పెరటి చెట్టు

సర్వజ్ఞుడు కానివాడు సత్కవి యగునె?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తొలితొలి సన్నపు తుంపురు లొలుకగా దిమితిమియని ముసురుపట్టె/ బిసబిసయని గాలి మెట్టుగా పెటపెట కణికలంతంతలు చినుకు లురి/ పిడుగు పెఠిల్లున పడియెనో అనగను కడిది ఉర్ములు బెడబెడ అనంగ/ క్రొక్కారు మెరుగు తళుక్కని మెరియగా పాసియు చీకు చూపర పెనంగ/ నించి కడవలు పడి క్రుమ్మరించినట్లు పాము వ్రేలాడ కట్టిన భంగి తోప/ వాన బోరున కురియంగ వరద నుండి మిర్రు పల్లంబు ఒక్కటై మేరమీరె’ - సన్నగా మొదలయిన వాన, ఉరుములు - మెరుపులు - పిడుగులతో కూడిన కుంభవృష్టిగా పరిణమించిన క్రమాన్ని శబ్దాలంకారాల సాయంతో పద చిత్రాలను రూపుకట్టించిన ఈ చిత్రకారుడి పేరు కొరవి గోపరాజు. ‘సింహాసన ద్వాత్రింశిక’ - అనగా 32 బొమ్మలతో ఉండే సింహాసనమని అర్థం!’ - అనే కావ్యంలోది. సామాన్య జన జీవితాల్లోని, అతి సామాన్యమయిన విషయాలకు సాహిత్య గౌరవం కల్పించే క్రమంలో తేట తెనుగునూ, సరళ కథాకథన శిల్పాన్నీ ప్రయోగించిన కవి గోపరాజు. ‘ప్రియంబుగాదె చెరకుల్దిను కంటె రసంబు గ్రోలినన్?’ అని అడిగి మరీ, క్లిష్టమయిన, ప్రౌఢ సంస్కృత ప్రయోగాలను మామూలు తెలుగు భాషలోకి మార్చి చూపించాడు ఈ కవి. ప్రాస్తావికంగానే అయినప్పటికీ తన ప్రాంతం గురించీ, ఆనాటి మనుషుల గురించీ, వాళ్ల మనుగడ గురించీ వివరంగా పేర్కొన్నాడు గోపరాజు. అలా చేసినందుకే, సురవరం ప్రతాపరెడ్డిగారు, మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు గోపరాజును ప్రజాకవిగా చూశారు. ఇతరులకు అతణ్ణి ఆదర్శంగా చూపించారు కూడా. సాహిత్యాన్ని సామాన్య పాఠక జనానికి అందుబాటులోకి తీసుకురావడానికి రెండు పన్లు చెయ్యాల్సి ఉంటుంది. మొదటిది, సామాన్యుల జీవితానికి సన్నిహితంగా ఉండే ఇతివృత్తం ఎంచుకోవడం; రెండోది రచనారీతి మామూలు పాఠకులకి అర్థమయ్యేదిగా మలచుకోవడం. గోపరాజు ఈ రెండు నియమాలనూ పాటించాడు. అందుకే కొమ్ములు తిరిగిన భిషగ్వరులు ఎవరూ అతని రచనను ఆదరించలేదు కానీ, సామాజిక ప్రయోజనం గురించిన స్పృహ ఉన్న పరిశోధకులెవరూ గోపన్నను నిర్లక్ష్యం చెయ్యలేదు! ‘శబ్దరత్నాకరం’ గోపరాజును నాలుగో తరగతి కవిగా పరిగణించింది. కానీ, అభిరుచి కలిగిన పాఠకులెవరూ శబ్ద రత్నాకరం చూసి కావ్యాలు చదవరు!
