విశాఖపట్నం

మెరుపు విశాఖపట్టణం : ఓ తండ్రి కథ - కథానిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోహన్ చిన్నప్పటి నుండీ చురుకైన కుర్రాడు. ఆటపాటల్లోనే కాదు చదువులోనూ నెంబర్ వన్ స్టూడెంట్‌గా ఉండేవాడు. ‘‘మీ కుర్రాడు మంచి తెలివైన వాడోయ్, కాస్త కష్టమైనా పెద్ద చదువులు చదివించు పెరిగి పెద్దయిన తరువాత మంచి స్థాయిలో ఉండి నీకూ నీ కుటుంబానికీ, ఈ ఊరికీ గొప్ప పేరు తెస్తాడు మీవాడు’’ అని అంటుండేవారు స్కూల్ టీచర్స్ మోహన్ తండ్రి అప్పారావుతో. అప్పారావు ఆటో డ్రైవర్. బ్యాంకు లోన్‌తో ఆటో కొనుక్కుని సొంతంగా ఆటో నడుపుకుంటూ జీవించేవాడు. మోహన్ తల్లి శారదకు బ్రాండెక్స్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా ఉద్యోగమొచ్చింది. నెలకు ఆరువేలు జీతం. మోహన్ అయిదవ తరగతి పాసయ్యాడు. ఎక్కడా కోచింగ్‌కి వెళ్లకుండానే మోహన్ నవోదయ స్కూల్‌లో సీటు సంపాదించుకున్నాడు. రోజులు గడిచాయి. అప్పారావు రెట్టించిన ఉత్సాహంతో కష్టపడి పనిచేసేవాడు. అతనికి భార్య శారద తోడు కూడా కలిసిరావడంతో ఆటో డ్రైవర్ నుండి పది ఆటోల ఓనరయ్యాడు. అతని దగ్గర పది పదిహేను మంది ఆటో డ్రైవర్లు డైలీ వేజెస్ కింద పనిచేసేవారు. మోహన్ నవోదయ చదువు పూర్తయింది. ఎపి రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీలో చదువుదువు గాని ఎంట్రన్స్ రాయమని ఎందరు ఎన్ని చెప్పినా వినకుండా ‘‘లేదు నేను ఫలానా విద్యా సంస్థలోనే చదువుతాను అక్కడయితే గణితం బేషుగ్గా ఉంటుంది. ఐఐటి తప్పకుండా కొట్టేయగలను’’ అని మంకుపట్టు పట్టాడు మోహన్. కొడుకు కోరిక కాదనలేక తన తలకు మించిన భారమైనా ఆ సంస్థలోనే ఇంటర్ చదివించాడు అప్పారావు. పిల్లాడి చదువుకి, కాలేజీ ఫీజుకి, పుస్తకాలకి, హాస్టల్‌కి డబ్బులు కట్టడానికి అప్పారావు అప్పులు చేయడం మొదలుపెట్టాడు. చదువుతూ మోహన్ బాగా ఖర్చు చేయడం, వీకెండ్‌లో సినిమాలకి వెళ్లడం, షికార్లు చేస్తుండడంవల్ల పాకెట్ మనీయే ఎక్కువ భారమయ్యేది అప్పారావుకి. మోహన్ ఇంటర్ పూర్తయ్యేసరికి అప్పారావు మూడు ఆటోలు అమ్ముకోవలసి వచ్చింది.
