నిజామాబాద్

ఆన్‌లైన్ సేవలతోనైనా మంచి పేరొచ్చేనా...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 4: అవినీతి ఆరోపణల్లో ముందు వరుసలో నిలిచే రవాణా శాఖలో ఆన్‌లైన్ సేవలను ప్రవేశపెట్టడంతో ఇకనైనా ఆ అపప్రద నుండి సంబంధిత శాఖ అధికారులు బయటపడతారా? అన్నది సందిగ్దంగానే మారింది. ఆర్టీఎ కార్యాలయాల్లో ఇబ్బడిముబ్బడిగా ప్రైవేట్ ఏజెంట్లు తిష్టవేస్తూ, వివిధ పనుల కోసం వచ్చే వారిని నిలువు దోపిడీకి గురి చేయడం సర్వసాధారణ అంశంగా మారింది. వసూలైన పైకం నుండి వివిధ స్థాయిలలో పర్సంటేజీల చెల్లింపులు జరగడంతో ఆర్టీఎ ఆఫీసులలో ప్రైవేట్ ఏజెంట్లదే హవాగా కొనసాగుతూ వచ్చింది. ఎసిబి అధికారులు నిర్వహించిన దాడుల సందర్భంగా అనేక పర్యాయాలు ఈ విషయం బట్టబయలైంది. తాజాగా రవాణా శాఖ 56 రకాల సేవలను ఆన్‌లైన్ ద్వారానే నిర్వర్తించే విధానాన్ని ఈ నెల 2వ తేదీ నుండి అందుబాటులోకి తెచ్చారు. లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులు మొదలుకుని వాహనాల రిజిస్ట్రేషన్, పర్మిట్లు, వాహనాల ఫిట్‌నెస్ తదితర సేవలన్నీ ఇకపై కేవలం ఆన్‌లైన్ ద్వారానే నిర్వర్తించేలా చర్యలు చేపట్టారు. దీంతో ఆర్టీఎ కార్యాలయాలన్నీ నగదు రహిత లావాదేవీలు నడిపే దఫ్తర్లుగా మారాయి. ఆయా సేవల కోసం అభ్యర్థులు మీ సేవా కేంద్రాలకు వెళ్లి ఆన్‌లైన్ విధానం ద్వారా నిర్ణీత రుసుము చెల్లిస్తూ దరఖాస్తులు చేసుకుని స్లాట్‌ను బుక్ చేసుకుంటే, వారికి ధ్రువపత్రాల పరిశీలన కోసం కార్యాలయానికి ఎప్పుడు రావాలనే వివరాలను సంక్షిప్త సందేశం(ఎస్‌ఎంఎస్) ద్వారా తెలియజేస్తారు. సూచించిన సమయానికి దరఖాస్తుదారుడు ధ్రువీకరణ పత్రాలతో ఆర్టీఎ కార్యాలయానికి వెళ్లి వాటిని సంబంధిత అధికారులకు చూపించిన అనంతరం అన్నీ సవ్యంగా ఉన్నట్టు వారు ధ్రువీకరించిన మీదట కోరిన సేవలు పొందే వెసులుబాటు కల్పించారు. మీ సేవకు వెళ్లకుండా సంబంధిత ఆప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ విధానం వల్ల అవినీతికి చెల్లుచీటి పడుతుందని, పారదర్శకంగా సేవలందించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రస్తుతం కొత్తగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఇప్పటికీ అనేక మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేయడం తెలియనందున ప్రైవేట్ ఏజెంట్లనే ఆశ్రయిస్తున్నారని తెలుస్తోంది.
వారు దరఖాస్తుదారుల పేరిట మీ-సేవా కేంద్రాల నుండి దరఖాస్తులను పంపిస్తూ, అనంతరం సర్ట్ఫికెట్ల పరిశీలన ప్రక్రియ సమయంలో అభ్యర్థుల వెంట వచ్చి ఆర్టీఎ కార్యాలయం అధికారులను ఇప్పటికీ కలుస్తున్నారు. ఏజెంట్లతో కలిసి వస్తున్న వారి అర్జీలను త్వరితగతిన ఆమోదముద్ర వేస్తూ, నేరుగా పరిశీలనకు వెళ్తున్న వారి విషయంలో ఒకింత వివక్షతను చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టినప్పటికీ ఏజెంట్ల ప్రమేయం మాత్రం ఇంకనూ రాజ్యమేలుతోందని స్పష్టమవుతోంది. ఈ విషయమై ఇన్‌చార్జి డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ దుర్గాప్రమీలను వివరణ కోరగా, ఇతర ఏ శాఖల్లో లేని తరహాలో తమ రవాణా శాఖలోనే మొట్టమొదటగా పూర్తిస్థాయిలో 56రకాల సేవలను ఆన్‌లైన్ పద్ధతి ద్వారా అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. తద్వారా అవినీతిని పూర్తిగా నిర్మూలించేందుకు, పారదర్శకంగా సేవలందించేందుకు ఆస్కారం ఏర్పడిందని డిటిసి పేర్కొన్నారు. కొత్తగా ఈ విధానం ప్రవేశపెట్టినందున ఇప్పుడిప్పుడే ప్రజలు అలవాటుపడుతున్నారని, దీంతో ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం కేవలం 10 నుండి 15శాతం వరకు మాత్రమే లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు. ప్రజలు ఏజెంట్లను సంప్రదించకుండా నేరుగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలని, అవసరమైన ధ్రువపత్రాలు ఉన్నట్లయితే నిర్ణీత రుసుముతోనే, నిర్ణీత గడువులోగానే వారు కోరిన సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. వినియోగదారులకు తమ శాఖ ద్వారా ఏయే సేవలు అందిస్తున్నాము, వాటికి సంబంధించి ఎలా దరఖాస్తులు చేయించాలి అనే విషయాలపై మీ సేవా కేంద్రాల నిర్వహకులకు కూడా సమావేశం నిర్వహించి సూచనలు చేశామన్నారు. అయితే వాహనాల తనిఖీలు నిర్వహించే సమయంలో నిబంధనలు పాటించని వారి వాహనాలను జప్తు చేసి చెక్ రిపోర్టులు రాయడం జరుగుతుందని, వాటికి సంబంధించిన అపరాధ రుసుము ఎంత వరకు విధించాలనే దానిపై మీ సేవా కేంద్రాల నిర్వహకులకు అవగాహన ఉండనందున ఈ ఒక్క ప్రక్రియను మాత్రం ప్రస్తుతం నేరుగా కార్యాలయానికి వచ్చి పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నారు.