నిజామాబాద్

రాష్ట్రంలో నిరంకుశ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 30: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగిస్తోందని బిజెపి నేత నాగం జనార్ధన్‌రెడ్డి ఆక్షేపించారు. ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలను ప్రశ్నిస్తే, ప్రతిపక్ష పార్టీల సభ్యులను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేస్తున్నారని అన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో చేటు చేస్తుందని, చట్టసభల్లో ప్రశ్నించే వారు కరువైతే ప్రజాస్వామ్యం ప్రజలకు వ్యతిరేకంగా పని చేస్తుందని ఆందోళన వెలిబుచ్చారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెరాస ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై అసలేమాత్రం గౌరవం లేదని, శాసన వ్యవస్థ పట్ల అపనమ్మకంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా 11శాతం ఉంటే, వారికి 12శాతం రిజర్వేషన్లు పెంచాలని బిల్లును ప్రవేశపెట్టారని, దీనిని ప్రశ్నించిన బిజెపి ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సుధీర్ కమిటీ కూడా 10శాతం వరకు రిజర్వేషన్లు పెంచాలని సిఫార్సు చేస్తే, సిఎం కెసిఆర్ ఏకంగా 12శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. నిజానికి ముస్లిం రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమైనదని, మతపరమైన రిజర్వేషన్లకు చట్టబద్ధత ఉండదనే విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా ఉటంకించారని నాగం పేర్కొన్నారు. ఈ విషయాలను ప్రస్తావించిన బిజెపి సభ్యులను సభ నుండి సస్పెండ్ చేయడం సిగ్గుచేటన్నారు. తాను తన 30సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని మునుపెన్నడూ చూడలేదని నాగం పేర్కొన్నారు. ఇదిలాఉండగా, దళారులు, వ్యాపారులు కుమ్మక్కై మిర్చి పంటకు ఒక్కసారిగా ధర తగ్గించివేయడంతో కడుపు మండిన రైతులు ఆందోళనకు దిగితే, వారిని ఆదుకోవాల్సిన బాధ్యతను కెసిఆర్ సర్కార్ విస్మరిస్తోందని విమర్శించారు. పైపెచ్చు ఆందోళనలు చేసేది రైతులు కాదంటూ తన అసమర్ధతను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తోందన్నారు. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీం కింద కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో మిర్చి రైతులను ఆదుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, ఈ దిశగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని దుయ్యబట్టారు. కేంద్రంతో ఒప్పందం కోసం సమగ్ర ప్రతిపాదనలతో కూడిన దస్త్రాన్ని ఉద్యానవన శాఖ సమర్పించిన నెల రోజులవుతున్నప్పటికీ, సదరు ఫైలు సిఎం కెసిఆర్ వద్దే మూలుగుతోందన్నారు. ప్రస్తుతం రైతులను ఆకట్టుకునేందుకు ఎకరానికి 4వేల చొప్పున ఎరువుల కోసం నిధులు ఖాతాల్లో జమ చేస్తామంటూ నమ్మబలుకుతున్నారని అన్నారు. గిట్టుబాటు ధర లభించక రైతులు తల్లడిల్లుతున్నా, సిఎం కెసిఆర్ తన వద్ద స్పెషల్ ఫండ్ కింద అట్టిపెట్టుకున్న 1800కోట్ల రూపాయల నిధుల నుండి రైతులకు నయా పైసా అందించకపోవడం ఆయనకు రైతుల పట్ల ఏపాటి చిత్తశుద్ధి ఉందో చాటుతోందని ఎద్దేవా చేశారు. గడిచిన మూడేళ్ల కాలంలో రైతులను ఏ విధంగానూ ఆదుకున్న పాపాన పోలేదని, కేవలం హామీలు, ప్రకటనలతోనే తెరాస సర్కార్ కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. మొత్తంగా చూస్తే కెసిఆర్ పాలన ‘పాలిటిక్స్ ఫుల్ - పరిపాలన నిల్’ అన్న చందంగా మారిందని విమర్శించారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్నా, వాటి గొంతు నొక్కుతూ సిఎం కెసిఆర్ అహంకారపూరితంగా దుర్మార్గపు పాలనను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోకపోతే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