కాల చక్రము గిర్రున తిరుగుతోంది, మోహన్‌కి అందరూ అనుకున్నట్టే ఖరగ్‌పూర్ ఐఐటిలో సీటొచ్చింది. తండ్రి ప్రోత్సాహంతో మెకానికల్ ట్రేడ్ తీసుకున్నాడు మోహన్. ఐఐటిలో ఫ్రీ ఎడ్యుకేషన్ అన్న మాటే గాని ఏ కార్పొరేట్ సంస్థకూ తగ్గదన్నట్టు ఖర్చయ్యేది అప్పారావుకి కొడుకు కింద. మోహన్ ఐఐటి పూర్తయ్యేసరికి అప్పారావు మరో అయిదు ఆటోలు అమ్మేశాడు. ‘‘నాను చెబితే విన్నావు కావు మనకున్న పది ఆటోల్లో ఎనిమిది అమ్మేశావు. మిగిలిన రెండు ఆటోల్లో ఒకటి పాడైపోయింది. మరొకటి నీకు మొట్టమొదటి ఆటో కాబట్టి సెంటిమెంట్‌తో ఉంచుకున్నావు... ఇదిగో పెనిమిటీ నువ్వు తప్పు చేస్తున్నావనిపిస్తోంది. ఎందుకంటే మనకున్న ఈ ఇందిరమ్మ ఇల్లు, ఆ రెండు ఆటోలు తప్ప మరేమీ లేదు. అప్పులూ పలకవు ఇప్పటికైనా మేల్కొని ఆడి సదువు అయింది కాబట్టి ఏదైనా ఉద్యోగానికి పొమ్మను మన పరిస్థితి కుదుటపడుతుంది’’ అని పోరుపెడుతుండేది శారద భర్త అప్పారావుతో. కొడుకు భవిష్యత్ బాగుండాలనే ఉద్దేశ్యంతోనే ఢిల్లీలో మంచి పేరున్న కోచింగ్ సెంటర్లో చేర్పించి, సివిల్స్ కోచింగ్ ఇప్పించాడు అప్పారావు. లక్షలు ఖర్చు చేశాడు గానీ మోహన్ మొదటిసారి పరీక్షల్లో పాసవలేదు. కలెక్టర్ కాలేకపోయాడు. అయినా పట్టు వదలకుండా కొడుకు మీదున్న ప్రేమతో మరికొన్ని లక్షలు ఖర్చు చేసి సివిల్స్ కోచింగ్‌లోనే రెండు మూడు సంవత్సరాలు ఉంచాడు మోహన్ని అప్పారావు. మూడో ప్రయత్నంలో మోహన్ సివిల్స్‌లో టాపర్ అయ్యాడు. కర్ణాటకలో జాయింట్ కలెక్టర్‌గా పోస్టింగ్ వచ్చింది. బెంగుళూరులో ట్రైనింగ్ కలెక్టర్‌గా జాయినయ్యాడు. అప్పారావు ఊర్లో సంబరాలు చేశాడు. ఊర్లో వాళ్లతో పాటు బంధుమిత్రులందరినీ పిలిచి విందు ఏర్పాట్లు చేశాడు. మోహన్‌కి చదువు చెప్పిన ఉపాధ్యాయులందరినీ స్వయంగా కలిసి కృతజ్ఞతలు చెప్పాడు. గురు దక్షిణ అంటూ తన తాహతుకు తగ్గ బహుమతులు ఇచ్చి ధన్యవాదాలు తెల్పాడు అప్పారావు. మోహన్ ట్రైనింగ్ పూర్తయింది. కర్ణాటకలో ఒక జిల్లాకి జాయింట్ కలెక్టర్‌గా ఉద్యోగంలో చేరాడు. కోచింగ్‌లు, పరీక్షలు, ట్రైనింగ్‌లు, ఉద్యోగాలు పేరిట మోహన్ చాలా బిజీగా ఉండడంతో సుమారు ఐదు సంవత్సరాల పాటు తన తల్లిదండ్రులను చూడడానికే రాలేదు మోహన్. కొడుకు ఉద్యోగంలో చేరాడు. సెలవు తీసుకొని పది రోజులైనా మన ఊర్లో ఉంటాడని ప్రకటించుకున్న అప్పారావు ఆశలు అడియాశలుగానే మిగిలాయి. మోహన్ పుట్టిన ఊరు రాలేదు. ట్రైనింగ్‌లో పరిచయమైన అపర్ణ అనే సివిల్స్ టాపర్‌ని పెళ్లి చేసుకున్నాడు మోహన్. అపర్ణని ఒప్పంచి తల్లిదండ్రుల్ని చూడడానికి మొక్కుబడిగా ఊరు వచ్చాడు మోహన్. చెప్పా చెయ్యకుండా పెళ్లి చేసుకున్న కొడుకు మీద కోపం పడలేదు అప్పారావు. ‘‘పెద్ద ఉద్యోగి కదా! వాడికి ఏది మంచో, ఏది చెడో తెలుసుకదా అందుకే వాడిని ఏమీ అనలేను’’ అంటూ బంధుమిత్రులకు సమాధానమిచ్చేవాడు అప్పారావు.
