నెల్లూరు

ఇస్తినమ్మ వాయనం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవిందం చిరకాల మిత్రుడు గోపాలానికి ఫోన్ చేశాడు. ‘‘ఓరే గోపాలం వచ్చే ఆదివారం మీ ఊరు వస్తున్నా’’
గోపాలం ప్రశ్నార్థకంగా ముఖంపెట్టి
‘‘నేను ఈ ఊర్లో స్థిరపడి ఇనే్నళ్లయితే నువు ఒక్కసారీ రాలేదు..అకస్మాత్తుగా ఏంటి నీ ప్రయాణం’’ అన్నాడు.
‘‘అదేరా.. అదేరా... వచ్చే ఆదివారం మీ ఊళ్లో.. నాకు ఒక సన్మాన కార్యక్రమము ఉంది’’ సిగ్గుపడుతూ చెప్పాడు గోవిందం.
‘‘సన్మానమా.. నీకా.. ఏం పీకేవని సూటిగా అడిగాడు’’ గోపాలం.
ఆ మాటకి చిర్రెత్తుకొచ్చింది గోవిందానికి. ఆవేశంతో అంతెత్తు ఎగిరిపడ్డాడు.
‘‘ఒరేయ్ మిత్రద్రోహీ.. నేనంటే ఎంత పెద్ద కవినో మర్చిపోయావట్రా’’ అన్నాడు.
‘‘నువ్వా...నువ్వెపుడు కవిత్వం వెలగపెట్టావ్’’
అంటూ అతన్ని ఉడికిస్తూ గోపాలం నవ్వాడు.
గోవిందం కోపంతో జుట్టు పీక్కున్నాడు. మరీ ఎక్కువ కోపం ప్రదర్శిస్తే.. ఉన్న నాలుగు వెంట్రుకలు ఊడిపోతాయని జుట్టు పీక్కోడం ఆపి-
‘‘ఒరే బడుద్దాయ్... 1 నుంచి బి ఎ వరకూ కలిసి మనం చదువుతున్నప్పుడు...అప్పుడప్పుడూ నానోట నుంచి ఆసువుగా పొంగిపొర్లిన కవిత్వధారలకి నువే ప్రత్యక్ష సాక్షివి’’
‘‘మన స్కూలు గ్రౌండ్‌లో ఒక దూడ పేడ వేస్తే ‘‘అదిగో దూడ... ఇదిగో పేడ అంటూ నేను చెప్పిన కవితకు అందరూ చప్పట్లు చరచలేదేరా?
ఒంటిబెల్‌కి .. ఐస్ తింటూ వుంటే చెట్టు మీద తొండ మనని చూసి వెక్కిరించినపుడు నేను ఒక రాయితో దానిని కొట్టి.. వెంటనే ‘‘ఐ సా తొండా అండ్ ఐ త్రో ఎ బండ’’ అని కవిత ఆసువుగా చెప్పలేదా.. మర్చిపోయావురా...
బట్టతల కనబడకుండా.. విగ్గు పెట్టుకుని తిరిగే మన తెలుగు మాస్టారుని చూసి... వెంటనే
‘మేడిపండు విప్పి చూడ పురుగులుండు ... తెలుగుమాస్టారి విగ్గు పీకి చూడ బోడిగుండు ఉండు’ అని నేను చెప్పిన కవితకు నవ్వనివార లేరని గుర్తులేదా..నీకు.
‘కుక్కపిల్ల... సబ్బుబిళ్ల.. అగ్గిపుల్ల’ కాదేదీ కవితకి అనర్హమని శ్రీశ్రీ అన్నాడని తెలుగు మాస్టారు చెబితే తొండ, బండ, కొండ.. కావేవి కవితకు అనర్హమని నేను చెబితే.. నన్ను అభినవ శ్రీశ్రీ అని అందరూ పొగడలేదూ...
‘‘చిన్న చిన్న కవితలను నానీలంటారు..నీ కవితలను ఖూనీలంటారు.. అదే పేరు పెట్టుకొంటావా’’ అన్నాడు నవ్వుతూ గోపాలం.
ఆ మాటలకు గోవిందం కొంత శాంతించి ఎప్పుడో నా కవితలకు ‘‘గోబీలు’’ అని నామకరణం చేసా అన్నాడు.
ఆ మాటలు విన్న గోపాలం ఇలా అనుకున్నాడు
వీడి కవితలు విన్నవాడికి ‘‘గోచీలు’’ కూడా మిగలవని మనసులో అనుకుని.
