నెల్లూరు

మోసపోకు మిత్రమా..! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త ఉద్యోగం, కొత్త ఊరు, కొత్తవారి పరిచయం ఎలా ఉంటాయోనని ఆలోచిస్తూ జోగివారిపల్లెలో ఆటో దిగాను. అది ఊరిలో బస్టాపులాగుంది. అక్కడే ఉన్న చింతచెట్టు కింద ఎత్తుగా బండలు వేశారు. బండపైన ఒక పెద్దాయన న్యూస్ పేపరు తిరగేస్తున్నాడు.
నా సూట్‌కేసుతో సహా పెద్దాయన దగ్గరకు నడిచి ‘‘నమస్తే సార్’’ అన్నాను.
పేపర్ నుంచి చూపు మరలుస్తూ చిన్నగా తలెత్తి నావైపు చూశాడు.
‘‘నమస్తే బాబు, ఎవరు కావాలి, ఊరికి కొత్తగా ఉన్నావు.. నువ్వు ఎవరు’’ అని గబగబా ప్రశ్నలు అడిగాడు.
‘‘నా పేరు జగపతిబాబు, ఈ ఊరికి వ్యవసాయ విస్తరణాధికారిగా వచ్చాను’’
‘‘అవునా ఇంతకీ ఏ ఊరో చెప్పలేదు’’
‘‘ఎర్రావారిపాళెం మండలం నెరబైలు గ్రామమండీ’’
‘‘రా నిల్చున్నావే, ఇక్కడ కూర్చో’’ అని నాకు సైగ చేశాడు.
నేను బండపై కూర్చున్నాను.
‘‘ఇంతకీ నువ్వు ఎక్కడుంటావు’’ అని అడిగాడు.
‘‘ఈ ఊర్లోనే ఎక్కడైనా నాకు సరిపడే గది ఉంటే చూపండి’’ అని నేను చెబుతుండగానే.. అప్పుడే అక్కడకు వచ్చిన ఒకాయన ‘‘ఏమయ్యా నారాయణా పేపర్ చదివేది అయిపోయిందా, ఎవరిదో తల తింటున్నావ్?’’ అని నావైపు చూస్తూ ప్రశ్నించాడు.
‘‘ఈ అబ్బాయి మనూరికి వ్యవసాయం చేయించే ఉద్యోగిగా వచ్చాడంట, మీ ఇంటిలో అద్దెకు గది ఉంటుందేమో చెప్పరాదూ రాఘవరెడ్డి’’ అని నన్ను చూపిస్తూ అడిగాడు నారాయణ.
‘‘అవునా.. సరే ఇంతకీ ఏ ఊరు మీది’’ అని అడిగాడు రాఘవరెడ్డి.
నారాయణ వెంటనే నా వివరాలన్నీ గబగబా చెప్పేశాడు.
ఆయన మాటలు వింటూ ఆ పక్కగా వెళుతున్న ఒకాయన ‘ఈ నారాయణకు ఊర్లోవాళ్ల విషయాలన్నీ కావాలి ఏమ్మనిషో ఏమో’ అనుకొంటూ వెళ్లాడు.
‘‘సరేలే.. రా బాబూ’’ అని నావైపు చూసి రాఘవరెడ్డి పిలవడంతో సూట్‌కేసు ఎత్తుకొని ఆయన వెంట నడిచాను.
‘‘ఎక్కడో ఒకచోట ఉండాలి’’ అనుకొంటూ దగ్గర్లోనే ఉన్న ఆయన ఇంటికి వచ్చాను.
ఇంట్లో సూట్‌కేసు పక్కన పెట్టాను. అంతలో రాఘవరెడ్డి టవల్ తెచ్చి ఇచ్చి ‘‘వెళ్లి కాళ్లు, చేతులు కడుక్కొని రా, భోజనం చేద్దువు’’ అన్నాడు.
టవల్ తీసుకొని ఎదురుగా ఉన్న బాత్‌రూంలోకి వెళ్లి కాళ్లు చేతులు కడుక్కొని వచ్చా.
అంతలో ఆయన భార్య అనుకుంటా ‘‘రా బాబు ఇక్కడకు వచ్చి కూర్చో’’ అని డైనింగ్‌టేబుల్ దగ్గర కూర్చీని చూపింది.
అప్పుడే ఇంటిలోకి వస్తున్న యువకుడిని చూసి ‘‘ఒరేయ్ రాజారెడ్డి, నువ్వు కూడా రా అన్నం తిందువు’’ అంది
‘‘వాడు నా కొడుకు, ఇది నా పెళ్లాం రత్నమ్మ’’ అని రాఘవరెడ్డి పరిచయం చేశాడు. అందరూ భోజనానికి కూర్చున్నాం. నాకు కొసరి కొసరి వడ్డించారు.
చేతులు కడుక్కొన్నాక నన్ను రాజారెడ్డి మిద్దెపైనున్న గదిలోకి తీసుకువచ్చాడు.
‘‘ఈరోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు.. రెస్ట్ తీసుకో సాయంత్రం మా ఊరు, పొలాలు చూపిస్తా’’ అని రాజారెడ్డి వెళ్లిపోయాడు.
మంచంపై పడుకొనగానే మా ఊరు, మా ఇల్లు గుర్తుకొచ్చాయి. నెరబైలు గ్రామంలో మా నాన్న గురవయ్య మోతుబరి రైతు. ప్రతి ఒక్కరూ మా ఇంటికి, మా నాన్న దగ్గరకు ఏదో ఒక పనిపై వచ్చి వెళ్లేవారు. నన్ను బాగా చదివించి డాక్టర్‌ను చెయ్యాలనుకున్న మా నాన్న ఆశలను అడియాశలు చేస్తూ అగ్రికల్చర్ బిఎస్సీ చదివాను.
