ఈ కవితా సంపుటిని చెరబండరాజుకు అంకితమిస్తూ ‘నా చేతిలో కలాన్నిచ్చి/ గమనానికో దిక్సూచిగ నిలిచి/ అక్షర ప్రపంచంలోకి నన్ను నడిపించిన/ కలం యోధుడా/ చెరబండ రాజా/ అందుకో నా కవిత్వ నీరాజనం/.. అంటారాయన. సంపుటిలోని 47వ కవిత ఈ పుస్తక శీర్షిక అయిన ‘స్మృతి ప్రవాహం’లో ‘కాలం తన మానాన తాను/ వౌనంగా తలంచుక వెళ్లిపోదు/.. అంటూ, ఏదో ఒక స్మృతి మిగిల్చి కాలం కదిలి పోతూనే ఉంటుందంటారు. ‘కాలాన్ని పంచాంగ తిథి వార నక్షత్రాల్లో వెతుక్కోకు!’ అంటూ కాలం విలువను తనదైన ప్రత్యేక శైలిలో ఆవిష్కరించారు. ‘మరుగున పడిన/ ఏ జ్ఞాపక శకలామో/ శూలమై/ హృదయాన్ని చీలుస్తున్నపుడో/ నా కవితా పదం/ మొదలవుతుంది’ అంటూ తన కవిత్వ దృక్పథాన్ని చెప్పకనే చెప్పారు. ‘జనుల కొరకు/ జగతి కొరకు/ బతుకు కొరకు బాగుకొరకు/ పాటల ఊటనై/ ఆగకుండ సాగుతుంట/.. అని తెలంగాణ పారిభాషిక పదాలతో ‘పాటల చెలిమి’ కవిత హృదయాన్ని హత్తుకుంటుంది. ‘దృశ్యాదృశ్యం’ కవితలో ‘చెల్లని రూపాయికి గీతలెక్కువ/ పసలేని నాటకానికి నస ఎక్కువ/.. లాంటి పద పంక్తులు సామెతలై కవిత్వ బలాన్ని పెంచాయి.
‘చాకులోయ్/ చాకులు/ చాకుల్లాంటి చూపుల/ చిన్నవాని కేకలు’.. అని ఎత్తుకున్న ‘వాడిన మొగ్గలు’ కవిత బతుకు తాకట్టు పెట్టిన బాల్యాన్ని చిత్రించింది. ప్రపంచ అపురూప అందాల భరణే నయాగారా జలపాతాన్ని కవి సందర్శించి భావోద్వేగంతో రసగంగా ప్రవాహంలా ‘నయాగారా! నా గారాల తనయా!’ అంటూ కవి చారిత్రక ప్రదేశాన్ని రసరమ్యంగా స్పృశించటం కనిపిస్తుంది. కవిలో ఎంత ప్రేమ వుందో అంతే కోపాన్ని సమాజ రుగ్మతల పట్ల ఆయన స్పందించిన తీరు చెబుతోంది. రోహిత్ స్మృతిలో రాసిన ‘దళిత నిష్క్రమణ సారాంశం’ కవితలో సమాజంలో వేళ్లూనుకున్న పోకడల్ని తన అక్షర శరాలతో చెండాడటం కనిపిస్తుంది. ముక్కలైన ఆకాశం కవితలో.. ‘ఒకడికి మరొకడు/ ఏమీ కాని పరాయి’ అంటూ మానవ సంబంధాలను విచిత్ర లోకంగా అభివర్ణించిన తీరు ఆకట్టుకుంటుంది. ‘్భగోళాన్ని బూడిదకుప్పగా మార్చే/ విధ్వంసక శతఘు్నల ఆయుధాగారాలు కాకుండా/ ఆకలినీ అజ్ఞానాన్ని ధ్వంసించే/ అపార జ్ఞాన భాండాగారాలుంటే/ ఎంత బాగుండు’ అంటూ ఎల్లలెరుగని కలల లోకం కవితలో కవి తన మనసును పాటగా చేసుకుని ఆలపించటం కనిపిస్తుంది. భగత్‌సింగ్ గురించి, వెనిజులా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్ స్మృతిలో కవిత, ఇలా పలువుర్ని స్మరించుకుంటూ రాసిన కవితలు సైతం వారి పట్ల కవికున్న ఆర్ధ్రత అక్షరాల్లో తొణికిసలాడుతుంది. ‘జీవచ్ఛవాలు’ కవితలో ‘మనసులు చెమ్మ కోల్పుతున్నాయి’.. అంటూనే, ‘ఎవడి శవం వాడే మోస్తూ’ అంటూ కవితను ముగించటం అనంత భావాల్ని ఎలా సంక్షిప్తం చేయాలో కవికి బాగా తెలిసినట్టు గోచరమవుతోంది.
‘చక్రవడ్డీల రథచక్రాల కింద/ నలిగి నలిగి నలిగి/ చిప్పలుగా/ బొచ్చెలుగా/ బోలెలుగా/ సర్దుబాట్లు చేసుకుంటున్న/ దొడ్డదొర’ అనే ‘ఆఖరి సర్దుబాటు’ కవిత దొర పెత్తనాన్ని, పీడనను వ్యక్తం చేస్తుంది. ఇక అద్దేపల్లి రామమోహనరావు మరణవార్త విని రాసిన ‘తడితడిగా నీ జ్ఞాపకం’ కవిత సైతం సాహిత్య స్నేహ సౌరభగీతమై ఆత్మీయ ఆలింగనంగా మనల్ని చుట్టుకుంటుంది. ఇక ప్రజాకవి కాళన్న నూటొక్క జయంతిని పురస్కరించుకుని రాసిన ‘కాళన్న కాంతిరేఖ’లో ‘నీ అక్షర తూణీరాలు దూసుకుపోతూనే వున్నాయ్’ అంటారు కవి. జీవన్ ఖమ్మం వాసి కావటంతో పరిసర ప్రాంతాల్లో జరిగిన అనేక సంఘటనలు ఆయన కవితా వస్తువులయ్యాయి. ‘ముదిగొండ నెత్తుటి చేవ్రాలు’ కవిత అలాంటిదే. ఇక ‘నా పొయెం పోయింది’ కవితలో, ‘అనంత కాల ప్రవాహంలోకి/ అమాంతం మాయమైపోయింది’ అంటూ సామాజిక చిత్రాన్ని గీశారు. ‘అమ్మా నీకు వందనం’ మొదటి కవిత నుంచి తెలం‘గానం’- చివరి కవిత వరకు వైవిధ్యభరితమైన భాషా సంపద, శైలి, కవికుండే ఆవేశం, అనుభవం, రసజ్ఞత అన్నీ మేళవింపై మనకు మంచి అనుభూతిని మిగుల్చుతాయి. డా. పొత్తూరు వెంకట సుబ్బారావు, వేణు సంకోజు ముందుమాటలు సైతం కవి సామాజిక స్పృహకు అద్దం పడతాయి. సాహితీప్రియులే కాకుండా, ముఖ్యంగా నేటితరం యువత చదవాల్సిన కవితా సంకలనం ఇది.

