దక్షిన తెలంగాణ

కన్నీటి ముత్యాలు! ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక ఊళ్లో పేరయ్య అనే ఓ పేదవాడుండేవాడు. అతనికి భార్య, ఓ నాలుగేళ్ల కూతురు. కూలో నాలో చేసుకుంటూ సంపాదించిన రోజు కూలీ డబ్బులతో హాయిగా కుటుంబాన్ని పోషించుకునే వాడు. గుడిసె జీవితమైనా.. కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర, నేటికి కరువు లేదు, రేపటికి రంధి లేదు. అరమరికలు లేని జీవితం. కాయకష్టం మీద బ్రతుకు. రోజు మట్టి పని. ఒక రోజు గుంతలు తీస్తుంటే గడ్డపారకు ఏదో తగిలి ‘ఖన్’మని శబ్దమయ్యింది. జాగ్రత్తగా తవ్వి తీస్తే.. ఓ ఇత్తడి గినె్న! దాన్ని శుభ్రం చేసి చేతుల్లోకి తీసుకోగానే ఏదో అశరీర వాణి పేరయ్యతో ఇలా అంది..
‘పేరయ్యా! నేను మామూలు గినె్నను కాదు.. మహిమ గలిగిన మాయ గినె్నను! నీ కన్నీళ్లు ఈ గినె్నలో ఎప్పుడు పడినా ఒక్కొక్క కన్నీటి బొట్టు ఒక ముత్యంలా మారి గినె్న నిండుతుంది. ఈ ముత్యాలు సంతలో అమ్మి సొమ్ము చేసుకొని సుఖంగా జీవించు! ఇది నీ కన్నీళ్లకే వర్తిస్తుంది సుమా!’ అని చెప్పి అంతర్థానమయ్యింది. పేరయ్యకు ఇదంతా ఏదో కలలా, పాతాళభైరవి సినిమాలో వున్నట్టు అనిపించింది. నమ్మలేక ఈ వింత గినె్న సంగతంతా భార్యకు చెప్పాడు. ఏం చెయ్యాలో తోచలేదు. ఇది నిజమోకాదోఅని తెలుసుకోవాలనే కుతూహలంతో ఏడవడానికి ప్రయత్నించాడు. ఆశ్చర్యం... ఏడుపు రావడం లేదు! మరి ఏడిస్తేనే గదా కన్నీళ్లు వచ్చేది!
అంతలోనే, హడావిడిగా ఒకప్పుడు తనతో కూలీగా పనిచేసినతను వచ్చి, ‘పేరయ్యా.. వెంబడే బయల్దేరు. మీ నాయిన మట్టి పెళ్లలు మీదబడి ఊపిరాడక చచ్చిపోయాడట!’ అనే పిడుగులాంటి వార్త చెప్పాడు. అది తట్టుకోలేక పేరయ్య బోరుమని ఏడ్చాడు. బొటబొట కళ్ల వెంబడి నీరు కారుతూనే ఉంది. అనుకోకుండా ఒళ్లోవున్న మాయగినె్నలో ఓ పది చుక్కలు పడ్డట్టున్నాయి. ‘ఈ గినె్నను జాగ్రత్తగా దాచిపెట్టు’ అని భార్యకియ్యబోతు గినె్నలోకి చూచినా పేరయ్య ఆశ్చర్యపోయాడు! గినె్నలో తళ తళ మెరుస్తూ.. పది ముత్యాలు! తండ్రి పోయాడన్న వార్తకు ఏడ్వాలా, ముత్యాలకు