నేను ఆ చదువే పెద్ద చదువులాగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే, మా నాన్న ‘‘ఇంటి పట్టున ఉండి సేద్యం చేసుకోరా, ఉన్న ఒక కొడుకు ఊర్లపట్టి పోతే మా పరిస్థితి ఏంటీ’’ అని తిట్టని రోజు లేదు.
మేము నలుగురం స్నేహితులం. రాజు ఉపాధిహామీ పథకంలో ఫీల్డు అసిస్టెంట్‌గా, వెంకట్ మా ఊరి పోస్ట్ఫాసులో బిపిఎంగా, శ్రీనివాస్ మగ ఆరోగ్యకార్యకర్తగా మా ఊరిలోనే పనిచేస్తున్నారు. నా చదువుకి మా గ్రామంలో పనిచేసే ఉద్యోగం రాదు. అందుకే వేరే మండలానికి వెళ్లాల్సి వచ్చింది. వస్తూవస్తూ ‘‘నాకు ఉద్యోగం నచ్చకపోతే తిరిగి వచ్చేసి ఇంటి వద్ద వ్యవసాయం చేసుకొంటా’’ అని నాన్నకు మాట ఇచ్చి వచ్చాను.
***
గది తలుపుపై శబ్దం రావడంతో నా ఆలోచనల నుంచి బయటపడ్డాను. వెంటనే లేచి తలుపు తీస్తే రాఘవరెడ్డి కొడుకు రాజారెడ్డి ఉన్నాడు.
ఇద్దరం గ్రామాన్ని చూడాలని మేడ దిగి రోడ్డుపైకి వచ్చాం.
అప్పుడే ఒక ఆటో వచ్చి ఆగింది. అందులో నుంచి అందమైన అమ్మాయి దిగి మేమున్న చోటికి వచ్చి పక్క సందులోకి వెళ్లింది.
‘ఇంత మారుమ్రూల ప్రాంతంలో ఎంత అందమైన అమ్మాయి’ అని ఆశ్చర్యపోయాను. మేము అక్కడ ఉండగానే రాఘవరెడ్డి ఇంట్లోకి కొంతమంది వెళ్లడం గమనించాను. వారిని చూస్తే ఉద్యోగస్తుల్లా కనపడ్డారు. నాకు ఏదో అనుమానం కలిగింది. వారు ఎవరై ఉంటారు, ఎందుకు వచ్చి ఉంటారు అని మనసులోనే అనుకొని ఉండబట్టలేక రాజారెడ్డితో ‘‘ఎవరు వాళ్లు.. మీ ఇంటికి ఎందుకు వెళుతున్నారు’’ అని అడిగాను.
‘‘ఆ విషయం మా నాయననే అడుగు’’ అని రాజారెడ్డి చెప్పడంతో ఇక ఉండలేక వెనుదిరిగి ఇంట్లోకి వచ్చాను.
‘‘సరే సార్.. ఉంటాము’’ అని ఇందాక నాకు కనబడిన వాళ్లు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు.
రాఘవరెడ్డి వాళ్లతో పాటు వచ్చి వీడ్కోలు చెప్పి మమ్మల్ని చూసి ‘‘ఈ ఊర్లో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేస్తారంట.. ఏర్పాట్లు చేయమన్నారు’’ అని విషయం చెప్పాడు.
అంతలో నేను చూసిన ఆ అందమైన అమ్మాయి సరాసరి ఆ ఇంట్లోకి వచ్చింది. సంప్రదాయబద్ధమైన దుస్తులు, కట్టూబొట్టూ అచ్చు తెలుగింటి బాపూబొమ్మలా ఉంది.
‘‘ ఏమ్మా మాధురీ ఇలా వచ్చావు’’ రాజారెడ్డి ప్రశ్నించాడు.
‘‘మా అమ్మ డాక్టర్లు ఎప్పుడొస్తారోనని కనుక్కొని రమ్మంది’’ అంటూ నావైపు చూసింది. ఆ చూపులు మన్మథబాణాల్లా నన్ను తాకాయి. శరీరమంతా ఒకరకమైన వేడి పుట్టింది.
అప్రయత్నంగా నా నోటి వెంట ‘‘మాధురీ ఎంత మధురమైన పేరు’’ అని వెలువడ్డాయి.
‘‘రేపు మన స్కూల్లో 9 గంటలకు డాక్టర్లంతా వచ్చి వైద్యశిబిరం మొదలుపెడతారు’’ రాఘవరెడ్డి మాటలకు ఈ లోకంలోకి వచ్చాను.
‘‘ఏం మీరు ఊరు చూడలేదా’’ మమ్మల్ని చూసిన రాఘవరెడ్డి అడిగాడు.
‘‘రేపు క్యాంపు అయ్యాక తిరుగుతాం’’ రాజారెడ్డి చెప్పడంతో లోనికి వెళ్లాను.
గబగబా మిద్దెపైకి ఎక్కి చూశాను. ఆ వీధిలోనే కుడివైపున నాలుగో ఇంట్లోకి వెళ్లింది మాధురీ.
ఉదయం 9 గంటలు.. ప్రాథమిక పాఠశాల ఆవరణ అంతా కోలాహలంగా ఉంది. కొద్దిసేపటికి గ్రామసర్పంచ్ సుధాకర్ వచ్చి మెడికల్ క్యాంపును ప్రారంభించారు.