మేడే పండుగకు కార్మిక సంఘాలు సమాయత్తం

కంఠేశ్వర్, ఏప్రిల్ 30: అనునిత్యం శ్రమిస్తూ సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించే కార్మిక లోకం ఆనందోత్సాహాల మధ్య మేడే సంబరాలు జరుపుకునేందుకు సమాయత్తమైంది. ఆయా కార్మిక సంఘాల ప్రతినిధులంతా ప్రతిఏటా వస్తున్న ఆనవాయితీని పాటిస్తూ గత వారం రోజుల నుండే మేడే ఉత్సవాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వాడవాడలా ఎర్రజెండాలను రెపరెపలాడించనున్నారు. వందలాది మంది కార్మికులతో నగరంలో ర్యాలీలు నిర్వహించి, బహిరంగ సభలు జరుపనున్నారు. ఎటు చూసినా కార్మిక లోకం కోలాహలమే కనిపించనుంది. ప్రపంచ కార్మికుల ఐక్యతకు, సంఘీభావానికి చిహ్నంగా నిలిచే మే డే పండగలో కార్మికులంతా పాల్గొంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో ప్రాణత్యాగం చేసిన అమర వీరులను మేడే సందర్భంగా స్మరించుకుంటూ వారికి విప్లవ జోహార్లర్పించనున్నారు. మేడేను విజయవంతం చేయాలని కోరుతూ వివిధ కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్ల నాయకులు ఇప్పటికే సదస్సులు నిర్వహించి ఎక్కడికక్కడ గోడప్రతులను ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద కార్మికుల శ్రమైక జీవనానికి ప్రతీక అయిన ఎర్రజెండాలు, బ్యానర్లతో ముందుగానే అలంకరించారు. ప్రతిఏటా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్న మేడే ప్రాశస్త్యాన్ని అవలోకిస్తే, ఎనిమిది గంటల పని దినం అమలు చేయాలని కోరుతూ అమెరికా దేశంలోని చికాగో నగరంలో 1886 మే 1వ తేదీన మూడున్నర లక్షల మంది కార్మికులు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా హేమార్కెట్ స్క్వేర్‌లో జరిగిన కాల్పుల్లో అనేక మంది కార్మికులు మృతి చెందారు. వారి రక్తంలో తమ చొక్కాలు తడిపి మిగితా కార్మికులు ఎర్రజెండాలను ఎగురవేసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. కార్మిక పోరాట ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా 8గంటల పని దినం అమలులోకి వచ్చింది. ఈ పోరాటం నుండి స్ఫూర్తి పొందేందుకు వీలుగా ప్రతిఏటా కార్మిక లోకం మేడే ఉత్సవాలను నిర్వహించుకుంటోంది. వాస్తవానికి చికాగో సంఘటనకు ముందు నుండే కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తూ వచ్చారు. 1856వ సంవత్సరంలో ఆస్ట్రేలియాలో కార్మికులంతా ఒకరోజు పనిని పూర్తిగా నిలిపివేసి ఆ ఏడాది ఏప్రిల్ 21వ తేదీన వినోద కార్యక్రమాల ద్వారా ఆనందాన్ని చవిచూశారు. ప్రతి ఏడాది ఇదే విధంగా చేయాలని నిర్ణయించారు. అనంతరం అమెరికాలో 1886 మే 1వ తేదీన డిమాండ్ల సాధన కోసం పనులను నిలిపివేసి కార్మిక దినంగా పాటించారు. 2లక్షల మంది కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొని 8గంటల పనిదినాన్ని అమలు చేయాలని కోరగా, యాజమాన్యాలు అంగీకరించలేదు. 1888లో తిరిగి మే 1వ తేదీన కార్మిక దినోత్సవంగా పాటించాలని నిర్ణయించారు. 1889లో ఐరోపా అంతటా కార్మిక ఉద్యమం విస్తరించింది. అంతర్జాతీయ కార్మిక మహాసభకు 400మంది ప్రతినిధులు హాజరయ్యారు. మే మొదటి రోజున కార్మిక దినోత్సవంగా పాటించాలని తీర్మానించారు. ఈ క్రమంలోనే కార్మిక లోకం బూర్జువా వర్గానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ తమ డిమాండ్లను సాధించుకుంది. అప్పటి నుండి ప్రతిఏటా మేడే ఉత్సవాలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం ద్వారా స్ఫూర్తి పొందుతామని కార్మిక సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఎఐటియుసి, సిఐటియు,ఐఎప్‌టియు, టిఎన్‌టియుసి, ఐఎన్‌టియుసి, సిపిఎం, సిపిఐ అనుబంధ సంఘాల నాయకులు మేడే సంబరాలను అట్టహాసంగా నిర్వహించుకునేందుకు వీలుగా కార్మికులను సమాయత్తం చేశారు.