మురిసిపోవాలా.. ఎటూ పాలుపోని పరిస్థితి! ఒక్కొక్క ముత్యాన్ని అమ్మి పేరయ్య కుటుంబం రాను రాను ఇదివరకంటే సుఖంగా బ్రతుకుతున్నారు. కూలీ మానేశారు. రోజులు హాయిగా గడుస్తున్నాయి. అవసరాలు పెరుగుతున్నాయి. రోజుకొకసారైనా గినె్నను చేతుల్లోకి తీసుకొని కన్నీటి కొరకు ప్రయత్నిస్తున్నాడు. ఎంత ప్రయత్నించినా ఏడుపు ససేమిరా రాలేదు. ఏమి చెయ్యాలో అర్థం గాక పిచ్చివాడిలా మనశ్శాంతి కోల్పోతున్నాడు. ఏడ్పు వచ్చే సందర్భాల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇది ఎవరూ కోరుకొని విపరీత పరిస్థితి! రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదు. ఎవరైనా తనకు బాగా కావాల్సిన వాళ్లు చనిపోతే బాగుండు.. ఛీ! ఛీ! ఇదేం ఆలోచన! నేనెందుకిలా ఆలోచిస్తున్నాను? ఎప్పుడూ ఇలా కీడు జరుగాలనే ఆలోచనలేనా? మాయ గినె్న మాత్రం మరువకుండా ఎప్పుడు తన చేతుల్లోనే.. నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారంగ నిద్ర.. ఓ పీడ కల.. ఊహించనిది. తన ముద్దుల బిడ్డ చనిపోయినట్టు కల! మేల్కొన్నాడు. ఒక చేత మాయ గినె్న, ఇంకో చేత చిన్నారిని తట్టి లేపడానికి ప్రయత్నించాడు. ఇంకేముంది.. కొంప మునిగింది. ఆ చిన్నది నిద్రలోనే చనిపోయింది! తెల్లవారంగ వచ్చిన కల నిజమయ్యింది! పేరయ్యకు ఏడ్పు ఆగలేదు. ప్రవాహంలా కన్నీటి ధార.. చేతిలోవున్న గినె్న నిండుకుంటూ.. కుప్పలు కుప్పలుగా.. పడగ్గది నిండా ముత్యాలే! చేతిలో వున్న గినె్నను విసిరి కొట్టి భార్యమీద పడి బోరున ఏడ్చాడు. ఎవరి భవిష్యత్తు కొరకైతే ఇవన్నీ కావాలనుకున్నాడో ఆ చిట్టి తల్లే వెళ్లిపోయింది. ముత్యాలు మాత్రం మిగిల్చింది! ఇలాంటి సంపద కోసమా నేను కాంక్షించింది?
ముత్యాలన్నీ అమ్మగా వచ్చిన డబ్బుతోవ ఆ చిన్నారి పేరు మీద దానధర్మాలు చేసారు. ఓ అర్ధరాత్రి పేరయ్య భార్యను తీసుకొని ఎక్కడికో దూరంగా వేరే ఊరికి వెళ్తూ మధ్యలో ఆ మాయ గినె్నను సముద్రంలోకి విసిరేశాడు? నడమంత్రపు సిరి వద్దనుకున్నారు. భార్యాభర్తలిద్దరూ మునుపటిలా కూలీ చేసుకుంటూ మరో చిట్టితల్లికై ఎదురుచూడసాగారు!