నేను, రాజారెడ్డి ఇద్దరం కలిసి క్యాంపు దగ్గరకు వచ్చాం. మమ్మల్ని చూసిన నారాయణ మా వద్దకు వచ్చాడు.
‘‘ఈ ఊర్లో గతంలో అధికారులు సర్వేచేసి తప్పనిసరిగా సంవత్సరానికి నాలుగు మెడికల్ క్యాంపులు నిర్వహించాలని చెప్పారండి.. అందుకోసమే ఈ క్యాంపు’’ అని గబగబా చెప్పాడు.
‘‘ఎందుకు’’ అని అడిగాను.
‘‘ఈ ఊర్లో చాలామంది అమ్మాయిలు బొంబాబు, పూణే, ఢిల్లీలో ఉండి వచ్చారులే. అదేదో గుప్తరోగం ఉందంట... అందుకని ఈ క్యాంపులు’’ నారాయణ టకటకా చెప్పాడు.
నాకు మాధురీ గుర్తుకొచ్చింది. కొంపదీసి మాధురీ అలా వెళ్లి వచ్చిందా.. ఛ.. ఛ.. అలా కనపడటం లేదు. ఇలా పలురకాల ఆలోచనలు వచ్చాయి.
అంతలో మాధురీ డాక్టరు వద్దకు తన తల్లిని తీసుకొచ్చి పరీక్షలు చేయించి ఇంటికి తీసుకుపోతూ కనపడింది.
‘ఈ అందం నన్ను మోసం చేయడం లేదు కదా’ అని నన్ను నేనే సముదాయించుకొన్నాను.
‘‘అమ్మా నేను పేటకు పోయి డాక్టరు రాసిచ్చిన మందులు తీసుకొని వస్తా, నువ్వు ఇంటికి పో’’ అని మాధురీ తల్లికి చెప్పడంతో ‘‘నేనూ ఇప్పుడే వస్తాను’’ అని రాజారెడ్డికి చెప్పి నేను కూడా పేటకు బయలుదేరాను.
మాధురీ ఎక్కిన ఆటో నేను ఎక్కి కూర్చున్నా ఒకరినొకరు ఆనుకుంటూ కూర్చోగా ఆటో టవున్‌కు బయలుదేరింది.
‘‘మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చారా’’ అంది నన్ను చూస్తూ మాధురి.
‘‘అవునండీ’’ అని చెప్పాను.
ఆటోలో ఒకరినొకరు ఇరుక్కోవడంతో చాలా సంతోషంగా ఉంది నాకు.
మాధురి మందులు తీసుకొనేంత వరకు నేను పేటలోనే ఉన్నా. తిరిగి ఆటోలో జోగివారిపల్లెకు వచ్చేశాము. అయితే నేను ఏమి మాట్లాడలేదు.
***
ఆ రోజు రాత్రి మా స్నేహితులకు మాధురీ విషయం చెప్పాను. ‘‘జాగ్రత్తరోయ్ అందం వెనుక చాలా ఉంటాయి’’ అని వాళ్లు నాకు చెప్పినా నా చెవుల్లో మాధురి పేరే వినపడుతోంది. రాత్రి 11 గంటలనుకొంటా.. పక్కన ఇళ్లలో ఎవరో చనిపోయారు.. ఏడుపులు భారీగా వినపడ్డాయి.
‘‘ఇంత చిన్న వయసులోనే నీకు నూరేళ్లు నిండాయా’’ అని నాకు ఆ నిశ్శబ్దరాత్రిలో వినపడింది. నాకు సరిగ్గా నిద్రపట్టలేదు. తెల్లారింది. అనుమానం లేదు అది మాధురీ వాళ్ల ఇంటి వద్దనే.
నిన్న మాధురి తల్లి కోసం మందులకు వచ్చింది కదా తల్లి చనిపోయిందేమో అనుకొన్న నాకు రాత్రి ఏడుపులు గుర్తొచ్చాయి. చిన్నవయసులోనే... అనే మాటలు గుర్తుకు రావడంతో గబగబా కిందకు వచ్చాను.
రాజారెడ్డి రెండువేల రూపాయలు దహనఖర్చుల కింద మాధురి వాళ్ల అమ్మ చేతిలో పెట్టడం గమనించాను.
రాజారెడ్డి వైపు చూశాను.
‘‘వీళ్ల కూతురు మాధురి ఏదో జబ్బుతో హఠాత్తుగా చనిపోయింది. అందుకని ఏదో మానవతా సాయంగా ఇస్తున్నాం’’ అని చెప్పాడు.
ఆ మాటలతో నా స్వప్నసౌధం ఒక్కసారిగా కూలిపోయినట్లనిపించింది. భూమి వణికినట్లుగా ఉంది. ఇక తట్టుకోలేక గబగబా మిద్దెపైకి ఎక్కి సెల్‌ఫోన్ తీశాను. నా స్నేహితులకి విషయం చెప్పాను.
‘‘చూశావా అందం వెనుక ఎంత మోసం ఉందో జాగ్రత్త.. అందం కాదు ముఖ్యం గుణం ముఖ్యం’’ అని ఫ్రెండ్స్ చెప్పడంతో నిజమేననిపించింది. నేను ఆలోచనలో పడిపోయాను.
- కటారి రామయ్య,
సదుం, చిత్తూరు జిల్లా
చరవాణి : 9704025771

