నిజామాబాద్

దేశానికే ఆదర్శం మిషన్ కాకతీయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 14: బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. ఇప్పటికే నీతి ఆయోగ్ సంస్థ ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ప్రశంసించిందని, దేశ వ్యాప్తంగా ఈ తరహాలో చేపట్టాల్సిన అవసరం ఉందంటూ సిఫార్సు చేసిందని చెప్పారు. మిషన్ భగీరథ కార్యక్రమం కూడా ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని, ఉత్తరప్రదేశ్, బెంగాల్, బిహార్ తదితర రాష్ట్రాల్లోనూ దీనిని చేపడతామని అక్కడి పార్టీలు ఎన్నికల్లో వాగ్దానాలు చేస్తున్నాయని గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలో గల రఘునాథ చెరువు ఆధునికీకరణ పనులు చేపట్టి మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు వీలుగా మిషన్ కాకతీయ రెండవ విడతలో ప్రభుత్వం 6.28కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ పనులకు గురువారం సాయంత్రం మంత్రి హరీష్‌రావు జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం, ఎంపిలు కవిత, బిబి.పాటిల్, ఎమ్మెల్యేలు బిగాల, జీవన్‌రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమల్లోకి తెస్తూ అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు.
ఈ దిశగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలు బంగారు తెలంగాణ నిర్మాణానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. అరవై ఏళ్ల కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలోని పాపాలను పూర్తిగా కడిగేందుకు కొంత సమయం పడుతుందని, ఇప్పటికే అనేక సమస్యలను అధిగమించగలిగామని అన్నారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకెళ్తుంటే, ప్రతిపక్షాలు అర్ధరహిత విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. తెరాస అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రైతుల కోసం 1024కోట్లతో గిడ్డంగులను నిర్మిస్తున్నామని, సాగునీటి ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌లో 25వేల కోట్ల రూపాయలను కేటాయించామని, ఇచ్చిన హామీకి కట్టుబడి సేద్యానికి 9గంటల విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. అన్నింటికి మించి వేల కోట్ల రూపాయలతో చేపడుతున్న మిషన్ కాకతీయ కార్యక్రమం వల్ల చెరువుల పునరుద్ధరణ జరిగి లక్షలాది ఎకరాల భూములు సస్యశ్యామలంగా మారనున్నాయని తెలిపారు. కాగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొట్టమొదటగా నిజామాబాద్ జిల్లాకే ప్రయోజనం చేకూరుతుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు జలాలను హల్దివాగు మీదుగా నిజాంసాగర్‌లోకి మళ్లించి చివరి ఆయకట్టు పంటలకు కూడా ఖరీఫ్, రబీ సీజన్‌లలో సమృద్ధిగా నీటిని అందించవచ్చని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నిజాంసాగర్ కాల్వల మరమ్మతుల కోసం త్వరలోనే మరో 200కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తామని మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చారు.
కాగా, మిషన్ కాకతీయ రెండవ విడత పనుల్లో నిజామాబాద్ జిల్లా అన్ని చెరువుల పనులకు టెండర్ల ప్రక్రియను చేపట్టడం ద్వారా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి హరీష్‌రావు జిల్లా యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులను అభినందించారు. మొత్తం 626చెరువులకు మంజూరీ తెలుపగా, అన్ని పనులకు టెండర్లు పిలిచారని అన్నారు. మొదటి విడత పనుల్లో ఖమ్మం జిల్లా ముందంజలో నిలువగా, నిజామాబాద్ జిల్లా ద్వితీయ స్థానం దక్కించుకుందని వివరించారు. ఈ ప్రాంత రైతులు ఎంతో చైతన్యవంతులని, చెరువుల్లోని పూడికమట్టిని స్వచ్ఛందంగా పంట పొలాలకు చేరవేస్తున్నారని కొనియాడారు.