తెరాస ప్రభుత్వాన్ని రైతులు క్షమించరు
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
మిర్చి పంటను కేంద్రం సేకరించేలా కృషి చేస్తానని వెల్లడి

నిజామాబాద్, ఏప్రిల్ 30: రైతులను ఆదుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన బాధ్యతను విస్మరించి, కేవలం ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తున్న తెరాస ప్రభుత్వాన్ని రైతులు ఎంతమాత్రం క్షమించబోరని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. మూడేళ్ల తెరాస పాలనలో హామీలే తప్ప రైతులు, ప్రజలకు ఒనగూరిన ప్రయోజనం శూన్యమేనని ఆయన దుయ్యబట్టారు. ఆదివారం ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు హాజరైన సందర్భంగా స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ కార్తికేయ, ఇతర అధికారులతో కేంద్ర మంత్రి దత్తాత్రేయ సమీక్ష జరిపారు. ప్రధానంగా తాగునీటి సరఫరా తీరుతెన్నులు, పంటలకు మద్దతు ధర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే ప్రస్తుతం మిర్చి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మార్కెట్‌లో నిర్ణీత ధర రైతుకు దక్కనప్పుడు మార్కెట్ ఇంటర్‌వెన్షన్ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యత్యాసపు ధరను సరిసమాన స్థాయిలో రైతులకు అందించేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. అయితే ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని జాప్యం చేసిందన్నారు. కందుల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం 756 కోట్ల రూపాయలను రాష్ట్రానికి విడుదల చేస్తూ, లక్షా 55 వేల మెట్రిక్ టన్నుల కందులు సేకరించిందన్నారు. ఇదే తరహాలో మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీం కింద మిర్చి పంటను కూడా సేకరించేందుకు అవకాశాలు ఉన్నాయా? అనే అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో చర్చిస్తానని దత్తాత్రేయ భరోసా కల్పించారు. రైతు సమస్యలను తాము రాజకీయం చేయదల్చుకోలేదని, అన్నదాతను ఆదుకోవడమే బిజెపి ధ్యేయమని పేర్కొన్నారు. ఎటొచ్చీ ముందుగా రైతులకు మేలు చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్రానికి ప్రతిపాదనలు అందాల్సి ఉంటుందని, ఈ విషయంలో కెసిఆర్ సర్కార్ తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆక్షేపించారు. తెరాస అధికారంలోకి వస్తే మూడు నెలల్లోపే నిజాం సుగర్స్‌ను ప్రభుత్వపరం చేస్తామని చెప్పిన కెసిఆర్, ప్రస్తుతం మూడేళ్లు గడుస్తున్నా ఆ వాగ్దానాన్ని నిలుపుకోవడం లేదన్నారు. పైపెచ్చు ఇదివరకు ప్రైవేట్ భాగస్వామ్యంలో కొనసాగిన ఎన్‌ఎస్‌ఎఫ్ కర్మాగారం పూర్తిగా మూతబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం కార్మికులతో పాటు వేలాది మంది రైతులకు శరాఘాతంగా మారిందని అన్నారు. ఏవైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించి కర్మాగారాలను తెరిపించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆక్షేపించారు. ఎన్‌ఎస్‌ఎఫ్ విషయమై ముఖ్యమంత్రి కెసిఆర్ విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయాధారిత పరిశ్రమలను విరివిగా నెలకొల్పేందుకు చొరవ చూపాలన్నారు. దురదృష్టవశాత్తు తెరాస అధికారం చేపట్టిన అనంతరం మూడేళ్లలో రాష్ట్ర రాజధాని మినహా జిల్లాలలో ఏ ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదని అన్నారు. ఆదిలాబాద్‌లో మూతబడిన సిమెంట్ ఫ్యాక్టరీని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తెరిపిస్తామని, ఈ విషయమై కేంద్ర భారీ పరిశ్రమల శాఖతో పాటు జాతీయ రహదారుల శాఖ మంత్రులు, అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని దత్తాత్రేయ పేర్కొన్నారు. బీడీ కార్మికుల కోసం ఆర్మూర్ ప్రాంతంలో ఇఎస్‌ఐ ఆసుపత్రిని నిర్మించే ప్రతిపాదనలను పరిశీలిస్తామని, సిద్ధులగుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి త్రైపాక్షిక సమావేశం