మనోగీతికలు

వింతరోదన
అహంకారం
హద్దులు దాటేటప్పుడు
అంధకారం
ఆత్మీయంగా కౌగిలించుకొంటుంది
‘‘ఆ’’.. అవసరంలో కూడా
నీ అంతరాత్మ నీకేదో చెప్పాలని
చెవిలో వేయాలని
గొణుగుతూనే ఉంటుంది
గొడవచేస్తూనే ఉంటుంది
చెడ్డ చేస్తున్నావురా అని
నీ చెంప మీద చెళ్లుమనిపిస్తూనే ఉంటుంది
చెవిలో జోరీగలా అరుస్తూనే ఉంటుంది
‘‘కానీ’’..వాటిని కర్కశంగా
ప్రక్కకు నెట్టి
పట్టరాని ఆవేశంతో కానిచ్చేస్తావు
నీ కర్మకాండను
విరిగి, నలిగిన ఆ హృదయం
ఎంత విలవిల్లాడిందో
వింత రోదన ఎంత జేసిందో
విషమెక్కిన నీ కళ్లకు కనిపించదు
చెవిటివై పోయిన నీ చెవులకు వినిపించదు
అసహనంగా ఆహుతైన
ఆ అగ్ని పర్వతం
అదును జూసి నీపై నిప్పులు కురిపించకమానదు
ఎదలోయల్లో ఎరుపెక్కిన గునపాలు
దించకామానదు
నీ అహంకారం, అథోగతిపాలై
నిన్నంతమొందించక మానదు
నీ పాశవిక ప్రవర్తన
పాతాళానికి త్రోయకమానదు
ప్రాణముండంగానే నిన్ను పాతేయకమానదు
పరాభవించకా మానదు
నిన్ను పట్టి పీక్కుతినకామానదు!

