నిజామాబాద్

ప్రజలను అప్రమత్తం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 26: ఎండలు మండుతూ, వేడి గాలుల తీవ్రత నానాటికీ తీవ్రమవుతున్న దృష్ట్యా వడదెబ్బ తాకిడికి లోనవకుండా తగు జాగ్రత్తలు పాటించేలా ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అధికారులకు సూచించారు. వడదెబ్బ కారణంగా జిల్లాలో ఏ ఒక్క కుటుంబానికి కూడా నష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఆమె పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ నుండి జిల్లా, డివిజన్, మండల స్థాయిలో పని చేస్తున్న వైద్యారోగ్య, పంచాయతీరాజ్, ఉపాధి హామీ, విద్య, ఆర్టీసీ, ఐసిడిఎస్, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40డిగ్రీల సెల్సియస్ దాటాయని, రానున్న ఏప్రిల్, మే మాసాల్లో మరింత తీవ్రంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున ఈ విషయమై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వడదెబ్బ బారి నుండి తమనుతాము కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ నెల 28న డివిజన్ స్థాయిలలో, 29న మండల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆర్డీఓలను ఆదేశించారు. ఆర్డీఓలు, మెడికల్ ఆఫీసర్లు, ఆర్టీసీ డిపో మేనేజర్లు, స్టేషన్ మేనేజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, వ్యవసాయ పరపతి సంఘాలు, ఎన్‌జిఓలు, ఎంఇఓలు, ప్రధానోపాధ్యాయులు, సంక్షేమాధికారులు, ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు, ఎఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, ఉపాధి హామీ ఎపిఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ సమాఖ్య సంఘాలు, పంచాయతీ కార్యదర్శులు, విఆర్‌ఓలు, విఆర్‌ఎలు ఈ సదస్సుల్లో పాల్గొని వడదెబ్బ నివారణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వడదెబ్బ లక్షణాల గురించి ప్రజలకు వివరిస్తూ, ముందు జాగ్రత్తలు తీసుకునేలా చూడాలన్నారు. తలనొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, కండరాలు పట్టేయడం, శరీరం పొడిబారటం, శరీరం పూర్తిగా చల్లబడిపోవడం, కళ్లు తిరగడం, మూత్రం పచ్చరంగులో కనడడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆ వ్యక్తిని నీడకు చేర్చి చల్లని ప్రాంతానికి తరలించాలన్నారు. చల్లని నీళ్లలో తడిపిన వస్త్రంతో శరీరమంతటిని తుడవాలని, శరీర ఉష్ణోగ్రత తగ్గే వరకు ఇలా ప్రాథమిక చికిత్సను అందించిన మీదట సాధ్యమైనంత త్వరగా వైద్య సేవల కోసం పిహెచ్‌సిలకు తరలించాలన్నారు. వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంపిణీ చేయనున్నామని కలెక్టర్ తెలిపారు. స్థానిక కేబుల్ నెట్‌వర్క్‌లు, థియేటర్లలో ప్రసార క్లిప్పింగులు ప్రదర్శింపజేయాలని ఆర్డీఓలను ఆదేశించారు. వడదెబ్బ బారి నుండి రక్షణ పొందేందుకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4గంటల మధ్యన బయటకు వెళ్లకూడదని, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే గొడుగు, నెత్తికి టోపీ, కండువా, కళ్లకు చలువ అద్దాలు ధరించాలని, వదులైన చేనేత దుస్తులు వేసుకోవాలని, పళ్ల రసాలు, కొబ్బరి బొండం నీళ్లు, మజ్జిగ తీసుకోవాలని హితవు పలికారు. జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న లక్షా 8వేల మంది కూలీలు తమ పనులను ఉదయం 10.30గంటల్లోపే ముగించాలన్నారు. నిర్మాణ రంగం, కార్మాగారాల్లో పని చేసే కార్మికులకు మధ్యాహ్నం 12గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు పని నుండి విశ్రాంతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ ఉప కమిషనర్‌ను ఆదేశించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లతో పాటు అత్యవసర మందులను సమృద్ధిగా నిలువ చేసుకోవాలని సూచించారు. జన సంచారం ఎక్కువగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లు, మండల కేంద్రాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. వివిధ పనుల కోసం కార్యాలయాలకు వచ్చే వారిని బయట నిలబెట్టరాదని, వారి విజ్ఞాపనలను వెంటదివెంట తీసుకుని పంపించివేయాలని హితవు పలికారు. వడదెబ్బకు గురైన వారికి అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వీలుగా 104, 108 అంబులెన్స్‌లు, ఆర్‌బిఎస్‌కె వైద్య బృందాల సేవలను అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. ఆర్టీసీ బస్సులలోనూ అత్యవసర మందులు ఉంచాలని అధికారులను ఆదేశించారు.

నేత్రపర్వంగా వెంకన్న రథోత్సవం
మోర్తాడ్, మార్చి 26: ఏడుకొండలవాడ..గోవిందా..వెంకటరమణా గోవిందా అంటూ వందలాదిమంది భక్తులు తన్మయత్వం, భక్తిపారవశ్యంతో స్వామివారి రథాన్ని లాగుతుంటే మోర్తాడ్ వెంకన్న జాతర నేత్రపర్వంగా సాగింది. స్వామివారి వార్షిక త్రయార్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం వేకువజామున రెండు గంటలకు స్వామివారి రథయాత్ర శోభాయమానంగా జరిగింది. శుక్రవారం ఉదయం నుండే వేలాది భక్తులు ఆలయంలోని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తదియ తిథి ప్రవేశానంతరం స్వామి రథోత్సవం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగానే చిన్నపల్లకిలో స్వామివారి ఉత్సవ మూర్తులను వేంచే యింపచేసి అందంగా పూలతో విద్యుద్దీపాలతో అలంకరించిన రథం వద్ద బలిపూజ నిర్వహించారు. రథానికి నేత్ర పూజ నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు శ్రీదేవిభూదేవి సహిత వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను రథంలో వేంచేయింపచేసారు. ప్రత్యేక హారతి ఇచ్చిన అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. తదనంతరం రథయాత్ర ప్రారంభమైంది. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని లాగడంతో ప్రారంభమైన రథయాత్ర మార్కెట్‌యార్డ్‌లోని రథమండపానికి మూడున్నర గంటలకు చేరింది. అప్పటికే అక్కడికి చేరుకున్న వందలాది మహిళలు స్వామివారికి మంగళహారతులు ఇచ్చారు. అనంతరం రథయాత్ర తిరిగి ఆలయం వైపునకు ప్రారంభమైంది. రథమండపం నుండి రథశాల వరకు మధ్యమార్గంలో అనేక మంది మహిళలు హారతులు ఇచ్చారు. ఉదయం ఐదు గంటలకు రథశాలకు చేరుకున్న స్వామివారిని ప్రత్యేక పల్లకిలో ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల తరువాత భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసారు. అత్యంత శోభాయమానంగా సాగిన ఈ కార్యక్రమంలో మోర్తాడ్‌తో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వైభవంగా చక్రతీర్థం
బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయంలో చక్రతీర్థం కార్యక్రమాన్ని వేదపండితులు శనివారం వైభవంగా నిర్వహించారు. అశ్వవాహనుడై పల్లకిలో బయలుదేరిన స్వామివారిని గ్రామశివార్లలోని గడి వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి ప్రారంభమైన శావ ఊరేగింపు ఆలయంలోని ప్రధాన వీధుల గుండా సాగి రాత్రి పదకొండు గంటల సమయానికి చేరుకుంది. ఆదివారం నాగవెల్లి, ఏకాంతసేవలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.