- ఆచార్య కడారు వీరారెడ్డి
హైదరాబాద్, సెల్.నం. 9392447007

పేదరికం

మా అత్తగారు ముత్తయిదువగా పోయారు. మాది చిన్న పల్లెటూరు కావడంతో దూర ప్రాంతాలనుంచి కొడుకులు, కూతుళ్లు అందరూ చేరుకున్నారు. మా వంశంలో ముత్తయిదువుగా చనిపోయినవాళ్లు చాలా తక్కువమంది. నూటయాభై సంవత్సరాల్లో ముత్తయిదువగా ఎవరూ చనిపోలేదుట. ఇనే్నళ్ల తర్వాత ఈవిడ సుమంగళిగా కాలం చేశారు. కార్యక్రమాలన్నీ చక్కగా జరుగుతున్నాయి ఏ లోపం లేకుండా. ముత్తయిదువగా పోయింది కాబట్టి మూసి వాయనాలు అన్నారు. ముత్తయిదువులకు ఇవ్వటానికి చేటలు, బొట్టు, కాటుక, గాజులు, పసుపు, కుంకుమ వంటివన్నీ సిద్ధం చేశారు. కార్యక్రమాలు చేసే పంతుళ్లు తమతో పాటు ఓ పేద పునిస్ర్తిని తీసుకువచ్చారు. ధర్మోదకాలు అయినాయి. పంతులుగారు కోడళ్లనందరినీ పిలిచారు. మేం నలుగురు కోడళ్లం. మా పెద్దత్తగారి కోడళ్ళు ముగ్గురు. మొత్తం ఏడుగురు కోడళ్లు. పంతులుగారు తనతోపాటు తీసుకువచ్చిన పునిస్ర్తికి మూసివాయనం తంతు చెయ్యమని చెప్పారు. నేను పెద్దకోడల్ని కాబట్టి మొదట నేను చేటకి పసుపు రాసి, బొట్టు పెట్టి, చేటలో చీర జాకెట్టు, చిన్న బంగారు మంగళసూత్రాలు, వెండి మెట్టెలు, పసుపు కుంకుమ, గాజులు తదితర సామగ్రి అంతా పెట్టి ఆవిడను చెరువు గట్టున కూర్చోబెట్టి కుంకుడు కాయ రసంతో తలరుద్ది స్నానం చేయించి ముఖానికి పసుపు రాసి బొట్టు పెట్టి మూసి వాయనం చేటను ఆవిడకు అందించి కాళ్లకు నమస్కరించాను. నా తరువాత కోడళ్లందరూ ఆమె తలస్నానం చేయించి, పసుపు రాసి, బొట్టు పెట్టి నమస్కరించారు. ఇదంతా చేయించుకున్నందుకు గాను ఆ పునిస్ర్తికి మూడువందల రూపాయలు ఇచ్చారు. కార్యక్రమం అంతా పూర్తయి తడిబట్టలతో కోడళ్లందరం ఇంటికి బయలుదేరాం. చేయి విపరీతంగా మండుతోంది. అదే మాట తోటికోడళ్లతో అంటే వారిదీ అదే పరిస్థితి. ఎందుకో ఎవరికీ ఒకపట్టాన అర్థం కాలేదు. చాలాసేపు ఆలోచించిన మీదట అప్పుడర్థమైంది - మిల్లులో కారం పట్టిన తర్వాత శుభ్రం చేయకుండా పసుపు ఆడించి ఉంటారని. ఎవరికి వారు మండుతున్న చేతుల్ని తడిగుడ్డతో తుడుచుకుంటూ నడుస్తున్నాం. ఇంతలో పసుపు రాయించుకున్న పునిస్ర్తి గుర్తుకొచ్చింది. పసుపు రాసిన మాకే ఇంత మంటగా ఉంటే, ఏడుగురు రాసిన పసుపుతో ఆ పెద్దావిడ ముఖం ఎంత మండిపోతోందో? అనిపించి బాధపడుతున్నాం. అది గుర్తుకురాగానే మా మనసు మనసులో లేదు. ఆవిడ గురించే ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాం. పాపం... పేదరికం ఎంతటి బాధనైనా భరిస్తుంది మరి!

- తెలికిచెర్ల విజయలక్ష్మి
బిలాస్‌పూర్, (చత్తీస్‌గఢ్), 09301421243

పుస్తక సమీక్ష

భావోద్వేగాల
‘మహోజ్వలం’!
పేజీలు: 68 - వెల: 75/-
ప్రతులకు:
కె.ఉజ్వల
ఇం.నం.2-10-841
జ్యోతినగర్
కరీంనగర్ - 505001
సెల్.నం.9395553393