పదిహేనో శతాబ్దం చివర్లో, పిల్లలమర్రి పినవీరభద్రుడికి కొంచెం వెనగ్గా, పుట్టి పెరిగినవాడు గోపరాజు. పూర్వకవి స్తుతిలో పినవీరన పేరు ఉండడాన్నిబట్టి ఈ అంచనాకి వచ్చారు పరిశోధకులు. వీరేశలింగం గారిలాంటి చరిత్రకారులు కొందరు గోపరాజును పదిహేడో శతాబ్దానికి నెట్టేయడానికి ఓ కారణం ఊహించవచ్చు. ‘సింహాసనద్వాత్రింశిక’ అయిదో ఆశ్వాసంలో వేమనని గుర్తుకు తెచ్చే ఆటవెలది పద్యం ఒకటుంది. ‘తినగ తినగ వేము తియ్యనౌ కైవడి..’ అనే పాదాన్ని బట్టి గోపరాజు వేమనకు అర్వాచీనుడు కావచ్చని ఊహించినట్లు తోస్తోంది. ‘ఏం, వేమనే గోపరాజు నుంచి ఈ పద్య పాదాన్ని ఎరువు పుచ్చుకోకూడదా?’ అని ఎవరయినా అడిగితే బదులు చెప్పడం కష్టమే. ఎందుకంటే, గోపన్నయినా, వేమన్నయినా ఈ భావాన్ని జానపదుల పలుకుబడి నుంచి తీసుకున్నవారే! పోతే, తనది కొండల నడుమన ఉన్న వనదుర్గమయిన ‘వేముగల్లు’ నగరమని చెప్పుకున్నాడు ఈ కవి. ఆ వూరు ఎక్కడుందో అజ తెలియడం లేదన్నారు గడియారం రామకృష్ణ శర్మ. కొల్లాపూర్ దగ్గిర, బహుశా నాగర్‌కర్నూల్ జిల్లాలో, ఓ వేముగ ఉందట గానీ అది కొండల నడుమ లేదన్నారు శర్మగారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో పదేళ్ల కింద కొండలు - ఆనవాలు లేకుండా - అదృశ్యమయిపోతున్నాయి. వందల సంవత్సరాల కిందటి వనదుర్గం తాలూకు కొండలు కాలగర్భంలో కలిసిపోయి ఉండడంలో వింతేముంది? కాగా, గోపరాజు స్వస్థలం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకా భీమ్‌గల్లేనని తేల్చారు సుంకిరెడ్డి నారాయణరెడ్డి. ఈ తీర్మానంలోని సామంజన్యం సంగతి కాలక్రమంలో తేలుతుంది - అదలా ఉంచండి. ఒక విషయమయితే ఖాయం. గోపరాజు ఇంటి పేరుగా ఉన్న గ్రామం కొరవి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. ఇక, కథాక్రమంలో భాగంగా, గోపరాజు ఓరుగల్లు నగరాన్నీ, భువనగిరినీ, ధర్మపురినీ వర్ణించాడు. ఈ వర్ణనలు మూలంలో లేనివనే విషయం గమనార్హం. దీన్నిబట్టి, గోపరాజు కచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి చెందినవాడని తేలిపోయింది.
‘సింహాసన ద్వాత్రింశిక’ తెలుగులో వెలువడిన ప్రధాన కథాకావ్యాల్లో మూడోది. కేతన ‘దశకుమార చరిత్ర’, జక్కన ‘విక్రమార్క చరిత్ర’ ఈ వరసలో ‘సింహాసన ద్వాత్రింశిక’ కన్నా ముందొచ్చిన కథాకావ్యాలు. ఈ మూడు కథాకావ్యాలూ తెలుగు సాహితిలో కొత్త ధోరణికి దారితీశాయి. అటు తర్వాత పుత్తేటి రామభద్రకవి ‘సకల కథాసార సంగ్రహం’, వెనె్నలకంటి అన్నయ్య ‘షోడశ కుమార చరిత్ర’ ‘కూచిరాజు ఎర్రన ‘్భతాళ పంచవింశతి’, పాలవేకరి కదరీపతి ‘శుక సప్తతి’, అయ్యలరాజు నారాయణామాత్యుడు ‘హంస వింశతి’ వరసగా వెలువడ్డాయి. ‘వెనకొచ్చిన కొమ్ములు వాడి’ అనే విషయం ఈ కథాకావ్యాల విషయంలో నిజమయింది! కొరవి గోపరాజు - ‘సింహాసన ద్వాత్రింశిక’ కాకుండా - వేరే ఏమయినా రాశాడేమోగానీ, అవేవీ ఇంతవరకూ బయటపడలేదు.