పైకి ..‘గోబీ’ అంటే అర్ధం నాయినా.. అన్నాను. అదేరా.. ‘గోవిందం చిరు కవితలు’ అని అర్థం.
అంతలో గోవిందం.. ఈ మధ్య పాతపుస్తకాలు ఇంట్లో సర్దుతుంటే చిన్నప్పటి కవితలు కనిపించాయి. బాల్యం నుండి ఇప్పటివరకు నేను రాసిన ‘‘గోబీలు’’ దొరికినాయి. ఆనందంతో అవన్నటినీ కలిపి ఒక పుస్తకంగా వేశాము.
‘‘ఆ పుస్తకం ఓ పెద్దమనిషి చదివి... సార్ మీ కవితలు అద్భుతంగా వున్నాయి. మీకు ఇప్పటివరకూ ఎవరూ ఎలాంటి సన్మానము చేయలేదా’’ అంటూ ఫోన్ చేశాడు.
‘‘లేదు.. చేయలేదు. నా టాలెంట్‌ను ఎవ్వరూ గుర్తించలేదు’’ అనగానే.. ఆయన
‘‘వెంటనే మీకు మా ఊళ్లో సన్మానం చేస్తాం..మీరు తప్పక రావాలి’’ అంటూ అతను ఫోన్ పెట్టేశాడు.
వాళ్లు నాకు కవి కుష్మాండ అన్న బిరుదు ఇవ్వదలచుకున్నార్రా..అన్నాడు ఆనందంగా గోవిందం.
‘కవి కుష్మాండ’ అంటే పేరు బాగుంది గానీ.. దాని అర్ధం ఏమిటో’’ అన్నాడు గోపాలం.
‘‘ఏమో? నాకేం తెల్సు.. వాళ్లు ఇచ్చిన లిస్టులో అదే నాకు నచ్చిన పేరు. అది నేనే సెలక్ట్ చేసుకున్నా’’.
కవి గార్దబాండ, కవి అండపిండ, కవి బ్రహ్మాండ, కవి గండభేరుండ, కవి గండరగండలో నాకా పేరు నచ్చింది అది కన్‌ఫామ్ చేశాను.. నీకు నచ్చలేదురా..’’
‘‘ఎందుకు నచ్చలేదు బాబు.. అద్భుతం. ఇంతకీ మా ఊళ్లో నీకు సన్మానం చేసే పెద్దమనిషి ఎవరబ్బా అన్నాడు’’ గోపాలం.
‘‘ఉన్నాడు ఆయనికి చాలా పేరుందంటగా.. మీ ఊళ్లో.. ఆయనే ఛీఛీ గారు’’
‘‘్ఛ..్ఛ’’నా ... అంటే..
చీరాల చిదంబరంమేనా..
ఆ.. ఆ.. ఆయనే.. ఔను... ఔను,
‘‘అయితే ఆయన ఊరికినే ఎవరికీ సన్మానం చేసిన దాఖలాలు లేవే.. నువ్వేమయినా ఒప్పందం కుదుర్చుకున్నావా ఏంటి?’’
‘‘ఆ అవును.. ఆ పై నెలలో... మా ఊళ్లో ఆయనికి ఘనంగా సన్మానం చేస్తామని’’ చెప్పాను.
‘‘సన్మానమా’’? ఔనా?
ఔను... ఆయనకి ‘కోకో’ పురస్కారం యివ్వబోతున్నాం.
‘‘కోకో’’..అంటే కొండమీద కోతి కాదు కదా.. కొంపదీసి..
‘‘కాదు..కాదు...నీకు వెటకారంగా ఉందా.. కోటిపల్లి కోటేశ్వరరావని.. మా ఊళ్లో ప్రముఖుడు ఉన్నాడు... ఇలాంటి సన్మానాలు చేసి... ఆయన చాలా పాపులర్ అయ్యాడు.
ఆయన ఘనంగా ‘కోకో’ పురస్కారం యిస్తాడు.
‘‘అయితే ఇదన్నమాట.. ఇచ్చిపుచ్చుకొనే వ్యవహారం...
‘‘గివ్ అండ్ టేక్’’... ఇంకా చెప్పాలంటే.. ‘‘పరస్పర సహకార పద్దతి’’ అన్నాడు సాలోచనగా.. గోపాలం.
‘‘ఇస్తినమ్మా వాయినం’’.. ‘‘పుచ్చుకుంటినమ్మా వాయినం’’. వాయినం పుచ్చుకున్నదెవరు..
‘‘నేనే.. ప్రముఖ కవులలో చేరాలన్న తాపత్రయం కలవాడిని.’’