తెలంగాణ కల సాకారమైన వేళ.. ఉద్యమ నేపథ్యంలో.. భావోద్వేగాలతో అక్షరాలనే ఆయుధాలుగా సంధించి.. మలిదశ పోరులో ఉడుతా భక్తితో ఉద్యమానికి ఊపిరులూదిన యువ కవి కొత్త అనిల్ కుమార్ ‘మహోజ్వలం’ పేరుతో ఓ కవితా సంపుటిని వెలువరించారు. ఉద్యమం నాటి ఉద్వేగభరితమైన ఘటనలను అక్షరబద్ధం చేశారు. తన కవిత్వం ద్వారా సామాజిక చైతన్యం కోసం.. సాహితీ వాహినిలో ఒక అక్షరమై ఈ నేల తల్లి రుణాన్ని తీర్చుకున్న ఆయన ఈ గ్రంథంలో ఉద్యమ కవిత్వానికి పెద్దపీట వేశారు. వౌనవీణ.. రతనాల వీణ.. పేర్లతో ఉద్యమ కవితా సంపుటాలను వెలువరించిన అనుభవమున్న ఆయన ‘వాన చినుకులు’ దీర్ఘ కవితను రాసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ‘మహోజ్వలం’ కవితా సంపుటిలో తెలంగాణ జీవితంలోని కష్టాలను అక్షరబద్ధం చేశారు. ఇక్కడి ప్రజల కడగండ్లను ఆర్ద్రంగా చిత్రించారు. చారెడు కన్నీళ్లకు, త్యాగానికి మారుపేరు తెలంగాణ తత్వమని తన కవిత్వం ద్వారా తేల్చిచెప్పారు. తెలంగాణ ఉద్యమానికీ, జీవితానికీ ఉన్న బంధాన్ని అక్షరాల్లో బంధించడానికి తన కలాన్ని సంధించారు.
తెలంగాణ తల్లికి జై అనడమంటే.. మనకు జన్మనిచ్చిన తల్లికి ప్రణమిల్లడమని భావించే కొత్త అనిల్ మొదటి కవితలోనే ధర్మపోరాటపు సంకల్పాన్ని పటిష్టవంతం చేసిన శబ్దాన్ని గుర్తుచేశారు. ఆయుధమంటే రక్తాన్ని చవిచూసి.. నరహత్యకు పాల్పడేది కాదనీ.. మానవ మస్తిష్కంలో విషభావాలు నిర్జీవింపజేసి.. నూతనోత్తేజాన్నిచ్చే ప్రతి పదం ఆయుధమేననీ.. అలా పదునెక్కి పదన తెప్పించే గొప్ప శక్తి నా తెలంగాణ అక్షరానికుందని స్వాభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ భాష ఆధిపత్య భాషకాదనీ.. ఆత్మీయ భాష అని వినమ్రంగా ప్రకటించిన కవి అనిల్ ‘మనపాట’ కవితలో తెలంగాణ పాట యొక్క ప్రాశస్త్యాన్ని చక్కగా ఆవిష్కరించారు.
ఆ పొడిసిన పొద్దును జూసి కూసిన తొలికోడి కూతలోంచి ఎరుపెక్కిన తూర్పును చూసి ఉరకలెత్తిన జనజీవనం నుంచి పుట్టింది తెలంగాణ పాట అని సగర్వంగా ప్రకటించారు. తెలంగాణ ఉద్యమకారుడు నిలబడితే శిఖరమనీ.. తలబడితే సముద్రమనీ.. కలబడితే ఉప్పెన అనీ.. కబళిస్తే సునామీ అనీ.. కలలో కూడా వాడికెదురు నిలబడాలనుకోకు అని మరో కవితలో హెచ్చరించారు.
‘గుట్ట’ కవితలో కవి యొక్క భావావేశాన్ని వీక్షిస్తాం! అలాగే ‘మంటల జెండాలైనయ్’ కవితలోనూ ఉడికిన నెత్తురు ఉరికి ఉరికొచ్చి అరచేతుల నిండి పిడికిలైందనీ.. మసిలిన రక్తం పొంగి పొంగి వచ్చి గుండెగిల నిండి నినాదమైందని ప్రకటించడాన్ని చూస్తాం!