- పచ్చా పెంచలయ్య
చరవాణి : 9912822341

తల్లిదండ్రులు
శెలవులే లేని జీవితం వాళ్లది
బతుకంతా వాళ్ల కళ్లలోని చూపుని
మనకు కానుకగా ఇచ్చి వాళ్లు మాత్రం
మనం ఆనందపడుతుంటే
అదేలోకంగా భావించి బతుకుతారు
అహర్నిశలూ రెక్కలకి అలుపు లేకుండా
మనకోసం మెట్లు కట్టి పైకి ఎక్కిస్తూ
వాళ్లు మాత్రం మొదటిమెట్టు దగ్గరే
అలుపు తెలీకుండా నిలబడే ఉంటారు
పిల్లల సుఖం కోసం ఎన్నో రాత్రుళ్లని
త్యాగం చేస్తూనే బతుకుతారు
పిల్లల కడుపు నిండితేనే వాళ్లకు తృప్తి
వాళ్లెన్ని త్యాగాలు చేసినా
గుర్తించలేని నిజమైన గుడ్డివాళ్లం మనం
కానీ అందరికీ కాకపోయినా కొందరికి మాత్రం
తల్లిదండ్రులు నేడు బరువవుతున్నారు
ఆ బరువుని వృద్ధాశ్రమాల్లో దించేసి
వాళ్లకి అందించాల్సిన ప్రేమానురాగాల్ని
ఎక్కడో పాతిపెట్టి వచ్చి
పనయిపోయిందన్నట్లుగా
చేతులు కడిగేసుకుంటున్నారు
వారి త్యాగాలకు విలువలేకుండా పోతోంది
వెలకట్టలేని అమూల్యమైన ప్రేమని
మనకు అందించిన వాళ్లకిదేనా బహుమానం

ఒక్కసారి మనం ఆలోచిద్దాం
మన మనస్సాక్షి ముందు మనం నిలబడి
ప్రశ్నించుకున్నప్పుడు..అద్దంలోంచి మనం మాయమైనట్లు.. బతుకులోంచి సిగ్గుతో
ఎక్కడికో మాయమయిపోతాం

అందుకే పిల్లలుగా.. మనుషులుగా
మనిషిలోని మానవత్వాన్ని బతికించుకుందాం
ఇప్పటికైనా వాళ్ల కష్టాలకి శెలవులిద్దాం

- షారోన్ బేగం, సోమశిల.చరవాణి : 8985963150

మహాభాగ్యం!
హెక్టార్లకొద్దీ భూములు
టన్నులకొద్దీ ధాన్యాలు
ట్రక్కుల నిండా ఫలాలు
ట్రాక్టర్ల నింపిన ఫలాలు
బ్యాంకుల్లో దాచిన కోట్లు
వాణిజ్యంలో రెట్టింపు లాభాలు
వారసత్వపు ఆస్తిపాస్తులు
తరగనంతగా సంపదలు
రెండుచేతులా సంపాదనలు
వంటినిండా ధరించే నగలు
బీరువాల్లో ఖరీదైన దుస్తులు
రియలెస్టేట్ల వ్యాపారాదాయాలు
ప్రజాధనం దుర్వినియోగ స్వాహాలు
అవినీతి అక్రమార్జనల భోగాలు
ఇవేవీ ఇవ్వలేవు నిజమైన భాగ్యం
‘మనచేతుల్లో మన ఆరోగ్యం’
అదొక్కటే
వాస్తవంగా మహాభాగ్యం!

