నిజామాబాద్

ప్రైవేటుకు దీటుగా సర్కారీ బడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 4: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను బోధిస్తూ ప్రైవేటు బడులకు దీటుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు హితవు పలికారు. సర్కారీ బడుల్లో ఉత్తీర్ణతా శాతాన్ని పెంపొందిస్తూ అత్యుత్తమ ఫలితాలను సాధించినప్పుడే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తిని కనబరుస్తారని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీల పిల్లలు కూడా ప్రభుత్వ బడులలోనే చదువుకునే పరిస్థితి రావాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష అని, సిఎం ఆశయ సాధన దిశగా అంకితభావం, చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన ఉపాధ్యాయులకు ఉద్బోధించారు. గురువారం స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో విద్యాశాఖ పనితీరుపై ఆయన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ, విద్యారంగానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తోందని, అందుకు అనుగుణంగానే ప్రభుత్వ బడులలో నాణ్యతతో కూడిన విద్యను బోధించేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని వివిధ శాఖలన్నింటిలో కలిపి మొత్తం మూడున్నర లక్షల మంది ఉద్యోగులుండగా, వారిలో కేవలం ఉపాధ్యాయులే లక్షన్నర మంది ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులను వేరెవరో ఎంపిక చేయలేదని, వారి ప్రతిభ ఆధారంగానే వారు ఈ కొలువులను దక్కించుకోగలిగారని అన్నారు. బోధన పట్ల ఎంతో సామర్థ్యం కలిగిన వారే ప్రభుత్వ బడులలో ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారని, అందుకు అనుగుణంగానే తమ విధులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఉన్నత విద్యావంతులను, మేధావులను, విజ్ఞానవంతులను ఆయా వేదికలపై సత్కరిస్తారని, వారిని ఆ స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దిన వారు ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. ఫలితంగానే సమాజంలో ఎవరికీ లేని గౌరవం గురువుల పట్ల అన్ని వర్గాల వారికి ఉంటుందని, ఎల్లప్పుడూ వారిది అగ్రస్థానంగా ఉంటుందన్నారు. విద్యార్థులు వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే అధిక సమయం గురువుల వద్దే గడుపుతారని, ఈ విషయాన్ని గుర్తెరిగి చక్కటి విద్యాబుద్ధులు నేర్పించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు హితవు పలికారు. జిల్లాలో 1473 ప్రాథమిక పాఠశాలలు, 269 ప్రాథమికోన్నత, 433 ఉన్నత పాఠశాలలు కలిసి మొత్తం 2175 ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయని అన్నారు. వీటిలో కొన్ని పాఠశాలలు అత్యుత్తమ ఫలితాలను సాధించగా, మరికొన్ని ఫలితాల సాధనలో బాగా వెనుకంజలో ఉండిపోయాయని అన్నారు. ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గత ఫలితాల తీరును సమీక్షించుకుని, ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని పునరావృతం కానివ్వకుండా ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రతి పాఠశాలలోనూ ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అతి తక్కువగా ఉందన్నారు. అసలే విద్యార్థులు లేని ప్రాథమిక పాఠశాలలు జిల్లాలో 20వరకు ఉన్నాయని, 10మంది లోపు విద్యార్థులు ఉన్న బడుల సంఖ్య 50వరకు ఉందని, ఇరవై మందికి తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు 148వరకు ఉన్నాయని, ఈ పాఠశాలల్లో 238మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో అసలేమాత్రం విద్యార్థులు లేని బడులు 12 ఉండగా, 10మంది విద్యార్థుల్లోపు ఉన్న పాఠశాలలు 41 ఉన్నాయని, 20మందిలోపు విద్యార్థులు ఉన్న బడులు మరో 71వరకు ఉన్నాయని, ఈ పాఠశాలల్లో 550మంది వరకు ఉపాధ్యాయులు కొనసాగుతున్నారని అన్నారు. దీనిని గమనించిన ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలను అమలు చేసేందుకు చర్యలు చేపడుతోందని చెప్పారు. సర్కారీ బడుల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తే తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారని, అలాంటప్పుడే బడులలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో నాటిన మొక్కలను సంరక్షించేందుకు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా ప్రధానోపాధ్యాయులకు సూచించారు. సమీక్షా సమావేశంలో జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్‌సింధే డిఇఓ లింగయ్య, డ్వామా పి.డి వెంకటేశ్వర్లుతో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.