‘మానుకోట కంకర్రాయి’ కవితలో.. మానుకోట రాయి దరువేసి ఎగిరిన తీరును చక్కగా చిత్రించారు. ‘పోలవరం’ కవితలో.. ‘ఖమ్మం అంటే నా తెలంగాణ తల్లికి ఎగిరే ఎర్రని పైటరా’ అని అభివర్ణించారు. దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయిన వేళ.. అరవై వసంతాలకు కాని దరి చేరని ఈ మధుర సంధ్యను తనివి తీరా ఆస్వాదిస్తానని ఇంకో కవితలో తమ ఆకాంక్షను వెల్లడించారు.
ఈ చల్లని ప్రశాంత వదనం దిగమింగిన వేదనలెన్నో..ఈ స్వేచ్ఛా వేకువ కోసం దివిగెగిసిన తారలెందరోనని అమరులను అక్షరాంజలి ఘటించారు! ఈ స్వరాజ్య పోరాటంలో బలైపోయిన ఉద్యమకారులను గుర్తు చేసుకుంటూ.. తెలంగాణ స్వరాష్ట్ర ఫలాలను అనుభవించకుండానే అసువులు బాసిన అమరులను ‘మహోదయం’ కవితలో నెమరువేసుకున్నారు. అరశతాబ్ది పోరుసలిపి అలిసిన ఈ మహారణ భూమిని.. ఇప్పుడిప్పుడే స్వేచ్ఛోదయ కిరణాలు సృజిస్తున్నాయని ‘స్వర్ణోదయం’ కవితలో వివరించారు. ఈ నేల చీకటి సంకెళ్లను తెంచాలన్న సంకల్పంతో పోరాడి గెలిచిన అమరులకు లక్ష దీపార్చనలను అక్షరాల్లో కూర్చిజోహార్లర్పించారు. క్షణ క్షణం ఈ పుడమిపై విద్యా కుసుమాలు పుప్పొడి శరాలు విసిరిన విద్యార్థి వీరులకు తెలంగాణ స్వరాజ్య ఫలితం అంకితమని ప్రకటించారు.
ఉరకలెత్తి ఉద్యమించిన కలాలు, గళాలు, మువ్వలు తెలంగాణ తల్లి మెడలో నగలా స్వర్ణ దరహాసాలు విరబూస్తున్నాయనీ.. తెలంగాణ వచ్చిందని సంబురపడుడు కాదనీ.. రేపటి మన స్వయం పాలనకు మనమే సైనికులం కావాలని పిలుపునిచ్చారు. చేయి చేయి కలిపి స్వయం పాలనలో నిత్య వసంతాలు నింపుటకై అందరం కదులుదామని నినదించారు. భోగభాగ్యాలు తెలంగాణను నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఇలా ఉద్యమ కవిత్వంతో పాటు.. ‘అద్దం’పై రాసిన కవితలో తమ సృజనను చాటుకున్నారు. అలాగే ఆత్మకథ, చెట్టు నేస్తం, ఉగాది కవితలు ఇందులో పొందుపరిచారు.
ఆదమరిచి యెద నాట్యమాడుతుంటే.. బాధ మరిచి మది పాట పాడుతుందనీ.. పది జిల్లాలు దశ దిశలా ఆనందపడుతుంటే.. ‘మహోజ్వలం’ పేరుతో మహోజ్వలమై వెలిగే తెలంగాణ పుడమిని కవి అనిల్ మన ముందు రేఖా మాత్రంగా ఈ గ్రంథంలో ఆవిష్కరింప యత్నించిన తీరు ప్రశంసనీయం! అయితే కవిత్వాంశ కోసం, శైలి, శిల్పం కోసం వెతకకుండా.. కవి యొక్క ఉద్యమ స్ఫూర్తిని ఈ నేలపై ఆయనకున్న అభిమానాన్ని పాఠకులు ఈ గ్రంథం ద్వారా గుర్తిస్తారన్న విశ్వాసం ఉంది!
- సాన్వి, కరీంనగర్, సెల్.నం.9440525544