- గోవిందరాజు సుభద్రాదేవి
మోపూరు పెంచల నరసింహం
చరవాణి : 9848627158

స్పందన

కిళ్లీ దొంగ బాగుంది
గత వారం మెరుపులో ప్రచురించిన కిళ్లీదొంగ కథ చాలా బాగుంది. అయితే కథలో రచయిత్రి గౌతమి గారు చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేశారు. కథ నిడివి ఇంకాస్త ఎక్కువగా వుంటే బాగుండేది. భార్యభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకుంటేనే ఆ కాపురం రంగుల హరివిల్లులా సాగుతుంది అని మరోమారు మా పాఠకులకు గుర్తుకు తెచ్చిన గౌతమి గారికి అభినందనలు.
- ఆమని, సర్వేపల్లి
- ప్రభాకర్ శాస్ర్తీ, సుందరమహల్‌రోడ్డు, గూడూరు

హేట్సాప్ లక్కరాజు
మన మెరుపులో మెరుస్తున్న రచయితలో ఒకరు లక్కరాజు శ్రీనివాసరావు. ఈయన ఏది రాసినా అందులో భావన అద్భుతం. ఇక గత వారం మెరుపులో ప్రచురించిన తరులకిదే వందనం అంటూ చెట్ల గొప్పతనాన్ని వర్ణించిన తీరు బాగుంది. ముఖ్యంగా మానవులకు చెట్లు ఎలా ఉపయోగపడుతున్నాయో వివరించి వాటికి వేనవేలు శుభాభివందనం అంటూ కవిత ముగించిన తీర్పు అదుర్స్. నిజంగా లక్కరాజు గారి కవులు ఈ సమాజానికి ఎంతో అవసరం.
- కైలాసం సత్యదేవ్, చిన్నబజార్, నెల్లూరు
- మయూరి, టీచర్, బుచ్చిరెడ్డిపాళెం

నిజంగా కలి‘కాలం’
ఇది ఎండాకాలమా కాదు..వానా కాలమా కాదు..చలికాలమా..కానేకాదు మరి ఇది ఎలాంటి కాలం? అంటూ మొదలైన కవిత చాలా గొప్పగా సాగి జనం చూస్తూ ఉంటారు ఎల్లకాలం..అందుకే అంటారు దీన్ని కలికాలం అంటూ చాలా ముగించి తన మనసులోని బాధను వెళ్లగక్కిన రచయిత నారాయణభట్. కవితలో సామాన్యుడి గోడు ప్రస్ఫుటంగా కనిపించింది.
- లక్ష్మీనారాయణ ఫణి, సర్వోదయ, నెల్లూరు