శారద మాత్రం కొడుకు తమని మోసం చేస్తున్నాడు, నిర్లక్ష్యం చేస్తున్నాడని గ్రహించి గంభీరంగా ఉండిపోయేది గానీ కొడుకుపై ప్రేమవల్ల ఏమీ అనేది కాదు. మొక్కుబడిగా పొడిపొడిగా మాట్లాడుతూ కేవలం రెండంటే రెండు రోజులే ఉండి కర్ణాటక వెళ్లిపోయాడు మోహన్ భార్యని తీసుకుని. కాలగర్భంలో కొన్నాళ్లు గడిచిపోయాయి. మోహన్ తల్లిదండ్రులకు నెలకు పదివేల రూపాయలు మాత్రమే పంపేవాడు. ‘‘ఇక ఆటోలు గీటోలు అంటూ నా పరువు తీయకండి, ఇల్లు ఉంది, నేను పదివేలు పంపుతున్నాను, ఇక మిగతా జీవితాన్ని హాయిగా గడిపేయండి’’ అంటూ ఒకరోజు ఫోన్ చేశాడు మోహన్ తండ్రికి.
‘‘అమ్మకు బాగా సుస్తీ చేసింది బ్రాండెక్స్‌లో పని చేయడం వల్ల దారం పోగుల ధూళి, దుమ్మి గుండెల్లో చేరి ఆమెకు టీబీ సోకినట్లు డాక్టర్లు చెప్పారు. నువ్వు వచ్చి చూసిపో నాయినా, మాకున్నది నువ్వు ఒక్కడివే కదా!’’ అని అప్పారావు ఫోన్ చేస్తే,
‘‘ఒక యాభై వేల రూపాయలు పంపుతున్నాను. వైజాగ్‌లోని మంచి ఆసుపత్రిలో చూపించండి ఫర్వాలేదు, నేను వీలు చూసుకొని వస్తాను’’ అని సమాధానమిచ్చాడు మోహన్. ఆరు నెలలు గడిచింది. డబ్బులు మాత్రమే పంపేవాడు గాని తల్లిని చూడడానికి వచ్చేవాడు కాదు మోహన్. రోగం ముదరడంకన్నా, కొడుకు తీరుకే మానసిక రోగం ముదిరి శారద కన్నుమూసింది. విషయం తెలిసినా ‘‘నేను ఢిల్లీలో ఉన్నాను, నేను రాలేకపోతున్నాను- శవాన్ని ఉంచవద్దు మన ఊరువాళ్ళు ఒప్పుకోరు, నేను తప్పకుండా రేపు వస్తాను, రుూలోగా జరగవలసిన తంతు పూర్తి చెయండి’’ అని ఫోన్ చేశాడు మోహన్ తండ్రికి. కొడుకు మీదున్న పిచ్చి ప్రేమతో అప్పారావు బంధుమిత్రుల దగ్గర కొడుకుని చులకన చేయకుండా ఇప్పటికిప్పుడు ఢిల్లీ నుండి ఎలా రాగలడు, నేనే తంతు పూర్తిచేస్తానులే’’ అంటూ భార్య అంత్యక్రియలు జరిపించేశాడు. మర్నాడు మోహన్ వచ్చాడు, లోకం ఏమనుకుంటుందో అన్న భయంతో అతి కష్టం మీద ఒక రోజు ఉండి తల్లికి పిండప్రదానం జరిపించేసి హడావుడిగా పోయాడు.
