నిజామాబాద్

దేవాలయాల అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, ఏప్రిల్ 29: ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన తెలంగాణ ప్రాంతంలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం జక్రాన్‌పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో వెంకటేశ్వర మందిర నిర్మాణానికి ఆయన స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దేవభక్తి ఎక్కువ అని, తెలంగాణలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలను అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారని అన్నారు. వెయ్యి కోట్లతో యాదగిరి గుట్టలోని లక్ష్మీనరసింహా స్వామి ఆలయం, 350 కోట్లతో వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దేవాలయం, నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన బీర్కూర్ మండలానికి చెందిన తిమ్మాపూర్ ఆలయాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి, శ్రీశైలం, కాలహాస్తీ, కనకదుర్గ దేవాలయం, అన్నవరం, సింహాచల దేవలయాలను అభివృద్ధి చేసుకున్నారని, తెలంగాణ ప్రాంతంలోని ఆలయాల అభివృద్ధిని విస్మరించారని అన్నారు. ముఖ్యమంత్రి రైతాంగానికి నీటి సౌకర్యం కల్పించాలన్న ఉద్ధేశంతో ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి వచ్చే నీటిని మేడిగడ్డ వద్ద కాళేశ్వరం మీదుగా 2005 టిఎంసిల నీరు సముద్రంలో కలువకుండా ఉండడానికి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని అన్నారు. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లాకు నీటిని మళ్లిస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్షా 30 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని, ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు. పడకల్‌లో నిర్మిస్తున్న వెంకటేశ్వర దేవాలయ నిర్మాణానికి ప్రభుత్వం తరపున 33 లక్షల 50 వేల రూపాయలను ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి తమ ఇళళ్లల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, వర్షపు నీరు భూమిలో ఇంకే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒక్క చుక్క నీరు కూడా వృధా కాకుండా భూమిలో ఇంకి భూగర్భజలాల పెంపుకు కృషి చేయాలన్నారు. పడకల్ గ్రామంలో అందరూ రైతు కుటుంబాలకు చెందిన వారున్నందున కేశ్‌పల్లి, జక్రాన్‌పల్లిలోని రెండు చెరువులను కలిపి మినీ ప్రాజెక్టులా చేసుకుంటే నీరు ఆగి చెరువులు నిండుతాయని, దీనివల్ల సంవత్సరానికి రెండు పంటలు పండించుకోవచ్చని అన్నారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ తన ఆరాధ్య దైవమైన వెంకటేశ్వరుని ఆలయానికి ప్రభుత్వం తరపున నిధులు మంజూరు చేసినందుకు కృషజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజి గౌడ్, ఆర్‌డిఓ యాదిరెడ్డి, హౌసింగ్ పిడి చైతన్యకుమార్, ఎంపిటిసి సుజాత, దేవాదాయ శాఖ కమీషనర్ సోమయ్య, విడిసి సభ్యుడు వడ్ల రాజేశ్వర్, తహశీల్దార్ గంగారాం పాల్గొన్నారు.