పెరటి చెట్టు

‘ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఈసున పుట్టి డెందమున హెచ్చిన శోక దవానలంబుచే/ గాసిలి ఏడ్చె, ప్రాణవిభు కట్టెదుటన్ లలితాంగి పంకజ/ శ్రీసఖమైన మోముపయి చేలచెరంగిడి బాలపల్లవ/ గ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కాకలీ ధ్వనిన్’ - అచ్చమయిన ప్రబంధ ఫక్కికి నిక్కమయిన నిదర్శనమీ పద్యం! సవతి మీద ఈర్ష్య పడ్డంతో మనసులో పుట్టి, చెలరేగిన దవానలం కారణంగా, భర్త సమక్షంలోనే మొహం మీద కొంగు కప్పుకుని గొల్లుమన్న ప్రబంధ నాయిక వైనం ఈ పద్యంలో చిత్రించాడు కవి. ఎంత చెడ్డా ప్రబంధ నాయిక కనక ఆమె ‘లేత చిగుళ్లు మేసి కసరెక్కిన కోకిల స్వరంలోనే’ మొత్తుకోవాలి తప్ప కుయ్యో మొర్రోమనడానికి వీల్లేదు కాక వీల్లేదు! అటుమీదట అవిడగారికి తిక్కతిరిగి దేవుణ్ణో, సాక్షాత్తూ పతిదేవుణ్ణో ఎడం కాలితో ఈడ్చి తన్నినా సరే, మన మగధీరుడు కిక్కురుమనరాదు! దానిని ‘మన్నన’గానే స్వీకరించాలి. ‘ముళ్లలాంటి పులకలతో నిండిన నా ఒంటికి తగిలి చిగురాకు లాంటి నీ పాదం గాయపడి వుంటుంది - అచ్చొచ్చో!’ అని విలవిల్లాడిపోవాలి. అదీ ప్రబంధ ఫక్కి ‘రాసిక్య’మంటే!
అసలు, నంది తిమ్మన రక్తంలోనే ఉందీ ప్రబంధ ఫక్కి. తన వంశంలో మూడో తరం ప్రబంధ కవి. ఆయన పిన తాత నంది మల్లయ - మేనమామ ఘంట సింగన జంట కవులుగా పదిహేనో శతాబ్దంలో ఓ వెలుగు వెలిగారు. ఈ మామా అల్లుళ్ళ ఘనత చెప్పడానికి ‘ప్రబోధ చంద్రోదయం’ గురించి చెప్పుకుంటే సరిపోతుంది. పదకొండో శతాబ్ది చివర్లో, కృష్ణ మిశ్రుడనే సంస్కృత కవి రాసిన ఆరంకాల వేదాంత రూపకమిది. వేదాంత పరిభాషలో వినిపించే భావనలనే పాత్రలుగా మలిచాడు కృష్ణ మిశ్రుడు. ఈశ్వరుడు, మాయ, మనసు, ప్రవృత్తి, నివృత్తి, మహామోహ, వివేక, ఉషనిషద్దేవి, శ్రద్ధ, శాంతి, తామసి, విష్ణ్భుక్తి, జీవేశ్వర, విద్య, ప్రబోధ చంద్ర - వీళ్లందరూ ‘ప్రబోధ చంద్రోదయం’ నాటకంలోని పాత్రలు. ఈ గొట్టు దృశ్య కావ్యాన్ని, ప్రబంధ శయ్యకు మార్పించి, మలపించి శ్రవ్య కావ్యంగా రాయించాలని గంగయ మంత్రి అనే పెద్దమనిషి ముచ్చటపడ్డాడు. ఆ పని నందిమల్లయ్య - ఘంట సింగన్నల చేత చేయించీ, అటు మీదట దాన్ని తానే అంకితం పుచ్చుకున్నాడు కూడా. ఆ వంశంలో పుట్టిన నంది తిమ్మన, తన పోషకుడి పడకటింట్లో, నిజంగానే జరిగిందని చెప్పే సంఘటననే ప్రాతిపదిక చేసుకుని ‘పారిజాతాపహరణం’ అనే అయిదు ఆశ్వాసాల ప్రబంధం - అయిదు వందల పైచిలుకు పద్యాల్లో - రాశాడంటే అందులో వింతేముంది? సంస్కృత భాగవతంలో ‘పారిజాతాపహరణం’ కథ మూడే మూడు శ్లోకాల్లో రాశారట. దాన్ని, సందర్భోచితంగా అయిదువందల పైచిలుకు పద్యాలతో ప్రబంధంగా రాయడం నంది తిమ్మన సాఫల్యానికీ, సామర్థ్యానికీ రుజువు.