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే త్రైపాక్షిక సమావేశం నిర్వహిస్తామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. జర్నలిస్టులకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును తు.చ తప్పకుండా అమలు చేయాలని, మజీథియా బోర్డు సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ఇప్పటికే కేంద్ర కార్మిక శాఖ తరఫున ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రెండు పర్యాయాలు లేఖలు రాశామని అన్నారు. ఇది ఉమ్మడి జాబితాలోని అంశం కావడం, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనిది కావడం వల్ల స్పందించడం లేదన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై మరోమారు రాష్ట్ర ప్రభుత్వాలు, యాజమాన్యాలు, వర్కింగ్ జర్నలిస్టులతో త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. విలేఖరుల సమావేశంలో బిజెపి నాయకులు నాగం జనార్దన్‌రెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, లోక భూపతిరెడ్డి, గడ్డం ఆనంద్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, పల్లె గంగారెడ్డి, గీతారెడ్డి, అమృతలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

షీ టీమ్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి
పోలీసు కమిషనర్ కార్తికేయ
ఇందూర్, ఏప్రిల్ 30: నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన షీ టీమ్స్ సేవలు మహిళలు, యువతులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కార్తికేయ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో మొత్తం 6 షీ టీమ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టీమ్‌లో ఒక ఇన్స్‌పెక్టర్‌ను అధికారిగా నియమించి, ఒక ఎస్‌ఐ, ఇద్దలు మహిళా పోలీసులు, ఇద్దరు కానిస్టేబుల్స్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ బృందం సభ్యులు ప్రధానంగా స్ర్తిలపై వేధింపులు అధికంగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని, అక్కడ సాధారణ ప్రజలలో కలిసిపోవడం జరుగుతుందని, ఈ బృందం వద్ద ఉండే నిఘా కెమెరాల్లో ఆకతాయిల వేధింపులను రికార్డు చేసుకోవడం జరుగుతుందని సిపి వెల్లడించారు. నేర స్వభావాన్ని బట్టి నేరస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించడం గానీ, వారిపై కేసు నమోదు చేయడం గానీ జరుగుతుందన్నారు. మహిళలు ఎవరైనా ఆకతాయిల వేధింపుల నుండి రక్షణ కోసం వాట్సప్ నెంబర్ 9490618029కు మెసేజ్ గానీ, డయల్ 100కు గానీ ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, జన సందోహం ఎక్కువగా ఉండే బస్టాండ్స్, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో ఆకతాయిలు సైగలు చేయడం, వేధింపులకు పాల్పడటం, కళాశాలల్లో వేధింపులకు గురయ్యే విద్యార్థినులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటే షీ టీమ్స్‌కు సమాచారం అందించాలని సూచించారు. అదే విధంగా 2017 ఏప్రిల్ 1నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలను వెల్లడించారు. ఈ నెల రోజుల్లో మొత్తం 13సంఘటనలు చోటు చేసుకోగా, నిజామాబాద్ డివిజన్‌లో 11, బోధన్, ఆర్మూర్ డివిజన్ల పరిధిలో ఒక్కోక్కటి చోటు చేసుకున్నాయని అన్నారు. ఈ సంఘటనల్లో 31మంది మందిని పట్టుకుని 16కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద 3 కేసులను నమోదు చేయడం జరిగిందని, పట్టుబడిన మొత్తం 31లో 12మందికి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని సిపి వెల్లడించారు.