‘‘పదోరోజు పెద్ద కర్మకి తమరు ఉండాలి బాబు’’ అని పంతులు గారు అంటే, ‘‘ఎందుకండి అంత సెంటిమెంట్ మూడో రోజు నేనే పిండ ప్రదానం చేశాను కదా! నేను జిల్లా కలెక్టర్ని నాకూ వేరే బాధ్యతలుంటాయి గదా, అయినా మా నాన్న ఉన్నాడు ఆయన చేత పదో రోజు పెద్ద కర్మ తంతు జరిపించండి ఖర్చుకు వెనుకాడవద్దు గ్రామంలోని అందరికీ భోజనాలు ఏర్పాటు చేయండి’’ అంటూ ఒక 50 వేల రూపాయలు దగ్గర బంధువులకు అందించి, వెళ్లిపోయాడు. అయినా అప్పారావుకి కొడుకు మీద కోపం రాలేదు. ‘జరిగిందేదో జరిగిపోయింది, పోయిన నా శారద మరి రాదు కదా వాడినెందుకు ఇబ్బంది పెట్టడం వెళ్లనివ్వండి’ అంటూ కొడుకుని సాగనంపాడు అప్పారావు.
కాలగమనంలో అప్పారావు ఒంటరి జీవితాన్ని దుర్భరంగా గడిపాడు. ఆర్థిక ఇబ్బందులు లేవుగాని, మానసిక ఇబ్బంది అతన్ని కుంగదీసింది. కొడుక్కి ఇద్దరు కొడుకులు పుట్టారు. మనవలు పుట్టిన తరువాత, వాళ్లని తీసుకుని ఊరు రమ్మనమని మోహన్‌కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది.
కొడుకు తడిగుడ్డతో పీకలు కోసే రకం అని అప్పుడర్థమయింది అప్పారావుకి ‘్భర్య శారద ఎంత మొత్తుకున్నా ఇల్లూ, వళ్లూ గుల్ల చేసుకుని కొడుకుని పై చదువులు చదివించినందుకు ఫలితం అనుభవించక తప్పదు’ అనుకుంటూ విషయం ప్రాణ స్నేహితులకి కూడా చెప్పకుండా లోలోపలే కుంగిపోయేవాడు అతడు- మోహన్ మిత్రుడు ఊరు సర్పంచ్ సత్యం నాయుడు పదేపదిసార్లు ఒత్తిడి చేసి ‘‘మీ నాన్నను ఒకసారి నీ దగ్గరకు పిలు, మనవల్ని కళ్లారా చూసి, వాళ్లతో ఆడుకోవాలని కోరికతో ఉన్నాడు’’ అని బలవంతం చేయడంతో ‘‘అయితే నువ్వు అతన్ని బెంగుళూరు పంపే ఏర్పాటు చెయ్యి రిజర్వేషన్ చేయించి ట్రెయిన్ ఎక్కించేస్తే నేను ఇక్కడ రిసీవ్ చేసుకుంటాను’’ అని మోహన్ కనాకష్టం మీద అనగానే అప్పారావును ట్రెయిన్ ఎక్కించాడు. అప్పారావుని ఇంటికి తీసుకెళ్లడానికి మోహన్ ఇంటి పని మనుషులు వచ్చి రిసీవ్ చేసుకున్నారు.
అప్పారావు గుండెల్లో పండగ, మనవల్ని చూశాడు, మురిసిపోయాడు, కానీ చేరిక, పరిచయం లేకపోవడం వల్ల వాళ్లే అప్పారావుకి దూరంగా పోతుండేవారు. కొడుకు దగ్గర అప్పారావు నెల రోజులున్నాడు. ఒక రోజు మోహన్ భార్య కావాలనే మోహన్‌తో గిల్లికజ్జాలు పెట్టుకొని గొడవపడింది. ఆ గొడవలో మాటామాటా పెరిగి ‘‘మీ నాన్న ఇక్కడ ఉండడానికి వీలులేదు, ప్రతి అడ్డమైనవాడిని ఉంచడానికి ఈ కొంపేమీ అనాథ శరణాలయం కాదు, మీ నాన్నని ఊరు పంపకపోతే నేనూ నా పేరెంట్స్‌ని తెచ్చి ఇంట్లో ఉంచుతాను. అయినా నీకూ నాకు నప్పడం లేదు మనం వేరువేరుగా ఉందాం, నీ తండ్రితో నువ్వు ఉండు, నా పేరెంట్స్‌తో నేను ఉంటాను’’ అని తీవ్ర స్వరంతో చెప్పింది మోహన్‌తో.
