నిజామాబాద్

కరవు సహాయక చర్యల్లో తాత్సారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 3: తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు తాండవిస్తున్న తరుణంలో ప్రభుత్వాలు ఉదారంగా కరవు సహాయక నిధులు కేటాయిస్తాయని ఆశించిన స్థానిక ప్రజానీకానికి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ఇప్పటివరకు జిల్లాలో కరవు నివారణ పనుల కోసం ప్రత్యేకంగా నిధులను ఖర్చు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితి కాస్త ప్రతిపక్షాల ఆందోళనలకు ఊతమందిస్తోంది. కాంగ్రెస్, బిజెపి సహా వామపక్షాలు నిరసన కార్యక్రమాలతో కదం తొక్కుతున్నాయి. వారం రోజుల క్రితం ఖమ్మంలో టిఆర్‌ఎస్ నాయకత్వం ప్లీనరీని నిర్వహించిన సందర్భంగా కెసిఆర్ ప్రభుత్వ వైఖరిని తూర్పారబడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు దిష్టిబొమ్మలను దగ్ధం చేసింది. ఓ వైపు రైతులు, అన్ని వర్గాల ప్రజలు కరవు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటే టిఆర్‌ఎస్ ప్రభుత్వం అట్టహాసంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోందని ఆక్షేపించింది. ఇదే బాటలో బిజెపి సైతం టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిరసన గళాన్ని తీవ్రతరం చేస్తోంది. తక్షణమే కరవు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే అన్ని మండలాల్లో తహశీల్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించిన కమలనాథులు, మంగళవారం ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళనలు జరిపారు. అనంతరం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున ధర్నా చేపట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. కరవు సహాయక పనులు చేపట్టేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 791కోట్ల రూపాయల నిధులను కేటాయించినా, వాటిని వెచ్చిస్తూ కరవు నివారణ చర్యలు చేపట్టడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇదే అంశంపై మంగళవారం వామపక్ష పార్టీలు కూడా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించాయి. ప్రభుత్వం కరవు నివారణ చర్యలు చేపట్టడంలో ఇదే తరహా తాత్సారం చేస్తే, మునుముందు ప్రతిపక్షాలు మరింత పెద్దఎత్తున ఆందోళన బాటలో పయనించనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవంగానే కరవు తీవ్రత అధికంగా ఉండడంతో అటు రైతులే కాకుండా, అన్ని వర్గాల ప్రజలు సంక్షోభంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు చేపట్టే ఆందోళనలకు వివిధ వర్గాల నుండి స్వచ్ఛందంగానే మద్దతు లభిస్తోంది. జిల్లాలో నెలకొన్న కరవు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం కరవు నివారణ పనుల కోసం గతేడాది నవంబర్ నెలాఖరులోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రతిపాదనలు సమర్పించింది. కరవు నివారణ పనుల కోసం మొత్తం 1255.36కోట్ల రూపాయలతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. వ్యవసాయ ఇన్‌పుట్ సబ్సిడీ కింద 164.14కోట్ల రూపాయలను కోరారు. అదేవిధంగా పంటల సాగు పూర్తిగా పడిపోయిన దృష్ట్యా కూలీలకు పనులు కల్పించి వేతనాలు చెల్లించేందుకు వీలుగా 968.50కోట్ల రూపాయలను, తాగునీటి ఎద్దడి నివారణ కోసం 64.49కోట్ల రూపాయలను, మూగజీవాల సంరక్షణ, పశుగ్రాసం కోసం 58.15కోట్ల రూపాయలు, వేసవిలో వడదెబ్బ బాధితులకు వైద్య సేవలందించేందుకు వీలుగా 8లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని కోరుతూ ప్రతిపాదనలు అందించారు. ఇలా భారీ మొత్తంలో నిధులు అవసరమని పేర్కొనగా, ఇంతవరకు కరవు సహాయక నిధులు జిల్లాకు మంజూరైన దాఖలాలు కనిపించడం లేదు. కనీసం గత ఖరీఫ్‌లో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు కోల్పోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇంకా వారి ఖాతాల్లో జమ కాకపోవడం బాధిత రైతాంగాన్ని ఆవేదనకు గురి చేస్తోంది. నష్టపరిహారం మంజూరైందని అధికారులు చెబుతున్నప్పటికీ, ఏయే పంటలకు ఎంతమేరకు పరిహారం విడుదల చేశారు, ఆ మొత్తాన్ని ఏయే ప్రాంతాలకు ఎంతమేర పంపిణీ చేయనున్నారనే వివరాలను మాత్రం వెల్లడించలేకపోతున్నారు. ఈ విషయమై అవగాహన సదస్సుల్లో రైతులు అధికారులను నిలదీస్తున్నారు. కాగా, జిల్లాలో ఉపాధి హామీ పనులు ఇదివరకు పెద్దఎత్తున కొనసాగినప్పటికీ, ప్రస్తుతం ఎండలు మండుతుండడంతో పనుల్లో ఒకింత వేగం తగ్గింది. ఇదివరకు రెండున్నర లక్షల మంది వరకు కూలీలు పనులు చేయగా, ప్రస్తుతం వారి సంఖ్య 90వేలకే పరిమితమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కరవు నివారణ చర్యలకు శ్రీకారం చుట్టి రైతులు, వివిధ వర్గాల వారికి తోడ్పాటును అందించాల్సి ఉండగా, ఆ దిశగా కార్యాచరణను అమలు చేయలేకపోతున్నారు. దీనిని అనుకూలంగా మల్చుకుని ప్రతిపక్షాలు తమ ఆందోళనలను ఉద్ధృతం చేస్తున్నాయి.