రాజమండ్రి

డబ్బుకు లోకం దాసోహం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెన్నీ ఐ లవ్ యు రా! నీవు లేకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను తెలుసా! చేతుల్లోకి ఆమె మోము తీసుకుని నుదుటిపై చుంబించాడు రాహుల్. అతని వంక ఉదాసీనంగా చూస్తోంది జెన్నీఫర్.
‘ఏం మాట్లాడవేం! నీ బాధ నాతో షేర్ చేసుకో రాదా?
నేనేమన్నా పరాయివాడినా! త్వరలోనే గదా! మనం పెళ్లి చేసుకునేది! రాహుల్ ముఖంలో లాలన.
‘అబ్బే అదేంలేదు పొడిపొడిగా అంది.
డబ్బు, డబ్బు, డబ్బు, ఈ డబ్బు ఎటువంటి వారినైనా విడదీస్తుంది. చులకన చేస్తుంది. హత్యజేయిస్తుంది. అన్యాయాలు, అక్రమాలు ఒకటేమిటి? డబ్బుకు విపరీతమైన శక్తి ఉంది. ఆమె జీవితాన్ని చదువుకుంది. తండ్రికి పక్షవాతం, అమ్మకు స్థూలకాయం. ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్మునికీ తను అక్క. పాత సినిమాల్లో ఉన్న కష్టాలన్నీ తనకున్నాయి. ప్రతినెలా జీతం కోసం ఎదురుచూపు. ఇంకా కష్టపడదామన్నా లేని ఉద్యోగాలు. రాత్రుళ్లు పార్ట్‌టైమ్ చేద్దామంటే ఒకటి రెండుసార్లు రోడ్లపై తాగుబోతు వేధింపులు. తండ్రి అసహాయత, తమ్ముడు బాల్యం, ఇంటికి మగవాళ్లే అయినా తనను, తన కుటుంబాన్ని కాపాడలేకపోతున్నారు. అందుకే మానుకుంది. ఇప్పుడు ఈ రాహుల్ నవ మన్మధుడేంగాదు. తనకు అతను లేకపోతే బ్రతకలేనంత ప్రేమ లేదు. అలా అని ఎప్పుడూ చెప్పలేదు. మరి అతనికి కూడా మాటల్లో ఉన్నంత ప్రేమ మనసులో లేదని అనుమానం తనకు.
‘ఏయ్! జెన్నీ ఏంటి ఆలోచిస్తున్నావ్’
‘మరేం లేదు రాహుల్ అంది మెడలో క్రాస్‌ని తిప్పుతూ’
‘డబ్బేమన్నా కావాలా! ప్రేమగా ముంగురులు సవరిస్తూ అన్నాడు.
‘అహహ! అది కాదు అంది జెన్నీ’
‘లేదురా! మనం ఒకరికొకరం తోడుగా ఉండాలి, ఎంతోకొంత పంచుకోనీ నన్ను కూడా
మాటల్లోనే ఇద్దరూ జెన్నీ ఇంటి దగ్గరకొచ్చారు.
‘అక్కా! డబ్బు తెచ్చావా! మిగిలిన పదివేలు కట్టనిదే కాలేజ్‌కి రావద్దంటున్నారు సార్! ఏడస్తూ అంది జెస్సీ
‘ఏయ్ ఇంత చిన్న విషయం నాకెందుకు చెప్పలేదు. అదే నాకు అవసరమైతే నువ్వివ్వవా!
‘లేదు రాహుల్ నేనేదో ఏర్పాటుచేస్తాను’ అని కాళ్లు కడుక్కుని లోనికెళ్లింది.
క్షణంలో రాహుల్ బయటకు వెళ్లి పదివేలు డ్రా చేసుకొచ్చి వద్దంటున్నా వినకుండా ఇచ్చాడు.
రేపు ఫీజు కట్టమని చెప్పి వెళ్లిపోయాడు.
తనకు తెలుసు ఈ రాహుల్ దగ్గర వాడేంకాదు.
తనకు సాయం చేస్తే వాళ్లలో కొంత చొరవ, చనువు చూపించ తామరాకుపై నీటిబొట్టులా ఉంటాడు. జెన్నీకి కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలున్నాయి. ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకోవాలంటే అప్పైనా సరే అర్హత ఉండాలనుకుంటుంది. అవే తన చెల్లెళ్లు, తమ్ముడికి పాఠాలుగా బోధిస్తుంది.
ఇప్పుడు అతనిచ్చిన డబ్బు ఆమెకు సంతోషాన్నివ్వలేదు. ఏ బంధం లేకుండా తన మనసు అంగీకరించడంలేదు. అసలు తనది, అతనిది ప్రేమో, కాదో తనే తేల్చుకోలేకపోతుంది తను. భారంగా కళ్లు మూసుకుని తర్వాత కలత నిదురపోయింది జెన్నీ.

