మెయిన్ ఫీచర్

సగం మంది నెటిజన్లు.. సైబర్ నేరాల బాధితులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటర్నెట్ వినియోగంలో ఈ ఏడాది అంతానికి మన దేశం ప్రపంచంలోనే రెండోస్థానానికి చేరుకోబోతుండగా- సైబర్ నేరాల జోరు కూడా అదే స్థాయిలో ఊపందుకుంటోంది. వచ్చే నెలాఖరుకు భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 402 మిలియన్లకు చేరుకుంటుందని ఐఎఎంఎఐ (ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) తాజా నివేదికలో పేర్కొంది. అంతర్జాల వినియోగంలో ప్రస్తుతం చైనా ప్రథమ స్థానంలో ఉండగా, ద్వితీయ స్థానంలో ఉన్న అమెరికాను కిందకు నెట్టేసే క్రమంలో భారత్ దూసుకుపోతోంది. మన దేశంలో ‘నెటిజన్ల’ సంఖ్యకు సంబంధించి ఈ ఒక్క ఏడాదిలోనే 49 శాతం వృద్ధి చోటుచేసుకుంది. అంతర్జాల సేవలు విస్తరిస్తున్నాయన్న సంబరం సంగతేమో గానీ, భారత్‌లో సగం మంది ‘నెటిజన్లు’ ఏదో ఒక రూపంలో సైబర్ మోసగాళ్ల బారిన పడుతున్నారు.
ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు విస్తరించడం, స్మార్ట్ ఫోన్ల వినియోగం అనూహ్యంగా పెరగడంతో మన దేశంలో అన్ని వర్గాల వారూ అంతర్జాలాన్ని విరివిగా వినియోగిస్తున్నారు. పల్లెలు, నగరాలు అనే తేడా లేకుండా ఇ-కామర్స్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ సేవలను పొందుతున్న వారి సంఖ్య అంచనాలకు మించి పెరుగుతోంది. 2014 సంవత్సరానికి సంబంధించి చూస్తే- నెటిజన్లలో 48 శాతం మంది సైబర్ నేరాల బారిన పడ్డారని ‘నార్టన్’ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా 113 మిలియన్ల మంది సైబర్ నేరాలను ఏదో ఒక రూపంలో ఎదుర్కొన్నారు. ఇంటర్నెట్‌ను వినియోగించేవారిలో ప్రతి వ్యక్తి సగటున 16,500 రూపాయలను నష్టపోయినట్లు అంచనా.
వినియోగదారుల పాస్‌వర్డ్‌లను తస్కరించి క్రెడిట్ కార్డుల ద్వారా నష్టం కలిగిస్తున్న సైబర్ నేరగాళ్ల జోరుకు అంతూపొంతూ లేకుండా పోతోంది. ఆర్థిక వ్యవహారాల్లోనే కాదు, అశ్లీల ఫొటోలు, అసభ్యకర రాతలతో మానసిక క్షోభకు గురిచేసే సైబర్ నేరగాళ్లు వీరవిహారం చేస్తున్నారు. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల వారూ కార్యాలయాల్లో, ఇంటి వద్ద ఇంటర్నెట్ వినియోగానికి మొగ్గు చూపడంతో సైబర్ నేరాలు పెరగడమే కాదు, సామాజిక వెబ్‌సైట్లలో సమాచారం పట్ల కూడా సందేహాలు చోటు చేసుకుంటున్నాయి. మనదేశంలో ‘పాస్‌వర్డ్’ భద్రత విషయంలో 41 శాతం మంది మాత్రమే తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ‘పాస్‌వర్డ్’లు తస్కరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో వ్యక్తిగత విషయాలు సైతం ‘నెట్’లో బహిర్గతం అవుతున్నాయి. వ్యక్తిగత సమాచారం తెలుసుకుంటూ సైబర్ నేరగాళ్లు ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా, లైంగికంగా వేధిస్తున్న ఉదంతాలు
