నిజామాబాద్

బహుజనులంతా రాజ్యాధికార సాధనకు పోరాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక్‌నగర్, జనవరి 15: బహుజనులంతా రాజ్యాధికార సాధనకై పోరాడుతూ, బహుజన పార్టీని బలోపేతం చేయాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్షశిల గైక్వాడ్ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని దుబ్బ ప్రాంతంలో గల ఆదర్శనగర్ చౌరస్తా వద్ద జనకల్యాణ దినోత్సవ మహాసభ నిర్వహించారు. అంతకుముందు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బిఎస్‌పి అధినేత్రి మాయావతి 61వ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్‌చేసి, పేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గైక్వాడ్ మాట్లాడుతూ, భావిభారత ఆశాజ్యోతి కుమారి మాయావతి త్యాగశీలత, కార్యదీక్షత ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. బహుజనుల కోసం ఆమె చేస్తున్న కృషి చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. గ్రామగ్రామాన సభలు, సమావేశాలు నిర్వహిస్తూ బహుజన సమాజాన్ని జాగృతం చేసేందుకు బడుగు వర్గాల ప్రతినిధులు కృషి చేయాలని కోరారు. తన జన్మదినం రోజున బహుజనులను ఏకతాటిపైకి తెచ్చేందుకు మాయావతి ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్‌పి ఉపాధ్యక్షుడు ఎ. రాజీవ్, ప్రధాన కార్యదర్శి ఎస్.గణేష్, డి.ప్రభుదాస్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

17ను కుల నిర్మూలన పోరాట దినంగా పాటించాలి
సమితి జిల్లా కన్వీనర్ మాణిక్యం
వినాయక్‌నగర్, జనవరి 15: ఈ నెల 17వ తేదీని కుల నిర్మూలన పోరాట దినంగా పాటించాలని కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా కన్వీనర్ మాణిక్యం పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఫులాంగ్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా దళితులు, ముస్లింలు, మైనార్టీలపై జరుగుతున్న హిందుత్వ దాడులను ప్రతిఘటించాలని అన్నారు. అతికొద్ది సంఖ్యలో ఉన్న అగ్రవర్ణాల వారు బడుగు, బలహీన వర్గాల వారిపై రాజ్యాధికార దురహంకారంతో స్వారీ చేస్తున్నారని, అవకాశం ఉన్న ప్రతీచోట అణిచివేసే ధోరణిని అవలంభిస్తున్నారని ఆయన ఆక్షేపించారు. దళితులు, పీడిత కులాల్లో ఆత్మగౌరవం, చైతన్యం పెరగడాన్ని చూసి జీర్ణించుకోలేక, వారిపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు వంటి అనేక దాష్టీకాలకు పాల్పడుతున్నారని అన్నారు. వెలివాడలపై దాడులు చేస్తున్న అగ్రకుల మనువాదులకు అండగా రాజ్యం పోలీసులను కాపలా పెడుతోందని, అందుకే రోహిత్‌వేముల మరణానికి కారణమైన నిందితులను ఇంతవరకు శిక్షింపబడలేదని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్‌ఎస్‌ఎస్, గోరక్ష కమిటీల పేర్లతో దళితులు, అణగారిన వర్గాల వారిని ఇబ్బందులకు గురి చేయిస్తున్నారని ఆరోపించారు. పల్లెల్లో సాంఘిక బహిష్కరణలు వంటి సంఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నప్పటికీ, పాలకులు పట్టించుకోవడం లేదని, దళితులను ఎప్పటికీ వెనుకంజలోనే నిలిపివేసేలా అగ్రకులాల వారు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఈ నెల 17న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయ సదస్సును నిర్వహించడం జరుగుతుందని, ముఖ్య అతిథులుగా ఐగోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ ఆనంద్ తెల్‌తుంబ్డె, దళిత ఉద్యమ నాయకుడు జిజ్ఞేష్ మోహన్(గుజరాత్), దళిత ఆత్మగౌరవ పోరాట సమితి నాయకులు వికాస్ ఆర్.వౌర్య తదితరులు హాజరుకానున్నారని తెలిపారు. జిల్లా నుండి అధిక సంఖ్యలో అణగారిన వర్గాల వారు పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్కం ప్రభాకర్, రాజేందర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.