నిజామాబాద్

నూతన పారిశ్రామిక విధానంతో విరివిగా పరిశ్రమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 12: బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానంతో తెలంగాణలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రముఖ కంపెనీలతో పాటు ఎంతోమంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న టిఎస్‌ఐపాస్ విధానం ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి పరిశ్రమల ఏర్పాటుకు చేపడుతున్న చర్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నందిపేట మండలం లక్కంపల్లిలోని సెజ్‌ను సందర్శించి మొదటి దశలో ఏర్పాటు చేయనున్న ఫుడ్‌పార్క్ పనుల ప్రగతి గురించి సంబంధిత అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్‌లో ఎంపి కల్వకుంట్ల కవిత అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక అతిథిగా హాజరై తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పరిశ్రమల శాఖపై జరిగే చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపనతోనే త్వరితగతిన ప్రగతి సాధ్యమవడమే కాకుండా, నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం ఎంతో సులభతరంగా పరిశ్రమలకు ఏకగవాక్ష విధానం ద్వారా అనుమతులు జారీ చేస్తోందని చెప్పారు. కొత్త పరిశ్రమలను నెలకొల్పేందుకు దరఖాస్తులు చేసుకున్న పక్షం రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నామని వివరించారు. నిర్ణీత సమయానికి ఒక్కరోజు గడువు దాటినా, అనుమతులు మంజూరు చేసినట్టే భావించాలని పేర్కొనడం జరిగిందని, ఈ తరహా విధానం మరెక్కడా లేదన్నారు. ఓ వైపు పరిశ్రమల స్థాపనకు వెసులుబాటు కల్పిస్తూనే, దళిత, నిరుద్యోగ యువతకు టిఎస్‌ఐపాస్ ద్వారా సబ్సిడీతో కూడిన తక్షణ రుణ సదుపాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలోని లక్కంపల్లి సెజ్‌లో తొలిదశ పనులు ప్రారంభమయ్యాయని, స్థానికంగా ఏర్పాటవుతున్న ఫుడ్ పార్క్ ద్వారా బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు ఆన్‌లైన్ ద్వారా మార్కెటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా స్కిల్ డెవలప్‌మెంట్‌ను మరింతగా పటిష్టపరుస్తూ మెరుగైన శిక్షణ అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుని అర్హులైన ప్రతి ఒక్కరూ ఆర్థిక పరిపుష్టిని సాధించాలని మంత్రి జూపల్లి ఆకాంక్షించారు. జిల్లాకు చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేల చొరవతో నందిపేట మండలం లక్కంపల్లిలో ఫుడ్‌పార్క్‌ను మంజూరు చేశామని, దీనిద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో 10కోట్ల రూపాయలతో లెదర్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వ్యవసాయానుబంధ పరిశ్రమలను నెలకొల్పేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రధానంగా వ్యవసాయం, పరిశ్రమల స్థాపనతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతూ రాష్ట్రం త్వరితగతిన ప్రగతి బాట పట్టేందుకు ఆస్కారం ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ రంగాలపై తెరాస ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని అన్నారు.
కాగా, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఇతోధికంగా తోడ్పాటును అందిస్తూ కనీసం పది వేల మందికి ఉద్యోగాలు లభించేలా చూడాలని ఎంపి కవిత మంత్రి జూపల్లిని కోరారు. వేల్పూర్ మండలంలో పసుపు(స్పైస్)పార్కు ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ 32కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయనున్నట్టు ప్రకటించారని, దీనిని త్వరితగతిన ఏర్పాటు చేస్తే అటు రైతులకే కాకుండా ఇతర అనేక రంగాల వారికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. జిల్లాలో మూతబడ్డ నిజాం షుగర్స్, ఎన్‌సిఎస్‌ఎఫ్ కర్మాగారాలను పునరుద్ధరించే విషయమై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కోరారు. వీటిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ పారిశ్రామికంగా నిజామాబాద్ జిల్లా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపి బిబి.పాటిల్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్, జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.