నిజామాబాద్

నిజాంసుగర్స్ కథ కంచికేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, మార్చి 10: నిజాంచక్కెర కర్మాగారాల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయక పోవడంతో కార్మికులు తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత శాసనసభా సమావేశాలలో ఈ ఫ్యాక్టరీల విషయం చర్చకు రాగా ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందిస్తూ నిజాంసుగర్స్ కర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపే పరిస్థితిలో లేదని తేల్చిచెప్పారు. దాంతో ఈ కర్మాగారాలు కనీసం సహకార రంగంలో నడిపేందుకు సర్కారు చర్యలు చేపడుతుందన్న సంకేతాలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీల నిర్వహణ విషయంలో ఎటువంటి చర్యలు చేపట్టలేక పోయింది. సహకార రంగానికి చర్యలు చేపట్టక పోవడం, లే ఆఫ్ ఎత్తివేత జరుగక పోవడంతో తమ పరిస్థితి గందరగోళంగా మారిందని కార్మికులు గొల్లుమంటున్నారు. ఈ కర్మాగారాలను ప్రభుత్వం నిర్వహించే విషయమై కార్మికులు రెండు సంవత్సరాలుగా అనేక విధమైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రథాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటు తెలుగుదేశం, వామపక్ష పార్టీలు సైతం కార్మికుల పక్షాన పోరాటాలు చేశాయి. ఎన్నికలలో ఇచ్చిన వాగ్ధానం ప్రకారం వంద రోజులలో నిజాంచక్కెర కర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయా పార్టీల నాయకులు ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ వీటి విషయంలో ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టలేక పోయింది. సమైఖ్య రాష్ట్రంలో అప్పటి తెదేపా సర్కారు బోధన్ నిజాంచక్కెర కర్మాగారంతో పాటు మెట్‌పల్లి నియోజకవర్గంలోని ముత్యంపేట, మెదక్ జిల్లాలోని ముంబోజిపల్లి చక్కెర కర్మాగారాలను జాయింట్ వెంచర్ ద్వారా ప్రైవేటు పరం చేయగా తెలంగాణ రాష్ట్రం వస్తే తమ బతుకులు బాగు పడతాయన్న ఆశతో ఈ కర్మాగారాలలో పనిచేసే కార్మికులు ఉద్యమంలో చురుకుగా పాల్గొని తమ ప్రత్యేకతను చాటుకున్నారు. అలాగే తెలంగాణ ఏర్పాటై తెరాస అధికారంలోనికి వస్తే కార్మికులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ముఖ్యమంత్రితో పాటు నిజామాబాద్ ఎంపి కవిత, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్‌లు స్పష్టమైన హామీలిచ్చారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కర్మాగారాల విషయమై ఎటువంటి చర్యలు చేపట్టక పోవడంతో కార్మిక కుటుంబాలు గొల్లుమంటున్నాయి. ఈ కర్మాగారాలలో ప్రైవేటు యాజమాన్యం 2015 డిసెంబర్ చివరి వారంలో లే ఆఫ్ ప్రకటించింది. అప్పటి నుండి కార్మికులకు కనీసం వేతనాలు కూడా లేకుండాపోయాయి. ఫ్యాక్టరీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం దేవుడెరుగు కానీ కనీసం తమకు బకాయి పడ్డ వేతనాలైనా చేతికందితే తాము ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడతామంటూ కార్మికులు పేర్కొంటున్నారు. ఈ బకాయిలను ఇప్పించి విఆర్‌ఎస్ ప్రకటిస్తే తమకు నాలుగు పైసలు చేతికొస్తాయని కుటుంబాలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ కర్మాగారాన్ని సహకార రంగంలో నడిపేందుకు సర్కారు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇక్కడి రైతులు మాత్రం ఫ్యాక్టరీని సహకార రంగంలో నడిపేందుకు ముందుకు రాలేక పోతున్నారు. దాంతో నిజాంసుగర్స్ కర్మాగారాల భవితవ్యం ఇక ప్రశ్నార్థకమేనని స్పష్టంగా తెలుస్తోంది. గత శాసనసభా సమావేశాలలో సర్కారు స్పష్టతను ఇచ్చినప్పటికీ కార్మికులకు న్యాయం చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టక పోవడంతో ఇక్కడి కార్మికులు ప్రభుత్వ చర్యల కోసం నిలువెల్లా ఎదురు చూస్తున్నారు. శాసనసభలో స్పష్టతనిచ్చిన ముఖ్యమంత్రి ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఆచరణలో పెట్టి తమకు న్యాయం చేయాలని కార్మికులు కోరుతున్నారు. పదిహేను నెలలుగా వేతనాలు లేకపోవడంతో అనేక మంది కార్మికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. కొందరు కార్మికులు కుటుంబాలు పోషించుకోలేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. సుగర్స్ కార్మికుల విషయంలో మొదటి నుండీ ధైర్యంగా ముందడుగు వేసి ఎళ్లవేళలా కార్మికుల పక్షాన నిలిచిన నిజామాబాద్ ఎంపి కవిత ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తుందని కార్మికులు పూర్తి భరోసాతో ఉన్నారు. ఇప్పటికే అనేక పర్యాయాలు కార్మిక నాయకులు ఎంపీని కలిసి తమ గోడును వినిపించారు. దాంతో స్పందించిన ఎంపి ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆ హామీ ఎప్పుడు నెరవేరుతుందో అని ఎదిరి చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కర్మాగారాల విషయంలో ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకుని తమను ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

