రచ్చ బండ

ఫలించిన కెసిఆర్ కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కల ఫలించింది. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్ధపై గులాబీ జెండాను ఎగురవేశారు. గత ఎన్నికల్లో అప్పటి పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా పోటీ చేయని టిఆర్‌ఎస్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేంత వరకు ఈ అంశంపై ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అందరూ ఊహించినట్లుగానే ఎన్నికల ఫలితాలను చూస్తే టిఆర్‌ఎస్ ఎవరి మద్దతు లేకుండా సొంతంగా మేయర్ స్ధానాన్ని కైవసం చేసుకుంది. ఇది నిజంగా చారిత్రాత్మక విజయంగా పేర్కొనవచ్చు. గత మూడు దశాబ్దాలుగా మజ్లిస్ సహకారం లేకుండా ఏ పార్టీ కూడా బల్దియా ఎన్నికల్లో మేయర్ పదవిని చేపట్టలేదు. హైదరాబాద్ అంటే మజ్లిస్, మజ్లిస్ అంటే హైదరాబాద్ అనే ముద్రను చెరిపివేసిన ఘనత టిఆర్‌ఎస్‌కే దక్కుతుంది. ఈ ఎన్నికల నుంచి కాంగ్రెస్, టిడిపి, బిజెపి పార్టీలు అనేక గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్ధ ఎన్నికల్లో 45 శాతం ఓట్లు పోలయ్యాయని, నిజంగా 60 శాతం ఓట్లు పోలై ఉంటే తమకు లాభించి ఉండేదని ఓటమి చెందిన పక్షాలు పోలింగ్ రోజు వ్యాఖ్యానించాయి. ఇది కూడా తప్పే. పోలింగ్ శాతం పెరిగే కొద్దీ టిఆర్‌ఎస్ పార్టీ మెజార్టీ మరింత పెరిగి ఉండేది.
ఈ ఎన్నికల ఫలితాలను విశే్లషిస్తే ఇక ఇప్పట్లో కెసిఆర్‌కు టిఆర్‌ఎస్‌కు తిరుగులేదని చెప్పవచ్చు. కాని ఎదిగే కొద్దీ వొదిగి ఉండాలన్న సామెతను అక్షరాలా కెసిఆర్ పాటించాల్సి ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా బాహ్య శత్రువులతో సమానంగా అంతర్గత శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనానికి ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకుపోయాయి. కాని అంతర్గత పార్టీ శత్రువులను ఎన్టీఆర్ గుర్తించలేకపోయారు. రాజకీయాలు నిశ్చలంగా ఉండవు. నదుల్లో నీటి ప్రవాహం లేకపోయినా, రాజకీయాల్లో మాత్రం ప్రవాహం, కదలికలు ఉంటాయి. టిఆర్‌ఎస్ పార్టీ 2014 వరకు ఒక ఉద్యమపార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సొంతంగా అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు.
కెసిఆర్ కూడా తొలుత అధికారంలోకి వచ్చినప్పుడు చేసిన ప్రసంగాల్లోని తీవ్రతను తగ్గించారు. పరిపాలనపై దృష్టిని పెట్టారు. ఆడంబరాలకు వెళ్లకుండా వీలైనంత వరకు వౌనంగా ఉంటూ పరిపాలనపైన దృష్టిని కేంద్రీకరించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, మిషన్ కాకతీయ కింద చెరువుల నిర్మాణం, క్రమం తప్పకుండా సామాజిక పెన్షన్ల చెల్లింపు ఇవన్నీ మంచి ఫలితాలు ఇచ్చాయని చెప్పవచ్చు. కెసిఆర్‌కు పెద్ద అండ కుమారుడు, మంత్రి కె తారకరామారావు. అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కెటిఆర్ హైదరాబాద్‌లో ఐటి రంగం అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా కూడా స్ధానిక సంస్ధలకు విధులు, నిధుల మంజూరులో అహర్నిశలు కృషి చేశారు. ఇవన్నీ గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు విజయాన్ని చేకూర్చాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీఠ వేసి బతుకమ్మ, బోనాలు పండగను నిర్వహించారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ఆంధ్రా సెటిలర్లకు ఉపద్రవం ముంచుకొస్తుందనే అపోహలు పటాపంచలయ్యాయి. అందరినీ కలుపుకుని పోవడంలో కెసిఆర్, కెటిఆర్, కవితతో పాటు రాష్ట్ర మంత్రివర్గం, తెలంగాణ వాదులు కృతాకృతులయ్యారని చెప్పవచ్చు.