- చాకలికొండ శారద,
రిటైర్డ్ హెచ్ ఎం, కావలి
చరవాణి : 9440757799

చిరు కవిత

రమ్యంగా మార్చుకో..!
అక్కడ -
అవసరాలు ఇస్తున్నారని
ఆసరాలు కల్పిస్తుంటారని
అవకాశాలు చూపిస్తున్నారని
గుంపులుగా
గుమిగూడుతున్నారు..
ఒకరికొకరు జతకడుతున్నారు...!
ఇక్కడ -
నిజాల్ని దాచేస్తున్నారని
ఇజాల్ని అణిచేస్తున్నారని
నిజాయితీని నలిపేస్తుంటారని
గుసగుసలు చెప్పుకుంటున్నారు
ఎవరికి వారు తప్పుకుపోతున్నారు..
వర్తమాన జనప్రవర్తనతో
(అ)రాజకీయం రాజ్యమేలుతోంది
పరివర్తన రాని సమాజంలో
ప్రజాస్వామ్యం పూజ్యమవుతోంది..

ఓ మనిషీ!
ఇకనైనా దూరదృష్టితో మేలుకో
ఏ అంశానికెలా స్పందించాలో నేర్చుకో
రానున్న కాలాన్ని రమ్యంగా మార్చుకో..!

- బొగ్గరపు రాధాకృష్ణమూర్తి,
నెల్లూరు. చరవాణి : 9885481939

స్పందన

అల్లుడు నల్లబంగారమే
గతవారం మెరుపులో పోట్లూరి సుబ్రహ్మణ్యం గారు రాసిన బంగాంలాంటి అల్లుడు కథ బాగుంది. కథ హాస్యభరితంగా సాగింది. ఎలుగుబంటిని అల్లుడుగా చూపడం కథలో ట్విస్టు. కథంతా నిజంగా జరిగినట్లుగా చూపించారు. నరసయ్య, శివుడి సంభాషణలు బాగున్నాయి. నిజంగా శివయ్యేతోనే నరసయ్య మాట్లాడుతున్నాడు అనుకొనేలోపే కథలోకి ఎలుగుబంటి చేరింది. బాగుంది. చివరకు నరసయ్య తేరుకోవడం..ఇది విన్న ఊరిజనాలు ఎగతాళి చేయడం, చివరకు ఊరంతా కలిసి నిజంగా శివయ్య, నరసయ్య కూతురు కిష్టమ్మకు పెళ్లిచేయడంతో కథకు శుభం కార్డు పడింది. మంచి కథను అందించిన రచయితకు ధన్యవాదములు. వాస్తవంగా మారుమూల పల్లెటూళ్లల్లో ఇలాంటి విషయాలే సహజంగా జరుగుతూనే ఉంటాయి.
- గాదె లక్ష్మీపతి, సిఎస్ పురం
- మిక్కిలి రాంబాబు, కలకడ, చిత్తూరు

దీపావళి కవిత బాగుంది
గత వారం మెరుపులో దీపావళి సందర్భంగా మార్టూరి శ్రీరామ్‌ప్రసాద్ గారు రాసిన దీపావళి కవిత బాగుంది. లోతైన అర్థాన్ని కవితలో అంతర్గతంగా చెప్పిన విధం బాగుంది. ఏదో చేయాలి.. ఏమి చేయలేకపోయాను అనే ఆవేదనను రచయిత కథలో చొప్పించారు. అనాథలు, అభాగ్యుల కళ్లలో దీపం పెట్టమ్మా..అంటూ కవితలో వాడిన వాక్యనిర్మాణం కూడా ముచ్చటగా వుంది.
- చిరువేళ్ల కృష్ణమోహన్, గూడూరు
- సరోజనమ్మ, రచయిత్రి, తిరుపతి

సైనికా నీకు సలామ్, ఉగ్రవాదులారా
ఖబడ్దార్ కవితలు బాగున్నాయి
సైనికుల కీర్తిని వర్ణిస్తూ గతవారం మెరుపులో ప్రచురించిన సైనికా నీకు సలామ్ కవిత సూపర్. నిజంగా సైనికుల గురించి ఎంత చెప్పినా తక్కువే. వారి రుణం ఏమిచ్చినా తీరదు. రచయిత ఆడేరు చెంచయ్య గారు గొప్పగా కవితను అందించారు. అలాగే ఉగ్రవాదుల్లారా ఖబడ్దార్ అనే కవితలో ఉగ్రవాదులను హెచ్చరించిన విధానం బాగుంది. రచయిత కొడవలూరు ప్రసాదరావు గారు గొప్ప కవితలోని పదాలతో ఉగ్రవాదులను భయపెట్టి మనలో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు.
- గాలి పద్మావతి, రాపూరు
- రాయపనేని సుజాత, గిద్దలూరు

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net
email: merupunlr@andhrabhoomi.net

- కటారి రామయ్య