పెరటి చెట్టు

మహోజ్జ్వల జానపద పౌరాణిక కవి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాలలు లీలతో బలుసు పండుల చాయ తనర్చి పండి కై
వ్రాలిన రాజసంబులకు వచ్చు శుకంబుల చేరనీక పో
దోల రవంబుతో చెరకు తోటల నీడల నుండి పాడి రు
న్మీలిత హావభావ రమణీ మకరాంకుని, సాహసాంకునిన్’
‘ఇది జక్కన రాసిన ‘విక్రమార్క చరిత్ర’లోని పద్యం. తెలుగులో ప్రబంధాలనే పేరుతో ప్రాచుర్యం పొందిన వర్ణనాత్మక శృంగార కావ్యాల ఆవిర్భావానికి మార్గం సుగమం చేసిన రచనల్లో ఈ కావ్యం ఒకటని - ఈ పద్యాన్ని చూసి - ఇట్టే గ్రహించవచ్చు. ఇది తెలుగులో వచ్చిన మూడో కథాకావ్యం అంటారు. (కేతన రాసిన ‘దశకుమార చరిత్ర’, మంచన రాసిన ‘కేయూరబాసు చరిత్ర’ మొదటి రెండూను.) ‘ఈ యిల ధర్మరక్ష వెలయింప జనించినయట్టి ఆదినారాయణమూర్తి వీవు; భవదంఘ్రి సరోరుహ సేవయర్థిమై చేయగ ఆత్మకోరి సరసీరుహ గర్భుడు పుట్టె భట్టియై; పాయక జోడుగూడి ఇల పాలన సేయుట మీకు నైజవౌ’ అనే పద్యం చూసిన తర్వాత, ఇది కేవలం జానపద కావ్యం కాదనీ, కవి జక్కన దానికి ఒకింత పౌరాణిక లక్షణం సయితం సంతరింప చేశాడనీ అర్థమయిపోతుంది. అయినా, అద్భుత రసాన్ని పోషించాలని తీర్మానించుకున్నాకా, దానికి అనువయిన ఫార్ములానే ఎంచుకోక తప్పదు, ఎంతటివాడికైనా.
జక్కన ఎక్కడ, ఎప్పుడు పుట్టి పెరిగి ఏమేం రాశాడనే విషయంలో మన పండిత పరిశోధకులు పరిపరి ఊహలు చేశారు. వారి మధ్య పూర్తిగా ఏకీభావం ఏర్పడిందనడానికి వీల్లేదు కానీ, అటూఇటూగా ఓ అవగాహన కుదిరింది. విక్రమ సింహపురిగా చరిత్ర ప్రసిద్ధమయిన నెల్లూరికి చెందిన జక్కన పదిహేనో శతాబ్దిలో తన ప్రసిద్ధ కథా కావ్యం రాసి వుంటాడనీ, ఇతగాడు శ్రీనాథుడికీ పోతనకీ సమకాలికుడయి వుంటాడనీ తెలుగు సాహిత్య చరిత్రకారులు భావిస్తున్నారు. జక్కన రాసిన ఇతర కృతుల ప్రస్తావన అతని ప్రసిద్ధ కావ్యంలో దొర్లలేదు. పరిశోధక పండితులకు అలాంటివేవీ దొరకనూ లేదు. అయినా, ‘ప్రతిపద్య చమత్కృతి’ లక్ష్యంగా పెట్టుకున్న జక్కన ఎక్కువ రచనలు చేసి ఉండకపోవడంతో వింత లేదు. కాగా, తనను తాను అఖిల కవిమిత్రుడనని జక్కన చెప్పుకోగా, అతన్ని సరస్వతీదేవితో సమానం అనేశాడు కృతిభర్త సిద్ధనమంత్రి. ఈయనా తగుపాటి కవేనట! ‘చిత్రగుప్తునకైన చింతింప అరుదైన గణిత విద్యా ప్రౌఢి ఘనతకెక్కిన’వాడిగా సిద్ధనను, జక్కన పొగిడి రుణం తీర్చుకున్నాడు.
సరే కృతికర్తకీ, కృతిభర్తలకీ ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు ఎలాగూ తప్పవు. కానీ, మన సాహిత్య చరిత్రకారులు ఇందులో కూడా వాళ్లతో పోటీపడడం చోద్యంగానే ఉంది. ‘ జక్కన లాక్షణికుడయిన మంచి కవి. ఈతని కవిత్వము నిర్దుష్టమయి, మనోహరముగ ఉండును. ఈ విక్రమార్క చరిత్రము నందలి కథలు సహిత మద్భుతములుగనే యుండు’నన్నారు వీరేశలింగం. ‘గద్య తిక్కన’ అక్కడితో ఆగినందుకు నిజంగానే మనం సంతోషించాలి. ‘ఈ కవి లోకోక్తుల నెన్నిటినో సందర్భోచితముగ నీ కావ్యమందిమిడ్చి యున్నా’డని ఆంధ్రకవి తరంగిణి కర్త చాగంటి శేషయ్య అన్నారు. ప్రౌఢ దేవరాయల కాలంలో జక్కన ‘విద్వత్ప్రశస్తి’ పొంది ఉంటాడని టేకుమళ్ల అచ్యుతరావు భావించారు. ఇక, వేదం వేంకటరాయ శాస్ర్తీ ‘శారదాంబికా ప్రథమ కింకిణి అను విక్రమార్క చరిత్ర ముద్రణ విమర్శనం’లో జక్కన పట్ల అపారమయిన ఔదార్యం ఒలకబోశారు. ‘జక్కన విక్రమార్క చరిత్రము అల్లసాని పెద్దనగారి పాండిత్యమును, ముక్కు తిమ్మనగారి లాలిత్యమును, రామరాజ భూషణుని ప్రౌఢియుంబొరసి చెన్నారుచున్నది’ అన్నారు వేదంవారు. పెద్దన, తిమ్మన, భట్టుమూర్తి మనకి ప్రాచీనులు కావచ్చు. కానీ, జక్కనకి అర్వాచీనులే కదా! ఆయన రచనారీతి ప్రభావం తర్వాతి కవుల మీద పడిందంటే అదో అందం! అలా కాకుండా, జక్కన రచనలో అతని తర్వాతి కవుల లక్షణాలు కనిపించాయనడం భావ్యమా? చారిత్రిక దృష్టి లేకపోవడమంటే ఇదే మరి!
