పెరటి చెట్టు

వీరభద్రుడి కవితా విభూతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నన్నపార్యు ప్రబంధ ప్రౌఢవాసనా సంపత్తి సొంపు పుట్టింపనేర్చు
తిక్కన యజ్వ వాగ్ఫక్కి కామోదంబు చెలువు కర్ణముల వాసింపనేర్చు
నాచిరాజుని సోము వాచామహత్వంబు సౌరభంబుల వెదజల్లనేర్చు
శ్రీనాథభట్టు భాషా నిగుంభంబుల పరిమళంబుల గూడ పరచనేర్చు
మహిత గుణశాలి పిల్లలమర్రి వీరనార్యుడా యింట పైతామహంబగుచును
వెలయుచున్నది నేడు కవిత్వ లక్ష్మి అఖిల సత్కవి నికరంబు నాదరింప’ అని చిల్లర వెన్నమంత్రి అన్నట్లుగా పిల్లలమర్రి వీరభద్రుడే రాసుకున్న పద్యమిది. నన్నయ్య, తిక్కన, నాచన సోమన, శ్రీనాథుల వరసలో తనను చేర్చుకోగలిగిన ఆత్మవిశ్వాసం వీరన్న సొంతం! అలాంటివాడు ‘వాణి నా రాణి’ అన్నాడంటే అనడా మరి? జైమిని భారతం, శృంగార శాకుంతలం అనే రెండు కావ్యాల ద్వారా సుప్రసిద్ధుడయిన వీరభద్రుడు పదిహేనో శతాబ్ది చివరి రోజులకు చెందినవాడని పరిశోధకుల్లో ఎక్కువ మంది నమ్మకం. భద్రుడు ‘అవతార దర్పణం’ ‘నారదీయ మహాపురాణం’ ‘మాఘమాహాత్మ్యం’ ‘మానసోల్లాస సారం’ తదితర రచనలు కూడా చేశాడట. ఈ ‘తదితర’ జాబితాలో కొందరు ఔత్సాహికులు ‘పురుషార్థ సుధానిధి’ని కూడా చేర్చగా, చాగంటి శేషయ్యగారి లాంటి పెద్దలు అది పినవీరభద్రుడి రచన కాదనీ, అతని అన్న పెద వీరభద్రుడి రచననీ వాదించారు.
తెలుగు సాహిత్య చరిత్రలో కావ్యాలకు ప్రాచుర్యం లభించడానికి ప్రధానంగా రెండు విషయాలు కారణమవుతూ ఉంటాయి. మొదటిది మతపరమయిన ప్రాముఖ్యం. కాగా రెండోది కావ్యకళకు సంబంధించినది. భారతం ఎవరు రాసినా, దానికి ఉండే ప్రాధాన్యం దానిదే. జైమిని భారతానికి వ్యాస భారతానికి ఉన్నంత ప్రాముఖ్యం లేకపోయినప్పటికీ - ఇందులో ‘ఆశ్వమేధిక పర్వం’ ఒక్కటే మిగిలి వున్నప్పటికీ - ఈ రచన పైన చెప్పిన రెండు కారణాల చేతనూ ప్రాచుర్యానికి నోచుకుదం. జైమిని, స్వయానా వ్యాసుడి శిష్యుడంటారు. ఇతగాడికి బాదరాయణుడనే వేరే గురువు కూడా ఉన్నాడట. సామ వేదానికి తుది రూపం ఇచ్చింది జైమినే అంటారు. మీమాంస సూత్రాలను రాసింది కూడా జైమినే అంటారు. క్రీస్తుకు పూర్వం నాలుగో శతాబ్దానికి చెందిన వాడని చెప్పే జైమిని వైదిక కర్మకాండల ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పినవాడట. కళింగాంధ్రుడని భావించే కుమారిల భట్టు జైమిని రచనలకు సమకూర్చిన భాష్యాన్నిబట్టి కొందరు ఇతగాడు దక్షిణ భారతీయుడు (ఇప్పటి అర్థంలో) అయి వుంటాడని అనుమానిస్తున్నారు. వైదిక కర్మకాండల ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పిన జైమిని అశ్వమేధ యాగ పర్వం ఒక్కదానే్న మూడు వేల శ్లోకాలతో రాయడంలో వింత లేదు. అసలీ పెద్ద మనిషి మిగతా పర్వాలు రాశాడో లేదో ఎవరికీ తెలియదు. పరిశోధక మండితుల్లో కొందరలాగా, మరికొందరిలాగా చెప్తున్నారు. అయితే, జైమిని మొత్తం భారతం రాసేవుంటాడనిపిస్తుంది. లేని పక్షంలో పద్దెనిమిది పర్వాల్లో ఒక్కదానే్న పట్టుకుని ‘జైమిని భారతం’ అనరు కదా!