భార్య దగ్గర లొంగిపోయాడో, కావాలనే నాటకం ఆడాడో తెలీదుగానీ ‘‘నేను సుఖంగా ఉండాలంటే నువ్వు మనవూరు వెళ్లిపోవాలి నాన్న’’ అంటూ తండ్రిని బ్రతిమిలాడాడు మోహన్. ‘‘నేను నీ దగ్గర ఉండిపోవడానికి రాలేదురా. ఏదో కొద్ది రోజులుండి పోదామని, పిల్లల్ని చూడాలని వచ్చాను. ఇక నేను వెళ్లిపోతాను. అక్కడ మన ఇల్లు, మీ అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి. అక్కడే నాకు బాగుంటుంది. నా గురించి ఆలోచించకు, నువ్వు నీ పెళ్ళాంతో గొడవపడకు, బహుశా నేను పల్లెటూరి వాడినికదా, నా వేషం, భాష, నా మాటలు ఆమెకు నచ్చకపోవచ్చు. నా గురించి దిగులుపడకు నువ్వూ నీ కుటుంబం హాయిగా ఉండండి. మీరు గొడవలు పడితే పిల్లలు బెంగపెట్టుకుంటారు’’ అంటూ ఊరు బయలుదేరాడు అప్పారావు. జనరల్ బోగీల్లో ప్రయాణమైతే కూర్చోడానికి సీటు దొరక్క నిద్రపట్టక కిక్కిరిసిన జనాలుతో సందడిగా ఉండేది. కొడుకు బిక్షవల్ల అప్పారావుకు థర్డ్ ఏసిలో సీటు దొరికింది. ఎసి చల్లదనంవల్ల అప్పారావుకి మగత నిద్ర పట్టింది. నిద్రలోకి జారుకోకముందే భార్య గుర్తుకొచ్చింది.
‘‘పాపం పిచ్చిది. ఏనాడూ రిజర్వేషన్ పెట్లో కూకోలేదు. పైగా ఎసి అంటేనే దానికి తెలీదు. కొడుకు కుటుంబం గురించి, పిల్లల ముచ్చట గురించి చెబితే మురిసిపోయి ఉండేది. కానీ అది ముందు చావడమే మంచిదయింది. కొడుకు, ఇద్దరు కొడుకుల తండ్రి, జిల్లా కలెక్టర్ అన్న ఆనందం కన్నా... మంచీ మర్యాద లేని ఆడదాన్ని పెళ్లాంగా చేసుకున్నాడనే దిగులుతో అది గుండాగి చచ్చి ఉండేది. కొడుకు తడి గుడ్డలతో పీకలు కోసే రకం అని తెలిసి కత్తితో పొడుచుకుని చచ్చి ఉండేది. అయినా కొడుకు బంగారు పల్లకిలో పోతున్నా నాకు ఆడు ముళ్ల కంపల మీద కూర్చున్నట్లు కనిపిస్తున్నాడు. భగవంతుడా ఆడిని ఓ కంట కనిపెట్టు, నా కొడుక్కి ఏ కష్టమూ రాకుండా చూడు’’ అని మనసులోనే ప్రార్థన చేసుకుని కునుకు తీశాడు. గాఢ నిద్రలోకి జారుకున్నాడు అప్పారావు... మరి లేవలేదు. శాశ్వత నిద్రలోకి చేరుకున్నాడు.