పేరు చెప్పుకోని ఒకానొక సంస్కృత కవి రాసిన ‘విక్రమార్క చరిత్ర’కు స్థూల అనువాదంగా ‘సింహాసన ద్వాత్రింశిక’ రాశాడు గోపన్న. అనువాద క్రమంలో కవి పది కథలు చేర్చడంతో, ఇందులో 42 కథలున్నాయని గడియారం వారన్నారు కానీ, 39 మాత్రమే లెక్కకు వస్తున్నాయి. విక్రమార్కుడి ‘దివ్య’ సింహాసనం - అతి విచిత్రమయిన పరిస్థితుల్లో - భోజరాజుకి దొరుకుతుంది. ఆ సింహాసనానికున్న మెట్ల మీద 32 సాలభంజికలు ఉన్నాయట. విక్రమార్క సింహాసనాన్ని అధిష్ఠించబోయిన భోజుణ్ణి ఆ బొమ్మలు ఆపి, ఓ కథ చెప్పి, నువ్వూ అంతటివాడివే అయితేనే వెళ్లి సింహాసనాన్ని అధిష్ఠించమంటూ ఉంటాయి. భోజుడు సాలోచనగా తిరిగి వెళ్లి, తనలోనూ ఆ గుణాలున్నాయని తేల్చుకున్న తర్వాత మర్నాడు మళ్లీ వస్తాడు. ‘అరేబియన్ నైట్స్’ పద్ధతిలో ఈ కథలను అనంతంగా సాగదియ్యొచ్చు. కానీ, గోపరాజు పాఠకుల మీద దయతల్చి అలా చెయ్యలేదు!
తనను తాను అష్ట భాషా విదుడనని గోపరాజు చెప్పిన మాట అతిశయోక్తి అయి వుండదని గడియారం రామకృష్ణ శర్మగారి అభిప్రాయం. ఆ రోజుల్లో షట్ ప్రాకృతాలూ - మాగధీ, శౌరసేనీ, మహారాష్ట్రీ, పాలీ, పైశాచీ, గాంధారీ - సంస్కృతం, తెలుగు చదువుకోని కవులు మన దేశంలో అరుదు. ఇవన్నీ కూడితే ఎనిమిది కానే అయ్యాయిగా! ‘దండ శూకాధి పోద్దండ..’ అనే పద్యంలో చతుర్విధ ప్రాకృత భాషల్లో రాజును ఆశీర్వదింపజేశాడట గోపరాజు. ఆవ్వాసాంత పద్యాల్లో తన సంస్కృత పాండిత్యం ప్రదర్శించాడు కవి. ఈ కవికి మరెన్నో ‘శాస్త్రాల్లో’ పాండిత్యం ఉందని గడియారం వారన్నారు. స్ర్తిల జాతులూ, చేపల జాతులూ, అశ్వ జాతులూ, వృక్ష జాతులూ, సర్ప జాతులూ, వస్త్ర - ఆభరణ విశేషాలూ, రాజనీతి, ఛందస్సులూ, యోగం, మల్లయుద్ధం, శకునాలూ, స్వప్న శాస్త్రం, జ్యోతిషం, గణక రీతులూ, చతుషష్టి కళలూ, ద్యూతక్రీడా విశేషాలూ, వేట వగయిరా కళల్లోనూ శాస్త్రాల్లోనూ గోపరాజుకి - ప్రావీణ్యం కాకపోయినా -ప్రవేశం ఉందని ‘సింహాసన ద్వాత్రింశిక’ చదివితే అనిపిస్తుంది.

-మందలపర్తి కిషోర్ 81796 91822