నిజామాబాద్

నక్సలైట్లు ఉంటేనైనా తెరాస అరాచకత్వానికి అడ్డు పడేదేమో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణలో ఇదివరకటి తరహాలో నక్సలైట్ల కార్యకలాపాలు ఉంటేనైనా తెరాస ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనకు కొంతవరకైనా అడ్డుకట్ట పడేదేమోనని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ శాసన సభాపక్ష నేత రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నక్సలైట్లు అభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తున్నారని ఇదివరకు భావించేవారమని, ప్రస్తుతం తెరాస ఆగడాలను చూస్తే నక్సలైట్లు ఉంటేనే బాగుండేదేమోనని అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తలారి సత్యం, చేపూర్ రవిల మృతి ఉదంతంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆదివారం రేవంత్‌రెడ్డి సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించి తెలంగాణ సాధించుకుంటే, విద్యార్థులు, యువకుల త్యాగాల పునాదులపై అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం దళితులపై దాడులు, దౌర్జన్యాలకు పూనుకోవడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. బిహార్ తరహా అరాచక పాలన తెలంగాణలోనూ కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందని, తెరాస ప్రభుత్వ నిరంకుశ విధానాల వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వెలిబుచ్చారు. ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా దళిత యువకులైన తలారి సత్యం, చేపూర్ రవిల మృతి ఉదంతమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆర్మూర్ నియోజకవర్గం నుండి గత 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన తలారి సత్యంను పథకం ప్రకారం తెరాస ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. జీవన్‌రెడ్డిపై దుబాయ్‌లో నమోదై ఉన్న క్రిమినల్ కేసుల గురించి ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపర్చని విషయమై తలారి సత్యం ఇ.సికి ఫిర్యాదు చేశారని, హైకోర్టులోనూ కేసు వేయడంతో జీవన్‌రెడ్డి అనుయాయులు అనేకమార్లు సత్యంను చంపుతామంటూ బెదిరింపులకు గురి చేశారన్నారు. దీంతో తనకు ప్రాణహాని ఉందంటూ తలారి సత్యం మానవహక్కుల సంఘాన్ని, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశాడని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కుటుంబీకులకు చెందిన టిప్పర్‌తో ఢీకొట్టించి తలారి సత్యం, రవిలను హత్య చేయించినా, పోలీసు అధికారులు ఎమ్మెల్యే పేరును ఇంతవరకు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చకుండా విచారణ జరుపకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కనీసం తలారి సత్యం కుటుంబీకుల వాంగ్మూలాన్ని కూడా సేకరించలేదని, ఎవరి ఒత్తిడితో పోలీసులు కేసును పక్కదారి పట్టిస్తున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ తరహా అన్యాయాలను చూస్తే నక్సలైట్లు ఉంటేనే బాగుండేదేమో అనే భావన ఏర్పడుతోందన్నారు. పాలకులు ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడకపోతే విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు మళ్లీ ఒక మార్గం వైపు పయనించే ప్రమాదం లేకపోలేదంటూ, పరోక్షంగా అడవి బాట పడతారనే సంకేతాలను రేవంత్‌రెడ్డి వెలువరించారు. తలారి సత్యం, చేపూర్ రవిల మృతి ఉదంతంపై ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్ర విచారణకు ఆదేశించాలని, పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా వాస్తవాలను వెలికి తీసి దోషులు ఎంతటివారైనా చట్టపరంగా శిక్ష పడేలా చేసి ఖాకీ యూనిఫాం గౌరవాన్ని కాపాడాలన్నారు. ఈ ఉదంతంపై టి.టిడిపి తరఫున మానవ హక్కుల సంఘానికి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీక్ష అనంతరం ర్యాలీగా జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిని కలిసి మెమోరాండం సమర్పించారు. రిలే దీక్షలో టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, అమర్‌నాథ్‌బాబు, రాజారాంయాదవ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, న్యూడెమోక్రసీ నాయకుడు వి.ప్రభాకర్, సిపిఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్, సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య, బిఎస్పీ నాయకుడు ఎడ్ల రాము, దళిత సంఘాల జెఎసి కన్వీనర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