రెట్టింపు ధరకు మినరల్ వాటర్ విక్రయాలు
అధికారుల దాడులతో మూతబడ్డ అనధికారిక ప్లాంట్లు
ఇదే అదనుగా అమాంతంగా రేట్లు పెంచి అమ్మకాలు

నిజామాబాద్, ఏప్రిల్ 30: ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో జిల్లా యంత్రాంగం నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై చర్యలకు ఉపక్రమించగా, ఈ పరిణామం కాస్త ప్రజానీకంపై పెనుభారం మోపినట్లయ్యింది. ఇబ్బడిముబ్బడిగా వాటర్ ప్లాంట్లు మూతబడడాన్ని అనుకూలంగా మల్చుకుని, ఐఎస్‌ఐ అనుమతులు కలిగి ఉన్న అరకొర వాటర్ ప్లాంట్ల నిర్వహకులు ఇదే అదనుగా చెలరేగిపోతున్నారు. ఒక్కసారిగా రెట్టింపు కంటే ఎక్కువ స్థాయిలో ధరలు పెంచి మినరల్ వాటర్ విక్రయాలు జరుపుతున్నారు. 30 లీటర్ల నీటి క్యాన్ ధర ఇదివరకు 12రూపాయలకు లభించేది కాగా, ప్రస్తుతం దానిని 30రూపాయలకు పెంచివేశారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ, ప్రజారోగ్య శాఖల అధికారులు గడిచిన వారం రోజుల నుండి నిరంతరంగా దాడులు కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెలసిన వాటర్ ప్లాంట్లను గుర్తిస్తూ ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు. ఒక్క జిల్లా కేంద్రంలోనే ఇప్పటివరకు ముప్ఫైకు పైగా వాటర్ ప్లాంట్లను సీజ్ చేసినట్టు తెలిసింది. అధికారుల దాడులు కొనసాగుతుండడాన్ని గమనించి మిగతా వాటర్ ప్లాంట్ల నిర్వహకులు ముందస్తుగానే తమ ప్లాంట్లను మూసివేసుకుని తాళాలు వేలాడదీశారు. దీంతో ఐఎస్‌ఐ ప్రమాణాలు కలిగి, నిబంధనలకు అనుగుణంగా ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్న నిర్వహకులకు ఈ పరిణామం కాస్తా కాసుల వర్షం కురిపిస్తోంది. వారం రోజుల క్రితం వరకు కూడా నిర్ణీత ధరకే మినరల్ వాటర్ అందించిన సదరు నిర్వహకులు, ప్రస్తుతం ఇబ్బడిముబ్బడిగా ప్లాంట్లు మూతబడి కొరత ఏర్పడిన దృష్ట్యా ధరను అమాంతంగా రెట్టింపు చేశారు. ఒక్కో నీటి క్యాన్‌ను 30రూపాయలకు విక్రయిస్తున్నారు. హోల్‌సెల్‌లో కిరాణా షాపుల వారికి పాతిక రూపాయలకు అందజేస్తున్నారు. అది కూడా తమకు బాగా తెలిసిన వారుంటేనే మినరల్ వాటర్ బాటిళ్లను సప్లై చేస్తున్నారు. మార్కెట్‌లో గల్లీగల్లీలో చిన్నచిన్న బడ్డీ కొట్లలోనూ అందుబాటులో ఉంటూ వచ్చిన వాటర్ క్యాన్లు ప్రస్తుతం అధికారుల దాడులతో కనుమరుగవడంతో, వీటికి అలవాటుపడిన సగటు జీవులంతా పడరాని పాట్లు పడుతున్నారు. మున్సిపల్ కుళాయిల ద్వారా వచ్చే నీరు కలుషితమై వస్తుండడంతో వాటికి ప్రత్యామ్నాయంగా మినరల్ వాటర్ బాటిళ్లను కొనుగోలు చేసుకునేందుకు సామాన్య కుటుంబాలు కూడా ఎప్పుడో అలవాటుపడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వాటర్ ప్లాంట్లు మూతబడి మినరల్ వాటర్‌కు తీవ్రమైన కొరత నెలకొంది. ప్రధానంగా అందుబాటులో ఉన్న మూడు, నాలుగు కంపెనీలకు చెందిన వారే ప్రస్తుతం అరకొర స్థాయిలో మార్కెట్‌లోకి మినరల్ వాటర్‌ను సప్లై చేస్తున్నారు. సదరు కంపెనీలు తాము శుద్ధి చేసిన జలాలు అందిస్తున్నామని నమ్మబలుకుతున్నప్పటికీ, పలువురు నిర్వహకులు నేరుగా బోరుబావుల నుండి నీటిని క్యాన్లలో నింపి సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలంటే ముందుగా అనేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అన్నింటికి మించి నీటిని శుద్ధి చేసే ఐఎస్‌ఐ మార్క్ కలిగిన యంత్రంతో పాటు నీటి పరీక్షలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాలపై ఎలాంటి ప్రభావం చూపదని నిర్ధారణ అయిన తరువాతనే దానిని మరింతగా శుద్ధి చేసి విక్రయించాలని నిబంధనలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఐఎస్‌ఐ మార్క్ శుద్ధి యంత్రాలు