పెరటి చెట్టు

‘పెద్దన వలె కృతిసెప్పిన పెద్దనవలె!’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నిరుపహతి స్థలంబు, రమణీప్రియ దూతిక తెచ్చి యిచ్చు క/ప్పుర విడె మాత్మ కింపైన భోజన ముయ్యెల మంచ మొప్పు త/ప్పరయు రసజ్ఞు లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్/ దొరకని గాక ఊరక కృతుల్ రచియింపుమనంగ శక్యమే!’ - ఈ పద్యం తెలియని సాహిత్యోపజీవులు తెలుగునాట దుర్లభులనే చెప్పొచ్చు. అయితే, ఇది ఓ కన్నడ పద్యానికి ప్రతికృతి అని తెలిసిన వాళ్లు కూడా కనిపించరు. వావిళ్ల సంస్థ ప్రచురించిన ‘మనుచరిత్ర’ ప్రతిలో పెద్దలు నిడుదవోలు వెంకటరావు గారు ఈ వాస్తవాన్ని సాదరంగా వెల్లడించడం వారి సత్యప్రియత్వానికి నిదర్శనం. ‘ఆంధ్ర కవితా పితామహుడు’ అనిపించుకున్న వాళ్లలో అల్లసాని పెద్దన మూడోవాడనే విషయం కూడా వారే చెప్పారు. ఈ పితామహుడు పదిహేనో శతాబ్ది తొలి పాదంలో, అనంతపురం జిల్లా సోమందేపల్లెలో, పుట్టాడని చెప్తారు. విజయనగర సమ్రాట్టు, సాహితీ సమరాంగణ చక్రవర్తి, ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయల చేత ‘కోకట్యాదనే కాగ్రహారంబులు’ - అడిగిన సీమల్లో - ఇప్పించుకున్నానని స్వయానా పెద్దనే ఓ చాటువులో చెప్పాడు. పెద్దన రాసిన ‘స్వారోచిష మనుసంభవం’ అనే మనుచరిత్ర అంకితం పుచ్చుకునే వేళ ఈ ఆంధ్రభోజుడు ‘పల్లకి తన కేల పట్టి ఎత్తె’నని కూడా ఈ పితామహుడు అదే చాటువులో చెప్పాడు. ‘బిరుదైన గండపెండేరమునకీవ తగు’దువని కూడా అన్నాడట రాయలు. సాదరంగా, తానే పెద్దన పాదానికి ఆ గండపెండియరం తొడిగాడట కూడా. రాయలు తనని ‘ఆంధ్ర కవితా పితామహ, అల్లసాని పెద్దన కవీంద్రా’ అని నోరారా పిలిచేవాడని కూడా కవిగారు తల్చుకుని తల్చుకుని బాధపడ్డాడు. కృష్ణరాయలతో పాటుగా స్వర్గానికి వెళ్లలేక, జీవచ్ఛవాన్నయి బతికున్నానని కూడా అంటాడు పెద్దన. కొద్దో గొప్పో చాటుధార తప్పిస్తే, ‘మను చరిత్ర’ కాకుండా, పెద్దన రాసిందంటూ చరిత్రకి దొరికింది దాదాపు శూన్యం. ఆయన రాశాడని అందరూ ఒప్పుకున్న ‘హరికథా సారం’ దొరకనే లేదు. కస్తూరి రంగకవి తదితరులు పేర్కొన్నట్లుగా ‘ఆముక్తమాల్యద’ పెద్దన ప్రణీతమేనని మన విమర్శకులు ఒప్పుకోలేదు. రాయలు పోయిన తర్వాత, పెద్దన తనకి రాజు గారిచ్చిన ఒకానొక అగ్రహారానికి - ‘ఎర్రగుంట్ల వేంపల్లి రోడ్ మీద ఉండే పెద్దనపాడు అగ్రహారానికి - తరలి వెళ్లి, అక్కడే కాలం చేశాడంటారు.
