నిజామాబాద్

జాడలేని విజిలెన్స్ తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 19: నాసిరకం విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల విక్రయాలు జరిపే ప్రైవేట్ డీలర్ల గుట్టును కనుగొని రైతులు నష్టపోకుండా నిలువరించడంలో విజిలెన్స్ శాఖ అధికారుల పాత్ర ఎంతో కీలకమైనప్పటికీ, ఆ దిశగా జిల్లాలో చర్యలు చేపడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇతర జిల్లాలలో అడపాదడపా ఈ తరహా దాడులు జరుగుతున్నప్పటికీ, వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్‌లో మాత్రం ప్రైవేట్ డీలర్లు అమ్మే ఎరువులు, విత్తనాల విక్రయాలపై అధికారులు దృష్టిసారించడం లేదు. ఇలాంటి పరిస్థితుల వల్ల రైతులు పెద్దఎత్తున నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఈసారి సకాలంలో, సమృద్ధిగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తుండడంతో ఖరీఫ్ సాగుకు రైతులు సన్నాహాలు చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. గత రెండేళ్ల నుండి తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో పంటల సాగు అంతంతమాత్రంగానే ఉండింది. ఈసారి పరిస్థితులు అనుకూలిస్తాయనే నమ్మకంతో అన్నదాత ఏరువాకకు సమాయత్తం అవుతున్నారు. దీంతో డీలర్లు కూడా పెద్దఎత్తున ఎరువులు, విత్తనాలను నిల్వ చేసుకుంటున్నారు. అయితే నాసిరకం ఎరువులు, విత్తనాలను కట్టబెట్టి రైతులను మోసం చేయడం ఏటేటా ఖరీఫ్, రబీ సీజన్‌లలో జరుగుతోంది. నష్టపోయిన అతికొద్ది మంది రైతులు మాత్రమే ధైర్యంగా ముందుకువచ్చి ఫిర్యాదులు చేస్తుండగా, అనేక మంది మిన్నకుండిపోతున్నారు. కాగా, ఎరువులు, విత్తనాలలకు డిమాండ్ భారీగా పెరిగితే బ్లాక్ మార్కెట్ ద్వారా విక్రయించేందుకు వీలుగా ప్రైవేట్ డీలర్లు వ్యూహ రచనలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ప్రభుత్వం సొసైటీల ద్వారా ఎరువులు, విత్తనాలను పంపిణీ చేస్తున్నప్పటికీ, అవి పూర్తిస్థాయిలో అందకపోవడంతో రైతులు ప్రైవేట్ డీలర్లపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో డీలర్లు రైతులను మోసం చేయకుండా, ఎరువులు, విత్తనాలను అక్రమంగా దాచిపెట్టకుండా ఖరీఫ్, రబీ సీజన్‌లు ప్రారంభానికి ముందే విజిలెన్స్ అధికారులు దృష్టిసారించాల్సి ఉంటుంది. అక్రమంగా నిల్వ ఉంచినా, రికార్డులు రాయకపోయినా విజిలెన్స్ అధికారులు దాడులు చేసి కేసులను నమోదు చేయాల్సి ఉంటుంది. నిత్యావసర చట్టం కింద కేసులను నమోదు చేసి డీలర్ల లైసెన్స్‌లను రద్దు చేయవచ్చు. కానీ జిల్లాలో ఎక్కడ కూడా విజిలెన్స్ అధికారుల పరిశీలన కనిపించడం లేదు. దీంతో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగించుకుంటున్నారు. జిల్లాలో అనేకమంది డీలర్లకు కనీసం లైసెన్స్‌లు కూడా లేకుండానే తమ వ్యాపారాన్ని సాఫీగా సాగిస్తూ అన్నదాతలను మోసం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సొసైటీల ద్వారా వివిధ రకాల విత్తనాలు, ఎరువులను సరఫరా చేస్తుండటం, డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండడంతో వాటిని పొందేందుకు రైతులు ఈసారి బారులు తీరనున్నారు. ప్రభుత్వపరంగా చేపడుతున్న ఎరువులు, విత్తనాల పంపిణీ కేంద్రాల వద్ద ఇబ్బందికర పరిస్థితులు ఉండడం, విఆర్‌ఓలచే ధ్రువీకరణ పత్రం తేవాలని ఆంక్షలు విధిస్తుండడంతో రైతులు ప్రైవేట్ డీలర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రైవేట్ డీలర్లలో కొందరికి మాత్రమే ప్రభుత్వపరంగా అనుమతులు ఉండగా, మరికొందరు అడ్డదారుల్లో డీలర్లుగా చెలామణి అవుతూ, రైతులకు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తద్వారా ఆరుగాలం కష్టపడి వేసుకున్న పంటలకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. వ్యవసాయ శాఖాధికారులు ముందుగానే రైతులను అప్రమత్తం చేసేందుకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో మాత్రం వ్యవసాయ శాఖాధికారుల పనితీరు అందుకు పూర్తి భిన్నంగా ఉంది. రైతులకు ఎలాంటి నష్టం జరుగకుండా చూడాల్సిన బాధ్యత కలిగిన సంబంధిత అధికారులు మాత్రం కార్యాలయాలకే పరిమితం అవుతున్నారని రైతులు విమర్శిస్తున్నారు.