- కటుకోఝ్వల రమేష్,
చరవాణి : 9949083327

మనోగీతికలు

ఒక్క క్షణం..
ఒక్క క్షణం..
కళ్లు వాకిళ్లు తెరవనే లేదు
ఆశలన్నీ శిథిలాల కింద నలిగిపోయాయ్
ఆనందాలన్నీ చెరసాలలో బందీ అయ్యాయ్
విరిసిన నవ్వులు వెలిసి పోయాయ్
ఒక్క క్షణం..
క్రీగంట వరకూ వెలిగిన చుక్కల లోకం
ఇప్పుడో అభయారణ్యం
కలల తలలు తెగి ఆవరించిన శూన్యం
ఒక్క క్షణం..
తెల్లారని బతుకులు కొన్ని
నిర్లక్ష్యపు కొమ్మన
ఊగిసలాడిన ప్రాణాలు కొన్ని
కిటికీ ఆవలి జీవితాలు
ఇప్పుడు కిటికీకి ఈవల
వలవలలాడుతున్నాయ్
ఒక్క క్షణం..
నోరు తెరిచిన దినదిన గండానికి
ఎన్నో జీవితాలు బలి
నిలిచిపోయిన దినచర్య
సశేష ప్రశ్నల వ్యథ
శోధించి, సాధించాల్సిందీ ఏమీలేదు
ఒక్క క్షణం
అంతా శేషం
తప్పెవరిదంటూ
మెదడు రోదిస్తోంది!