మనోగీతికలు

హరిత విశ్వం
ఎన్ని యుగాలుగా
పచ్చని ప్రకృతి
విశ్వానికి మూలమై
నిలిచిందో!
ఎన్ని కాలాలుగా రుతు గమనాలు
పంచ భూతాలకు
గణాంకమై సాగాయో!
ఎన్ని యుగాలుగానో
నింగి, నేల వసంతకాలమై
యుగళ గీతాలాలపించెనో కదా!
ఎంత కాలంగానో
చినుకు చినుకు పెనవేసుకుని
ధారలై పుడమి
అణువణువు నిండుకుందో!
మబ్బుల్తో కమ్ముకున్న గగణం
హరితంతో నిండుకున్న భువనం
ఎంతకాలంగా అనుసంధానమై
సహవాసం చేసాయో కదా!
ఇంత అద్భుతమైన సృష్టిని
నీ వారసులకు లేకుండ చెయ్యాలని
పచ్చని ప్రకృతిని చిదమాలని,
మనుగడకు ఊపిరులైన
పర్యావరణాన్ని చంపాలని
ఎంతకాలంగా కక్షగట్టావో కదా!
మేధస్సుగల ఓ మనిషి..

- రామానుజం సుజాత
కరీంనగర్, సెల్.నం.9701149302

సముద్రం ఘనీభవించింది..!

అవును.. సముద్రం ఘనీభవించింది..!
గదిలో, మదిలో ప్రవహించాల్సిన ఒరవడిలో
విఫలమై..స్వప్న చంచలమై..
ఒక కారాగార నియంత చీకటి జైలులో
ఖననమై మిగిలిపోయింది!
సముద్రం ఘనీభవించింది..కిటికిలో నుండి
నేను రోజూ చూసే సముద్రమే!
హోరుమంటున్న దుఃఖపు
చినుకులను వర్షిస్తూ..
కాగితంపై సిరామరకల
జలపాతంలో దూకి
లుప్తమైపోయింది!
భూ మండలాన్ని చుట్టుకొన్న
నీలంరంగు అనకొండలా
జీవనోత్సవంలో శోభిల్లాల్సిన సముద్రం,
నేడు కలుషిత వ్యర్థాలతో,
ముసిరిన రసాయనిక మేఘాలతో..
ఎగిసే పెట్రోల్ బావుల అగ్నికీలలతో,
జ్వలించే గ్యాస్ లైన్ పైపులతో అది
భళ్లున పగిలే నిప్పుల సునామీలా,
నేడు భూమండలాన్ని మింగబోతున్న
ఒక రాకాసిబిలం!
గూడ తెగిన చెప్పువోలే
ఊడ్చి పడేసిన చీపురుకట్టలా
ఏటేటా ముప్పేటలా డ్రైనేజీ ప్లాస్టిక్ వ్యర్థాలను
బడబాగ్నిలా కడుపులో దాచుకుంటున్న
ముదురు నీలం రంగు నీటిపాయ
నేడు పిప్పిలాంటి నిరర్థక
జీవన సారంలా మారి..

- బి.కళాగోపాల్
నిజామాబాద్
సెల్.నం.9441631029
అస్తమిస్తున్న పడమటి సూరీడు సాక్షిగా..
తడిలేని ఇసుక తుఫానులో..
తడారిన నా కంటి చెలిమెలో..
నేడు సముద్రం ఘనీభవించింది..!

ఇంకేముంది?
చట్టం తన పని తాను చేసుకుపోతుందని
కట్టు కథల మాటలు విని విని
విసుగొచ్చింది
తన పనిపై తాను జెండా ఎగిరిస్తే
ఈ నీలినీడలెందుకు?
నేరస్తులెందుకూ?
శ్రేయోరాజ్యం-వెనె్నల రాజ్యం,
వెలుగు రాజ్యం
అలా ప్రక్కనుంచుదాం!
ఈ కన్నీటి రాజ్యం సంగతెందుకూ?
చట్టం తన పని తాను చేసుకుపోతుంటే..
నేరస్తులు తగ్గారా? పెరిగారా?
కాలు జారిన వాడు కన్నీటిలో పడాలి
కనకం సింహాసనం మీద
కాళ్లుజూపాడెందుకు?
బురద తొక్కినవాడు చెరువులో మునుగాలి
చెమట బట్టలకు రుద్దుతున్నాడెందుకు?
చీకటి పనుల మురికి మనిషి
ఉదయానికి జెండా ఎత్తటమేమిటి?
ప్రశ్నించేవాన్ని నేరస్తున్ని చేస్తే
ఇంకేముంది?
దొంగ పారిపోతున్నాడు!
దొంగను దొంగ పట్టుకోలేడు!
అరుపు దండుగ!

- సిహెచ్.మధు
నిజామాబాద్, సెల్.నం.9949486122

పువ్వును చూసి..
ఒక్కసారి
పువ్వును మనసు పెట్టి చూడు..
రాలిపోతున్నా..
దాని మోములో దిగులు కనిపించదు!
కుత్తుక తెంచి... సూదులు గుచ్చినా..
నవ్వును వీడక మందహాసంతో మురిపిస్తుంది!
కానీ... మనుష్యులమైన మనం
చిన్న బాధకే..
కుమిలి కుమిలి జీవశ్చవాల్లా మారుతాం!
ఇకనైనా.. పువ్వును చూసి..
బాధల్ని దిగమింగడం నేర్చుకుందాం మరి!

