నిజామాబాద్

అమలుకు నోచని చట్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 11: బడిఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని, బాలకార్మిక రహిత సమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, అడుగడుగునా దుర్భర జీవనాలు గడుపుతున్న బాలలు దర్శనమిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రవేశపెట్టినా, దాని అమలు తీరును సామాజిక పరిస్థితులు ప్రశ్నిస్తున్నాయి. పొట్ట కూటి కోసం పలువురు చిన్నారులు యాచక వృత్తిలో అడుగుపెడుతుండగా, మరికొందరు ప్రమాదకర పనుల్లో కొనసాగుతున్నారు. ఉదయానే్న పది ఇళ్లకు తిరుగుతూ సేకరించిన పాచిపోయిన అన్నం చిన్నారులతో పాటు వారి కుటుంబీకులకు పరమాన్నంగా మారుతూ ఆకలితో అలమటించకుండా ప్రాణాలు నిలుపుకునేందుకు దోహదపడుతోంది. ఉన్నతాధికారులంతా తిష్టవేసే నిజామాబాద్ నగరంలో బాల యాచకుల సంఖ్య కోకొల్లలని చెప్పవచ్చు. కూలీ పనులు చేసేందుకు కూడా శరీరం సహకరించని స్థితిలో కొందరు నిరుపేదలు తమ చిన్నారులను యాచక వృత్తిలో దించుతున్నారు. అలాంటి వారికి ప్రత్యామ్నయంగా ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తే తప్ప, చిన్నారులకు ఈ యాచక వృత్తి నుండి విముక్తి లభించడం దుర్లభం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఎంతసేపూ బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తామంటూ ఊకదంపుడు ప్రకటనలు గుప్పించడం, అతి కొద్దిమంది మాత్రమే బాలకార్మికులు మిగిలారంటూ తప్పుడు నివేదికలు సృష్టించడం షరా మామూలుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాల యాచకులను మినహాయిస్తే, నగరంలోని వివిధ వ్యాపార సంస్థల్లో వెట్టిచాకిరి చేస్తూకాలం వెళ్లదీస్తున్న 14సంవత్సరాల లోపు బాలల సంఖ్య కూడా కోకొల్లలుగానే ఉంది. కుటుంబ పోషణ కోసం చిన్నతనంలోనే చేయరాని పనులు చేస్తూ అనేక రకాల తంటాలు పడుతున్నారు. పిల్లలను పనుల్లో పెట్టుకుంటే చట్టరీత్య చర్యలు తప్పవని తెలిసినప్పటికీ, కొంత మంది వ్యాపారులు చిన్నారులను బాలకార్మికులుగా మార్చడం షరా మామూలైంది. జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉందంటే బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అధికారులు ఎంత చిత్తశుద్ధిగా వ్యవహరిస్తున్నారో స్పష్టమవుతోంది. బాలకార్మికులను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, అధికారుల మొక్కుబడి చర్యలతో లక్ష్యం నీరుగారి నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరులా మారుతున్నాయి. పలుమార్లు ముమ్మరంగా దాడులు నిర్వహిస్తూ వ్యాపార సంస్థల్లో పనులు చేసే బాలకార్మికులను గుర్తించి వారికి వసతి కల్పిస్తూ, విద్యాబుద్ధులు నేర్పించేందుకు బ్రిడ్జి కోర్సులు, ప్రభుత్వ హాస్టళ్లలో చేర్పిస్తున్న అధికారులు, అనంతరం వారి బాగోగులపై దృష్టిసారించకపోవడం శోచనీయం. పరిస్థితులు అనుకూలించకపోవడంతో బ్రిడ్జి కోర్సుల్లో చేరిన బాలలు కొద్దిరోజులకే అక్కడి నుండి పరారవుతూ, యధావిధిగా బాలకార్మికుల అవతారం ఎత్తుతున్నారు. ఉన్నతాధికారుల మెప్పు కోసం అప్పుడప్పుడూ ఉదయం నుండి సాయంత్రం వరకు దాడులతో అధికారులు హల్‌చల్ చేస్తున్నప్పటికీ, బాలకార్మికుల నిర్మూలన కోసం నిరంతర చర్యలు చేపడుతున్న దాఖలాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. దీనిని ఓ ఉద్యమంగా చేపట్టడంలోనూ విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు కూడా బడి బయట పిల్లలను గుర్తిస్తూ వారిని స్కూళ్లలో భర్తీ చేయించేందుకు చేపడుతున్న చర్యలు కూడా తాత్కాలిక ఫలితాలనే అందిస్తున్నాయి.