నిజామాబాద్

అన్నదాతకు ఆపన్నహస్తం ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 11: ప్రకృతిపరంగా ఒడిదుడుకులు ఎదురై పంటలు కోల్పోయిన బాధిత రైతాంగానికి ఆపన్నహస్తం అందించే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో అన్నదాతలు తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడులు అతివృష్టి, అనావృష్టి ధాటికి కోల్పోయి ఆర్థికంగా చితికిపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాల్లో బాధిత రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ పాలకులు ఇస్తున్న హామీలు నీటి మూటలుగానే మారుతున్నాయి. ఆఘమేఘాల మీద అధికారులను సర్వేలకు పూరమాయించి నివేదికలు రూపొందించడంతోనే సరిపెట్టుకుంటున్నారు. దీంతో నెలల తరబడి మంజూరుకాని అరకొర నష్టపరిహారం కోసం బాధిత రైతులు చకోర పక్షుల్లా ఎదురుతెన్నులు చూడాల్సి వస్తోంది. గతేడాది 2015 ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు వెంటాడడంతో రైతులు పెద్ద ఎత్తున పెట్టుబడులు కోల్పోయారు. ఏడాది కాలం గడిచినా బాధిత రైతులకు మాత్రం ఇంతవరకు ఇన్‌పుట్ సబ్సిడీ చేతికందలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఊహించుకోవచ్చు. అప్పటి ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో సుమారు 3.50లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు ఎండిపోయినట్టు గుర్తించారు. ఎక్కువగా వరి, మొక్కజొన్న, సోయా, కంది, పెసర, జొన్న, చెరకు, పత్తి పంటలకు నష్టం వాటిల్లి రైతులు పెట్టుబడులకు నీళ్లొదులుకోవాల్సి వచ్చింది. సర్వే అనంతరం ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ పంటలు నష్టపోయిన రైతుల జాబితాను అధికారులు రూపొందించారు. వరి, చెరకు పంటలకు హెక్టారుకు 13,500రూపాయల చొప్పున, మొక్కజొన్నకు 8333రూపాయల వంతున, ఇతర పంటలకు 6800రూపాయల చొప్పున ఇన్‌పుట్ సబ్సిడీని అందించాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఈ లెక్కన మొత్తం 116కోట్ల రూపాయల పైచిలుకు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా, ఏడాది కాలం గడిచినప్పటికీ ఈ నిధుల జాడ లేకుండాపోయింది. జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే అనేక పర్యాయాలు ఇన్‌పుట్ సబ్సిడీ నిధుల మంజూరీ విషయమై ఊరడింపు వచనాలు పలుకుతున్నప్పటికీ, ఆయన వ్యాఖ్యలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. ఇన్‌పుట్ సబ్సిడీ కింద కేంద్రం 700పైచిలుకు కోట్ల రూపాయలను విడుదల చేసినప్పటికీ, ఆ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా మరికొంత మొత్తం నిధులను జోడిస్తూ రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా, ఈ ప్రక్రియలోనే ఎడతెగని జాప్యం జరుగుతోంది. ఈ విషయమై బిజెపి సహా ఇతర ప్రతిపక్షాలు ఇప్పటికే పలు పర్యాయాలు ఆందోళనలు కూడా నిర్వహించారు. అయినప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన కానరావడం లేదు. ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు సమకూరాల్సిన ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడిన నేపథ్యంలో సమీప భవిష్యత్తులో ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ నిధులను మంజూరు చేస్తుందనే నమ్మకం సైతం లేకుండాపోయిందని రైతులు ఉసూరుమంటున్నారు.
ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీని జమ చేస్తే ప్రస్తుతం రబీలో పంటల సాగు పనులు చేపట్టేందుకు ఎంతో ఉపకరిస్తుందని అన్నదాతలు పేర్కొంటున్నారు. బ్యాంకుల నుండి కనీసం పది శాతం వరకు కూడా రుణాలు అందించక, మరోవైపు పెద్ద నోట్ల రద్దు ఫలితంగా బయట కూడా ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు పుట్టక రబీ పంటల సాగుకు అవసరమైన పెట్టుబడులను సమకూర్చుకోవడం రైతులకు ఎంతో భారంగా పరిణమించింది. ఇలాంటి పరిస్థితుల్లో తమ ఖాతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీ సొమ్ము జమ అయితే ఎంతోకొంత వెసులుబాటు లభిస్తుందని, ఈ దిశగా ప్రభుత్వం చొరవ చూపుతూ సాధ్యమైనంత త్వరగా నిధులు మంజూరు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.