ఇంటికి వచ్చిన రాహుల్‌కి నిద్ర పట్టడంలేదు. తనకు పాకెట్ మనీగా ఇచ్చిన డబ్బును తను ఎమోషనల్ అయి జెన్నీ చెల్లికి ఇచ్చాడు. జెన్నీ ఇంప్రెషన్ సంపాదించాలని, ఆమె తీసుకోకుండా రిటన్ చేస్తుందని, అప్పనంగా కీర్తి సంపాదించాలని వేసి ప్లాను ఈవిధంగా బెడిసికొట్టింది. రేపు తను రిటన్ చేయకపోతే తన గతేంకాను. ఈ నెలంతా ఎలా గడపాలి? నిద్ర పట్టడంలేదు. మరునాడు 12 గంటలకు వెళ్లాడు.
‘రాహుల్ గారూ థ్యాంక్సండి. మీ వలన నేను టైమ్‌కి ఫీజు కట్టగలిగాను’ నవ్వుతూ అంది జెస్సీ.
రాహుల్ గుండెలో రాయిపడింది. ఛీఛీ అమ్మాయిలు ఎంత నిస్సిగ్గుగా తీసుకుంటారు. తను ఇస్తే తీసుకోవడమేనా! రిటన్ చేయవద్దు. ఇన్ని రోజులుగా అతనికి ఆకాశమంత ఎత్తుకి ఎదిగిన జెన్నీ చాలా మరుగుజ్జుగా, చులకనగా, ఇష్టంలేని దానిలా అనిపిస్తుంది. ఈ ఆడవాళ్లు డబ్బు కోసం వెంట పడతారనే తండ్రి, తల్లి మాటలు గుర్తుకొచ్చాయి.
మరి తను ప్రేమిస్తున్నాడా! లేదా! మరితను జెన్నీని ముద్దు పెట్టుకుంటాడు. ఐ లవ్ యు చెప్తాడు. మరి ఇదంతా ఇన్‌ఫాచ్యుయేషన్. వయసులో ఉన్న వారికి మధ్య కలిగే ఆకర్షణ అంతే. తనేంటి ఇంత పిచ్చిగా డబ్బులిచ్చేశాడు. అయినా డబ్బును ఆశపడితే అది ప్రేమేకాదు. తనేం హీరో కాడు. ఈమె వళ్లో డబ్బులు పోసి ఉద్ధరించడానికి. ఈ ఆడవాళ్లంతా తమ అందాన్ని ఎరగా వాడి తనలాంటి వాళ్లని మెస్మరైజ్ చేస్తారు.
నిజంగా జెన్నీ తనను అలా చేసిందా! చేసే ఉంటుంది. ఇన్నాళ్లు దాచుకుని ఇప్పటికి బయటపడింది. నేనే ఇచ్చేలాగా, తను అడగనే అడగకుండా బెట్టుగా లాక్కోనిచ్చింది. తను ‘కో’ అంటే కోటిమంది అమ్మాయిలు వస్తారు. ఇలా ఖర్చు పెడుతూ పోతే తన ఆస్తిపాస్తులన్నీ ఇలాగే కరిగిపోతాయి. ఇక ఈమెతో బంధం కట్ చేయాలి. అందందేముంది? పదిరోజులు కలసి ఉంటే కుక్క పిల్లపైనైనా ప్రేమ పుడుతుందని నానే్న అంటాడు. ఇక ఈ విష వలయం నుండి బయటపడాలి. ‘ఏదో సాకు జెప్పి ఆ డబ్బు కూడా తీసుకోవాలి’ ఆలోచిస్తూ ముందుకు నడుస్తున్నాడు.
ఎదురుగా జెన్నీ చకచకా నడుస్తూ ఎదురైంది.