‘పారిజాతాపహరణం’ ప్రబంధం పుట్టుక వెనక కథ గురించి ఓ ఐతిహ్యం ప్రచురంగా వినిపిస్తుంది. రాయలకున్న పట్టపు రాణుల్లో ఒకామె తిరుమలదేవి. ఆమె శ్రీరంగపట్నం రాజకుమార్తె. పడక గదిలో తిరుమలదేవి కాలు రాయల తలకి తగలడంతో విజయనగర సమ్రాట్టు ఆమెపై అలిగి లేచిపోయాడట. ఆమెకి ‘అరణపు కవి’గా పుట్టింటి వారు నంది తిమ్మనని పంపారని చెప్తారు. రాజుకూ రాణికీ సయోధ్య కలిగించడానికి తిమ్మన ‘పారిజాతాపహరణం’ రాశాడంటారు. ఈ కావ్యంలో ‘జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తనర్చు లతాంతాయుధు కన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునం తొలగం ద్రోసె లతాంగి’ అంటూ సాత్రాజితి శ్రీకృష్ణుడికి చేసిన సత్కారాన్ని - విష్ణు భక్తుడయిన రాయలకి - గుర్తు చేశాడు తిమ్మన. తద్వారా, ‘నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్క పూని తాచిన అది నాకు మన్ననయ’ అనుకున్న కృష్ణ లీలను తిమ్మన కృష్ణరాయలకి జ్ఞాపకం చేశాడంటారు.
ఇక, ‘పారిజాతాపహరణం’ ప్రబంధంలో నంది తిమ్మన చెప్పిన కథ సుప్రసిద్ధమే. శ్రీకృష్ణుడు రుక్మిణి ఇంట్లో ఉండగా కలహ భోజనుడయిన నారదుడు అక్కడికి వచ్చి, ఆ అవతార పురుషుడికి పారిజాతం అనే పువ్వు సమర్పించుకుంటాడు. అది ఇంద్రుడి తోటలో పూసే అరుదయిన పువ్వు. శచి, పార్వతి, సరస్వతి లాంటి వాళ్లకే అది ప్రతిరోజూ లభ్యం. నారదుడు రుక్మిణికి చెప్పిన దాని ప్రకారం ఆ పారిజాతం వాడదు. ఏడాదిపాటు జడలో ముడుచుకున్నా అది నలగదు. ఏకాంత సేవను మరింత శృంగారభరితం చేస్తుంది. ఏడాది తర్వాత, తిరిగి చెట్టెక్కి కూర్చుంటుంది! ‘కృష్ణుడికి తన పదహారువేల మంది భామల్లో నువ్వంటేనే ఎక్కువిష్టం కనకనే ఈ పువ్వును నీ కిచ్చా’డంటాడు నారదుడు. అక్కడితో ఆగితే, అతగాడు కలహ భోజనుడెందుకవుతాడు? ‘కృష్ణుడు సత్యావిధేయుడని విన్నాను. కాదని ఇప్పుడు తేలిపోయింద’ని కూడా అంటాడు. అతడా మాట అనే సమయానికి సత్యభామ చెలికత్తె అక్కడే ఉంటుంది. అసలు అందుకే అన్నాడా మాట. ఆ విధేయురాలు తిన్నగా సత్యభామ దగ్గిరకెళ్లి జరిగినదంతా ఆమె చెవిన వేస్తుంది. దాంతో సత్యభామకి తలకొట్టినంత పనవుతుంది. భర్త మీద అలిగి, ‘సత్యా’గ్రహం చేస్తుంది. ఆమెని మెప్పించేందుకు, కృష్ణుడు ఇంద్రుడితో యుద్ధం చేసి పారిజాత వృక్షాన్ని ఎత్తుకొచ్చి సత్యభామ పెరట్లో పాతుతాడు. ఆ విధంగా తాను సత్యావిధేయుణ్ణేనని లోకానికి రుజువు చేస్తాడు. రసికుడయిన భర్త ప్రవర్తన అలా వుండాలన్నది నంది తిమ్మన రాయలకిచ్చిన సందేశం!