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

మనోగీతికలు

కలలు..కన్నీళ్లు
అందమైన, ఆనందమైన,
అద్భుతమైన కలలు కన్నాను
కానీ.. అడుగడుగున అడ్డొచ్చాయి పేదరికం, కన్నీళ్లు
ఉన్నత చదువుల కోసం
కోటి కలలు కన్నాను
కానీ, ఫీజులు కట్టలేక కష్టాలు గుర్తొచ్చి కారాయి కంటనీరు
కొలువుల వేటలో కోకోల్లలుగా
ధరఖాస్తులతో కన్నకలలు
అధికారుల అవినీతి, బంధుప్రీతితో కల్లలయ్యాయి
వ్యాపారంలోనైనా రాణించాలని కాంక్షించినా
కలసిరాలేదు కంటతడిలా పెట్టుబడి
నేలమ్మను నమ్ముకొందామన్నా బంగారుకలలు... చినుకురాలక బీళ్లు తెరుచుకున్నాయి నోళ్లు
బ్రతుకు కోసం పల్లెనొదలి
పట్టణాలకొలస వెళ్లినా
కూడు, గూడు, గుడ్డ లేక
దోమకాటుకు బలయ్యాను
చిరుద్యోగాల చిక్కులు బ్రతుకు బండికి పడిన బ్రేకుల్లా
బంధించి వేసే బానిసపు సంకెళ్లు ఆవరించాయి
రెక్కలొచ్చి ఎగిరే ఉల్లి, పప్పు ధరలు దడ పుట్టించాయి
నా రెక్కలమ్మినా నిత్యావసరాలకు సరిపోతుంది
మూడుపుటలా తిండి గగనమైన ఈవేళ
ముప్పూట బ్రతుకు సాగదీయడం అవహేళనయ్యింది
సమసమాజంలో సహచరంతో నాలోని జీవనచక్రం
అతుకుబతుకుల మధ్య ఆగుతూ సాగుతుంది
సాగరంలా వెన్నంటిన సంసారంతో సాగనంటుంది ఈ ఊపిరి
ఊపిరాడకపోతే ఊగిసలాడే ఈ గుండెలయకు ఊరటలేదు
ఎదలో దాగున్నదొకటే కష్టమైన
కఠోరమైన కన్నీళ్ల నుండి
చెమ్మగిల్లి చెక్కిళ్ల నుండి వేడినీటి
బుగ్గలస్థానే ఆనందభాష్పాలు
రావాలని..

- ఎ.వై.శివకుమార్, నెల్లూరు
చరవాణి : 9441222364

ఏ రాజ్యాలు
ఉదయిస్తాయో..!
ఉగ్రభూతం జడలు విప్పి నర్తిస్తోంది
విశ్వమంతా విలయతాండవం చేసేస్తోంది
జటలు విప్పి కోరలుచాచి..విషం చిమ్ముచూ
జగత్తుకే పెనువిపత్తులా దాపురించింది
మనిషి మనిషిగా మసలలేకే మారణహోమాలు
శవాల గుట్టలపై ఏ రాజ్యాలుదయిస్తాయో
పారే నెత్తుటి నీచుకంపులకు పాలకులెవ్వరో
కాలే శవాల కమురు వాసనల్లో
కట్టే కంకళ సౌధమెవ్వరి కోసమో
మండుతోన్న గుండెలతో
అవని అంతా చిధ్రవౌతోంది
ధరిత్రి చరిత్ర అంతా రక్తసిక్తమే
మొన్నటి రాజులు, నిన్నటి బేహారులు,
నేటి ఉగ్రవాదులు
అన్యాయానికి, అశాంతికి పుట్టిన బిడ్డలు వీరు
ప్రభాత వెలుగులు మింగే చీకటి శక్తులు వీరు
ఈ బండబారిన మొండి బతుకుల్లో
ప్రేమ పల్లవాలుదయిస్తాయా?
ఔను ఈ విశాల జగమంతా రణరంగ
స్థలమైపోయింది
నెత్తుట ముసిగిన ఓడలా వుందీ లోకం
జాతులు, మతాల భేదం విడిచి
చేతులు కలిపి నినదించాలి
ఆ జనరణ నినాదాల కంపనాలకు రక్కసి మూకలు గుండెలు పగిలి చావాలోయ్
ఆ నూతన ప్రపంచ సృష్టి వైపుగా..సాగుదాం