వరూధినీ - ప్రవరాఖ్యుల కథగా మొదలయిన ‘మను చరిత్ర’ మరో రెండు తరాల కథలు కూడా చెప్తుంది. మన ప్రబంధ కవితకి ఉదాహరణ ప్రాయమనిపించే రీతిలో నిర్మితమయిన కావ్యమిది. అంచేతనే, అసంఖ్యాకంగా పిల్ల మనుచరిత్రలూ (తర్వాతి రోజుల్లో పిల్ల వసుచరిత్రలూ) పుట్టుకొచ్చాయి! ప్రసిద్ధ పౌరాణిక కథను తీసుకుని, దానిలో అష్టాదశ వర్ణనలూ, శృంగారాది రసాలూ, సాహిత్య సాము గరిడీలూ గుప్పించి పండిత మండలికి ఆమోదయోగ్యంగా ఉండే రీతిలో రూపొందించే కావ్య నిర్మాణమే ప్రబంధమంటే, నిజానికి మధ్యయుగాల్లోనే, ఈ ప్రబంధాలను సంస్కృతంలో రాసిన వాళ్లు జైనులు. ఇరవయి నాలుగు మంది తీర్థంకరుల ‘చరిత్ర’ల రూపంలో, పదమూడు పదిహేను శతాబ్దాల మధ్యకాలంలో, విస్తృతంగా జైన ప్రబంధాలు రూపుదిద్దుకున్నాయి. పందొమ్మిదో శతాబ్దంలో వచన సాహిత్య రూపాలు నిర్దిష్ట రూపం తీసుకుని, వ్యాపించేంత వరకూ ప్రబంధ ధోరణే తెలుగు కవిత్వ (సాహిత్య?) సీమను ఏలింది. పెద్దన కన్నా నూరూ నూట పాతికేళ్ల తర్వాతి వాడయిన పింగళి సూరన లాంటి సాహసులు ‘కేవల కల్పనా కథలు’ తీసుకుని ప్రబంధాలు నిర్మించడంతో, సంప్రదాయ తెలుగు కవిత్వం పెద్ద మలుపు తిరిగినట్లయింది. అందుకే, సూరన రాసిన ‘కళాపూర్ణోదయం’ పద్య రూపంలో వున్న నవల అన్నారు కట్టమంచి రామలింగారెడ్డి.
రాముడో, దేవుడో, ఆంధ్ర మహావిష్ణువు లాంటి దైవ సమానుడో, ‘నా విష్ణుః పృథ్వీ పతిః’ అనిపించుకున్న రాజో, ఆయనగారి బావమరిదో కలలోనో ఇలలోనో కనిపించి తమని ఆజ్ఞాపించిన మీదటనే కవిత్వం రాస్తున్నామని ప్రకటించడం సంప్రదాయ కవులకు ఆనవాయితీ. అయితే, ఏ కావ్యమూ నేరుగా ఆకాశం నుంచి వూడిపడదు. తనకన్నా ముందు తరాల కవులు చేసిన ప్రయోగాల ప్రాతిపదికపైనే ఏ కవయినా ‘సొంత’ కావ్య నిర్మాణానికి పూనుకుంటాడు. వావిళ్ల సంస్థ ప్రచురించిన ‘మనుచరిత్ర’ కావ్యంలో సుప్రసిద్ధ పరిశోధక పండితులు వేటూరి ప్రభాకరశాస్ర్తీ గారు పెద్దన ఎత్తిపోతల పథకాన్ని సవిస్తరంగా వివరించారు. ‘ఆంధ్ర కవితా పితామహుడు’ ఏయే పద్యాలు ఏయే కవుల నుంచి ఎత్తేశాడో సోదాహరణంగా పేర్కొన్నారు ప్రభాకరులు. దానితోపాటుగా, ప్రభాకరులు ప్రముఖంగా ప్రస్తావించిన విషయం ఒకటుంది. సంస్కృతంలోని దృశ్య కావ్యాల్లో - నాటకాదుల్లో - కనిపించే వస్వైక్యం తెలుగు శ్రవ్యకావ్యాల్లో కానరావడం లేదని వారన్నమాట అక్షర సత్యం. దీన్ని దోషంగా గుర్తించిన విమర్శకులే మనలో తక్కువ! ఆ మాట అంటూనే, వేటూరి వారు చెప్పిన ఈ మాటలు మర్చిపోరానివి; ‘అమృత రస పూరమగు పెద్దన్నగారి సరస కవితా ప్రసారమున ఈ నలుసులు పరిగణనీయములు కావు. నేనెరిగి, ఆంధ్ర కవిత్వమును ఈతడు కూర్పగల్గిన ట్లిటీవల ఎవ్వరును కూర్పనేరరైరి’.
