నిజామాబాద్

హరితహారానికి సర్వం సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 5: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టి విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ నెల 8వ తేదీ నుండి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుండగా, మొత్తం 3.35కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ మేరకు పకడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తూ, వివిధ వర్గాల వారిని భాగస్వాములు చేయనున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి చోట మొక్కలు నాటించి, వాటిని సంరక్షించాలనే ధ్యేయంతో ప్రజలకు ఈ కార్యక్రమం ప్రాధాన్యతను వివరించి భాగస్వాములు చేసేందుకు మంగళవారం అన్ని గ్రామ సచివాలయాల పరిధిలో గ్రామసభలు నిర్వహించారు. ప్రధానంగా గడిచిన రెండేళ్లుగా జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఉత్పన్నమైన ఇబ్బందులు, ఇందుకు గల కారణాలను అధికారులు వివరిస్తూ ప్రజలను మొక్కలు నాటే దిశగా కార్యోన్ముఖులు చేసేందుకు ప్రయత్నించారు. వాస్తవంగానే జిల్లా భౌగోళిక విస్తీర్ణం 7.95లక్షల హెక్టార్లు ఉండగా, అందులో అటవీ విస్తీర్ణం మాత్రం 1.70వేల హెక్టార్లకే పరిమితమైంది. అంటే కేవలం 21.46శాతం మాత్రమే పచ్చదనం నెలకొని ఉంది. పర్యావరణ సమతుల్యం కాపాడబడుతూ, వర్షాలు అనుకూలించాలంటే కనీసం 35శాతం అటవీ విస్తీర్ణం ఉండాల్సి ఉంటుంది. పచ్చదనం ఆశించిన స్థాయిలో లేనందున వర్షాభావం వెంటాడుతూ సాగు, తాగునీటికి ఇక్కట్లు ఎదురవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు విరివిగా మొక్కలు నాటడం ఒక్కటే పరిష్కారమని భావిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మూడేళ్ల వ్యవధిలో జిల్లాలో 10కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. అయితే గతేడాది పెద్దఎత్తున మొక్కలు నాటేలా సుమారు 400పైచిలుకు నర్సరీల్లో మొక్కలు పెంచినప్పటికీ, వర్షాలు అనుకూలించకపోవడంతో ఈ కార్యక్రమం సత్ఫలితాలు అందించలేకపోయింది. మూడున్నర కోట్ల మొక్కలు పెంచాల్సి ఉండగా, వర్షాభావం వల్ల కేవలం 149.92లక్షల మొక్కలను మాత్రమే పెంచగలిగారు. వాటిలోనూ కేవలం కోటి వరకు మాత్రమే మొక్కలను నాటారు. నాటిన మొక్కల్లో సైతం దాదాపు 30 నుండి 40శాతం వరకు మొక్కల జాడ అసలే కనిపించడం లేదు. అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభం నుండే వర్షాలు అనుకూలిస్తుండడంతో హరితహారం కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టేలా జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. జిల్లాలోని ఒకటిరెండు మినహా దాదాపుగా అన్ని మండలాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదవగా, 16మండలాల్లో ఇప్పటికే సాధారణం కంటే ఎక్కువ మోతాదులో వర్షాలు కురిసాయి. దీంతో ప్రతీచోట ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటేలా ఆయా వర్గాల వారిని సన్నద్ధం చేస్తున్నారు. గతేడాది మిగులుగా ఉన్న 1.65కోట్ల మొక్కలతో పాటు ఈ సంవత్సరం వివిధ నర్సరీల్లో మరో కోటీ 60లక్షల వరకు మొక్కలను సిద్ధం చేశారు. డ్వామా, సామాజిక అటవీ విభాగం ఆధ్వర్యంలో నర్సరీల్లో పెంచిన మొక్కలను గ్రామాల వారీగా అందజేస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం 40వేల చొప్పున మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఒక్కో ఇంటికి ఐదు చొప్పున మొక్కలు కేటాయించేలా ప్రణాళికలు రూపొందించారు. ఆర్ అండ్ బి రోడ్లకు ఇరువైపులా సుమారు 200కిలోమీటర్ల మేర, పంచాయతీరాజ్ రోడ్లకు ఆనుకుని 191కిలోమీటర్ల మేర మొక్కలు నాటనున్నారు. అదేవిధంగా చెరువు గట్ల వెంబడి 50 హెక్టార్ల విస్తీర్ణంలో, కొండగుట్టల్లో 20హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించనున్నారు. ఏయే ప్రాంతాల్లో, ఏ రకానికి చెందిన, ఎన్ని మొక్కలు నాటాలనే విషయమై పూర్తి కసరత్తులు చేసిన మీదట జిల్లా యంత్రాంగం సమగ్ర ప్రణాళిక రూపొందించింది. రోడ్లకు ఇరువైపులా గుల్‌మొహర్, కదంబ, బాదం, ఫెల్‌టుఫోరం రకాలకు చెందిన సుమారు. 23.54 లక్షల మొక్కలు నాటనుండగా, కొండగుట్టలతో కూడిన ప్రాంతాల్లో సీతాఫలం, వెదురు, నెమలినార, కానుగ రకాలకు చెందిన 22వేల మొక్కలు, చెరవు గట్ల వెంబడి బబూల్, తెల్లమద్ది, ఈత, ఖర్జూర, సిల్వర్‌ఓక్ రకాల మొక్కలు 26.61 లక్షలు, కాల్వల గట్లపై అల్‌స్టోనియా, గుల్‌మొహర్, కదంబ, స్పథోడియా, బాదం మొక్కలు 17.27లక్షలు, ఇళ్లలో పండ్లు, పూల మొక్కలు 27.64లక్షలు, పొలం గట్లపై టేకు రకం 1.35 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. అదేవిధంగా పారిశ్రామిక వాడల్లో కానుగ, నిమ్మ, గుల్‌మొహర్, వర్షాధార మొక్కలను, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణల్లో ఉసిరి, మునగ, నిమ్మ, జామ, కానుగ, గుల్‌మొహర్ రకాలకు చెందిన 12.75 లక్షల మొక్కలు నాటనున్నారు. మసీదులు, ఆలయాలు, చర్చిలు, గురుద్వారాలు, స్మశాన వాటికల వద్ద మారేడు, వేప, నేరేడు, వెలగ రకం మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించారు. వర్షాలు అనుకూలిస్తున్నందున ఈసారి మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేస్తూ గ్రామాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసింది. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు డ్వాక్రా మహిళలు తదితరులను భాగస్వాములు చేస్తూ విరివిగా మొక్కలు నాటడం, నాటిన మొక్కలను సంరక్షించడం, అటవీ విస్తీర్ణం అంతరించిపోకుండా చూడడం, మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి బాధ్యతలను అప్పగిస్తున్నారు. జిల్లా యంత్రాంగం కృషికి మునుముందు కూడా ఇదే తరహాలో వర్షాలు అనుకూలిస్తే హరితహారం కార్యక్రమం లక్ష్యం నెరవేరి నిజామాబాద్ జిల్లా పచ్చదనాన్ని సంతరించుకోనుంది.