- కె.రవిశేఖర్, నాయుడుపేట
చరవాణి : 9849388182

అక్షర దక్షిణ
చుక్కనీరు కరువై
నీకై మొక్కగా ఓ వరుణా!
అక్కరకు మించిన స్థాయిలో
మిక్కుటముగ కురిపిస్తివి వాన
ఉక్కిరిబిక్కిరయ్యాయి
ఊరు..వాడ..కొండ..కోన
జలదిగ్బంధమున చిక్కుకుని
పెక్కుజనుల ఆక్రందన
ఆత్మీయుల ఆచూకీ తెలియక
వర్ణణాతీత ఆవేదన
వరుణా! ఇకనైనా చాలించవా
నీ దారుణ విజృంభణ
కుమిలిపోతున్న అమాయక జీవులకు
కలిగించవా ప్రాణరక్షణ
అని వేడుకుంటూ అర్పిస్తున్నాను
అక్షర లక్షల తక్షణ దక్షిణ

- అల్లాడి వేణుగోపాల్,
నెల్లూరు

వృక్ష విలాపం
పండ్లు కాయలనిచ్చి
జనుల ఆకలితీర్చి
చల్లగాలులనిచ్చి
వర్షాలు రప్పించి
ప్రాణులకు నీడిచ్చి
సేదదీరగనిచ్చి
ఆమ్లజనినందించి
ప్రాణాలు నిలబెట్టి
వరద వేగమునాపి
భూమి సారాన్ని నిలబెట్టి
జీవకోటికెపుడు
ఆధారమై బ్రతుకు
మా మీద పగ ఏల
మము నరుకుతారేల?
రహదారు భవనాల
నిర్మాణమని అంటూ
మమ్ము నరికేస్తారు
అడ్డు తొలగిస్తారు
మా ఉనికి మీ కొరకు
మరచిపోతున్నారు
‘పవరు’ తీగలకు మేం
అవరోధమంటారు
మా తలలు అడ్డంగ
ఖండించి వేస్తారు
స్వార్థాన్ని విడనాడు
ఓ మానవా నీవు!
నిస్వార్థమైన మా
సేవలను గమనించు.
ప్రకృతి సమతూక
నియమాన్ని గుర్తించు!
మేధావి మానవా,
విజ్ఞతను పెంచుకో!
మా ఉనికె మీ ప్రగతికి
మూలమని గ్రహించు!
వృక్షజాతిని నీవు సంరక్షణ చేయి!
మనిషి జాతిని రక్ష చేసి వర్థిల్లు
వృక్షోరక్షతి రక్షితః అని నమ్ము
సర్వత్రా నీ జాతి ప్రగతి సాధించు!

- చాకలికొండ శారద,
విశ్రాంతి ప్రధానోపాధ్యాయిని,
విబిహెచ్, కావలి

చరిత్ర సృష్టిద్దాం
వన దేవతకు వందనం
పావన దేవతకు అభివందనం

చెట్టుగాలై ఉసురు నిలుపు
చెట్టు వానై గొంతు తడుపు
చెట్టు గింజై కడుపు నింపు
చెట్టు నూలై వస్తమ్రిచ్చు

చెట్టు గూడై నిన్ను కాచు
చెట్టు నీడై తోడు నిలుచు
చెట్టు మందై రోగమణచు
చెట్టు పువ్వై పూజ నిలుచు

చెట్ల పచ్చరంగు చేయు కనులవిందు
అడువులే పుడమితల్లికి అలంకారము
తరువులే తరిగిపోతే కరువు
గుండెలే చెరువు బతుకే బరువు
ప్రకృతి పార్వతి యండి
ప్రణమిల్ల రారండి
ఘనముగా జరుపుకుందాం

మొక్కకదా దిక్కు మనకు
మెక్కుదామ కలసి తనకు
వృక్షముల దీవెనలను
అక్షయముగ పొందుదాం

చెట్టపట్టాలేసుకొని
చెట్లనెన్నో నాటుదాం
పచ్చదనం పరిచేద్దాం
ముచ్చటగా మెరిపిద్దాం

ఆంధ్రావని సమస్తాన్ని
అక్షయ పాత్రగ చేద్దాం
హరితాంధ్రను సాధిద్దాం
చరిత్రనే సృష్టిద్దాం

- చిరమన వెంకట రమణయ్య,
గూడూరు
చరవాణి : 9441380336

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

email: merupunlr@andhrabhoomi.net

- గోవిందరాజు సుభద్రాదేవి