నిజామాబాద్

వర్ని ఠాణా ఎదుట బిజెపి ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ, ఏప్రిల్ 30: బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని వర్ని మండలంలో గల బడాపహాడ్ దర్గా వద్ద ఇటీవల వెలుగు చూసిన హత్యోదంతాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బిజెపి నాయకులు, కార్యకర్తలు శనివారం వర్ని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. అంతకుముందు వర్నిలో ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు రెండు వందల మంది కార్యకర్తలు ప్రదర్శనగా చేరుకుని ఠాణా ఎదుట రెండు గంటల పాటు బైఠాయించారు. పోలీసులకు, అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిజెపి ధర్నాకు దిగిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా వర్ని పోలీస్ స్టేషన్ వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. బాన్సువాడ, కోటగిరి, బోధన్ తదితర ప్రాంతాల సిఐలు, ఎస్‌ఐలతో పాటు జిల్లా కేంద్రం నుండి స్పెషల్ పార్టీ బలగాలను రప్పించి ఠాణా వద్ద మోహరింపజేశారు. అయితే బిజెపి నాయకులు శాంతియుతంగా ధర్నా చేపట్టి తమ ఆందోళనను విరమించుకోవడంతో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోలేదు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డిలు మాట్లాడుతూ, అనునిత్యం కులమతాలకు అతీతంగా వందలాది మంది భక్తులు సందర్శించే బడాపహాడ్ దర్గా వద్ద పెద్దఎత్తున అరాచకాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. కొంతమంది రౌడీలు దర్గా వద్దనే మకాం వేసి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. గత మూడు మాసాల క్రితం శంకర్ అనే యాచకుడిని హత్య చేసి సమీపంలోని అటవీ ప్రాంతంలో శవాన్ని దహనం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా ఇదే ప్రాంతంలో మరికొందరిని సైతం హత్య చేసి పూడ్చిపెట్టగా, ప్రస్తుతం అస్తి పంజరాలు, ఎముకలు బయటపడుతున్నాయని అన్నారు.
ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు సరైన రీతిలో విచారణ చేపట్టకుండా, శంకర్ హత్య సంఘటనను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. శంకర్‌ది ముమ్మాటికీ హత్యేనని, అధికార పార్టీకి చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్‌ల ఒత్తిడి మేరకు వర్ని ఎస్‌ఐ ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసును తప్పుదోవ పట్టిస్తున్న ఎస్‌ఐను తక్షణమే సస్పెండ్ చేయాలని, నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బిజెపి ఆధ్వర్యంలో మరింత పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బిజెపి నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎంతటివారైనా ఉపేక్షించం : డిఎస్పీ వెంకటేశ్వర్లు
కాగా, బడాపహాడ్ దర్గా వద్ద చోటుచేసుకున్న సంఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని బోధన్ డిఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం ఆయన సంఘటనా స్థలాన్ని సందర్శించి స్థానిక పోలీసులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ విలేఖరులతో మాట్లాడుతూ, శంకర్‌ను హత్య చేసినట్టు నిర్ధారణ అయితే దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. సంఘటనా స్థలంలో లభ్యమైన పుర్రె, ఎముకలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, నివేదిక అందిన మీదట దాని ఆధారంగా దర్యాప్తును మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఎవరికీ తలొగ్గకుండా నిష్పక్షపాతంగానే దర్యాప్తును కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.