ప్రతి మొక్కకూ నీరందించాలి
జాయంట్ కలెక్టర్ సత్తయ్య
గాంధారి, మార్చి 10: హరితహారంలో భాగంగా నాటిన ప్రతీ మొక్కకూ నీరు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నాటిన మొక్కలకు విద్యార్థులు నీరు పోయాలని జాయింట్ కలెక్టర్ సత్తయ్య అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతీ శుక్రవారం నిర్వహిస్తున్న వాటరింగ్ డేను పురస్కరించుకుని మొక్కలకు ఆయన నీరును పోశారు. అనంతరం విద్యార్థుల నుద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు మొక్కల పెరుగుదల విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, మొక్కలను రక్షించే విషయమై ప్రజలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని వివరించారు. త్వరలో జరుగనున్న పదవ తరగతి పరీక్షలో విద్యార్థులు బాగా రాసి మంచి మార్కులతో పాసై తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం పోతంగల్ కలాన్ గ్రామ పంచాయతీ పరిధిలోని కర్ణంగడ్డను సందర్శించారు. తండాలో నెలకొన్న సమస్యలను తాండాకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు జాయంట్ కలెక్టర్‌కి వివరించాడు. పోతంగల్ శివారులోని నర్సరీని ఆయన పరిశీలించారు. నర్సరీలో మొక్కల పెంపకానికి తీసుకుంటున్న చర్యలను స్థానిక ఎంపిడిఓ సాయాగౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు. నర్సరీలో మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుని సిబ్బంది వాటి పరిరక్షణకు కృషి చేయాలని వివరించారు. ప్రతీ మొక్క బ్రతికే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండలు బాగా ఉంటే దాని నుండి మొక్కల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలను తెలుసుకుని జాగ్రత్త వహించాలన్నారు. ఆయన వెంట ఉపాధిహామీ ఈసి హరిబాబు, పాఠశాల సిబ్బంది తదితరులున్నారు.

కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ బదిలీ

కామారెడ్డి, మార్చి 10: కామారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ విజయలక్ష్మీని శుక్రవారం రాత్రి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత 8నెలల క్రితం సదాశివపేట్ మున్సిపాలిటీలో మేనేజర్‌గా పనిచేసిన విజయలక్ష్మీని కామారెడ్డి మున్సిపాలిటీకి కమిషనర్‌గా బదిలీపై వచ్చారు. మున్సిపల్ కమిషనర్‌గా ఆమె పనితీరుపై అధికారుల్లో ప్రజాప్రతినిధుల్లో ఉన్న అసంతృప్తి వల్లే ఆమెను తిరిగి సదాశివపేట్ బల్దియా మేనేజర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. కామారెడ్డి ఆర్డీఓ శ్రీనును బల్దియా కమిషనర్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.