కలిగిన కంపెనీలు ఒక్కసారిగా పెరిగిన డిమాండ్‌తో నీటిని శుద్ధి చేయకుండానే క్యాన్లలో నింపి సప్లై చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అది కూడా అమాంతంగా ధరను రెట్టింపు కంటే ఎక్కువకు పెంచి విక్రయిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు తమ ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలనే తాపత్రయంతో వంద శాతానికి పైగా పెంచిన ధరను భరిస్తూ మినరల్ వాటర్ క్యాన్లను దక్కించుకునేందుకు అపసోపాలు పడుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం పట్టించుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవడం వరకు బాగానే ఉన్నప్పటికీ, అందుబాటులో ఉన్న ప్లాంట్ల నిర్వహకులు ఎకాఎకిన ధరలను రెట్టింపు చేసి నీటి వ్యాపారం సాగిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం మినరల్ వాటర్ పేరుతో తెరపైకి వచ్చిన ఈ నయా దోపిడీని నిలువరించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.

సమస్యలకు నిలయం జనరల్ ఆసుపత్రి
కంఠేశ్వర్, ఏప్రిల్ 30: ప్రజలకు అత్యాధునిక, మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించే జిల్లా జనరల్ ఆసుపత్రి ప్రస్తుతం సమస్యలకు నిలయంగా మారిందని చెప్పవచ్చు. గత రెండు మూడు రోజుల వరకు తీవ్రమైన తాగునీటి ఇక్కట్లను ఎదుర్కొన్న విషయం విధితమే. తాజాగా, శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో అత్యావసర విభాగాలతో పాటు ఆయా వార్డుల్లో చికిత్సలు పొందుతున్న పేషెట్లు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ముఖ్యంగా అత్యావసర విభాగం, ఐసియు, గైనిక్, ఆర్థోపెడిక్ తదితర వార్డుల్లో వైద్యం పొందుతున్న వారు నానా అవస్థలు ఎదుర్కొన్నారు. గైనిక్ వార్డులో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో శస్త్ర చికిత్స చేయించుకున్న మహిళలతో పాటు డెలివరీ అయిన బాలింతలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రెండు మాసాల క్రితమే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇక్కడ ఈ-ఆసుపత్రిని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఎదుర్కొంటున్న సమస్యలపై రోగుల బంధువుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఒక ఫిర్యాదుల పెట్టేను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించడం జరిగింది. అయితే రోగుల బంధువుల నుండి ఫిర్యాదులు, విమర్శలు పెద్దఎత్తున వెల్లువెత్తే అవకాశం ఉండటంతో ఆసుపత్రి ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేయలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోగులకు ముఖ్యమైన స్కానింగ్, ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే తదితర విభాగాల్లోని సిబ్బంది అందుబాటులో ఉంటూ, సాయంత్రం 5గంటల వరకు వైద్య సేవలు సేవలు అందించాల్సి ఉన్నప్పటికీ, మధ్యాహ్నం ఒంటిగంట లోపే పై విభాగాలను మూసివేస్తున్నారు. రోగులు ఇదేమిటని ప్రశ్నిస్తే, అంతా మా ఇష్టమని, స్కానింగ్, ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ రిపోర్టులు త్వరగా కావాలంటే బయట చేయించుకోవాలని సమాధానం ఇస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. అత్యావసర విభాగాల్లో 24గంటల పాటు డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని డిఎంహెచ్‌ఓ, ఆసుపత్రి సూపరింటెండెంట్ చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. జిల్లాలో స్వైన్‌ఫ్లూ సోకిన రోగులు చికిత్స నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి వస్తే, సరైన చికిత్సలు అందించడంలో