శోభాయమానంగా నీలకంఠేశ్వరుడి రథోత్సవం
కంఠేశ్వర్, ఫిబ్రవరి 14: నగరంలోని కంఠేశ్వర్‌లో గల నీలకంఠేశ్వరుని రథోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆదివారం సాయంత్రం నీలకంఠేశ్వర స్వామి వారి రథయాత్ర ప్రారంభమవ్వగా, వేల సంఖ్యలో భక్తులు పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఓం నమఃశ్శివాయ - ఓం నమఃశ్శివాయా అంటూ భక్తులు పరవశించిపోయి రథానికి టెంకాయలు కొట్టి తమ భక్తిప్రపత్తులు చాటుకున్నారు. ఆలయానికి పావు కిలోమీటరు దూరంలో ఉన్న తల్లిగోరి (సమాధి) వద్దకు రథం సాయంత్రం 6.30గంటల సమయంలో చేరుకోగా, అక్కడ ప్రత్యేక హారతులు ఇచ్చి, పూజలు జరిపిన మీదట రథం తిరిగి ఆలయానికి చేరుకుంది. అంతకుముందు అంటే ఉదయం ఐదు గంటల నుండే రథోత్సవాన్ని పురస్కరించుకుని వేద పండితులు ప్రత్యేక పూజలు, హరతులు, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా ఆలయం ఆవరణలో తినుంబడారాల దుకాణాలు, బొమ్మల దుకాణాలు వెలిశాయి. దీంతో కంఠేశ్వర్ చౌరస్తా ప్రాంతం జాతరను తలపించి భక్త జన సందోహంతో కిటకిటలాడింది. రథోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారి సేవా సమితి, స్కౌట్స్ అండ్ గైడ్స్ వాలంటీర్లు ఆలయంలో భక్తులకు సేవలందించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తాగునీటి వసతి సమకూర్చారు. నగర డిఎస్పీ ఆనంద్‌కుమార్ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. రథోత్సవంను పురస్కరించుకుని ఆర్టీసీ బస్సులను కంఠేశ్వర్ వుమెన్స్ కళాశాల మీదుగా బస్టాండ్‌కు దారి మళ్లించారు. అదేవిధంగా కంఠేశ్వర్ కమాన్ నుండి ఆర్మూర్ వైపునకు వెళ్లే బస్సులను దుబ్బ మీదుగా మళ్లించారు. ఈ రథోత్సవం ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి రోజున వస్తుంది. ఆ సమయంలోనే రథోత్సవం, జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 15న నమకచమక సహిత రుద్రాభిషేకం, స్వామివారి అవబృత స్నానం(చక్కరతీర్థం) కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ చైర్మెన్ రవీందర్‌రెడ్డి, ఇఓ మహేందర్‌గౌడ్‌లు తెలిపారు.

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కరడుగట్టిన ఉగ్రవాది అఫ్జల్‌గురు వర్ధంతిని జరపడాన్ని ఖండిస్తూ
తె.యులో ఎబివిపి నిరసన
డిచ్‌పల్లి రూరల్, ఫిబ్రవరి 14: ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో కరడుగట్టిన ఉగ్రవాది అఫ్జల్‌గురూ వర్ధంతి జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎబివిపి ఆధ్వర్యంలో ఆదివారం కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చాటారు. ఈ సందర్భంగా ఎబివిపి నాయకుడు రమణ మాట్లాడుతూ, ఉగ్రవాదుల సానుభూతిపరులూ ఉగ్రవాదులేనని అన్నారు. భారతదేశానికి చెందిన వారై ఉండి, సొంత దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం శోచనీయమన్నారు. యూనివర్శిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఈ తరహా చర్యలకు పాల్పడడం, పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం దేశ ద్రోహంగానే పరిగణించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశ సేవ కోసం అమరులైన జవాన్‌లను, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ఏనాడూ పట్టించుకోని వాళ్లు, వందలాది మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులను న్యాయపరంగా ఉరి తీస్తే, వారి సంస్మరణ సభలు యూనివర్శిటీల్లో చేపట్టి భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ తరహా వైఖరిని ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లోని అంతర్భాగమేనని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందు, మహేష్, నాయకులు రాజురాథోడ్, రవిరాజు, ప్రవీణ్, నగేష్, లక్ష్మణ్, అంబయ్య, రమేష్, నవీన్, చందర్, రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.

