నిజామాబాద్

బిందు సేద్యానికి మరింత ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 20: తక్కువ నీటితో ఎక్కువ పంటలు సాగు చేసేందుకు వీలుగా బిందు సేద్యానికి తమ ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లలోనే డ్రిప్ ఇరిగేషన్‌కు సుమారు 350కోట్ల రూపాయల వరకు నిధులు వెచ్చించామని, అయినప్పటికీ రైతుల నుండి డిమాండ్ ఎక్కువగా వస్తున్నందున నాబార్డు ద్వారా మరో వేయి కోట్ల రూపాయల రుణం తీసుకుని డ్రిప్ పరికరాలు, స్ప్రింక్లర్లను సబ్సిడీపై అందజేస్తున్నామని అన్నారు. వర్ని మండల కేంద్రంలోని సిసిడి స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆవరణలో కూరగాయల పంట కాలనీలపై రైతులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును ప్రారంభించిన సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు సమైక్య రాష్ట్రంలో ఉద్యానవన శాఖ ద్వారా కేవలం 250కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేశారని, తెలంగాణ ఆవిర్భావం అనంతరం తమ ప్రభుత్వం కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 350కోట్ల రూపాయలను వెచ్చించిందని వివరించారు. ఇదివరకు ఒక్కో రైతుకు అర ఎకరానికి మాత్రమే డ్రిప్ పరికరాలకు సబ్సిడీని అందించే వారని, ప్రస్తుతం పనె్నండున్నర ఎకరాల వరకు కూడా తాము సబ్సిడీని వర్తింపజేస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు 100శాతం, బిసిలకు 90శాతం, చిన్నసన్నకారు రైతులకు 90శాతం, ఇతరులకు 50శాతం సబ్సిడీపై వీటిని అందజేస్తున్నట్టు మంత్రి పోచారం పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వేయి ఎకరాలకు డ్రిప్ పరికరాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటికే 700ఎకరాలకు మంజూరీలు తెలిపామని అన్నారు. ప్రభుత్వం అందించే తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ రైతులు ఆర్థిక ప్రగతిని సాధించాలని పోచారం ఆకాంక్షించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా తమ పంట ఉత్పత్తులను విక్రయించుకునే వెసులుబాటు కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, మునుముందు దళారీ వ్యవస్థకు అసలేమాత్రం ఆస్కారం లేకుండా చేస్తామన్నారు. సుదూర ప్రయాణాన్ని కూడా తొలి అడుగుతోనే ప్రారంభించాల్సి ఉంటుందని, అదే తరహాలో వ్యవసాయ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ కృషికి రైతుల ప్రయత్నాలు కూడా తోడైనప్పుడే ఆశించిన ఫలితాలు పొందగల్గుతామని అన్నారు. జిల్లాలో 7.77లక్షల ఎకరాల సాగు భూమికి గాను 2.80లక్షల విద్యుత్ మోటార్లు ఉన్నాయన్నారు. ఒక్క బాన్సువాడ నియోజకవర్గంలోనే 44వేల బోరుబావుల కింద లక్షా 75వేల ఎకరాల భూమి సాగవుతోందని వివరించారు. అడపాదడపా ప్రకృతి సహకారం కరువై రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకుండా ఆర్థికాభివృద్ధిని సాధించాలనే ఆకాంక్షతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ అవకాశాల వైపు కూడా వారు దృష్టిసారించేలా ప్రోత్సహిస్తోందన్నారు. సాంప్రదాయ పంటలే కాకుండా రైతులు అధిక లాభాలను అందించే కూరగాయల సాగు వంటి అంశాలపై దృష్టిని కేంద్రీకరించాలని హితవు పలికారు. స్థానిక అవసరాలకు సరిపడా కూరగాయ పంటల సాగు జరగడం లేదని, 75శాతం వరకు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుండి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు 100శాతం కూరగాయల పంటలను సాగు చేపట్టేలా ఉద్యానవన శాఖ ద్వారా రైతులను ప్రోత్సహించేందుకు విరివిగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఇందుకోసం ఉద్యానవన శాఖకు ఈ ఏడాది బడ్జెట్‌లో పెద్దఎత్తున నిధులు కేటాయించామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనాభా ప్రాతిపదికన 54క్లస్టర్లను ఏర్పాటు చేసి ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పని చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు, స్ప్రింక్లర్లను అందజేశారు. ఈ సదస్సులో రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రాంరెడ్డి, కలెక్టర్ యోగితారాణా, బోధన్ ఆర్డీఓ సుదాకర్‌రెడ్డి, కామారెడ్డి డిఆర్‌డిఎ పి.డి చంద్రమోహన్‌రెడ్డి, ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.