- మీగడ వీరభద్రస్వామి, చోడవరం.
సెల్: 9441571505.

ప్రాణం

సమయం సాయంత్రం అయిదవుతుంది. పైగా ఆ రోజు ఆదివారం కావడంతో గాజువాక సెంటర్ మొత్తం అనేక వాహనాలతో రద్దీగా ఉంది.
అప్పుడే అంజలి పండగ బట్టలకోసం షాపింగ్‌కి బయలుదేరింది. అంజలితో మరో ముగ్గురు స్నేహితురాళ్లు కూడా వచ్చారు. వీళ్లు నడుస్తున్న సమయంలో ఒక బైక్‌ని కారు ఢీకొనడంతో బైక్ మీద ఉన్న వ్యక్తి ఎగిరిపడ్డాడు.
అంజలి ఇది చూసి షాక్ అయింది. వెంటనే తేరుకుని ఆ స్థలానికి పరుగుపరుగున వెళ్లింది. వద్దని స్నేహితురాళ్లు వారించినా రక్తపు మడుగులో కొట్టుకుంటున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి వెంటనే 108కి ఫోన్ చేసింది. ఫోన్ చేసిన రెండు నిమిషాల తర్వాత 108 అధికారులు ఫోన్ ఎత్తగానే అంజలి ‘‘సార్.. గాజువాక మెయిన్‌రోడ్ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఒక వ్యక్తికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి మీరు తొందరగా రండి’’ అనగానే..
‘‘సారీ మేడమ్ ఈ రోజు బండి రిపేరుకి వెళ్లింది’’ అన్నారు.
‘‘అలా అంటే ఎలా? ఇక్కడ ప్రాణం పోయేలా ఉంది. మరో బండినైనా రమ్మని చెప్పండి’’ అంది.
‘‘సారీ మేడమ్ మరో బండి లేదు’’ అంజలికి విపరీతమైన కోపం వచ్చింది. అప్పటికే అతని చుట్టూ జనం గుమిగూడారు. అందరు ‘108కి ఫోన్ చేశారా?’ అని అడుగుతుంటే అంజలికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు.
అక్కడంతా ట్రాఫిక్ జామయింది. చాలామంది ట్రాఫిక్ పోలీసులు వచ్చారు. అందరూ చూస్తుండగానే యాక్స్‌డెంటయిన వ్యక్తి చనిపోయాడు.
అంజలి నిర్ఘాంతపోయింది. ట్రాఫిక్ పోలీసులు అక్కడ ఉన్న అందరిని పంపించివేస్తున్నారు. అప్పడు అంజలి ‘‘మన దేశం ఎప్పటికీ మారదు. రాష్ట్ర రాజధాని కోసం విరాళాలు వస్తున్నాయి. అంబ్‌లెన్స్‌ని బాగు చేద్దాం అని ఎవ్వరికీ అన్పించదు. రాష్ట్రంలో ఎయిర్‌పోర్ట్ ప్రతి జిల్లాలోను ఉండాలని ఆలోచిస్తారు తప్ప ప్రాణాలను కాపాడే అంబులెన్స్‌లు రాష్ట్రంలో పని చేస్తున్నాయో లేదో ఆలోచించరు.
స్టేట్‌ను సింగపూర్ చేసి అభివృద్ధిలో ముందుకు వెళ్లాలనే ఆలోచనే తప్ప యాక్సిడెంట్‌లో ప్రాణాలు పోకుండా ఫోన్ చేసిన వెంటనే క్షణాలలో వచ్చే ఏర్పాటు చేయరు’’ అనగానే అక్కడున్న జనాలకీ, పోలీసులకు షాక్ కొట్టినట్లు అయింది. అంజలి కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుండి నిష్క్రమించింది.

- నల్లపాటి సురేంద్ర, అచ్యుతాపురం
విశాఖపట్నం. సెల్ : 9490792553.

భావి తరాలకు మంచిని పంచుదాం!

