నిజామాబాద్

నాలుగు స్థానాల్లో టిక్కెట్లు దక్కేదెవరికో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాకూటమి అభ్యర్థుల ఖరారులో
ప్రతిష్టంభన
నిజామాబాద్, నవంబర్ 13: నామినేషన్ల దాఖలు పర్వం మొదలైనప్పటికీ, మహాకూటమి అభ్యర్థుల ఖరారు విషయంలో మాత్రం ప్రతిష్టంభన దూరం కాలేకపోతోంది. కాంగ్రెస్ విడుదల చేసిన తొలి జాబితాలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని మొత్తం తొమ్మిది సెగ్మెంట్లకు గాను ఐదు నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. మరో నాలుగు సెగ్మెంట్లకు సంబంధించి ఎవరికి టిక్కెట్‌లు కేటాయిస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. మొదటి నుండి ఊహించినట్టుగానే తొలివిడత జాబితాలోనే కామారెడ్డి నుండి శాసన మండలి విపక్ష నేత మహ్మద్ షబ్బీర్‌అలీకి, బోధన్ నుండి మాజీ మంత్రి పీ.సుదర్శన్‌రెడ్డికి, ఆర్మూర్ నుండి ఎమ్మెల్సీ ఆకుల లలితకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. వీరితో పాటు ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్ అయిన జుక్కల్ నియోజకవర్గం టిక్కెట్‌ను మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాంకు, బాన్సువాడ అభ్యర్థిగా ఆ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న కాసుల బాల్‌రాజ్‌ను ప్రకటించారు. ఇవి మినహా మిగతా నాలుగు సెగ్మెంట్లు అయిన నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సంబంధించి సస్పెన్స్ పర్వం కొనసాగుతుండడంతో ఆశావహులంతా నరాలు తెగే ఉత్కంఠతో మలివిడత జాబితా ప్రకటన కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ నుండి కాంగ్రెస్ తరఫున మహేష్‌కుమార్ గౌడ్, రత్నాకర్, తాహెర్‌బిన్ హందాన్‌తో పాటు మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ అనుచరులు కూడా టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ ప్రసాద్ కూడా ఈ స్థానాన్ని కోరుకుంటున్నారు. మరోవైపు ఇటీవలే ఎంఐఎంకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన మాజీ డిప్యూటీ మేయర్ మీర్‌మజాస్‌అలీ, బీజేపీ నుండి చుక్కెదురైన ధన్‌పాల్ సూర్యనారాయణలు కూడా ఢిల్లీకి చేరుకుని కాంగ్రెస్ టిక్కెట్ కోసం తమవంతు ప్రయత్నాల్లో నిమగ్నమైనట్టు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎవరికి టిక్కెట్ కేటాయిస్తారన్నది చివరి నిమిషం వరకు అంతుచిక్కని వ్యవహారంలా తయారైంది. నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ నుండి కాంగ్రెస్ పతాకంపై బరిలోకి దిగేందుకు ఆ పార్టీ నాయకులు అర్కల నర్సారెడ్డి, నగేష్‌రెడ్డి, భూంరెడ్డిలు ఉవ్విళ్లూరుతుండగా, తెరాస అసమ్మతి నేతగా ముద్రపడి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి తనకే అభ్యర్థిత్వం ఖరారవుతుందని ఎనలేని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా టీ.టీడీపీకి కేటాయించనున్నారనే ప్రచారం సైతం తెరపైకి వస్తోంది. అయితే తెదెపా తొమ్మిది మంది అభ్యర్థులతో విడుదల చేసిన తొలి జాబితాలో నిజామాబాద్ రూరల్ అభ్యర్థి పేరు లేకపోవడంతో సస్పెన్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. ఇక బాల్కొండ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ పేరు దాదాపుగా ఖరారైందని భావిస్తున్న క్రమంలో, ఈ స్థానాన్ని కూడా పెండింగ్‌లో పెట్టడంతో నిజామాబాద్ రూరల్‌కు బదులుగా బాల్కొండను తెదెపాకు కేటాయించాలని అధిష్టానం యోచిస్తున్నట్టుగా తెలుస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. తెదెపా తరఫున ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి బాల్కొండ టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. వీరిరువురిలో ఎవరికి అభ్యర్థిత్వం కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి తెలంగాణ జన సమితి ఈ స్థానాన్ని తమకే కేటాయించాలని పట్టుబడుతుండడం, మరోవైపు కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు అనేక మంది ఔత్సాహికులు మొగ్గుచూపుతుండడంతో ఎల్లారెడ్డి సీటును కూడా పెండింగ్‌లో ఉంచారని స్పష్టమవుతోంది. టీజేఎస్ తరఫున పోటీ చేయాలని హైకోర్టు న్యాయవాది రచనారెడ్డి తనవంతు ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి అదృష్టం పరీక్షించుకోవాలని నల్లమడుగు సురేందర్, సుభాష్‌రెడ్డి, జమునారాథోడ్, మదన్‌మోహన్‌లు ఎవరికివారు టిక్కెట్ రేసులో పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో మహాకూటమి తరఫున పై నాలుగు సెగ్మెంట్లలో ఎవరికి అభ్యర్థిత్వాలు ఖరారవుతాయనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.