మొత్తానికి, అరణపు కవిగా తిమ్మన తన కర్తవ్యాన్ని జయప్రదంగా నిర్వర్తించాడని చెప్పొచ్చు. ‘చికిలీ చేసిన మన్మథ బాణాల్లాంటి’ పద్యాలను ఈ ప్రబంధంలో ఏరి, కూర్చాడు తిమ్మకవి. అల్లసాని పెద్దన మాదిరిగా ప్రౌఢ కవిత్వం చెప్పి, పండితకవి అనిపించుకున్న రాయలను మెప్పించేందుకు నంది తిమ్మన ప్రయత్నించలేదు. ఒకటి రెండక్షరాలతో పద్యాలు చెప్పడం లాంటి గారడీ విద్య అక్కడక్కడ ప్రదర్శించినా అదే ఆయన ధోరణి కాదు. సున్నితమయిన భావాలను అందమయిన మాటల్లో పొదగడం తిమ్మన శిల్పం. అందుకే, ‘ముక్కు తిమ్మనార్యు ముద్దుపలుక’నే ప్రశంసకు ఆయన పాత్రుడయ్యాడు. ప్రభువుల మనసులను రంజింప చెయ్యడానికి మించిన ప్రయోజనం ప్రబంధ కవులు ఆశించలేదు; వాళ్లు ఆశించిన ప్రయోజనం చాలామట్టుకు నెరవేరిందనే చెప్పాలి.
శ్రీకృష్ణ దేవరాయల దర్బారులో ‘అష్ట దిగ్గజాల’నే కవులుండేవారని చెప్తారు. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణుడు, పింగళి సూరన - ఈ ఎనిమిది మంది కవులనూ కలిపి ‘అష్ట దిగ్గజాలు’ అంటారు. రాయలు రాజ్యమేలింది క్రీ.శ.1509-1529 మధ్యకాలమంటారు. ఈ అష్టదిగ్గజాల్లో సగానికి సగం మంది రాయల కొలువులో లేనేలేరు. అయినప్పటికీ మన సాహిత్య చరిత్రకారులు వీళ్లందరూ సమకాలీనులే నన్నట్లు రాస్తూంటారు. వెల్చేరు నారాయణరావు లాంటి పరిశోధకుల లెక్క ప్రకారం, ‘అష్టదిగ్గజాల’ కల్పన పదిహేడో శతాబ్దంలో జరిగింది. అల్లసాని పెద్దన, నంది తిమ్మనలు శ్రీకృష్ణ దేవరాయల కొలువులో ఉన్నారనడానికి ఆధారాలున్నాయి. ఇదిలా వుండగా, ‘నానా సూన వితాన వాసనల నానందించు...’ పద్యం నంది తిమ్మన రాసినట్లూ, దాన్ని రామరాజ భూషణుడు ‘కొనుక్కున్నట్లూ’ మన సాహిత్య చరిత్రకారులు రాశారు. ‘వసుచరిత్ర’ లాంటి మహాకావ్యం రాసిన భట్టుమూర్తి రాయలేనంత గొప్ప పద్యమా అది? పైగా, పోతన పెద్దనాదులే తమకన్నా ముందున్న మంచన, మారన లాంటి కవుల పద్యాలను సొంతం చేసుకోవడం మనం చూశాం కదా! క్రయవిక్రయాల గొడవెందుకు మధ్యలో? ఈ పద్యం వల్లనే నంది తిమ్మన ముక్కు తిమ్మన అయ్యాడని చెప్పే కథల్లాంటి కల్పనలతో నిండి వున్న కారణంగానే, మన ‘సాహిత్య చరిత్ర’ కేవలం కల్పితమనిపిస్తుంది!

-మందలపర్తి కిషోర్ 81796 91822