- చెన్నమనేని ప్రేమసాగర్ రావు
కరీంనగర్, సెల్.నం.9912118554

గజల్ మహిమ!
సహారా ఎడారైతేనేమి?
పెను తుఫానైతే నేమి?
ఎదిగే మొక్క పెరగకుంటుందా
దాని లక్షణం వికసించడమే
తోటలోనే వాడిపోతే గులాబీలకేమందం?
గుడిలోనో.. జడలోనో వుంటేనే అందం!
బురద ఎంత జిమ్మినగానీ మణికి వనె్నతగ్గలేదే!
పరద ఎంత వేసిన గానీ వరద ప్రేమ ఆగలేదే!

- డాక్టర్ జి.నర్సన్, వేములవాడ
సెల్.నం.9247303236

ఓ.. రేరుూ!
వంకర కాళ్ల నులక మంచాన్ని
వాకిట్లోన పరిచాను
సేద తీరుదామని
వచ్చి అలా ఒరిగాను
మబ్బు చాటు నెలవంక
తొంగి చూసెను నావంక
రూపు మారే మేఘాలు
సాగిపోయెను మునుముందుకు
తెగి పడేటి తోక చుక్కలు
వచ్చి పోయేటి విమానాలు
విశ్వాంతరాళంలో
విహరిస్తున్న ఆనందం!
బుడి బుడి అడుగులు వేస్తూ
బిర బిర పరుగులు తీస్తూ
ఇల్లంతా అల్లరి చేస్తూ
మాటిమాటికి మారాం చేసే
మా అబ్బాయికి
చందమామను చూపిస్తూ
వెండి గినె్నలో వెన్న ముద్దతో
గోరుముద్దలు పెట్టాలి
వెనె్నల లేక వనె్నలు లేక
పరిమళాలను పంచలేక
ఎండవేడికి తాళలేక..
రాతిరి కోసం ఎదురు చూస్తూ..
శశి కాంతిలో వికసించాలని
చందమామతో సరసమాడాలని
ఆకాంక్షిస్తూ ఎదురు చూస్తూ
కలువపూలకై..
పక్షులు పాడేటి జోలపాటకై..
నిరీక్షిస్తున్నా!
ఓ రేరుూ!
మాకై తీసుకు రావా చల్లని హాయి!

- ఎం.్భక్షపతి నాయక్, లెక్షెట్టిపేట, ఆదిలాబాద్ జిల్లా, సెల్.నం.9492540770

ఏదీ నా ‘సిరి’?
వెనె్నల చినుకులు
వేసవిలో వేల్పులా..
కురిపించినా..
కనిపించడం లేదు నా ‘సిరి’!
ఏ మబ్బుచాటున
దాక్కున్నదో కదా!
ఏడని వెతికేది?
నేలపై అమావాస్య వచ్చినటుల
చీకట్లు పరుచుకున్నాయిప్పుడు!
గాఢతనపు నలుపు తొలిగాక..
‘సిరి’ కోసం గగనమంతా గాలించ
ఆకాశయానం చేయనా?
ఓ నువ్వు దివ్వెవై కదిలొస్తావనీ..
మువ్వవై సవ్వడి చేస్తావనీ
చిరునవ్వులు పంచుతావనీ
ఇలాగే నీ కోసం నిరీక్షించనా?

- కూర్మాచలం వెంకటేశ్వర్లు
కరీంనగర్
సెల్.నం.7702261031

ఒక్కో చుక్కను..
ఒక్కో నీటిచుక్కను.. ఒడిసి పట్టు!
నేల తల్లికి ప్రణమిల్లి..
గంగమ్మను దాచుకొమ్మని
విన్నవించు!
జలధారలన్నీ.. ఫలధారలేననీ..
అవే మన ‘ఆయువుపట్టు’ అని తెలుసుకో!
కుప్పలు తెప్పలుగా కురిసే
నీటి బొట్టును..
పదిలంగా రక్షించు!
ఇంకుడు గుంతలకు మళ్లించి..
నీటి యుద్ధాలను నివారించు!

