నెల్లూరు

స్టాండింగ్ కమిటీలో బడ్జెట్ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, మార్చి 22: నెల్లూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 2016-17 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఆమోదం పొందింది. మంగళవారం నెల్లూరు నగరపాలక కార్పొరేషన్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్లో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో బడ్జెట్‌పై చర్చించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది మెరుగ్గా ఉండే విధంగా బడ్జెట్ అంచనాల ప్రతిపాదనలను సిద్ధం చేశారు. గతంలోలా కాకుండా ఈ ఏడాదికి పక్కాగా ప్రభుత్వం నుంచి వస్తున్న గ్రాంట్లను లెక్కలోకి తీసుకుని బడ్జెట్ తయారుచేశారు. అయితే బడ్జెట్‌లో కార్పొరేషన్‌కు సంబంధించిన విలువైన స్థలాలను బడా నాయకులకు లీజు పేరుతో కట్టబెట్టేందుకు మేయర్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాగుంట లేఅవుట్‌లో ఉన్న కార్పొరేషన్ స్థలాన్ని ఒక కల్యాణ మండపానికి ధారాదత్తం చేశారు. అదేవిధంగా నగరంలో ఉన్న విలువైన కార్పొరేషన్ స్థలాలను బడాబాబులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత ఏడాది బడ్జెట్ 610 కోట్ల రూపాయలకు ప్రతిపాదలు తయారుచేస్తే అందులో కేవలం 160 కోట్లు మాత్రమే కార్పొరేషన్ ఖర్చు పెట్టిందన్నారు. అయితే గత ఏడాది అండర్ గ్రౌండ్ డ్రైనేజి, తాగునీటి పథకం ప్రాజెక్టులకు 1130 కోట్ల రూపాయలు వస్తాయని బడ్జెట్‌లో ప్రతిపాదనలు తయారుచేసి పెట్టారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రెండు ప్రాజెక్టులకు ఒక్క పైసా కూడా రాలేదు. అదేవిధంగా బిపిఎస్ స్కీమ్ నుండి 50కోట్ల రూపాయలు వస్తాయని గత బడ్జెట్‌లో పెట్టారు. అయితే గత ఏడాది రాకున్న నిధులు ఈ బడ్జెట్‌లో తప్పక వస్తాయని ఊహించి అత్యధిక స్థాయిలో బడ్జెట్‌లో తయారుచేశారు.
కాకి లెక్కల బడ్జెట్ కాదు:మేయర్
నగరపాలక సంస్థ 2016-17 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఊహాజనితమైనది కాదని గ్రాంటు రూపంలో రాబోతున్న నిధులను క్రోడీకరించి తయారుచేసిన బడ్జెట్ అని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఈ ఏడాదిలో తొలివిడతగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజి, తాగునీటి పథకానికి సంబంధించి పనులు కూడా ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు మొత్తం మూడేళ్ళలో పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు. అందులో తొలివిడతగా 3వ భాగం నిధులు కార్పొరేషన్‌కు మంజూరు అవుతాయని చెప్పారు. గత ఏడాది బిపిఎస్ స్కీమ్ కింద రావాల్సిన 50 కోట్ల రూపాయలు ఈ ఏడాదిలో తప్పకుండా వస్తాయన్నారు. గత ఏడాదిలో బిపిఎస్ స్కీమ్‌ను పొడగించడం వల్ల కార్పొరేషన్‌కు రావాల్సిన నిధులు రాలేదన్నారు. అదేవిధంగా జనరల్ ఫండ్స్ నుండి 50కోట్ల రూపాయలు, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు 40కోట్ల రూపాయలు వస్తాయన్నారు. డ్రైయిన్స్, పార్కులు, శానిటేషన్‌కు అత్యధిక స్థాయిలో నిధులు కేటాయించినట్లు తెలిపారు. స్కూల్స్, కమ్యూనిటీ హాల్స్, ఫుట్‌పాత్‌ల ఆధునీకరణపై ప్రత్యేక దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. గతంలోలా కాకుండా ఇక నుంచి ప్రతి పైసాకు లెక్క ఉండే విధంగా ఈ-కోడ్ విధానాన్ని రూపొందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు జెడ్ శివప్రసాద్, బొల్లినేని శ్రీవిద్య, మేకల రజని, బాలకోటేశ్వరరావు, ఎస్‌ఇ ఇమమూద్దీన్, హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.