నానాటికీ అధికమవుతున్నాయి. వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడానికి బదులు, నాలుగింట ఒకవంతు నెటిజన్లు ‘పాస్‌వర్డ్’లను ఇతరులకు చెప్పడానికి ఏ మాత్రం సంకోచించడం లేదని సర్వేలో తేలింది. ఈ కారణంగా ఎంతోమంది నెటిజన్లు సైబర్ నేరగాళ్ల బారిన పడడం, ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించడం నేడు సర్వసాధారణమైంది. విశ్వవ్యాప్తంగా చూస్తే నెటిజన్లలో ప్రతి వ్యక్తి సగటున 23,878 రూపాయల మేరకు నష్టపోతుండగా, భారత్‌లో మాత్రం ప్రతి నెట్ వినియోగదారుడు సగటున 16,500 రూపాయలను నష్టపోవడం ఆందోళన కలిగించే పరిణామని సైబర్ నిపుణులు అంటున్నారు. ఆర్థిక నష్టమే కాదు, తమకు మానసిక ఇబ్బందులు తప్పడం లేదని ఫిర్యాదు చేస్తున్న నెటిజన్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వ్యక్తిగత విషయాలు తెలుసుకుని, తమను పలురకాలుగా సైబర్ నేరగాళ్లు వేధిస్తున్నారని చాలామంది నెటిజన్లు వాపోతున్నారు. వ్యక్తిగత విషయాలు బహిర్గతం కావడంతో తాము తీవ్ర భావోద్వేగాలకు లోనవుతున్నట్లు ప్రతి పదిమంది నెటిజన్లలో కనీసం ఎనిమిది మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ నేరాల బారిన పడుతున్నట్లు భారత్‌లో 36 శాతం మంది నెటిజన్లు అంగీకరిస్తుండగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఖ్య 19 శాతంగా నమోదైంది. సైబర్ నేరాలను ధైర్యంగా ఎదుర్కొంటామని 40 శాతం మంది మాత్రమే చెబుతున్నారు. సర్వే సందర్భంగా ‘నార్టన్’ ప్రతినిధులు 17 దేశాలకు చెందిన 17,125 మంది నెటిజన్లను పలు అంశాలపై ప్రశ్నించారు. ఈ సర్వేలో భారత్ నుంచి సుమారు వెయ్యిమంది నెట్ వినియోగదారులు పాల్గొన్నారు. 18 నుంచి 55 ఏళ్లలోపు వయసు వారు నెట్ వినియోగానికి సంబంధించి తమ అనుభవాలను, అలవాట్లను తెలియజేశారు. 50 ఏళ్లు దాటిన వారు మాత్రం నెట్ వినియోగంలో తగు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు. యువజనులు మాత్రం నెట్ వినియోగంలో స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. ‘పాస్‌వర్డ్’ల సమాచారాన్ని ఇతరులతో పంచుకుంటున్నట్లు 31 శాతం మంది యువజనులు అంగీకరించారు. ఇది ప్రమాదకర ధోరణి అని తెలిసినప్పటికీ వారు ఆన్‌లైన్‌ను యథేచ్ఛగా వినియోగిస్తున్నారు.
వినియోగదారుల్లో అలక్ష్యం, అలసత్వం కారణంగానే సైబర్ నేరాల జోరు పెరుగుతోందని, మోసాల గురించి తెలిసిన తర్వాత కూడా ప్రతి నలుగురు నెటిజన్లలో ఒకరు మాత్రమే అప్రమత్తంగా ఉంటున్నారని తేలింది. తాము సైబర్ నేరగాళ్ల బారిన పడబోమని ప్రతి పదిమంది నెటిజన్లలో నలుగురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో ప్రతి పదిమంది నెట్ వినియోగదారుల్లో కనీసం ఏడుగురు సైబర్ నేరాల బారిన పడలేదంటున్నారు. అయితే, గత ఏడాది కాలంలో ఈ పరిస్థితిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొబైల్ ఫోన్లను తస్కరించడం ద్వారా కూడా సైబర్ నేరాలకు అవకాశాలు పెరుగుతున్నాయి. తమ స్మార్ట్ ఫోన్లు తస్కరణకు గురైనట్లు భారత్‌లో 32 శాతం మంది చెబుతుండగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఖ్య 15 శాతంగా ఉంది. ‘పాస్‌వర్డ్’ల బహిర్గతం చేయడం మంచిదికాదని తెలిసినప్పటికీ, భారత్‌లో ఎంతోమంది నెట్ వినియోగదారులు ఆ సమాచారాన్ని బంధుమిత్రులతో పంచుకుంటున్నారు.

-లాస్య