ఒక మంచి మాట

మూడు కుటుంబాల వాళ్లం కలసి అలహాబాద్ కుంభమేళాకి వెళ్లాం. మిగతా రెండు కుటుంబాల వాళ్లు నార్త్ ఇండియన్స్. మేం ఒక్కళ్లమే తెలుగు వాళ్ళం. మా గ్రూపులో అందరం కలిపి పది మంది ఉన్నాం. ట్రైన్ దిగేసరికల్లా రెండు గంటలయింది. స్టేషన్ బయటనున్న రెస్టురూంకి వెళ్లి మా లగేజీ అంతా అక్కడ పెట్టి అవసరం అయిన బట్టలు, సామాన్లు చిన్న బ్యాగుల్లో సర్దుకుని నది ఒడ్డుకి బయలుదేరాం. అక్కడ అందరూ తెలుగువాళ్లే. చాలా సంతోషం వేసింది. అది ఆంధ్రప్రదేశ్‌లా వుంది కాని అలహాబాద్‌లా లేదు. నేను తెలుగువాళ్ళతో ‘మీరెక్కడి నుంచి వచ్చారు. ఎప్పుడు వచ్చారు?’ అంటూ పరిచయవాక్యాలు మాట్లాడుతూ వుంటే, నాతో ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ వెక్కిరిస్తున్నారు. ‘వాళ్ల వాళ్లని చూసేసరికి మనల్ని మర్చిపోయింది’ అని. బోటు కోసం వెయిట్ చేస్తున్నాం. ఒక స్టీం బోటుకి 28 మందిట. బోటులోకి ఎక్కేవాళ్లందరం ఒకళ్లకొకళ్లు పరిచయాలు అయ్యాయి. అందరూ శ్రీకాకుళం జిల్లా వాళ్లం అని చెప్పారు. కాకతాళీయంగా మేం కూడా అదే జిల్లా వాళ్లం కావటం వలన చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వున్నాం. సంగమం వచ్చింది. బోటులోంచి అందరూ దిగి నీట మునిగి బోటులో బట్టలు మార్చుకున్నాం.
మరొక బోటులో సంగమం దగ్గర ఒక శివలింగాన్ని పెట్టుకుని పండా ఒకాయన కొద్దిపాటి పూజా సామగ్రితో కూర్చున్నారు. అక్కడ శివలింగంమీద పాలు పోసి దర్శనం చేసుకుని దండం పెట్టుకుని గబగబా అందరూ గంగమ్మ తల్లికి కూడా నమస్కారం చేసి తెచ్చుకున్న వాటర్‌కాన్ల నిండా గంగనీరు నింపుకుని అందరూ సంతోషంగా ఫీలయ్యాం. ఆడవాళ్లంతా బోటులోనే లలితా పారాయణం చేసుకుంటున్నారు. కొంతమంది శనివారం ఏకాదశి అని విష్ణుసహస్రం చదువుతున్నారు.
బోటు తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉంది. అందరూ ఎన్నో కష్టాలు పడి రిజర్వేషన్లు లేక నానా బాధ పడి వచ్చేరు. త్రివేణిలో స్నానం చేస్తే పుణ్యం అని స్నానాలు చేశారు. ఈ జన్మకు పాపాలు తీరిపోయాయి అన్నంత సంతోషంగా ఉన్నారు. బోటు బయలుదేరింది. రెండేళ్ల పిల్లాడెవరో లెట్రిన్‌వెళ్లాడు. ఆ పిల్లాడి తల్లి గుడ్డముక్కతో తుడిచి ఆ గుడ్డను టక్కన నీళ్లలోకి విసిరింది. అదివెళ్లి సమంగా గంగా, యమునా, సరస్వతుల సంగమంలో పడింది. నా మనసు చివుక్కుమనిపించింది. యింత దూరం చంటి పిల్లాడితో ఎన్నో కష్టాలు పడి వచ్చింది సంగమ స్నానం కోసం. కొంచెం సేపు ఆ చంటి పిల్లాడు ఖరాబు చేసిన బట్టను పక్కన ఉంచుకుని బోటు దిగిన తరువాత ఎక్కడయినా డస్ట్ బిన్‌లో వేసి చేయి కడుక్కుంటే ఎంత బాగుండేది. పవిత్ర నదీ జలాల్లో ఏదో మునిగాం అంటే మునిగాం కాదు... వాటిని ఎంత పవిత్రంగా, స్వచ్ఛంగా ఉంచగలిగితే అంత మంచిది. పుణ్యం మాట దేముడెరుగు మనకే కాదు మన భావితరాలకు కూడా మంచిని చేసిన వాళ్లం అవుతాం.

- తెలికిచెర్ల విజయలక్ష్మి,
బిలాస్‌పూర్,
సెల్ : 09301421243.

