నిజామాబాద్

నెరవేరిన కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 17: ఎట్టకేలకు కొంత ఆలస్యంగానైనా మోస్రా, చందూర్ గ్రామాల ప్రజల కల నెరవేరింది. పై రెండు గ్రామాలను నూతన మండలాలుగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో అధికారికంగా ఉత్తర్వులు వెలువడడమే తరువాయిగా మారింది. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వర్ని మండలంలో కొనసాగుతున్న మోస్రా, చందూర్ గ్రామాలను కొత్త మండలాల జాబితాలో చోటు కల్పించాలంటూ గత చాలాకాలం నుండి స్థానికులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. జిల్లాలు, మండలాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టిన సమయంలోనే పై రెండు గ్రామాలను కొత్త మండలాలుగా ప్రకటిస్తారని ఆశించిన స్థానికులకు తీవ్ర నిరాశే ఎదురైంది. రెండు గ్రామాలలో కనీసం ఒక్కదానికి కూడా నూతన మండలాల జాబితాలో చోటు దక్కలేదు. వీటికి బదులుగా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోనే ఉన్న రుద్రూర్, నస్రుల్లాబాద్ గ్రామాలను కొత్త మండలాలుగా ఏర్పాటు చేశారు. దీంతో అప్పట్లో మోస్రా, చందూర్ గ్రామాల ప్రజలు నిరవధిక ఆందోళనలు కొనసాగిస్తూ తీవ్ర స్థాయిలో నిరసనలు చాటారు. ఈ నిరసనల సెగ నిన్నమొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల పర్వం వరకు కూడా అధికార తెరాస పార్టీకి తగులుతూ వచ్చింది. ఎన్నికల ప్రచారం నిమిత్తం మోస్రా గ్రామానికి తెరాస అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరైన సందర్భంగా స్థానికులు ఆయన పర్యటనను వ్యతిరేకించారు. ఓ యువకుడైతే ఏకంగా పోచారం తమ గ్రామానికి రావద్దంటూ సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగించారు. ఈ నేపథ్యంలోనే గత నవంబర్ 28న బాన్సువాడ నియోజకవర్గ కేంద్రానికి ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన సీఎం కేసీఆర్ దృష్టికి పోచారం ఈ విషయాన్ని తీసుకెళ్లారు. మోస్రా, చందూర్ గ్రామాలను మండలాలుగా ఏర్పాటు చేయాలంటూ స్థానికులు బలీయమైన ఆకాంక్షను వ్యక్తపరుస్తున్నారని తెలుపగా, సీఎం కేసీఆర్ కూడా అందుకు సానుకూలంగా స్పందిస్తూ తెరాసను అధికారంలోకి తెచ్చిన వెంటనే పై రెండు గ్రామాలను కొత్త మండలాలుగా ప్రకటిస్తామని ఎన్నికల ప్రచార సభలో స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ హామీకి కట్టుబడి ప్రస్తుతం మోస్రా, చందూర్ గ్రామాలను నూతన మండలాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువరించేందుకు కసరత్తులు కొనసాగిస్తున్నారు. తాజాగా వచ్చి చేరుతున్న ఈ రెండు మండలాలతో నిజామాబాద్ జిల్లాలో మొత్తం మండలాల సంఖ్య 29కి చేరుకోనుంది. అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో మొత్తం 8మండలాలు కొనసాగనున్నాయి. వాటిలో బీర్కూర్, నస్రుల్లాబాద్, బాన్సువాడ, మండలాలు కామారెడ్డి జిల్లా పరిధిలో ఉండగా, కోటగిరి, వర్ని, రుద్రూర్‌తో పాటు నూతనంగా ఏర్పాటవుతున్న చందూర్, మోస్రా మండలాలు నిజామాబాద్ జిల్లా పరిధిలో కొనసాగనున్నాయి. కాగా, ఇచ్చిన హామీ మేరకు నూతన మండలాలుగా ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన దరిమిలా మోస్రా గ్రామస్థులు సోమవారం హైదరాబాద్‌కు తరలివెళ్లి మాజీ మంత్రి, బాన్సువాడ నుండి తెరాస ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి ఘనంగా సన్మానించారు. కొత్త మండలంగా ఏర్పాటు చేయడంతో తమ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధిని సంతరించుకునేందుకు ఆస్కారం ఏర్పడిందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పందిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే సాంప్రదాయం టీఆర్‌ఎస్ పార్టీదేనని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారం రోజుల్లోపే అమలు చేసి తమ నిబద్ధతను నిరూపించుకున్నామని అన్నారు. ప్రజల అభీష్టం గురించి వివరించిన వెంటనే సానుకూలంగా స్పందిస్తూ కొత్త మండలాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయిస్తున్న సీఎం కేసీఆర్‌కు పోచారం కృతజ్ఞతలు ప్రకటించారు.

ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి పదవీ గండం తప్పదా?
* మండలి చైర్మన్‌కు తెరాస ఫిర్యాదు

నిజామాబాద్, డిసెంబర్ 17: తెరాస తరఫున శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన డాక్టర్ ఆర్.్భపతిరెడ్డికి పదవీ గండం వెంటాడుతోంది. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలపై వేటు వేయాలని కోరుతూ తెరాస శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు సోమవారం మండలి చైర్మెన్ స్వామిగౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్సీల జాబితాలో కొండా మురళి, యాదవరెడ్డి, రాములు నాయక్‌తో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన భూపతిరెడ్డి కూడా ఉన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వీరు పార్టీ ఫిరాయింపునకు పాల్పడినందున నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలని మండలి చైర్మెన్‌కు అందించిన వినతిపత్రంలో కోరారు. వీరిపై చర్యలు చేపట్టే అంశం మండలి చైర్మెన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో తెరాసను వీడిన ఎమ్మెల్సీల పదవిపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. తెరాస ఆవిర్భావం నుండి డాక్టర్ భూపతిరెడ్డి ఆ పార్టీలో కొనసాగుతూ రాగా, గత 2014 ఎన్నికల్లో ఆయన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం టిక్కెట్‌ను ఆశించారు. అయితే చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌లో వచ్చి చేరిన బాజిరెడ్డి గోవర్ధన్‌కు తెరాస అధినేత కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని కేటాయిస్తూ, ప్రత్యామ్నాయంగా ఎమ్మెల్సీ పదవి కట్టబెడతానని భూపతిరెడ్డికి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు కొంత ఆలస్యమైనప్పటికీ, భూపతిరెడ్డికి శాసన మండలి పదవి దక్కేలా అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికు, భూపతిరెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో భూపతిరెడ్డిపై నిజామాబాద్ ఉమ్మడి జిల్లా తెరాస ప్రజాప్రతినిధులంతా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని అభియోగాలు మోపుతూ గత పది నెలల క్రితం అధిష్టానానికి ఫిర్యాదు లేఖ పంపారు. భూపతిరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని సిఫార్సు చేశారు. అయితే నెలలు గడుస్తున్నప్పటికీ తెరాస అధిష్టానం ఆయనపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో భూపతిరెడ్డి తనంతటతానే తెరాసను వీడి, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవల జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ అభ్యర్థిగా పోటీ సైతం చేశారు. గట్టి పోటీ ఇచ్చినప్పటికీ తెరాస సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో భూపతిరెడ్డి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తెరాస తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికై పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మెన్‌కు ఫిర్యాదు చేసినందున, భూపతిరెడ్డి పదవికి ఎసరు వచ్చే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ కూడా నిజానికి ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయన పైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో నాలుగు మాసాల క్రితం అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే డీఎస్ తన రాజకీయ అనుభవంతో రాజ్యసభ పదవికి ఎసరు రాకుండా ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తనపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలంటూ తెరాస అధిష్టానాన్ని డిమాండ్ చేసిన డీఎస్, తనంతటతాను మాత్రం రాజీనామా చేయలేదు. తన అనుచరులందరినీ కాంగ్రెస్‌లో చేర్పించినప్పటికీ, తాను ఇంకనూ తెరాస సభ్యత్వాన్ని కలిగి ఉండడంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు అవకాశం లేకుండాపోయింది. అదే సమయంలో ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన దరిమిలా ఆయనపై మండలి చైర్మెన్‌కు తెరాస ఫిర్యాదు చేసేందుకు ఆస్కారం ఏర్పడింది.