నిజామాబాద్

పక్కనే శ్రీరాంసాగర్ ఉన్నా.. ‘పానీ’కి పరేషానీ..!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, ఏప్రిల్ 17: నానాటికీ ముదురుతున్న ఎండల ప్రభావంతో బాల్కొండ మండల కేంద్రానికి చెందిన ప్రజలు తడారిన గొంతులతో దాహార్తి సమస్యను ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గ కేంద్రంలోనే ఈ పరిస్థితి నెలకొని ఉంటే, ఇతర పల్లెలు, మారుమూల తండాలలో తాగునీటి సమస్య తీవ్రతను అంచనా వేసుకోవచ్చు. బాల్కొండలో మొత్తం 16 వార్డులు ఉండగా, వాటిలో సగానికి పైగా వార్డులలో దాహార్తి సమస్య నెలకొని ప్రజ లు అపసోపాలు పడాల్సి వస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ అతి సమీపంలోనే ఉన్నప్పటికీ, తాము తాగునీటి వసతికి కూడా నోచుకోలేకపోతున్నామని బాల్కొండ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు చేపట్టిన పలు మంచినీటి పథకాలు సైతం నీటి వసతి లేక నిరుపయోగంగా మార డం ప్రజల పాలిట శాపంలా పరిణమించింది. మిషన్ భగీరథ పథకం పనులు కొనసాగుతున్నప్పటికీ, వేసవి ముగిసేంత వరకు కూడా శుద్ధి జలాలు ప్రజలకు అందుతాయా? అన్నది అనుమానంగానే మారింది. దీంతో పాత పథకాల పైనే ఆధారపడి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అధికారులంతా మిషన్ భగీరథ పనులపైనే దృష్టిని కేంద్రీకరిస్తుండడంతో, మంచినీటిని అందించే పాత పథకాల నిర్వహణ గాడి తప్పుతోంది. నీటి సరఫరాలో ఎక్కడైనా సమస్య తలెత్తితే ఇదివరకు సత్వరమే స్పందించేవారు కాగా, ప్రస్తుతం స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన శూన్యంగా మారుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2వ వార్డు పరిధిలోని నెహ్రూనగర్ కాలనీ, వినాయక్‌నగర్, భైంసాకాలనీ, అత్తర్‌గల్లి, ఎన్టీఆర్ కాలనీ ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి సీజన్‌లో అడపాదడపా అక్కడక్కడా తాగునీటి తిప్పలు ఎదురవడం సహజమే అయినప్పటికీ, ఈసారి సమస్య మరింత ఉధృతరూపం దాల్చడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకుంటున్నప్పటికీ నీటి వనరుల లేమిని సాకుగా చూపుతూ తమ నిస్సహాయతను వ్యక్తపరుస్తున్నారు. స్థానిక ప్రజల ఇబ్బందులను దూరం చేసేందుకు నాలుగేళ్ల క్రితం ఉన్నత పాఠశాలకు చెందిన క్రీడా మైదానంలో అదనంగా మంచినీటి ట్యాంకును నిర్మించారు. అయితే దీని నిర్మాణం పూర్తయినప్పటికీ, పైప్‌లైన్ కనెక్షన్ ఇవ్వడంలో ఎనలేని జాప్యం చేస్తుండడం వల్ల మంచినీటి ట్యాంకు అలంకారప్రాయంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ట్యాంకు నిర్మించిన అధికారులు, మరికొన్ని నిధులను జతచేస్తూ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసేందుకు మాత్రం చొరవ చూపడం లేదని విమర్శిస్తున్నారు. అదేవిధంగా ఊర చెరువు వద్ద 30సంవత్సరాల క్రితం నిర్మించిన వాటర్ ట్యాంకు ద్వారా సరఫరా చేస్తున్న నీరు మండల కేంద్రంలోని 20శాతం జనాభాకు కూడా సరిపోవడం లేదని ఆయా కాలనీల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. తాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం నిధులను కేటాయిస్తున్నప్పటికీ వాటిని వెచ్చించే విషయంలోనూ విఫలమవుతున్నారనే ఆక్షేపణలు ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. పలుచోట్ల బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ, వాటికి పైప్‌లైన్లు ఏర్పాటు చేసి కొత్తగా నిర్మించిన ట్యాంకుల్లోకి నీటిని సరఫరా చేసే విషయంలో అశ్రద్ధ కనబరుస్తున్నారని వాపోతున్నారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఎద్దడిని నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని బాల్కొండ మండల కేంద్రంలోని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.