మనోగీతికలు

ఆమె వెళ్లిన చోటల్లా...!
ఆమె ఎక్కడో...
పాటల మొక్కలు నాటుతూనే ఉండొచ్చు
పిల్లల హృదయ వీణల్ని మీటుతూనే ఉండొచ్చు
బదిలీపై ఎగిరెళ్లిన ఆ పాటల పిట్ట
ఏ తోటకు వసంతాలను ఆహ్వానిస్తుందోగానీ-
పాటల పిట్టల్ని ఎగరేస్తూనే ఉంటుంది!
* * *
ఇప్పుడామె ఈ దారిలో నడిచినట్టు లేదు
ఆమె చేతుల్లోంచి...
అక్షరాల గింజలేరుకున్న పిల్లలూ లేరు
పట్టణ రణగొణ ధ్వనుల మధ్య బహుశా
పాటే వాళ్లను బతికిస్తూ ఉంటుంది!
* * *
ఆమె ఆటో దిగి వచ్చినపుడల్లా
ఊరికి వసంతం వచ్చినట్టే ఉండేది
ఆమె ఏ వూరెళ్లిపోయిందో గానీ...
ఆమె పాట ఇంకా గాల్లో గిరికీలు కొట్టినట్టే ఉంది
ఆదమరచి ఆ బడిదారిగుండా ఎప్పడయినా అడుగులేస్తే...
కోయిల పిట్టలు ఆమె పాటను కొనసాగించినట్టే ఉంది
* * *
ఇప్పటికీ ఆమె పాడుతున్నట్టే ఉంటుంది
పాటల పంట పండించినట్టే ఉంది
ఆమె వదిలెల్లిన పాట ప్రతిధ్వనిస్తూనే ఉంది
పరిసరాలను పరిమళింపజేస్తూనే ఉంది!
* * *
ఆమె ఎక్కడున్నా...
పిల్లల మనోక్షేత్రాల్లో పాటల మొక్కలు
నాటుతూనే ఉంటుంది
ఆమె వెళ్లినచోటల్లా
పాటల తోటలు విస్తరిస్తూనే ఉంటాయి!

- చింతా అప్పలనాయుడు,
సెల్ : 9441713185.

అమ్మో! ఆడపిల్లా...?!

అమ్మో! ఆడపిల్లా...?!
అమ్మో ఆడపిల్లా?! అని భయపడితే
సృష్టి ముందుకు సాగుతుందా-
మానవాళికి మూలం స్ర్తియే అయినప్పుడు
ఆ స్ర్తినే అంతంచెయ్యాలనుకోవడం
వివేకమా? అవివేకమా??
స్ర్తి, పురుషులు
కాల రథానికి రెండు చక్రాలు
ఒకే చక్రంతో,
అవిటితనంతో తప్పటడుగులు వేస్తే
కాలగమనం ముందుకు సాగుతుందా?
ఓ పురుష ప్రపంచమా -
కష్టసుఖాలు, గెలుపోటములు
సహజసిద్ధమైనప్పుడు
మనిషి- మనిషిగా మసలుకుంటే
కళకళలాడుతుంది సృష్టి నిండుగా.

- కాళ్ల గోవిందరావు,
ఆమదాలవలస,
సెల్ : 9550443449.

ఊహల ఊపిరి
వాకిట్లో నీకై దిద్దిన రంగవల్లులు
గడపలకి కట్టిన తారా తోరణాలు
పెరట్లో పెంచిన మందారాలు
పందిరికి అల్లుకున్న విరజాజులు
కుండీల్లో విరబూసిన గులాబీలు
కిటికీలకి ఎగబాకిన మాలతీ లతలు
అన్నిటా నీ మమతలే కనిపిస్తున్నాయి
అంతటా నీ నవ్వులే వినిపిస్తున్నాయి
తులసమ్మ దగ్గర వెలిగే దీపం
దేముని గదిలో అలుముకున్న ధూపం
నింగిని మెరిసే హరివిల్లు
నేలను తాకే మట్టి వాసన
అంతటా నీ రూపే కనిపిస్తుంది
చల్లగ వీచే గాలి, వెండిలా మెరిసే వెనె్నలా
మెల్లగ తాకే నీ హారం,
నీ మెడలో మెరిసే మణిహారం
అన్నిటిలో నీ ఉనికి తెలుస్తుంది
అన్ని దిక్కులా నీ రూపు నిలుస్తుంది
నువ్వు నా ఎదురుగా లేకపోతేనేం?
నాలో శ్వాస ఉన్నంతవరకు
నీ ధ్యాసే మెదుల్తుంది
నీ స్మృతులే నాలో ఊపిరులూది
నన్ను సదా సజీవంగా ఉంచుతాయి

- శివాని,
శృంగవరపుకోట.
===============
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.