నెల్లూరు

బిజెపి జిల్లా అధ్యక్ష ఎన్నిక పూర్తయ్యేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఏప్రిల్ 3: బిజెపి జిల్లా అధ్యక్షుడి నియామక ప్రక్రియ నెలల తరబడి కొలిక్కి రాకుండా సందిగ్ధంలోనే కొనసాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో విచారం వ్యక్తమవుతోంది. ఎన్నికల కమిషన్ నియామవళి అనుసరించి అన్ని రాజకీయ పార్టీలు రెండేళ్లకోమారు సభ్యత్వాల నమోదు విధిగా చేపట్టాలి. సభ్యత్వాల నమోదు తరువాయి సంస్థాగత ఎన్నికలు చేపట్టాల్సి ఉంది. దాదాపు అన్ని రాజకీయ పార్టీల్లోనూ సంస్థాగత ఎన్నిక అనే బదులు ఎంపిక లెక్కనే సాగుతున్నారు. ఈ ఎంపికలకు సంబంధించి ఏకాభిప్రాయం అనేది ఎప్పుడోగాని కనిపించదు. అధికారంలో ఉన్న పార్టీలకైతే ఏకాభిప్రాయం సంగతి అటుంచితే అంతర్గత పోటీ తీవ్రతరంగా ఉంటుంది. దీంతో ఆశావహుల్లో క్రమశిక్షణ అనే అంశాన్ని గీటురాయిగా చూపుతూ, పోటీ స్థితిని సర్దుబాటు చేస్తూ పదవుల పందారంపై దృష్టిసారిస్తుండటం పరిపాటి. బిజెపి నెల్లూరు జిల్లా కమిటీ అధ్యక్ష పదవి విషయానికి వస్తే పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. ఈక్రమంలో అధ్యక్ష పదవినే నెలల తరబడి కొలిక్కి తీసుకురాకుండా యథాతధ స్థితిని కొనసాగిస్తున్నారు. ఒక్క జిల్లా అధ్యక్ష పదవికే కాకుండా ఇతర పదవుల అంశంలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉండటం గమనార్హం. ప్రస్తుతం బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండటంతోపాటు ప్రధాని నరేంద్రమోదీకి సగటు జన బాహుళ్యంలో ఎంతోకొంత అనుకూల పవనం వీస్తోంది. దీంతో అధికారంలో లేనప్పుడు పార్టీ పదవులు భారంగా భావించే వారంతా ఇప్పుడు పోటీ పడుతుండటం గమనార్హం. బిజెపికి నెల్లూరు జిల్లాలో విచిత్ర పరిస్థితి నెలకొని ఉందనే చెప్పాలి. ప్రస్తుతం ప్రధాని మోదీకి కుడిభుజంగా కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు వ్యవహరిస్తుండటం తెలిసిందే. అలాంటి ఉన్నత స్థితిలో ఉన్న నేతకు సొంత జిల్లా అయిన నెల్లూరువాకిట పార్టీ పటిష్టత ఎండమావే. అధికారంలో ఉన్నప్పుడైనా జిల్లా అధ్యక్షుడిగా సమర్థ నేతతో భర్తీ చేయకపోతే ఎలాగని పార్టీ శ్రేణులు నిష్ఠూరం చెందుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడి మాదిరిగానే పార్టీ పరిస్థితి కూడా అంతా అసౌష్టవమే. ఇకనైనా పార్టీ పురోగతి దిశగా బాటలు వేయకపోతే ఎలాగనే అభిప్రాయం వినవస్తోంది. కాగా, రేపోమాపో రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ఎంఎల్‌సి సోము వీర్రాజు నియామకం జరగవచ్చని ప్రచారం. ఆ తరువాత అయినా నెల్లూరు కమిటీ అధ్యక్ష పదవి అంశంపై స్పష్టత ఏర్పడుతుందా అనేది వేచి చూడాలి. వాస్తవంగా ముందు జిల్లా కమిటీలు ఏర్పడిన తరువాతే రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరగడం ఆనవాయితీ. అయితే జిల్లాలోని పార్టీ నేతల్లో సమన్వయం లేకపోవడంతో జిల్లా కమిటీ ఎంపిక వెనక్కు వెళ్తోంది. ఈ పదవి లక్ష్యంగానే కొన్నాళ్ల క్రితం బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి శిష్యుడైన జయరాజ్ కావలికి చెందిన సీనియర్ నాయకుడు కందుకూరు సత్యనారాయణపై పత్రికాముఖంగా విమర్శలు చేశారు. ఇదిలాఉంటే సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం జరిగితే మిత్రపక్షంగా ఉన్న తమ తప్పులు కూడా ఎత్తిచూపుతూ ఆరోపణలు సంధిస్తారంటూ తెలుగుతమ్ముళ్లు ఒకింత ఆందోళనకరమైన అభిప్రాయాలు వినిపిస్తున్నారు. నెల్లూరులో మాత్రం తెలుగుదేశం నేతలు బిజెపి తమకు ఎన్నటికీ పోటీ కాబోదనే ధీమాను ఎండగట్టేలా బిజెపి ఎప్పుడు అగ్రభాగంలోకి చేరుతుందనేది సందేహాస్పదమే. కేంద్ర మంత్రి వెంకయ్య సొంత ఇలాఖాలోనే ఇలాంటి స్థితి ఉంటే ఎలాగనేది బిజెపి అభిమానుల అభిప్రాయంగా ఉండటం గమనార్హం. వాస్తవంగా ప్రధాని మోదీ అంతరంగం కూడా బిజెపి వివిధ రాజకీయపక్షాలతో చెలిమి సాగిస్తూనే సొంతంగా పురోగతి సాధించాలి. ఆ క్రమంలోనే గత 2014 పార్లమెంటరీ ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షాల సంఖ్యాబాహుళ్యంతో నిమిత్తం లేకుండానే లోక్‌సభలో సొంత మెజారిటీ చూపించారు. అనంతరం వచ్చిన మహారాష్ట్ర ఎన్నికల్లో తమ చిరకాల చెలిమి పక్షమైన శివసేనను కూడా కాదని అక్కడ సొంతంగానే పార్టీ బావుటా ఎగరవేసేలా చూశారు. కొన్ని రాష్ట్రాల్లో ఆశాజనకంగా పుంజుకోకున్నా క్రమేపి ఎదుగుదలే లక్ష్యంగా సాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో అసోంలో ఆశాజనకమనే అంచనాల్లో ఉన్నారు. ఇంతవరకు పార్టీ తరపున చట్టసభల్లో బోణీయే ఎరుగని కేరళలో ఎలాగైనా ఖాతా ప్రారంభించాలని మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌ను రంగంలోకి దించారు. అలాంటి స్ఫూర్తిదాయకంగా సాగే పార్టీ అగ్రనేతల ఆశయాలకు తగ్గట్లు నెల్లూరుజిల్లా కమిటీ కూడా కొలువుదీర్చే తంతు త్వరగా వేగిరపరచాలని బిజెపి సగటు కార్యకర్తల మనోభిప్రాయంగా ఉంది.