ఆమె ముఖంలో నిన్నటి దైన్యంలేదు. ఎంతో చురుకుగా, చలాకీగా ఉంది. పొడవాటి జడ చురుకుగా కదులుతుంది. కళ్లు మెరుస్తున్నాయి.
కనుబొమ్మలు నాట్యం చేస్తున్నాయి. ఇదేమిటి? తాను ఎందుకు వివశుడౌతున్నాడు. పదివేలు తీసుకుంది ఇక ఇలాగే దివాళా తీయిస్తుంది. రాహుల్ సీరియస్‌గా ఇంటికి వెళ్లే వస్తున్నాను అన్నాడు.
‘సో! సారీ!రాహుల్ పద కాఫీ ఇస్తాను’
‘అవసరం లేదు’ కఠోరంగా అన్నాడు.
జెన్నీ అనుకుంటుంది. ఇదంతా తనపై ప్రేమ. తను సమయానికి లేనందుకు అలుగుతున్నాడు. నిజంగానే మగవాళ్లని గూర్చి తాను తప్పుడు అభిప్రాయానికి వచ్చానని అనుకుంది. ఆమె దృష్టిలో రాహుల్ హిమపన్నాగంలా ఎదిగిపోతున్నాడు. చెయ్యి పట్టుకుని ఇంటికి దెచ్చి కూర్చోబెట్టింది. లోనకి వెళ్లి కాఫీ దెచ్చి ఇచ్చింది. ఇన్నిరోజులుగా ఆమె చేతి కాఫీ అమృతంలా ఉండి ఇప్పుడే విషంలా మారినట్లనిపించింది రాహుల్‌కి.
ఎలాగో గటగటా త్రాగేశాడు. ఇక బయల్దేరతాను
కందగడ్డలా మొహం పెట్టి అన్నాడు.
‘జస్ట్ మినిట్ రాహుల్’ ఆమె లోనికి వెళ్లి కవరు తెచ్చి ఇచ్చింది.
‘ఇ.. ఇదేమిటి?’ ప్రశ్నార్థకంగా చూశాడు.
‘రాహుల్! నేను నీకు చెప్పనేలేదు కదా! పోస్టల్ ఆర్‌డి క్లోజ్ చేశాను. అవసరానికి ఆదుకోవడానికే గదా ఈ సేవింగ్స్ కళకళలాడుతున్న మొహంతో పచ్చి దానిమ్మ గింజల నవ్వుతో చెప్పింది జెన్నీ.
హఠాత్తుగా అతని దృష్టి ఆమె చేతులపైబడింది. ఎప్పుడూ మెరుస్తూ ఉండే బేంగిల్ ఆమె చేతికి లేదు. అవును తను ఆ గాజు అమ్మేసుంటుంది. లేదా తాకట్టు పెట్టుంటుంది.
ఛీఛీ తను ఎంత చులకనగా చూశాడామెను. ఆ విష బీజం తన గుండెల్లో వట వృక్షమై ఎంత వికృత రూపం దాల్చింది. సరిగా కవరు పట్టుకోలేక టేబుల్‌పై విడిచిన కవరును జెస్సీ అతని జేబులో పెట్టింది. థ్యాంక్యూ! అని మళ్లీ మనసారా చెబుతున్న ఆత్మాభిమానం గల అక్కాచెల్లెళ్లను జూస్తూ డబ్బు ఎంత పాపిష్టిది అని చర్చికి వెళ్లి జీసస్ వద్ద మోకరిల్లి తన పాపాలను క్షమించమని వేడుకున్నాడు రాహుల్.