కవిత్వంలో ఏం చెప్పావనే దానికన్నా, ఎలా చెప్పావనే దానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది సంప్రదాయ సాహిత్యం. అందుకే, ఆ ధోరణికి చెందిన రచనల్లో కథలకన్నా, కథనానికే ఎక్కువ ప్రాముఖ్యం దక్కుతుంది. (శతకాల్లాంటి నైతిక సాహిత్యాన్ని ఇందుకు అనువాదంగా చెప్పొచ్చు - వాటిల్లో కథలే వుండవు కనక!) ననె్నచోడుడు, మంచన, మారన, ఎర్రన, నాచన సోమన, శ్రీనాథుడు, గౌరన, జక్కన, పిల్లలమర్రి పిన వీరభద్రాదులు చూపించిన మార్గంలో - వాళ్ల పద్యరచన రీతుల ప్రత్యక్ష ప్రభావంలో - పెద్దన ‘మనుచరిత్ర’ రూపొందించారు. తనకన్నా ముందు తరాలకి చెందిన కవుల మార్గంలో, పెద్దన కూడా కథాకావ్యంగానే ‘మను చరిత్ర’ను రూపొందించినప్పటికీ, ప్రబంధాల్లో కథకు ప్రాధాన్యం తక్కువనే చెప్పాలి. ‘మార్కండేయ పురాణం’లో మారన 150 పద్యాల్లో రాసిన మను చరిత్ర కథను పెద్దన ఆరువందల శ్లోకాలకు పెంచాడు. చతుర్దశ వర్ణనలూ, ఆరు ఆశ్వాసాలతో కూడిన కథా కావ్యమిది. తెలుగులోని ‘పంచ మహాకావ్యా’ల్లో మనుచరిత్ర ఒకటి. (కృష్ణ దేవరాయలు రాసిన ‘ఆముక్త మాల్యద’, తెనాలి రామకృష్ణుడు రాసిన ‘పాండురంగ మాహాత్మ్యం’, రామరాజ భూషణుడి ‘వసుచరిత్ర’, చేమకూర వెంకట కవి రాసిన ‘విజయ విలాసం’ మిగతా నాలుగు మహాకావ్యాలూను!)
హిందూ మత సంప్రదాయంలో పధ్నాలుగు మంది మనువులున్నారు. వాళ్లలో రెండో మనువు పేరు స్వారోచిషువు. అతని తండ్రి స్వరోచి. ఈ స్వరోచి తల్లే వరూధిని అనే గంధర్వ స్ర్తి. హిమాలయాలను చూసేందుకు ఎగిరెళ్లి అక్కడే చిక్కడిపోయిన ప్రవరాఖ్యుడనే ‘్భసురోత్తము’డిని, వరూధిని ప్రేమిస్తుంది. కానీ, ఏకపత్నీవ్రతుడయిన ప్రవరుడు ఆమెని ఆదరించడు. తన ధార్మిక తత్పరతతో హిమాలయాల నుంచి స్వస్థలం అరుణాస్పద పురానికి వచ్చేస్తాడు. వరూధిని ఉచితానుచితాలు ఖాతరు చెయ్యకుండా, ప్రవరాఖ్యుడిని గాఢంగా కోరుకుంటుంది. విరహంలో ఉన్న వరూధినిని ఓ గంధర్వుడు - ప్రవరుడి వేషం వేసుకెళ్లి - మోసగిస్తాడు. ఇక్కడి వరకూ మూడు ఆశ్వాసాలు ముగిసిపోతాయి. వాళ్లకి జన్మించిన స్వరోచి కథ నాలుగో ఆశ్వాసంలో మొదలయి, ఆరో ఆశ్వాసం దాకా సాగుతుంది. ఆ స్వరోచి కొడుకే స్వారోచిష మనువు. ఇతగాడి పుట్టుకే ఈ కావ్యం ఇతివృత్తమని శీర్షిక సూచిస్తుంది. స్వారోచిషుడి కథ అటూఇటూగా సగం ఆశ్వాసం మేరకు పరిమితమయింది. రచనా శైలి విషయానికి వస్తే, గాంధర్వ సంస్కృతిలో ప్రేమకూ కామానికీ పెద్ద తేడా లేదనిపించే రీతిలో ఉంది పెద్దన కథనం. వాస్తవానికి ఈ కాముకత ప్రాబంధిక ధోరణిలో అంతర్భాగం. అదలా వుంచితే, వర్ణన ప్రధానంగా సాగిన పెద్దన కవిత్వం సంస్కృత అలంకారాలకూ, సౌందర్యశాస్త్ర ప్రమాణాలకూ అన్ని విధాలా తగినట్లుంది. ఎటొచ్చీ, సంస్కృతంలోనూ, తెలుగులోనూ లోతయిన పాండిత్యం ఉన్నవాళ్లకి మాత్రమే అర్థమయ్యే సాహిత్యం ఇది.
‘పెద్దన వలె కృతిసెప్పిన పెద్దనవలె; అల్పకవిని పెద్దనవలెనా? ఎద్దనవలె; మొద్దనవలె; గ్రద్దనవలె’ నన్నాడు కవి చౌడప్ప. మహావిష్ణువును మోసే గరుత్మంతుడు కూడా ‘గ్రద్దే’ కదా! పరమశివుణ్ణి మోసే నంది కూడా ఎద్దే కదా!! ఎద్దు, గద్ద అనేవి తిట్లెలా అవుతాయి మరి? పెద్దనలాంటి పరమ భాగవోత్తముణ్ణి పొగిడే ఆవేశంలో ఈ యథార్థవాది ఒకింత ఔచిత్యం మర్చిపోయినట్లున్నాడు!

-మందలపర్తి కిషోర్ 81796 91822