పదో శతాబ్దం తొలిపాదంలోనే పంపన కన్నడంలో ‘విక్రమార్జున విజయం’ పేరిట భారతాన్ని రాశాడు. కన్నడ కవిత్రయంలో రెండో వాడయిన రన్నడు - మరో యాభై సంవత్సరాల తర్వాత - ‘సాహస భీమ విజయ’ (అనే గదాయుద్ధ) పేరిట మహాభారతం రాశాడు. పదిహేనో శతాబ్దంలో ‘్భరత కథామంజలి’ని కుమార వ్యాసుడనే నారనప్ప, ‘జైమిని భారతం’ ఆశ్వమేధిక పర్వాన్ని 16-17 శతాబ్దాలకు చెందిన లక్ష్మీశుడు రాశారు. కానీ, మన తెలుగు వాళ్లకి మహాభారతమంటే కవిత్రయ మహాభారతమే. నన్నయ్య రెండున్నర పర్వాలు రాసి భారతానువాదం ఆపిన తరుణంలో, పనె్నండో శతాబ్దంలోనే తిక్కనకు సమకాలికుడో - కొద్దిగా తర్వాతి కాలానికి చెందినవాడో అయిన అధర్వణుడు కూడా వ్యాస భారతంలో 18 పర్వాలనూ ఒంటిచేతోత అనువదించాడని చెప్పడానికి ఆధారాలున్నాయి. ఇక, కృష్ణద్వైపాయనుడు రచించిన భారతాన్ని కాక, వేరే భారతాలను కనీసం ఇద్దరు ప్రముఖ కవులు అనువదించిన సంగతి సువిఖ్యాతమే. పదిహేనో శతాబ్దంలో పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమిని భారతాన్ని - అనగా, ఆశ్వమేధిక పర్వాన్ని మాత్రమే - జయప్రదంగా అనువదించాడు. అదే శతాబ్దంలో తాళ్లపాక తిరుమలాంబ అనే తిమ్మక్క, భారత కథనే, ద్విపద కావ్యంగా ‘సుభద్రా కల్యాణం’ పేరిట రాసింది. మరో రెండు వందల సంవత్సరాల తర్వాత సముఖం వెంకట కృష్ణప్ప నాయకుడు కూడా జైమిని భారతానే్న (వచనంలో) పునః అనువదించాడు. ఈ రెండింటికీ మధ్యలోనూ, ఆ తర్వాతా కూడా భారతంలోని ఆఖ్యానాలనూ ఉపాఖ్యానాలనూ ఇతివృత్తాలుగా తీసుకుని ఎందరో ఎన్నో కావ్యాలు రాశారు. పదహారో శతాబ్దంలో - పొనె్నకంటి తెలగనార్యుడు మహాభారతంలోని ఓ కథని తీసుకుని ‘యయాతి చరిత్ర’ రాశాడు. అదే శతాబ్దానికి చెందిన అద్దంకి గంగాధర కవి మహాభారతంలోని మరో కథని తీసుకుని ‘తపతీ సంవరణోపాఖ్యానం’ రాశాడు. అదే శతాబ్దానికి చెందిన గౌరన భారతంలోనిదే వేరే కథని తీసుకుని ‘హరిశ్చంద్రోపాఖ్యానము’ కావ్యాన్ని రాశాడు. పదిహేడో శతాబ్దానికి చెందిన చేమకూర వెంకటకవి ప్రతి పద్యంలోనూ చమత్కారం పొదుగుతూ భారత కథనే ‘విజయవిలాసం’గా రాశాడు.
ఈ మొత్తం భారత కవిగణంలో - కవిత్రయానికి కాకుండా - అంతో ఇంతో గుర్తింపు సంపాదించుకోగలిగినవాడు పిల్లలమర్రి పినవీరభద్రుడు. భద్రుడు జైమిని భారతం అనువదించడంతోపాటుగా, మహాభారతం నుంచే తీసుకున్న శకుంతల కథను ‘శృంగార శాకుంతలం7గా కూడా రాసి ఉండడం సయితం ఈ ప్రఖ్యాతికి ఓ కారణం కావచ్చు. అదొక్కటే కాకుండా, ప్రాంతీయ పరమయిన కారణం మరొకటి ఉంది. తెలంగాణ ప్రాంతంలో పుట్టిన వీరభద్రుడు, దక్షిణాంధ్ర తీరానికి తరలివెళ్లి, వెన్నమంత్రికి ‘శృంగార శాకుంతలం’ అంకితమిచ్చాడు. సంస్కృత మహాభారతంలో శకుంతల కథను ఏడేయేడు (68-74) అధ్యాయాల్లో వ్యాసుడు చెప్పి ముగించాడని, చిన్నపుడెక్కడో చదివిన గుర్తు. దాన్ని మహాకవి కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ పేరిట ఏడంకాల నాటకంగా రాశాడు. ఈ కథలోని శృంగారంశపై మాత్రమే కేంద్రీకరించి పిల్లలమర్రి పినవీరభద్రుడు ‘శృంగార శాకుంతలం’ రాశాడు. ఆ తర్వాత, కన్నడ దేశంలో అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న జైమిని భారతంలోని అశ్వమేధిక పర్వాన్ని అనితర సాధ్యమనిపించేలా అనువదించి సాళువ నరసింహ రాయలకి అంకితమిచ్చాడు భద్రుడు. అతని రచనల్లో మనకి దొరుకుతున్నవి ఈ రెండు రచనలే. అయినా, అన్నం ఉడికిందో లేదో చూడ్డానికి రెండు మెతుకులు చాలవూ?

--మందలపర్తి కిషోర్ 81796 91822