వైద్యులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. పైగా స్వైన్‌ఫ్లూ వ్యాధి నివారణకు అవసరమైన మందులు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయా, లేవా అనే విషయాన్ని కూడా చెప్పిన నాథుడే కరవయ్యారని పలువులు బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు ఉదయం వేళలో ఆసుపత్రికి బయోమెట్రిక్ విధానంలో హాజరు వేసుకుని, యథావిధిగా మళ్లీ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి తమ విధులను కొనసాగిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఆసుపత్రిలో అవినీతిని పూర్తిగా అరికట్టినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములు పేర్కొంటున్నప్పటికీ, స్ట్ఫా నర్సులు, సిబ్బంది రోగులు, డెలివరీకి వచ్చే గర్భిణీ స్ర్తిల నుండి వసూళ్ల పర్వం కొనసాగిస్తునే ఉన్నారని పలువురు బాధితులు పేర్కొంటున్నారు. డబ్బులు వసూలు చేస్తున్న విషయమై సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు రోగుల బంధువులు ఫిర్యాదులు చేస్తున్నా, పట్టించుకునే నాథుడే కరవయ్యారని ఆరోపణలు ఉన్నారు. ఇక మార్చురీలో అనాథ శవాలను భద్రపర్చేందుకు అవసరమైన ఫ్రీజర్లు సరిపడా లేకపోవడంతో గుర్తు తెలియని మృతదేహాలను బయటనే పారవేస్తుండటంతో ఆ ఆవరణ మొత్తం కంపుకొడుతోంది. కలెక్టర్ డాక్టర్ యోగితారాణా వారం రోజుల పాటు సెలవులో ఉండటం, జిల్లా జనరల్ ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పందించి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని రోగుల బంధువులు కోరుతున్నారు.

ఘనంగా శంకరాచార్య జయంతి ఉత్సవాలు

కామారెడ్డి, ఏప్రిల్ 30: జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి ఉత్సవాలను ఆదివారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న శారదాదేవి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. వేదపండితులు బ్రహ్మశ్రీ గంగావరపు ఆంజనేయశర్మ, అర్చకులు సతీష్, సంతోష్‌ల ఆధ్వర్యంలో ఉదయం నుండి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉత్సవ పూజ, అభిషేకాలు, తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగావరపు ఆంజనేయశర్మ మాట్లాడుతూ, భక్తులు ఆధ్యాత్మికతను అలవాటు చేసుకోవాలని సూచించారు. మంచి మార్గంలో నడిచి ఇతరులకు ఆదర్శంగా నిలవాల్సిందిగా సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న మాతా శారదాదేవి ఆలయంలో ఆదిశంకరచార్య జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఉదయం నుండి భక్తులతో క్షిరాభిషేకం, విశేషపూజ, వేదగోష్టి, పండితుల ఉపన్యాసాలు, తీర్థప్రసదాలు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు మైపాల్‌రెడ్డి, రాజేశ్వర్, శ్రీనివాస్, గంగాధర్, బాలాజీ తదితరులు ఉన్నారు.

కర్నాటక రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జిగా మధుయాష్కీ
ఇందూర్, ఏప్రిల్ 30: నిజామాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్‌కు మరోమారు పార్టీ పరంగా కీలక పదవులు దక్కాయి. ప్రస్తుతం ఆయన ఎఐసిసి అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, ఆ పదవిని యథాతథంగా కొనసాగిస్తూనే ఆయనకు ఎఐసిసి నాయకత్వం మరికొన్ని అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎఐసిసి కార్యదర్శి హోదాలో కర్నాటక రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జిగా నియమించారు. ఈ మేరకు ఆదివారం ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేదీ నియామక పత్రాన్ని జారీ చేశారని మధుయాష్కీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.