- సుధా శశిరేఖ, సెల్: 9441599321

మనోగీతికలు

ఆ మూలగది
దేశమాత స్వేచ్ఛకై
రగిలి పొగిలి జ్వలించి, తపించి,
దేశభక్తిని నరనరాన్న నింపుకొని
మండే సూర్యునిలా, సెల్యులార్ జైల్లో
ఆ మూలగదిలో
విప్లవాగ్నిని బంధించిన
బ్రిటీష్ దమన నీతిని ఎదిరించిన యువకుడా?
గోనె సంచులే దుస్తులుగా,
ఇనుప మూకిట్లో, కిలుమెక్కిన
పురుగుల అన్నాన్ని తింటూ,
మట్టి మూత్ర పాత్రల దుర్వాసన భరిస్తూ, సహిస్తూ
బలవుతున్న సోదరుల ఆత్మాహుతిని చూస్తూ,
వెరవక, దడవక, అదరక, బెదరక
మిగిలిన వారిలో స్ఫూర్తి రగిలిస్తూ, జ్వలిస్తూ
ఆ మూలగదిలో
వేవేల స్ఫూర్తి గీతాలు పాడుతూ, పాడిస్తూ
ఇనుప గొలుసుల అలంకారాలు
కొరడా దెబ్బల బహుమతులతో,
ఎర్రని రక్తాన్ని, స్వేదంగా మలచుకొని
జాతి గుండెకు స్వేచ్ఛావాయువునందివ్వాలని
తపిస్తూ, కదలిస్తూ, నినదిస్తూ,
‘వందేమాతర’ మంత్రం లక్షలమార్లు జపిస్తూ
నీడలా, తోడులా, పక్కనే ఘోషించే
కడలి హోరులా, దేశభక్తితో జ్వలించేను!
ఆ మూలగది నిండా! సాహస వీరుని శ్వాసయే!
నేటికీ పరిమళించేను
క్రూరశిక్షలకు చేతుల్లో బొబ్బలు
చేతల్లో దేశ స్వేచ్ఛకై తూటల్లాంటి క్రియలు
ప్రతిరోజూ ఉరి కొయ్యికి వేలాడే
సోదరుల పెదవుల కదిలే వందేమాతర స్ఫూర్తినందుకొంటూ
నిర్భయంగా పాతికేళ్ల జీవితం ఆ మూలగదిలో
భరతమాత స్వేచ్ఛకై అనవరతం తపించిన మహాత్ముడా?
ఆ గది నాటికి, ఏ నాటికీ పదుగురికి
స్ఫూర్తినింపే ధ్యానమందిరమే

- యు.శైలజ, రాజమహేంద్రవరం
సెల్: 9440247596

జయహో భారత్
వ్యాపారం ముసుగులో చీమల దండులా వలస వచ్చి
అపార సంపదను దోచుకుని, విశాల భరతావనిని
దురాక్రమించి, నిరంకుశ పాలన జరిపిన తెల్లవారిని
ఉరిమిచూసి తరిమి తరిమి కొట్టిన బాపూజీకిదే మా జోహార్!

కల్లాకపటం లేని ప్రజల చల్లని బ్రతుకును తల్లడిల్లచేసి
తల్లి భారతిని కుళ్లబొడిచిన నల్లమనసు తెల్లవారిగుండెలు
గుభిల్లుమనిపించి పలాయన మంత్రం పఠింప చేసిన
అగణిత అరివీర అహింసాయోధులకు ఇవే మా జోతలు!

ఆనాటి ఎర్రకోట బురుజుపై త్రివర్ణ పతాక రెపరెపలు
అనంతకోటి ప్రజల సువర్ణ హృదయానంద డోలికలు
ఈనాడు మనమాస్వాదించే అమృత స్వాతంత్ర వీచికలు
సకల దేశాలకు వేద సుధను పంచిన మహాక్షర తూలికలు!

అప్రతిహతముగా ప్రగతిపథాన పురోగమించి
ఆగామితరాలకి పదిలంగా అందించే స్వర్ణమాలికలు!
జయహో భారత్! విజయహో భారత్!

- చాగంటి సుబ్రహ్మణ్యం, అనపర్తి, ఫోన్: 9573386124

email: merupurjy@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా.
email: merupurjy@andhrabhoomi.net

- సుధా శశిరేఖ