- అమూల్యా చందు,
విజయవాడ.
చరవాణి : 9059824800

వారి ప్రపంచాలు
అతను
ఆమెను
తన జీవితకాలమంతా
భరించక తప్పదు

అగ్నిసాక్షిగా
ఆమె మెడలో
తాళి కట్టాడు గనుక
భర్త అంటే
భరించువాడని
అర్థం కనుక!

వారిద్దరు
భార్యాభర్తలని
అయినవాళ్లకు
కానివాళ్లకు
అందరికీ
తెలిసింది కనుక

అతను
ఆమెను
భరించక తప్పదు!
రెండు మనసులు
ఒకటిగా
నాలుగడుగులు
రెండుగా
పడుతున్నాయనే
భ్రమలో
సమాజముంది గనుక

అతను
ఆమెను
భరించక తప్పదు!

ఒకే
ప్రపంచముందని
చాలామంది నమ్మకం
కానీ
మనిషికో
ప్రపంచముందని
అనుకోక తప్పదు!!
ఎందుకంటే
ఆమెదొక ప్రపంచం
అతనిదొక ప్రపంచం!!!

- రాపోలు పరమేశ్వరరావు
కొత్తరెడ్డిపాలెం
చరవాణి : 9951416618

కన్నీటి వాన
మారుతున్న కాలంతో
పాటుగా అభివృద్ధి పథంలో
పరుగులు పెడుతున్న
ఈ తరుణంలో కూడా
స్వేచ్ఛ లేక, చరిత్ర మారక
మారని మానవ మృగాలు చేసే
అకృత్యాల సాక్షిగా
స్ర్తిల కళ్ల నుండి
జారుతునే ఉన్న
ఈ కన్నీటి వాన..
ఆగేది ఏనాటికి?

- పెయ్యల శ్రీనివాసరావు,
మచిలీపట్నం, కృష్ణా జిల్లా.
చరవాణి : 8886423116

అలిగిన
వానచినుకు
చల్లని గాలి తాకిడికి
నల్లని మేఘాల నుండి
జాలువారే వాన
చినుకు అలిగింది
పర్యావరణం పక్కదారి పట్టిందని
ఋతుపవనాల సవ్వడి
సద్దుమణిగింది
నీటిచుక్క కోసం
నింగి పైకి తొంగిచూపు
పుడమిలో దాగిన
జలం అడుగంటిపోయె
పచ్చని చీరకట్టిన
ప్రకృతి ఒడలిపోయె
నెర్రలు బారిన నేలతల్లి
బిక్కముఖమేసింది
గుక్కెడు నీళ్ల కోసం
కడివెడు కన్నీళ్లు కార్చుతూ
కోసెడు దూరంలో
నీటి వ్యథల తీరం
చుక్కచుక్కా నీటిచుక్కను
ఒడిసిపట్టి
ముందుచూపు లేక
కుండపోత వానతో
పరుగులు తీసే
సెలయేరును అడ్డగించలేక
సంద్రంపాలు చేసి
మిన్నకుంటే
నీటి తిప్పలు తప్పేట్లు లేవు
కాలానుగుణంగా వచ్చే
వానచుక్కను వృథా పోకుండా
ఇంగుడు గుంటలో దాచిపెడదాం
భూగర్భ జలమట్టం పెంచి
మన అవసరాలు తీర్చుకుందాం..!

- పంజాల ఐలయ్య,
గార్ల, ఖమ్మం జిల్లా.
చరవాణి : 9440324881

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

గోనుగుంట మురళీకృష్ణ