ఎన్నికల ప్రచారంలో ఎవరిని నొప్పించకుండా, ఏ వర్గాన్ని పల్లెత్తుమాట అనకుండా ఎంతో జాగ్రత్తగా హుందాగా వ్యవహరించారు. ఇదే టిఆర్‌ఎస్ బలం. కెసిఆర్ చెప్పినట్లు టిఆర్‌ఎస్ తెలంగాణ సాధన కోసం చేసిన ఉద్యమంలో నిర్వహించిన పాత్ర వేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ బద్ధులై అన్ని వర్గాలను కలుపుకుని పోవడం వేరు. నిజంగా రాజ్యాంగానికి అనుగుణంగా అన్ని వర్గాలను కలుపుకుని పోతున్న పార్టీగా టిఆర్‌ఎస్ అవతరించింది. తెలంగాణ రాష్ట్రం గుండెకాయ హైదరాబాద్. ఈ నగర పాలక సంస్ధపై జెండా ఎగురవేయాలని ఏ రాజకీయ పార్టీ అయినా కలలు కంటుంది. అంతర్జాతీయ నగరంగా, మెట్రోపాలిటన్ ప్రాంతంగా ఘనమైన నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ మేయర్ పీఠంపై తొలిసారిగా తెలంగాణ రాష్టస్రమితి గులాబీ జెండా రెపరెపలాడు తున్నది. అరుదైన ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన జవాబుదారీతనం, బాధ్యత టిఆర్‌ఎస్‌పై ఉంది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. తమ కూటమికి మంచి సీట్లు వస్తాయన్న టిడిపి-బిజెపి పార్టీల కలలు కల్లలయ్యాయి. అలాగే తమ మద్దతు లేకపోతే ఏ పార్టీ కూడా హైదరాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోలేదన్న మజ్లిస్ అహంభావ వైఖరిని టిఆర్‌ఎస్ చావు దెబ్బతీసింది. మజ్లిస్ పార్టీ మెడలు వంచిన కెసిఆర్ రియల్ హీరో. ఈ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పాతబస్తీలో తన పట్టును నిలుపుకుంది. హైదరాబాద్‌ను అత్యంత అభివృద్ధి చెంది నగరంగా ప్రపంచ పటంలో నిలబెట్టే గురుతరబాధ్యత టిఆర్‌ఎస్‌పై ఉంది. అదే సమయంలో పార్టీని గ్రామ స్ధాయి నుంచి నగరం వరకు నిర్మించుకోవడంపై టిఆర్‌ఎస్ దృష్టిని సారించాలి. టిఆర్‌ఎస్‌ను విమర్శించే ముందు తమ పార్టీలో అంతర్గత నిర్మాణం పటిష్టం చేసుకుని, బలహీనతలను అధిగమించి ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా పోరాడేందుకు టిడిపి, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు నడుంబిగించాలి. తెలంగాణ రాజకీయాల్లో బలపేతమైన పార్టీగా అవతరించిన టిఆర్‌ఎస్ అంతరంగిక ప్రజాస్వామ్య వ్యవస్ధను నిర్మించుకోవాల్సి ఉంది. ఏ పనిచేపట్టినా ముందుగా కసరత్తు చేసి ఆచితూచి అడుగులు వేసే కె చంద్రశేఖరరావుకు హైదరాబాద్ ప్రజలు మంచి బహుమతి ఇచ్చారు. దీనికి గుర్తుగా చరిత్రలో నిలిచిపోయేలా మరిన్ని మంచి పనులు చేయాల్సిన బాధ్యత కెసిఆర్‌పై ఉంది.

- విజయ శైలేంద్ర