విక్రమార్కుడు భారతీయ సంస్కృతిలో - చరిత్రలో కాదు! - ఎన్నదగిన ధీరోదాత్తుడు. విభిన్న చారిత్రిక దశలలో మహానుభావులు ఉన్న రోజులూ ఉంటాయి - లేని కాలమూ ఉంటుంది. కానీ జనం ఇలాంటి మెట్ట వేదాంతంతో తృప్తిపడరు. ఆరుద్ర అన్నట్లుగా ప్రజలు తమ ఆకాంక్షలకు తగిన నాయకుణ్ణి తామే కల్పించుకుంటారు. అలాంటి కల్పిత నాయకుడికి ఏ విషయంలోనూ వంకపెట్టలేం. కనీవినీ ఎరుగని మహిమోపేతమయిన మూర్తిమత్వం అతనికి ఆపాదిస్తారు జనం. దేవుళ్లకయినా సాధ్యంకాని మహిమలను అతనికి అంటగడతారు. ఇందుకు ఉత్తమ ఉదాహరణలు అల్లూరి రామరాజు గురించిన కథలే! రామరాజు ఒకే సమయంలో రెండు మూడు పోలీస్‌స్టేషన్లను కొల్లగొట్టినట్లు జరిగిన ప్రచారాన్ని- అనేక దశాబ్దాలపాటు - ప్రశ్నించినవాడే లేడు! వేల మంది రామరాజులకు ఒకే మూల పురుషుడు విక్రమార్కుడు. అందానికి అందం, డబ్బుకు డబ్బు, అధికారానికి అధికారం, దాతృత్వానికి దాతృత్వం అతని పరం చేశారు జనం. ఇది తెలుగు జాతికే పరిమితమయిన విషయం కాదు. సంస్కృతంలో కూడా విక్రమార్కుడి గురించి ఇలాంటి రచనలు చాలానే వున్నాయి.
పదకొండో శతాబ్దికి చెందిన సోమదేవుడనే సంస్కృత కవి చెప్పిన ‘కథాసరిత్సాగరం’లోని పనె్నండో సంపుటం ‘బేతాళ పంచవింశతి’. ఇందులో బేతాళుడు విక్రమార్కుడికి చెప్పిన పాతిక కథలున్నాయి. నిజానికి ఈ పాతిక కథలూ - గుణాఢ్యుడు పైశాచీ భాషలో రాసిన - ‘బృహత్క్థ’ నుంచి తీసుకున్నవే. అదే కాలానికి చెందిన కాశ్మీర దేశపు కవి, ఔచిత్య విచార చర్చ ద్వారా ప్రపంచ ప్రసిద్ధికి పాత్రుడయిన ఆలంకారికుడు, క్షేమేంద్రుడు కూడా గుణాఢ్యుడి ‘బృహత్క్థ’ను సంగ్రహ రూపంలో పునఃరచించాడు. అందులోనూ, విక్రమార్కుడి గురించిన కథలు ఉన్నాయట. ఇక, పదకొండో శతాబ్దానికే చెందిన మరో కవి బల్లాల దేవ రాసిన ‘్భజ ప్రబంధం’ కూడా విక్రమార్కుడి గురించిన కథలున్నాయట. ‘విక్రమాంక దేవ చరితమ్’ అనే పేరుతోనే సంస్కృతంలో ఓ కావ్యం ఉంది. దీన్ని పనె్నండో శతాబ్దికి చెందిన కాశ్మీర కవి బిల్హణుడు చెప్పాడంటారు. అది కాకుండా, ఎవరు రాశారో ఎవరికీ తెలియని ‘విక్రమార్క చరితమ్’ అనే మరో కావ్యం కూడా ఉందట; అందులోని కొన్ని నీతి పద్యాలను జక్కన తన కావ్యంలో సందర్భోచితంగా వాడుకున్నాడు కూడా. అంతేకానీ, జక్కన ఏ సంస్కృత కావ్యాన్నీ అనువదించే పని పెట్టుకోలేదు. ప్రాచుర్యంలో ఉన్న విక్రమార్కుడి కథలు గుదిగుచ్చి, వాటిల్లో అష్టాదశ వర్ణనలూ పొదిగి, తనకు తెలిసిన జ్యోతిశ్శాస్త్రం, యోగ శాస్త్రం వగయిరాల విశేషాలను అక్కడక్కడ అద్ది, ‘ప్రతిపద్యము చోద్యముగా కృతి చెప్పి’ ఒప్పించాడు జక్కన. పల్లాదుర్గయ్యగారు లెక్క తీసిన దాని ప్రకారం, ఇందులో ఇరవై కథలున్నాయి. కవిగా జక్కన గొప్ప శిల్పి. కథలను నాటకీయంగా ‘చెప్పి’ మెప్పించాలే తప్ప, వివరాలు ఏకరువు పెట్టకూడదనే విచక్షణను అడుగడుగునా ప్రదర్శించిన కవి జక్కన. అతగాడి కావ్యం నాలుగు కాలాలపాటు బతికి బట్టకట్టడంలో వింతేముంది?