నిజామాబాద్

కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 7: ప్రస్తుత రబీ సీజన్‌లో రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటలను దృష్టిలో పెట్టుకుని వాటి సేకరణ నిమిత్తం ప్రభుత్వపరంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు గురువారం తన చాంబర్‌లో జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయమై చర్చించారు. వరి ధాన్యంతో పాటు మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలను ఆయా ప్రాంతాల వారీగా నెలకొల్పాలని నిర్ణయించారు. పిట్లంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని, బాన్సువాడ, పిట్లం, ఎల్లారెడ్డి, ఆర్మూర్‌లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఈ నెల 11వ తేదీ నుండి అందుబాటులో ఉంచాలని జె.సి అధికారులకు ఆదేశించారు. జొన్న, మొక్కజొన్న పంటలను మార్క్‌ఫెడ్ ద్వారా సేకరించనున్నారు. ఈ నెల 11వ తేదీనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సైతం ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనేది నిర్ణయిస్తామని జె.సి రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని, విపత్కర పరిస్థితులను అధిగమిస్తూ పంటలు సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధర అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈసారి ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలను నెలకొల్పుతున్నామని తెలిపారు. మొక్కజొన్న క్విటాలుకు 1325రూపాయలు, జొన్నకు 1570 రూపాయల చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాల్లో పూర్తిస్థాయిలో మద్దతు ధర చెల్లించడం జరుగుతుందన్నారు. అయితే రైతులు బాగా ఆరబెట్టిన, శుభ్రపర్చిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కాగా, జిల్లాలో ఈసారి వరి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. దీంతో తక్కువ సంఖ్యలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు రెండున్నర లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు చేయాల్సి ఉండగా, కేవలం 40వేల ఎకరాలకే ఈ పంట సాగు పరిమితమైంది. నాటిన విస్తీర్ణంలోనూ అనేకచోట్ల బోర్లు ఎండిపోయి, చీడపీడలు, తెగుళ్లు సోకి దిగుబడులు గణనీయంగా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈసారి కేవలం 40వేల మెట్రిక్ టన్నుల వరకే వరి ధాన్యం దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా 20 నుండి 25వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. వరి పంట ఏయే ప్రాంతాల్లో సాగు చేశారనే వివరాలను పరిశీలిస్తూ, సంబంధిత ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను నెలకొల్పనున్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం దిగుబడులు చేతికందే ప్రాంతాల్లో ఈ కేంద్రాలను అందుబాటులో ఉంచుతామని జె.సి పేర్కొన్నారు. సమావేశంలో డిఎస్‌ఓ కృష్ణప్రసాద్, మార్క్‌ఫెడ్ సహాయ సంచాలకులు రేఖతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.