- హన్మాండ్ల రమాదేవి
బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా
సెల్.నం.9959835745

మేలుకొలుపు
ఒక ఉదయం..
ఎన్నో ప్రాణులకు ఉషోదయం..
ఒక ఆలోచన..
ఎందరో లక్ష్యాలకు మార్గదర్శకం!
ఒక మంచి కార్యం..
ఎన్నో అవకాశాలకు ఆలంబనం!
ఒక రాత్రి..
ఎన్నో ప్రాణులకు వెలుగులు!
ఒక నిశీధి వెలుగులలో
ఎన్నింటికో మేలుకొలుపు!

- గుండు రమణయ్య గౌడ్
పెద్దాపూర్, కరీంనగర్ జిల్లా
సెల్.నం.9440642809

కృష్ణతత్వం!
యశోదమ్మ గారాబాల ముద్దులను
తన ముద్దుచేష్టలతో మురిపిస్తాడు..
వెన్నదొంగలా.. వెన్న ముద్దలు తింటూ..
వెన్నపూసలా కరుగుతాడు!
రాగాలు తీస్తూ.. అనురాగాలతో
అలరిస్తాడు!
మురళీ గానాలతో..ముచ్చటగా
మురిపాలు కురిపిస్తాడు!
గోపికల తలపులలో తళుక్కున మెరిసి
తాదాత్మ్యం చెందిస్తాడు!
గోపరుల ఆపదలను
గోటిలెక్కన తీరుస్తాడు..
యశోదమ్మను ఆటపట్టిస్తూనే..
నోటిలో భూఃన భోనాంతరాలను చూపిస్తాడు!
తనపై మనసుపడ్డ గోపికల మదిని
మధురంగా మీటుతాడు..
జగతినంతా రాధామయంగా మలిచి..
రసరమ్యంగా తన్మయుడవుతాడు..
జగతినేలెందుకు..
జగన్నాథుడై.. వేంచేస్తాడు!

- పోపూరి మాధవీలత
హైదరాబాద్, సెల్.నం.8125175667

నగర జీవనం!
జనంతో పూటెక్కిన రోడ్లపై
అడుగు తీసి అడుగేయాలన్నా
కష్టించి క్రాస్ చేయాలన్నా
గిన్నీస్‌కి ఎక్కడానికి చేసే
నిరంతర సాధనే!
అడుగడుక్కీ అడ్డుపడే సిగ్నల్స్‌తో
వచ్చిపడుతున్న అంతరాయాలకు
మనోసంద్రమంతా అతలాకుతలం!
ఆగినట్లే ఆగుతూ పరుగులు తీసే
బస్సులకై పడిగపులు!
ఊపిరిసలపక
ఫుట్‌పాత్‌లపై వ్రేలాడే
అభాగ్యులకే ముప్పు
ఎటు నుంచి పొంచి చూస్తుందో
అంజనం వేసినా అంతుబట్టని
దౌర్భాగ్యకర భయంకర దృశ్యాలు!
వెహికిల్స్ చూస్తే
చీమలబారులే తలంపుకొస్తాయి
అయితే..
వాటిలోని క్రమశిక్షణ
భూతద్దంతో చూసినా వీటిలో కన్పడదు
కారణం..
‘వేగం కన్నా ప్రాణం మిన్న’ అనే సూక్తిని
మూటగట్టి మూసీనదిలో పారేయడమే!
విద్యా పరిమళాలు
వెదజల్లే మాటటుంచి
నిత్యం వాడిపోతున్న శిశుకుసుమాలే
దారిపోడవునా దర్శనమిస్తాయి!
ఓ పక్క నాణ్యతలోపం
మరో పక్క డబ్బంతా మంచినీళ్లప్రాయం!
దినదినగండం దీర్ఘాయుష్షు
నగర జీవనం నానాటికీ దుర్భరం!!

- కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం
జగిత్యాల, సెల్.నం.9492457262

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net
నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com
email : merupuknr@andhrabhoomi.net

- ఆచార్య కడారు వీరారెడ్డి