దాహార్తితో అలమటిస్తున్న గిరిజన తండాలు
భీమ్‌గల్, ఫిబ్రవరి 14: భీమ్‌గల్ మండలంలోని గిరిజన తండాల్లో తాగునీటి ఎద్దడి రోజురోజుకీ తీవ్రమవుతుండటంతో ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. మండలంలోని ధనంబండతండా, రూప్లాతండా, కారేపల్లి, దేవక్కపేట, రాహత్‌నగర్, దేవున్‌పల్లి తదితర గ్రామాల పరిధిలో గల గిరిజన ప్రజలు తాగునీటి కోసం వ్యవసాయ బోరుబావులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. పబ్లిక్ కుళాయిలు గానీ, చిన్నతరహా మంచినీటి ట్యాంకులు కానీ తండాల్లో లేకపోవడం, కొన్ని తండాల్లో ఉన్నా నీరు సరఫరా కాకపోవడంతో నిరుపయోగంగా మారాయి. దేవక్కపేట గ్రామ పరిధిలోని గిరిజన తండాలో మంచినీటి ట్యాంక్ ఉన్నప్పటికీ, దాని ఆలనాపాలనా పట్టించుకోకపోవడంతో తండాలో తాగునీటి సమస్య తీవ్రమైందని స్థానికులు వాపోయారు. అలాగే మినీ వాటర్ ట్యాంకుకు నీరు సరఫరా కాకపోవడంతో తండావాసులు సమీపంలోని వ్యవసాయ పంపుసెట్ల వద్ద నుండి నీటిని తెచ్చుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటం, రాత్రి వేళల్లో కరెంట్ వచ్చే సమయంలో నానా అవస్థలను ఎదుర్కొవాల్సి వస్తోందని గిరిజనులు పేర్కొంటున్నారు. రాహత్‌నగర్ గ్రామ పరిధిలోని తండాల్లో సైతం తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చిందని స్థానికులు తెలిపారు.
చిన్న నీటి ట్యాంక్‌లు, చేతిపంపులు ఉన్నప్పటికీ, ప్రస్తుతం అవి నిరూపయోగంగా మారాయని తండావాసులు అంటున్నారు. చెడిపోయిన చేతిపంపులు, నీటి ట్యాంకులకు మరమ్మతులు చేయించాలని ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండాపోతోందని, మండల అధికారులకు సైతం తమ గోడును వెళ్లదీసుకున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారని గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భీమ్‌గల్ మండలంలోని ఆయా తండాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని గిరిజనులు, మండల ప్రజలు కోరుతున్నారు.

హిందూ వాహిని ఆధ్వర్యంలో
వాలెంటైన్స్ డే వ్యతిరేక దినం
కంఠేశ్వర్, ఫిబ్రవరి 14: వాలంటైన్స్ డే భారతీయ సంస్కృతి కాదని చెబుతూ ఆదివారం హిందూ వాహిని ఇందూరు శాఖ ఆధ్వర్యంలో వాలంటైన్స్ డే వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తిలక్‌గార్డెన్‌లో పలు జంటలకు కౌన్సిలింగ్ జరిపారు. ఈ సందర్భంగా హిందూ వాహిని నగర ప్రధాన కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ, వాలంటైన్స్ డే అనేది పూర్తిగా పాశ్చాత్య విష సంస్కృతి అని గుర్తించాలన్నారు. భారతీయ యువతీ, యువకులును తప్పుడు మార్గంలో పయనించేలా చేసేందుకు ఈ తరహా వేడుకలను మన దేశంపై ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు. జీవితంలో స్థిరపడేందుకు ఒక బాధ్యతాయుతమైన నిర్మాణం జరగాల్సిన వయస్సులో ప్రేమ అనే ఒక అత్యంత పవిత్రమైన, విలువైన అంశాన్ని అపహాస్యం చేస్తూ చేపట్టే వాలంటైన్స్ డే వేడుక వారి కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని తిరిగి సరి చేసుకోలేని రీతిలో దెబ్బతీస్తుందని అన్నారు. యువత ఈ విషయాన్ని గ్రహించి వాలంటైన్స్ డే వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని బాధ్యులు అనిష్‌రాజు, విజయ్‌భాస్కర్, రాజశేఖర్, మురారి, రోహిత్, విశ్వనాథ్, జగదీష్, సాయిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
మద్నూర్, ఫిబ్రవరి 14: మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న కె.్భగ్యశ్రీ అనే విద్యార్థిని అదృశ్యమైనట్టు ఆమె కుటుంబీకులు ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ కాశీనాథ్ తెలిపారు. ఎప్పటిలాగే ఈ నెల 12వ తేదీన కాలేజీకి వెళ్లిన భాగ్యశ్రీ ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆమె కుటుంబీకులు బంధువుల ఇళ్లలో వాకబు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో ఆదివారం బాలిక తండ్రి రాము పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ కాశీనాథ్ తెలిపారు. ఇదిలాఉండగా, బాలిక అదృశ్యం వెనుక పలువురు ఆటోడ్రైవర్ల హస్తం ఉన్నట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. కళాశాలకు వెళ్లే బాలికలపై కనే్నసి కొందరు ఆటోడ్రైవర్లు వారికి మాయమాటలు చెప్పి తమ వెంట తీసుకెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవలి కాలంలోనే ఇలాంటి సంఘటనలు నాలుగైదు జరగడంతో ప్రస్తుతం భాగ్యశ్రీని కూడా ఆటోరిక్షా డ్రైవర్లే కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకెళ్లి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా పోలీసులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు.