నిజామాబాద్

రైతుల భూములను బలవంతంగా లాక్కుంటే సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 15: ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో రైతుల భూములను తెరాస ప్రభుత్వం బలవంతంగా లాక్కునే ప్రయత్నాలు చేస్తోందని, దీనిని కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం సహించబోదని శాసన మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్‌అలీ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రాణహిత-చేవేళ్ల పథకం కింద జిల్లాలో 20, 21, 22 ప్యాకేజీలు ఉండగా, ప్రభుత్వం కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని లక్షా 45వేల ఎకరాలకు ప్రయోజనం చేకూర్చే 22వ ప్యాకేజీని రద్దు చేసిందన్నారు. ఈ రెండు సెగ్మెంట్లకు కాళేశ్వరం పథకం ద్వారా మల్లన్నసాగర్ నుండి నీటిని అందిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారని, అయితే ఇది ఆచరణ సాధ్యం కానందునే తాము అసెంబ్లీలో సిఎం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు దూరంగా ఉండిపోయామని అన్నారు. ప్రస్తుతం మల్లన్నసాగర్ నుండి నీరందించాలంటే దాదాపు 50వేల ఎకరాల భూమిని సేకరించాల్సి వస్తోందని, రెండు పంటలు పండే భూములను ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పోలీసులు, రెవెన్యూ అధికారులను పురమాయించి రైతుల నుండి బలవంతంగా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ క్రమంలో కామారెడ్డి మండలంలోని కిష్టాపూర్ గ్రామ రైతులు అభ్యంతరం తెలిపితే వారిపై లాఠీచార్జ్ చేయించారని ఆరోపించారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో రూపొందించిన భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా కెసిఆర్ ప్రభుత్వం బలవంతంగా భూములను సేకరించేందుకు ప్రయత్నిస్తోందని, ఈ వైఖరిని తాము ఎంతమాత్రం సహించబోమని, రైతుల పక్షాన నిలబడి గట్టిగా పోరాడతామని అన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఆచరణ సాధ్యం కాదనే విషయాన్ని తాము ముందుగానే తేల్చి చెప్పామని, ప్రస్తుతం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్న క్రమంలో అది వాస్తవమని నిర్ధారణ అవుతోందన్నారు. మల్లన్నసాగర్ వద్ద 50టిఎంసిల నీటిని నిలువ చేస్తామని చెప్పిన కెసిఆర్, ప్రస్తుతం అది సాధ్యపడకపోవడంతో 22టిఎంసిలకు కుదించుకున్నారని, పాములపర్తిలోని 24టిఎంసిల స్థానంలో 11టిఎంసిలకు మార్చారని షబ్బీర్‌అలీ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్, ఎంపి కవితలు ఇబ్బడిముబ్బడిగా ప్రకటనలు చేస్తూ కేవలం హామీలతోనే కాలం వెళ్లదీస్తున్నారని దుయ్యబట్టారు. తెరాస అధికారంలోకి వస్తే 100రోజుల్లో నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ప్రస్తుతం ఏకంగా ఫ్యాక్టరీలనే లాకౌట్ చేయించిందని విమర్శించారు. ఆసరా పెన్షన్‌లకు సంబంధించి ఒక్క నిజామాబాద్ జిల్లాలలోనే కుంటి సాకులతో 46వేల మంది లబ్ధిదారుల పేర్లను తొలగించారని అన్నారు. బీడీ కట్టలపై పుర్రె గుర్తు, క్యాన్సర్ బొమ్మల ఆంక్షలను తొలగించడంలో ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. నిరుపేదలకు లబ్ధి చేకూర్చే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాల పథకానికి ముందుకు రాని కాంట్రాక్టర్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనుల కోసం మాత్రం పోటాపోటీగా ముందుకు వస్తున్నారని, ఇది కెసిఆర్ ప్రభుత్వ దమన నీతిని చాటుతోందన్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు అన్యాయం చేసేందుకే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయడం లేదని ఆయన ఆరోపించారు.
పాలేరు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం
కాగా, ఖమ్మం జిల్లా పాలెరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని షబ్బీర్‌అలీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం అహరహం శ్రమించిన రాంరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాన్సర్‌తో చనిపోతే, ఆయన సతీమణిపై తెలంగాణ ద్రోహి తుమ్మల నాగేశ్వర్‌రావును నిలుపడం ద్వారా కెసిఆర్ తన నైజాన్ని చాటుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలంతా కరవు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటే మంత్రులందరూ పాలేరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం సిగ్గుచేటన్నారు. చివరకు ఆత్మహత్యలు చేసుకున్న ఏ ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించలేదన్నారు. తెరాస ఎన్ని కుయుక్తులు పన్నినా, పాలేరులో సైలెంట్ ఓటింగ్ ద్వారా కాంగ్రెస్ గెలువడం ఖాయమని షబ్బీర్‌అలీ జోస్యం చెప్పారు.
విలేఖరుల సమావేశంలో ఎఐసిసి అధికార ప్రతినిధి మధుగౌడ్ యాష్కీ, టి.పిసిసి ప్రధాన కార్యదర్శి మహేష్‌కుమార్ గౌడ్, నరాల రత్నాకర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, నాయకులు ఖుద్దూస్, ఇలియాస్, బలరాం, సృజన్, రఘు తదితరులు పాల్గొన్నారు.